ఆ గ్రామాల్లో ‘నిశ్శబ్ధ’ దీపావళి..

22 Oct, 2019 15:21 IST|Sakshi

దీపావళి అనగానే అందరికీ గుర్తొచ్చేది టపాసులు. ఇటీవలి కాలంలో చాలా మందికి ఎక్కువ టపాసులు కాల్చడమనేది గొప్పదిగా మారింది. వాస్తవానికి దీపావళి అంటే దీపాల వరుస అని​ అర్థం. మంచిపై చెడు సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండగను జరుపుకుంటామనే సంగతి అందరికి తెలిసిందే. పండగ సందర్భంగా లక్ష్మి పూజ నిర్వహిస్తారు. అయితే దీపావళిని ఉత్తరాదిన ఐదు రోజులు జరుపుకుంటుంగా.. దక్షిణాదిన మాత్రం ఒకటి, రెండు రోజులు మాత్రమే పండగ సందడి ఉంటుంది. కానీ దేశం మొత్తం పండగలో కనిపించేది బాణాసంచా. ఇటీవల దీపావళి రోజున బాణాసంచా కాల్చడంపై సుప్రీం కోర్టు నియంత్రణ విధించింది. కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను చాలా చోట్ల ఉల్లంఘిస్తూనే ఉన్నారు. 

అయితే ఇందుకు భిన్నంగా తమిళనాడులో శివగంగ జిల్లాలోని కొల్లుకుడిపట్టి, సింగంపునారి గ్రామాలు మాత్రం టపాకాయలు కాల్చడానికి దూరం. వీరు సుప్రీం ఆదేశాలకు పాతికేళ్ల ముందు నుంచే బాణాసంచా కాల్చకూడదనే తీర్మానం చేసుకున్నారు. ఈ రెండు గ్రామాలు కూడా వెట్టంగుడి బర్డ్‌ సాంక్చురీలో భాగంగా ఉన్నాయి. అయితే ఇక్కడికి చలికాలం కొన్ని రకాల పక్షులు వలస వస్తుంటాయి. సైబీరియా, న్యూజిలాండ్ నుంచి వచ్చిన పక్షులు అక్కడే నివాసం ఏర్పాటు చేసుకొని మళ్లీ ఎండకాలం ప్రారంభం కాగానే వాటి ప్రదేశాలకు వెళ్లిపోతాయి.  ఇక్కడే గుడ్లు పెటి పొదిగి పిల్లలకు రెక్కలు వచ్చిన తర్వాత తమ ప్రాంతాలకు తీసుకెళ్లిపోతాయి.

గతంలో  కూడా ఈ ప్రాంతంలో టపాసులు కాల్చేవారు. అయితే బాణాసంచా మోతకు వలస వచ్చిన పక్షలు భీతిల్లిపోయేవి. పక్షులు పొదిగే గుడ్ల నుంచి పిల్లలు కూడా సరిగా బయటికి వచ్చేవి కావు. కొన్ని సార్లు పక్షులు అక్కడి నుంచి ఎగిరి వెళ్లిపోయేవి. ఈ పరిస్థితులను గమనించిన రెండు గ్రామాల ప్రజలు తమ గ్రామాల్లో బాణాసంచా కాల్చకూడదనే నిర్ణయం తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆ గ్రామాల్లో ఏ దీపావళికి కూడా బాణాసంచా కాల్చడం లేదు. కొల్లుకుడిపట్టి, సింగంపునారి గ్రామాల్లో ఎప్పుడూ బాణాసంచా కాల్చడం చూడలేదని ఆ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న అటవీ అధికారులు తెలిపారు. 

బాణాసంచా కాల్చకూడదనే నిబంధనపై గ్రామస్తులు కూడా  బలమైన సంకల్పంతో ఉన్నారు. ‘మనుషులమైతే బాణాసంచా శబ్దం భరించలేకపోతే ఇంట్లో దూరి తలుపులు వేసుకుంటాం, చెవుల్లో దూది కూరుకుంటాం. మరి ఆ పక్షులు ఈ భయంకరమైన శబ్దాలను ఎలా భరించాలి?’ అని ఆ గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మన ఆనందం కోసం పక్షులను క్షోభ పెట్టడం ఏమిటి అనేది వాళ్ల భావన. దీపావళికే కాక గ్రామాల్లో జరిగే ఏ ఇతర వేడుకల్లో కూడా వారు బాణాసంచా కాల్చరు.

పిల్లల సరదా కోసం..
పిల్లలకు టపాసులు కాల్చడమంటే మహా సరదా. అలాంటి వాటిని కాల్చవద్దంటే వాళ్ల మనసులు నోచుకుంటాయి. అందుకే  ఆ గ్రామాల్లోని పిల్లలు ఎక్కువ శబ్దం లేని టపాసులను మాత్రమే కాలుస్తారు. అది కూడా... స్కూలు హెడ్మాస్టరు పర్యవేక్షణలో చెట్లు, పక్షులు లేని నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్లి మరీ టపాసుల వేడుక చేసుకుంటారు.

మరిన్ని వార్తలు