సొంతగూటికి యడ్యూరప్ప!

11 Jul, 2013 16:59 IST|Sakshi
బీఎస్ యడ్యూరప్ప

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్నది జగమెరిగిన సత్యం. పరస్సరం కత్తులు దూసుకున్న నాయకులు 'ప్రయోజనాల' పేరుతో చేతులు కలపడం రాజకీయాల్లో సర్వసాధారణ విషయం. దుమ్మెత్తిపోసిన పార్టీలోకే దూకే ఉద్ధండ నాయకులకు నడుస్తున్న జమానాలో కొదవే లేదు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప ఈ కోవకే చెందుతారు. తనను గెంటేసిన పార్టీలోకి తిరిగి చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. మళ్లీ కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు.

కమలం పార్టీలోకి తిరిగి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని యడ్యూరప్ప స్వయంగా ప్రకటించారు. సొంత గూటికి తిరిగి చేరే విషయంలో బీజేపీ అగ్ర నేతలు తనతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన బహిరంగంగా చెప్పారు. అయితే వెనక్కు వెళ్లే విషయంపై తన మద్దతుదారులతో చర్చించిన తర్వాత తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటానని తేల్చేశారు. బీజేపీలోని యెడ్డీ అనుయాయులు ఆయనను తిరిగి పార్టీలోకి తెచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

బీజేపీ అగ్రనేత అద్వానీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్, మరో సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి- యడ్యూరప్ప పునరాగమనం పట్ల సుముఖంగా లేరని సమాచారం. అయితే పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీలు మాత్రం యెడ్డీ సొంత గూటికి రావాలని కోరుకుంటున్నారు. అద్వానీ ప్రభృతులకు నచ్చజెప్పి యడ్యూరప్పను పార్టీలోకి తీసుకు రావాలని వీరు భావిస్తున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబరులో యడ్యూరప్ప మళ్లీ బీజేపీలో చేరే అవకాశాలున్నాయి.

బీజేపీ ప్రధాని అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పేరు బలంగా వినబడుతుండడం కూడా యడ్యూరప్ప  కమలం దళంలోకి తిరిగి వెళ్లేందుకు ఒక కారణమన్న వాదన వినబడుతోంది. మోడీ పెద్ద నాయకుడని, ఆయన నాయకత్వాన్ని 60 శాతం మంది ప్రజలు ఆమోదించారంటూ యడ్యూరప్ప సానుకూలంగా స్పందించడం ఇక్కడ ప్రస్తావనార్హం. తానొక్కడినే కాదని దేశ ప్రజలందరూ మోడీని ప్రధానిగా చూడాలనుకుంటున్నారని యడ్యూరప్ప పేర్కొనడం చూస్తుంటే బీజేపీలోకి ఆయన పునరాగమనం ఖాయమని అర్థమవుతోంది.

మరిన్ని వార్తలు