మిజోరాంలో పురుషుల కంటే మహిళలే ముందడుగు

7 Dec, 2013 16:24 IST|Sakshi

భారత రాజకీయాల్లో అంతగా ప్రభావం చూపకపోవచ్చు. అయితేనేం ప్రజాచైతన్యంలో మాత్రం ఆ రాష్ట్రాన్ని చూసి ఇతర రాష్ట్రాల వారు నేర్చుకోవాల్సిందే. ఆ రాష్ట్రంలో పురుషుల కంటే మహిళలు మరింత చైతన్యశీలురుగా ఉండటం విశేషం. అదే తాజాగా ఎన్నికలు జరిగిన ఈశాన్య రాష్ట్రం మిజోరాం.

జనాభా, వైశాల్యం పరంగా మిజోరాం చాలా చిన్న రాష్ట్రం. భౌగోళిక పటంలో భారత ఈశాన్య ప్రాంతంలో బంగ్లాదేశ్కు సమీపంలో ఉంటుంది. ఆ రాష్ట్ర జనాభా దాదాపు 11 లక్షలు. చాలా రాష్ట్రాలు మహిళల జనాభా క్రమేణా తగ్గుముఖం పడుతోందని ఆందోళన చెందుతుంటే.. మిజోరాంలో మాత్రం స్త్రీ, పురుషుల జనాభా నిష్పత్తి దాదాపు సమానంగా ఉండటం విశేషం. 2011 జనాభా లెక్కల ప్రకారం పురుషులు 5.55 లక్షలు, మహిళలు 5.41 లక్షలు ఉండటం గమనార్హం. అక్షరాస్యత 91 శాతంపైనే.

ఓటింగ్లోనూ మిజోరాంది అగ్రస్థానమే. అత్యంత సంపన్నులు, విద్యావంతులు ఉండే దేశ రాజధాని ఢిల్లీలో ఈసారి 68 శాతం పోలింగ్ నమోదైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఇదే రికార్డు. అదే మిజోరాం ఓటింగ్ సరళిని పరిశీలిస్తే ఎప్పుడూ దాదాపు 80 శాతం ఉంటుంది. 2003 ఎన్నికల్లో పరుషులు 78 శాతం, మహిళలు 78 శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2008 ఎన్నికల్లో పురుషులతో పోలిస్తే మహిళలదే పైచేయి. 78 శాతం మంది పురుషులు ఓటేయగా, మహిళల ఓటింగ్ 81 శాతం నమోదైంది. ఇక తాజా ఎన్నికల్లో మొత్తం 81 శాతంపై పోలింగ్ జరిగింది. ఈ సారి కూడా పురుషుల కంటే మహిళలే ముందంజలో ఉన్నారు. 3.5 లక్షల మంది మహిళలు ఓటింగ్లో పాల్గొనగా, పురుషుల సంఖ్య 3.4 లక్షలు నమోదైంది.

40 శాసనసభ స్థానాలున్న మిజోరాంలో కాంగ్రెస్తో పాటు ఎంఎన్ఎఫ్, ఎంపీసీ ప్రధాన రాజకీయ పార్టీలు. తాజా ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తోందని సర్వేలు చెబుతున్నాయి.

>
మరిన్ని వార్తలు