జావా డే

14 Jul, 2014 03:42 IST|Sakshi
జావా డే

మోటార్ సైకిల్స్.. బైక్స్ ఏ పేరుతో పిలిచినా ఆ పదం యువతలో ఉత్సాహాన్ని ఉరకలెత్తిస్తుంది. వారికి ఎప్పటికీ బోర్ కొట్టనిది ఫ్యాషన్ బైక్ రైడింగ్. నాలుగైదు దశాబ్దాల క్రితం జావా బైక్‌లదే హవా. అత్యాధునిక, విలాసవంతమైన బైక్‌లు ఎన్ని మార్కెట్లోకి వచ్చినా తాము యంగ్‌గా ఉన్నప్పుడు నడిపిన బైక్‌ను చాలా మంది ఇప్పటికీ వదిలిపెట్టలేదు. జూలై రెండో ఆదివారం ప్రపంచ జావా బైక్ డేను హైదరాబాద్ జావా బైకర్స్ అసోసియేషన్ సభ్యులు దక్కన్ క్లబ్‌లో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. 74 మంది జావా ఓనర్లు తమ బైక్‌లతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ వ్యవస్థాపకుడు జయ్‌వీర్‌రావ్
‘జావా’తో తనకున్న అనుబంధాన్ని సిటీ ప్లస్‌తో
 పంచుకున్నారు.
 
అమీర్‌పేట్ న్యూ సెయింట్ కాలేజీలో బీఎస్సీ చదివే రోజుల్లో అంటే 1970లో తొలిసారి జావా కొనుక్కున్నా. ఆ రోజుల్లో జావాపై కాలేజీకి వెళ్తుంటే ఆ మజాయే వేరు. చక్కర్లు కొట్టే కొద్దీ దానిపై ఇష్టం మరింత పెరిగేది. అలా 1971,72,74, 96ల్లో నాలుగు బైక్‌లు కొన్నా. ఇప్పుడు కూడా సిటీలో జావాపై షికారు చేయడం నాకెంతో ఇష్టం. నాతోపాటు జావా బైక్‌లు కొన్న వారందరినీ ఒకేచోట చేర్చాలనే ఉద్దేశంతో జావా బైక్స్ అసోసియేషన్ స్థాపించా. దాదాపు 500 మందికి పైగా బైక్‌లు నగరంలో ఉన్నాయి. ప్రతి నెలా రెండో ఆదివారం జావా బైక్‌లపై నగర శివార్లకు జాయ్‌రైడ్ వెళ్తాం.  
 
1996 లోనే జావా బైక్‌ల ఉత్పత్తి ఆగిపోయింది. అప్పట్లో సికింద్రాబాద్‌లో బైక్ షోరూమ్, రిపేర్ కేంద్రాలుండేవి. ఇప్పుడు బయట మెకానిక్‌లు ద్వారా బైక్ బాగు చేయిస్తున్నాం. స్పేర్ పార్ట్స్ అవసరమైతే ఇంటర్నెట్, ఫేస్‌బుక్‌ల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న జావా అసోసియేషన్లను అప్రోచ్ అయి సేకరిస్తాం. బెంగళూరు, కూర్గ్ నగరాల్లో జరిగే బైక్ ఉత్సవాలకు కూడా హైదరాబాద్ తరఫున పలుమార్లు హాజరయ్యా. రిచర్డ్‌రాజు, బాలిపటేల్ నాకు మంచి బైక్ మిత్రులు. 56 ఏళ్ల వయస్సులో నేను బైక్ ఎక్కినా కుర్రవాడినే. నా బైక్‌ను రూ.3 వేలు పెట్టికొన్నా.. 2స్ట్రోక్ బైక్.
 ఎల్. సుమన్

మరిన్ని వార్తలు