జనవాణికి మన్ననేదీ?

10 Jul, 2013 16:20 IST|Sakshi
జనవాణికి మన్ననేదీ?
అమెరికా సంయుక్త రాష్ట్రాల స్వాతంత్య్రం కోసం జార్జి వాషింగ్టన్ సాగించిన పోరాటం గురించి, లేదా థామస్ జెఫర్సన్ రాజనీతిజ్ఞత గురించి ఇవాళ ప్రపంచం మరచిపోయింది. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా అంటూ, తెల్లజాతి, నల్లజాతి అంటూ విడిపోయి అమెరికా ముక్కలుకాకుండా కాపాడి, తన ప్రాణం పోగొట్టుకున్న అబ్రహాం లింకన్ కూడా విస్మరణకు గురవుతున్నాడు. నిజానికి ఇదంతా  రెండో ప్రపంచయుద్ధం తరువాత అమెరికా పోషించిన వివాదస్పదమైన పాత్ర వల్ల చోటు చేసుకున్న పరిణామం. ఇప్పుడు అమెరికాకు ఉన్న పేరు ‘ప్రపంచపోలీస్’. ఆధునిక యుగ పు సామ్రాజ్యవాదానికి కేంద్రబిందువు. యుద్ధంలో ఉన్న దేశాలకు ఆయుధాలు అమ్ముతుంది. 
 
 అంతర్యుద్ధం చేస్తున్న తిరుగుబాటుదారులకీ, వారిని అణిచే ఆ దేశ ప్రభుత్వానికీ కూడా ఆయుధాలు విక్రయిస్తుంది. మొదటి ప్రపంచయుద్ధంలో స్విట్జర్లాండ్ వంటి తటస్థ దేశంలో దుకాణం తెరిచి ఇటు జర్మనీకీ, అటు బ్రిటన్‌కీ కూడా ఆయుధాలు అందుబాటులో ఉంచింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రచ్ఛన్నయుద్ధంలో ‘ప్రజాస్వామ్య’ పరిపుష్టికి కంకణం కట్టుకుంది. వియత్నాం యుద్ధం అమెరికా అపకీర్తిని సుస్థి రం చేసింది. కానీ ఇదంతా అమెరికా పౌరుల అభిమతం కాదు. ఇతర దేశాలలో అమెరికా జోక్యం చేసుకోవడం ఆపాలనే ప్రజాభిప్రా యం వియత్నాం యుద్ధసమయంలోనే పురు డు పోసుకుంది. ఇదే వాణి ఇప్పుడు మరింత బలపడుతోంది. అమెరికా విదేశ జోక్యం తగ్గిం చుకోవడం మంచిదన్న అభిప్రాయం పదేళ్లలో పది శాతం పెరిగింది. వియత్నాం యుద్ధ కాలంలో వినిపించిన ఈ అభిప్రాయం కంటె ప్రస్తుతం వినిపిస్తున్న అభిప్రాయం ఎంతో గట్టిది. 
 
 ‘ప్రభుత్వం సాగిస్తున్న నియంతృత్వ పోకడలను సరిచేయడమే నా ధ్యేయం’ అన్నా డు ఇప్పుడు ప్రపంచ పత్రికలలో నిత్యం దర్శనమిస్తున్న ఎడ్వర్డ్ జోసెఫ్ స్నోడెన్. అతడు చెప్పినది అమెరికా గురించే. అతడు ఆ దేశ పౌరుడే. అమెరికా జాతీయ భద్రత సంస్థ కాంట్రాక్టరు, మాజీ సీఐఏ ఉద్యోగి అయిన స్నోడెన్ కొన్ని కీలక పత్రాలను పత్రికలకు అందించాడు. అమెరికా ఎక్కడెక్కడ సమాచార వ్యవస్థలలో తలదూర్చిందో ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయి. ‘శత్రువులకు సహకరించి దేశ ద్రోహానికి తలపడ్డాడ’ని ప్రభుత్వం ధ్వజం ఎత్తుతుందన్న సంగతి తెలిసినా అతడీ పని చేశాడు. ఈ పని స్నోడెన్ చేసి చూపిం చాడు. ఈ పని చేయకున్నా ఎక్కువ మంది అమెరికన్లలో ఇప్పుడు స్నోడెన్ కనిపిస్తాడు. అమెరికా దారి తప్పిందన్నదే వారందరి నిశ్చితాభిప్రాయం. అరెగాన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన చరిత్ర ఆచార్యుడు క్రిస్టొఫర్ మెక్‌నైట్ నికోలస్ నిర్వహించిన సర్వేలో సంభ్రమం కలిగించే అంశాలను అమెరికన్లు వెల్లడించారు.
 
 ఏకాకితనం, విదేశాల వ్యవహారాలకు దూరంగా ఉండిపోవడం అమెరికా మౌలిక విధానం కాదనే క్రిస్టొఫర్ అంగీకరిస్తున్నారు. కానీ ఆయా సమయాలలో రాజకీయ వ్యవస్థల ఏర్పాటు, విధానాల రూపకల్పనలో అమెరికా ఇతర దేశాలను ప్రభావితం చేసిన మాట వాస్తవం అంటారాయన. అంటే సానుకూల స్పందన. ఈ ధోరణి కొనసాగకపోయినా ‘ప్రజాస్వామ్య’ ఉద్ధరణ పేరుతో అమెరికా ప్రపం చ దేశాల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం సరికాదన్నదే ఈ సర్వేలో పాల్గొన్న డెబ్భై శాతం ప్రజలు వెల్లడించారు. అమెరి కాలో  యుద్ధాన్ని వ్యతిరేకించే యువతరం సంఖ్య పెరుగుతోంది. ఇరాక్‌తో యుద్ధం, అఫ్ఘానిస్థాన్‌లో జోక్యం; తద్వారా దేశంలో తలెత్తిన ఆర్థిక కలకలం చాలామందికి రుచిం చలేదు. ఇతర దేశాల వ్యవహారాలలో జోక్యం తో సైనికుల, దౌత్యవేత్తల, సాధారణ ప్రజల మరణాలు కూడా అమెరికన్లను  కలత పెడుతున్నాయి. 
 
 నిజానికి ఈజిప్ట్ తాజా పరిణామాలలో అమెరికా ప్రమేయం గురించి ఆ దేశ విధాన రూపకర్తలలోనే కాకుండా సాధారణ ప్రజలలో కూడా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. సిరియా సంక్షోభంలో ప్రభుత్వ వ్యతిరేకులకు ఆయుధాలు పంపడం తప్పిదమని డెబ్బయ్ శాతం అమెరికన్ల అభిప్రా యం. అక్కడికి ఆయుధాలు పంపడం గురిం చి ప్రతి పదిమందిలో ఆరుగురు వ్యతిరేకించారు. బరాక్ ఒబామా హయాంలోనే  ఇది జరిగింది. కానీ, ఆయన తన ఎన్నికల వాగ్దానంలో విదేశ జోక్యం గురించి ఆశాజనకమైన మాటలు చెప్పిన సంగతిని అమెరికన్లు మరచిపోలేదు. ‘అమెరికా ఇప్పటికి సంపాదించుకున్న అపకీర్తి చాలు. అది ఇంకొంతకాలం అగ్రరాజ్యంగా వెలుగొందాలంటే ఇతర దేశా ల సార్వభౌమాధికారాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. లేదంటే సోవియెట్ రష్యాకు పట్టిన గతే పడుతుంది’ అంటూ సామాజిక మీడియాలో ఒక పౌరుడు చేసిన హెచ్చరిక పెద్దన్నల చెవి వరకు ఎప్పుడు వెళుతుందో! 
 
 ‘శాంతి, వాణిజ్యం, నిజాయితీతో కూడి న స్నేహ సంబంధాలు’ అంటూ థామస్ జెఫర్సన్ రూపొందించిన విదేశాంగ విధాన సూత్రం గురించి ఇప్పుడు కొందరైనా గుర్తు చేసుకుంటున్నారు. అమెరికా జోక్యం తన పౌరులకు గానీ, జోక్యం చేసుకుంటున్న దేశానికి గానీ మేలు చేయడం లేదనే చాలా మంది అభిప్రాయం. వియత్నాంతో సహా అమెరికా జోక్యం చేసుకున్న ప్రతిచోట జరిగింది ఇదే. 
 కల్హణ
 
మరిన్ని వార్తలు