తప్పు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి?

29 Jul, 2013 03:28 IST|Sakshi
తప్పు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి?
‘ధర్మో రక్షతి రక్షితః’ అనే వాక్యాన్ని మనం వింటూంటాం. మనం ధర్మాన్ని రక్షిస్తే అది మనని రక్షిస్తుందనేది దీనర్థం. ఈ ధర్మాన్నే కొద్దిగా వివరిస్తూ గీత-‘శ్రేయాన్ స్వధర్మః, విగుణః, పరధర్మాత్ స్వనుష్ఠితాత్, స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయాపహ’’ అని తెగేసి చెప్పింది. 
 
 ఈ మొత్తాన్ని మనకు అర్థమయ్యే భాషలోకి అనువదించుకుంటే ‘ఏది తప్పో- ఏది ఒప్పో’అనే విషయాన్ని మనకి మరెవరో చెప్పనక్కరలేదు. ఓ తప్పుని చేయబోతున్న వేళ లోపలి పరమాత్మ ‘ఇది తప్పు’ అని నిర్ద్వంద్వంగా చెప్పనే చెప్తాడు. ఆ మాటని విరోధిస్తూ అవిద్య, అత్యాశ మొదలైన కుసంస్కారాలన్నీ జీవుడికి పట్టిన కారణంగా జీవాత్మ- ఫలానివాడు చేయలేదా?...’ అంటూ తన వాదాన్ని వినిపించడం ప్రారంభిస్తుంది. ఆ చర్చ మన మనసులో జరుగుతున్నది కాబట్టే మనం ‘కాస్త తటపటాయించాను, ఒకడుగు వెనక్కి వే శాను, ఎందుకో బుద్ధిపుట్టలేదు...’ అంటుంటాం. ఈ సందర్భంలో మనం పరమాత్మ మాటనే పాటిస్తూ జీవ సంస్కారాన్ని (జీవాత్మ ప్రబోధాన్ని) వినకుండా ఉంటే తప్పు జరగనే జరగదు. 
 
 ఆ పరమాత్మ శక్తిని పెంచుకోవడానికీ జీవాత్మని తగ్గించుకోవడానికీ పుట్టినవే స్తోత్రాలు, శ్లోకాలు, భజనలు, కీర్తనలు...ఇవన్నీ కూడా. ‘పాపం వస్తుంది, కళ్లు పోతాయి, దేవుడిక్కోపం వస్తుంది, నాశనమై పోతాం...’ వంటివన్నీ తప్పుని ఏ స్థాయిలో చేస్తే ఆ స్థాయిలో మనకి లభించే శిక్షాపురస్కారాలు. 
 
 ఒకే ఒక్క వాక్యంలో దీనికి సమాధానం చెప్పాలంటే-మనకెవరైనా ఏమి చేస్తే అన్యాయం జరిగిందని వాపోతామో ఆ పనిని మనం ఇతరులకి చేయకుండా ఉండడం’ పరమధర్మం. ఆ ధర్మాన్ని అనుసరిస్తుంటే తప్పు చేయనే చేయలేం. 
 
 అకాల వర్షాలు, ఉపద్రవాలు తదితర ప్రకృతి వైపరీత్యాలకు కారణం ఏమిటి? 
 కష్టపడి సంపాదించి నెలనెలా ఇంటిని నడుపుతున్న తండ్రి తన  సంతానం సక్రమంగా ఉండడం లేదని అర్థమైనప్పుడు మందలింపుగా ఒక హెచ్చరిక చేస్తాడు. ఇది మనకు అనుభవంలో ఉన్నదే. 
 
 అలాగే భగవంతుడు కూడా అన్నిటినీ మనకియ్యకుండా భూమినిచ్చి వర్షాన్నీ- పంచభూతాలనీ మన అదుపులో ఉంచినట్టుగా ఉంచి అవి విజృంభించకుండా ఉండే త నాన్ని తన చేతిలో ఉంచుకున్నాడు. 
 
 ఏ భగవంతుడు మనందరినీ ధర్మబద్ధంగా జీవించవలసిందన్నాడో అలా మనం ఉన్నంతకాలం అలా లోకం నడిచినంతకాలం ఆయన మనని పట్టించుకోడు. ఎప్పుడైతే అధర్మం మెల్లగా పాకడం ప్రారంభిస్తుందో దానికి సూచనగా వర్షాలని తగ్గిస్తాడు. అయినా మన ధోరణిలోనే మనం ఉంటే వర్షాలు పూర్తిగా రాకుండా నిరోధిస్తాడు. ఇంత చేస్తున్నా కూడా లెక్కలేనితనంతో మనం ఉంటే, భూమి ద్వారా భూకంపాన్ని, నీటిద్వారా ఉప్పెనలనీ- తేజస్సు ద్వారా ఉష్ణవ్యాధుల్నీ, జలాశయాల్ని ఇంకిపోయేలా చేయడాన్నీ, భూమి మొలకెత్తనితనాన్నీ- వాయువు ద్వారా తీవ్రమైన నష్టాన్నీ- ఆకాశం ద్వారా పిడుగుల్నీ మనకు శిక్షగా విధిస్తాడు.
  
 కాబట్టి ఎన్ని తీరుల కరువుకాటకాలు, ప్రకృతి వైపరీత్యాలు... ఇలాంటివి మనకి కనిపిస్తుంటే అంత మోతాదులో మనం అధర్మబద్ధంగా ఉన్నామని భగవంతుడు చెప్తూ, ‘మన ముఖాన్ని మన అద్దంలో మనకి చూపిస్తున్నట్టు. 
 
  బుద్ధి కర్మానుసారిణీ... అంటే ఏమిటి? 
 బుద్ధిః- మనకి ఓ పనిని చేయాలనే బుద్ధి పుట్టడమనేది కర్మ+ అనుసారిణీ- మనం పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాలని అనుసరించి ఉంటుంది. దీనినే బుద్ధి కర్మానుసారిణీ అంటారు. 
 
 - డా. మైలవరపు శ్రీనివాసరావు
 ఆధ్యాత్మిక ప్రవ చకులు 
మరిన్ని వార్తలు