యోగా.. భలేగా!

5 Feb, 2015 00:01 IST|Sakshi
యోగా.. భలేగా!

షాపింగ్ మాల్, కాఫీ షాప్, రద్దీ లేని రోడ్డు, ఆఫీస్.. ఎక్కడైనా కావచ్చు ఒక్కసారిగా యోగాలవర్స్ అంతా ఒక్కచోటికి చేరుకుంటారు. యోగాసనాల్లోకి వెళ్లిపోతారు. మాబ్ డ్యాన్స్‌ల్లాంటి కొత్త ట్రెండ్ ఈ పాపప్ యోగా. ఇప్పటిదాకా యూరప్ దేశాల్లోనే ఉన్న ఈ ట్రెండ్ పొరుగునున్న మెట్రో సిటీస్‌లో మొదలు కాగా, ఇప్పుడిప్పుడే నగరానికి చేరుతోంది.
..:: కట్టా కవిత
 
యోగా క్లాసుల్లో చేరేందుకు సమయంలేక... రోజూవారీ ఒత్తిడి నుంచి బయటపడలేక సతమతమవుతున్న వారికి ఉపయోగకరం ఈ పాపప్ యోగా. దీనికోసం యోగా స్టూడియోలు అక్కర్లేదు. యోగా మ్యాట్, డ్రెస్ అన్నీ చూసుకోనవసరం లేదు. రోజు మొత్తంలో మీకు వీలున్న సమయంలో సింపుల్ ఆసనాలతో, మెడిటేషన్ టెక్నిక్స్‌తో ప్రశాంతతను గెయిన్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ ఇది. ఖాళీ ప్రదేశాలను ఉపయోగించుకుంటూ ఎక్కువ మందికి యోగా ప్రయోజనాలను ఉచితంగా తెలియజేయాలన్నది ఇందులోని కాన్సెప్ట్. దీని ద్వారా యోగా లవర్స్‌ను ఒక్క దగ్గరిని తీసుకురావడంతో పాటు ఇంకో పది మందికి యోగాపై అవగాహన కలిగించవచ్చని నగరానికి చెందిన యోగా నిపుణులు అంటున్నారు.
 
రీఛార్జ్...

కంప్యూటర్ల ముందు కూర్చుని కోడింగ్, ఈ మెయిల్స్‌తో తల బద్దలు కొట్టుకునే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్, ఇతర ఉద్యోగులకిది ఉపయోగపడుతుంది. అంతేకాదు గంటల తరబడి ఫోన్ మాట్లాడే కాల్‌సెంటర్ ఉద్యోగులు తొందరగా రీఛార్జ్ కావడానికి ఉపయోగ పడే సాధనం ఈ పాపప్ యోగా. అయితే ఖాళీ కడుపుతో చేసే ఆసనాలు కాకుండా ఏ టైమ్‌లోనైనా చేయగలిగే రిలాక్సేషన్, బ్రీథింగ్ ఎక్సర్‌సెజైస్, శవాసనం లాంటివి ఇందులోని ముఖ్య థీమ్స్.

కాఫీషాప్‌లో ఆఫీస్ ఫ్రెండ్స్‌తో...

న్యూఢిల్లీలోని ఓ పార్కులో నిధి ఖండూజా పాపప్ యోగా ప్రారంభించింది. యోగాను ఇష్టపడే కొద్దిమంది, వాళ్ల ఫ్రెండ్స్‌ను ఆహ్వానించి రోజూ ఉదయం, వీకెండ్స్‌లో యోగా చేశారు. కొత్తగా వచ్చిన వారు మళ్లీ వచ్చేటప్పుడు వాళ్ల ఫ్రెండ్స్‌ని తీసుకొచ్చేవాళ్లు. ఇప్పుడు యోగాకు వచ్చేవాళ్ల సంఖ్య పెరిగింది. ‘ఇద్దరా, ముగ్గురా, ఇరవై మందా అని ఆలోచించకండి... ముందు చేయడం ప్రారంభించండి’ అంటోంది నిధి. హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేస్తున్న నితిన్ తన ఆఫీస్ ఫ్రెండ్స్‌తో కలిసి కాఫీషాప్‌లో యోగా చేస్తున్నాడు. ‘ప్రాణాయామం, బ్రీథింగ్ ఎక్సర్‌సెజైస్ చేస్తాం. తర్వాత మనసు ప్రశాంతంగా’ ఉంటుంది అంటున్నాడు నితిన్.
 
యువత కోసం...

యోగా అనగానే పెద్ద వయసువారు తెల్లటిబట్టల్లో ద్యానముద్రలో ఉన్నట్టు ఊహించేసుకుంటాం. కానీ యూత్‌ను ఎక్కువగా యోగావైపు ఆకర్షించడానికి చేసే ప్రయోగమిది. ఇప్పుడు కొన్ని షాపింగ్ మాల్స్ కూడా పాపప్ యోగా క్లాసెస్ నిర్వహిస్తున్నాయి. రోజంతా పని ఒత్తిడితో సతమతమైన వారు సాయంత్రం పూట ఒక్కచోట చేరి ఇలా చే యడం వల్ల మనసే కాదు శరీరమూ నూతనోత్తేజాన్ని పొందుతుంది. ప్రస్తుతం నగరంలో ప్రతి ఆదివారం జరుగుతున్న రాహ్‌గిరిలో కూడా యోగా భాగమైంది. యోగా ట్రైనర్ సంగీత అంకత దీన్ని ప్రారంభించారు. మొదట 10 మందితో ప్రారంభమైనా... సెషన్ చివరికల్లా 50 మంది వచ్చి చేరుతున్నారు. వీరిలో స్టూడెంట్స్, ఎంప్లాయీస్, కంపెనీస్ ఎండీలూ ఉంటున్నారు. పాపప్ యోగా కాన్సెప్ట్‌ను ప్రస్తుతం సిటీలోని కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ ఆఫీసుల్లో అప్లై చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి.

మరిన్ని వార్తలు