తిన్న వెంటనే ఏం చేయకూడదంటే...

9 Nov, 2017 18:12 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ధృడంగా, వ్యాధులకు దూరంగా ఉంటామనుకుంటే పొరపాటే. ఆహారం తీసుకునే ముందు, తిన్న తర్వాత మనం చేసే పనులూ మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. తిన్న వెంటనే మనం చేసే కొన్ని పనులు  మనకు తెలియకుండానే అనారోగ్యాలకు దారితీస్తాయి.ముఖ్యంగా తిన్న వెంటనే ఆహార పదార్ధాలు జీర్ణం అవుతాయనే అపోహతో వెంటనే నడవడం వంటివి చేస్తారు. అయితే తిన్న తరువాత 30 నిమిషాల వరకూ వాకింగ్‌ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక తిన్న వెంటనే నిద్రపోవడం ఆరోగ్యానికి చేటుచేస్తుంది. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రిస్తే జఠరరసాలు ప్రతికూల దిశలో వెళ్లి మొత్త జీర్ణ ప్రక్రియ దెబ్బతినే అవకాశం ఉంది. ఇక పొగతాగడం ఆరోగ్యానికి హానికరమైతే..తిన్న వెంటనే స్మోక్‌ చేయడం మరింత ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారం తీసుకున్న తర్వాత స్నానం చేయడం మానుకోవాల్సిన అలవాటని సూచిస్తున్నారు. ఆహార పదార్ధాలు జీర్ణం కావడానికి తగిన శక్తి అవసరమని, తిన్న వెంటనే స్నానానికి ఉపక్రమించడం సరైంది కాదని చెబుతున్నారు.

ఆహారం తీసుకున్న అరగంట తర్వాతే టీ, కాఫీలు తీసుకోవాలి.తాజా పండ్లు ఆరోగ్యానికి ఎంత అవసరమో, తిన్న వెంటనే వీటిని తీసుకోవడం అంతే ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఆహారంతో పాటు పండ్లు తీసుకుంటే అవి  ఆహారపదార్ధాలతో కలిసిపోవడంతో సకాలంలో జీర్ణవ్యవస్థలోకి వెళ్లలేవని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు