బయటకు వెళ్లే మహిళల్లారా జాగ్రత్త!

12 Aug, 2014 18:07 IST|Sakshi
బయటకు వెళ్లే మహిళల్లారా జాగ్రత్త!

ఆధునిక పరిజ్ఞానం ఎంత అందుబాటులోకి వస్తే ప్రమాదకరమైన పరిస్థితులు కూడా అదే స్థాయిలో ఎందురవుతుంటాయి. అణువును కనిపెట్టిన తరువాత అణువిద్యుత్ను తయారు చేస్తున్నారు. అణుబాంబులను కూడా తయారు చేస్తున్నారు. మంచి అయినా, చెడు అయినా ఒక ఆధుని వస్తువుని మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అలాగే సిసి (క్లోజ్డ్ సర్యూట్) కెమెరాలు సక్రమమైన రీతిలో ఉపయోగిస్తే, అవి దొంగలను, నేరస్తులను పట్టిస్తాయి. కాని కొందరు వాటిని దుర్వినియోగం చేయడం వల్ల మహిళలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కెమెరాలు విస్తృతంగా వినియోగంలోకి వచ్చిన తరువాత  మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఎక్కడపడితే  అక్కడ రహస్య కెమెరాలు అమరుస్తున్నారు. పబ్లిక్ ప్రదేశాలలో పెడితే మంచిదే. కానీ కొంతమంది కామాంధులు బాత్‌రూముల్లో, ట్రయల్ రూముల్లో, షాపింగ్ మాల్స్లో, హాటళ్లలో ఇటువంటి కెమెరాలు  పెట్టి యువతులు, మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు.

బెంగళూరులోని ఒక వస్త్ర దుకాణంలో యజమానులు నీచానికి ఒడిగట్టారు. ట్రయల్ రూములో కెమెరా అమర్చారు.  ఈనెల 7న  ఆ షాపుకు వెళ్లిన ఓ మహిళ ఆ విషయం కనుగొంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగప్రవేశం చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. అతి తక్కువ ధరకే సిసి కెమెరాలు అందుబాటులోకి రావడంతో చాలా మంది ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. మహిళలు దుస్తులు మార్చుకునేటప్పుడు, స్నానాలు చేసేటప్పుడు  రహస్య కెమెరాల ద్వారా వీడియోలు తీస్తున్నారు. ఆ తరువాత వారికి వాటిని చూపించి బెదిరిస్తున్నారు. వారిని శారీరకంగా లొంగదీసుకుంటున్నారు. ఎక్కువగా యువతులను నానా రకాలుగా  హింసిస్తున్నారు. వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇటువంటి వారి చేతిలో చిక్కుకున్న అనేక మంది యువతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.

మహిళలు బయటకు వెళితే ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్న నేపధ్యంలో  చాలా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఏర్పడింది. షాపింగ్‌ మాల్స్‌, హోటల్స్‌, టైలరింగ్ షాపులు, బ్యూటీపార్లర్లు.....కు వెళ్లినప్పుడు మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి.  ట్రయల్‌ రూమ్స్‌ను, బాత్‌రూములను జాగ్రత్తగా పరిశీలించిన తరువాతే వాటిని వినియోగించుకోవాలి. రహస్య కెమెరాలు అమర్చినట్లు ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు తెలియజేయడం మంచిది.

Read latest Features News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా