100 షార్ట్ ఫిల్మ్స్.. యూత్‌ఫుల్ ఐడియా

3 Jul, 2014 02:28 IST|Sakshi
100 షార్ట్ ఫిల్మ్స్.. యూత్‌ఫుల్ ఐడియా

ఆలోచనలో కొత్తదనం ఉదయిస్తే.. అవకాశాలు అవే చిగురిస్తాయి. వాటికి క్రియేటివిటీ జోడిస్తే.. అనుకున్న ల క్ష్యం దగ్గరవుతుంది. అలా పుట్టిందే ఎంఆర్ ప్రొడక్షన్స్. ఓ ఇద్దరు ఇంజనీరింగ్ కుర్రాళ్ల కళల ప్రాజెక్టు ఇది. ఐదేళ్లలోనే 100 సినిమాలు నిర్మించిన సంస్థంటే నమ్ముతారా..? ఏ ప్రొడక్షన్ విత్ వాల్యూస్ అండ్ క్రియేటివ్ ఐడియాస్ అనే ట్యాగ్ లైన్‌తో వచ్చిన ఎంఆర్ ప్రొడక్షన్‌‌స ఇప్పుడు పొట్టి సినిమాల ప్రపంచంలో రారాజుగా నిలుస్తోంది. ఈ సంస్థ 2009డి సెంబర్‌లో ప్రారంభమైంది. వారిద్దరి పేర్లు ధీరజ్ రాజ్, సుభాష్‌చంద్ర.
 
 ధీరజ్ రాజ్‌ది విజయనగరం జిల్లా కొట్టాయం. సుభాష్‌చంద్రది పశ్చిమగోదావరి జిల్లా రేలంగి ప్రాంతం. ఇంటర్మీడియెట్ రోజుల్లోనే దోస్తీతో జట్టు కట్టారు. ధీరజ్ మహారాజా కాలేజీలో, సుభాష్ రఘు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. బీటెక్ పూర్తికాగానే.. లఘు చిత్రాలను నిర్మించాలని డిసైడయ్యారు. కట్ చేస్తే.. వారు చదువుకున్న ఇంజనీరింగ్ కాలేజీల మొదటి అక్షరాలను తీసుకుని ఎంఆర్ ప్రొడక్షన్‌‌స స్టార్ట్ చేశారు.  
 
ఈ బ్యానర్ మీద మొట్టమొదట తీసిన ‘సక్సెస్’ లఘు చిత్రం గీతం వర్సిటీ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లో ఫోర్త్ బెస్ట్‌గా నిలిచింది. అలా మొదలైన షార్ట్ ఫిల్మ్ యాత్ర ఐదేళ్లలో 99 రిలీజ్ చేసి వందో చిత్రం విడుదలకు సన్నద్ధం అవుతోంది. ఈ బ్యానర్ నుంచి వచ్చిన అన్ని సినిమాలకు కథ వీరిదే. ఆర్టిస్టుల చాయిస్, నేపథ్య సంగీతంపైనా దృష్టి పెట్టారు. ‘తల్లిదండ్రులు, స్నేహితులు ఎంతగానో ప్రోత్సహించారు. మా చిత్రాలకు సినీహీరోలు, దర్శకుల ప్రశంసలు లభించాయి’ అని చెప్పారు ఈ కుర్రాళ్లు.
 
 మా బ్యానర్ మీద 49 చిత్రాలలో నటించిన రాజ్ తరుణ్ ‘ఉయ్యాల జంపాల’ చిత్రంలో హీరోగా నటించారు. మా 11 చిత్రాలలో నటించిన చాందినీ చౌదరి త్వరలోనే వెండితెరపై వెలగనుంది. ఎన్నో సినిమాలకు అసిస్టెంట్‌గా చేస్తున్న సంగీత దర్శకుడు వంశీకృష్ణ మా సినిమాలకు సంగీతం అందించారు. ‘మూగమనసులు’ ఫీచర్ ఫిల్మ్‌కు సంగీతం అందించిన కేశవ్ కిరణ్ మా దగ్గర నుంచే వచ్చారు. ‘ద బ్లైండ్ డే’ (సుభాష్ చంద్ర) చిత్రం ద్వారా ఎంఆర్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ఉందని అందరూ గుర్తించారు. ఆ చిత్రంతోనే చాలామందికి బ్రేక్ వచ్చింది. ‘పెళ్లి పుస్తకం’ (ధీరజ్ రాజ్) ట్రెండ్ సెట్ చేసింది. ఫ్యామిలీ సినిమాలను షార్ట్ ఫిల్మ్స్‌గా తియ్యొచ్చనే ట్రెండ్ క్రియేట్ చేసింది.
 ధీరజ్ రాజ్, సుభాష్‌చంద్ర
 - డాక్టర్ వైజయంతి

>
మరిన్ని వార్తలు