జూమ్ బరాబర్

29 Jan, 2015 00:33 IST|Sakshi
జూమ్ బరాబర్

కాస్తంత కళాత్మక కోణం ఉండాలే కానీ... కనులను తాకే ప్రతి చిత్రం ఓ అద్భుతమే. ఇక చేతుల్లో కెమెరా ఉంటే... అవన్నీ మెమరబుల్ ‘క్లిక్’లే. ఇలాంటి ‘లెన్స్’ను క్యాచ్ చేయాలనే అభిరుచి చాలామందికే ఉంటుంది. కానీ... కెమెరా భుజాన వేసుకుని టైమ్ స్పెండ్ చేయాలంటేనే అసలు సమస్య వచ్చి పడుతుంది. బిజీగా దూసుకుపోయే సిటీ లైఫ్‌లో హాబీ కోసం అంత సమయమా! కష్టమే! అయితే... వీక్‌డేస్‌ను వదిలేసినా లేజీగా గడిపేసే వీకెండ్స్‌ను మోస్ట్ ఎక్సైటింగ్‌గా మార్చుకోవచ్చంటున్నారు ‘హైదరాబాద్ వీకెండ్ షూట్స్ క్లబ్’ సభ్యులు. మెడలో కెమెరా ఉంటే చాలు... మీలా ఆలోచించే మిత్రులు ఇక్కడ ఎందరో ఉన్నారు. విభిన్నంగా సాగే ఈ క్లబ్ విశేషాలు ఈవారం...  
 
 బెంగళూరు, ముంబైల్లో ఫొటోగ్రఫీ హాబీతో నడిచే క్లబ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. 2006లో ప్రారంభమైన హైదరాబాద్ వీకెండ్స్ షూట్స్ క్లబ్... క్రమం తప్పకుండా రకరకాల ఫొటో యాక్టివిటీస్ నిర్వహిస్తోంది. ఇది ప్రారంభించే నాటికి హైదరాబాద్‌లో ఈ తరహా క్లబ్స్ లేవు. ఐటీ, కార్పొరేట్ రంగం పెరిగిన క్రమంలో ఫొటోగ్రఫీ హాబీని ఎంకరేజ్ చేయాలని ఫ్లిక్కర్‌లో ఈ ఆన్‌లైన్ క్లబ్ నెలకొల్పారు వ్యవస్థాపకుడు ఎన్.కిశోర్. ప్రస్తుతం ఈ బృందంలో 8,500 మందికి పైగా సభ్యులున్నారు. ఫేస్‌బుక్ ద్వారా కూడా యాక్టివిటీస్ షేర్ చేసుకుంటోంది.
 
 వారానికో లొకేషన్
 సాధారణంగా వారానికో లొకేషన్ ఎంచుకుంటారు. ఆసక్తి ఉన్న వారంతా అనుకున్న సమయానికి అక్కడికి చేరుకుంటారు. ఓ గ్రూప్ ఫొటో దిగేసి... ఆపై ఎవరికి వారు తమ అభిరుచికి తగ్గట్టుగా ఆ ప్రాంతంలోని అందాలను క్లిక్‌మనిపిస్తారు. నగరంలోని కుతుత్‌షాహీ టూంబ్స్, చార్మినార్, గోల్కొండ, గండిపేట తదితర స్పాట్స్, పండగలు, సంస్కృతులు, ప్రదర్శనలు... ప్రతి దృశ్యం వీరి కెమెరాకు చిక్కితే అపురూపమే. ఇవి కాక హంపి, నాగార్జునసాగర్ వంటి చోట్లకు వన్‌డే టూర్లు...  లడక్, కాశీ తదితర ప్రాంతాలకు సుదీర్ఘ పర్యటనలు ప్లాన్ చేస్తుంటారు. లాంగ్ టూర్లు మూడు నెలలకోసారి ఉంటాయి. ఇలా ఇప్పటి వరకు 150 ఈవెంట్స్ చేశారు. ఈ క్లబ్‌లో ఎవరైనా సభ్యులు కావచ్చు. అదీ ఉచితంగా. అలాగే... వీకెండ్ షూటర్స్ కోసం ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తుంది క్లబ్.
 
 ఫొటో ఎగ్జిబిషన్స్
‘కెమెరా కొనగానే ఫొటోగ్రఫీ ఆసక్తి ఉన్న వాళ్ల కోసం వెతుకుతుంటే ఆన్‌లైన్‌లో ఈ గ్రూప్ గురించి తెలిసింది. నాలుగేళ్లుగా క్లబ్ యాక్టివిటీస్‌లో పాల్గొంటున్నా. ఏటా డిసెంబర్‌లో థీమ్ బేస్డ్ ఫొటో కాంపిటీషన్ నిర్వహిస్తుంటాం. ఎంపిక చేసిన 75 ఫొటోలను రిఫ్లెక్షన్స్ పేరుతో ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేసి ప్రదర్శిస్తుంటాం’ అని పారిశ్రామికవేత్త, క్లబ్ అడ్మిన్ మాధవ్ ఎడ్లపాటి చెప్పారు.
 
 బేసిక్స్ తెలియని ఔత్సాహికుల నుంచి ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్స్ వరకు క్లబ్‌లో ఉన్నారు. ఫొటోగ్రఫీ నేర్చుకోవాలనుకొనేవారికి, స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకొనేవారికి ఉచితంగా వర్క్‌షాప్స్ ఏర్పాటు చేస్తుందీ క్లబ్. కేవలం హాబీగానే కాకుండా అనేక సామాజిక అంశాలపై కూడా రెగ్యులర్‌గా నిర్వహించే ఫొటో వాక్‌లో అవగాహన కల్పిస్తారు. హైదరాబాద్‌లో కనుమరుగవుతున్న అనేక అంశాలను పదిలంగా మలచాలనే ఉద్దేశంతో 1000 ప్రోట్రేట్ ప్రాజెక్టుని చేపట్టిందీ క్లబ్. మెంబర్స్ కావాలనుకొనేవారు https:// www.flickr.com/ groups/ hyderabadweekendshoots/ లింక్ క్లిక్ చేయవచ్చు.
 -  ఓ మధు

మరిన్ని వార్తలు