వెలుగు పువ్వుల దిబ్బు దిబ్బు దీపావళి 

23 Oct, 2019 15:31 IST|Sakshi

అమావాస్య రోజు శ్రీకృష్టం జననం లాగా అమావాస్య రోజున దివ్వెల తోరణాలతో..వెలుగు పువ్వుల కొలువు దీపావళి. నరకాసుర వధ, బలి చక్రవర్తి రాజ్యదానం, వనవాసం అనంతరం రాముడు అయోధ్యకు తిరిగిరావడం, విక్రమార్కుడి పట్టాభిషేకం...ఇలా కథలూ,కారణాలూ ఎన్ని ప్రాచుర్యంలో ఉన్నా నులివెచ్చని చలికాలంలో దేశవ్యాప్తంగా జరుపుకునే దివ్వెలపండుగ. అయితే దీపావళి పండుగ ప్రజాహితంగా, పర్యావరణ హితంగా జరుపుకుంటున్నామా? ఈ పండుగ వేళ కాలుష్య కాసారంలా మారిపోతున్న పుడమి తల్లికి మరింత భారమేనా? ఢమాల్‌...ఢమాల్‌ అంటూ విపరీతమైన శబ్దాలతో.. అక్షరాలా ఆ లక్ష్మీదేవినే (అతి ఖరీదైన టపాసులను) అగ్నికి ఆహుతి చేయడమేనా దీపావళి పరమార్థం....దిక్కులు పిక్కటిల్లేలా భరించలేని శబ్దాలతో..బిక్క మొహం వేసే పసిపిల్లల తల్లుల అవస్థలు ఎవరికీ పట్టవా? ఇలా  ప్రతీ దీపావళికి నా మదిని తొలిచేసే ప్రశ్నలు. 

కానీ చిన్నతనంలో ఒక వేడుక మాత్రం నాకిప్పటికీ గుర్తే.. అదే 'దిబ్బు దిబ్బు దీపావళి..' పొడవాటి గోగు కర్రలు, కొత్త తెల్లటి వస్త్రంతో చేసిన నూనె వత్తులు....దీపావళి ఎంతైనా బాలల పండుగే కదా.. అందుకే బాల్యం నాటి జ్ఞాపకాలు భూచక్రాల్లా గిర్రున నన్ను చుట్టుకున్నాయి. నా జీవితంలో నాకెంతో ఇష్టమైన రేడియోలో పండుగ రోజు గంటపాటు నాదస్వరంతో నిద్ర లేవడం ఎంత గుర్తో. వణికించే చలిలో మందార ఆకులు వేసి నానబెట్టిన కుంకుడు కాయల రసంతో తలంటూస్నానాలు.. అందులోనూ ఆడపిల్లలు ముందు చేయాలి. నాన్న  స్వయంగా పొటాషియం, గంధకం కలిపి తయారు చేసే చిచ్చుబుడ్లు, మతాబులు, సిసింద్రీలూ, అన్నయ్యలకోసం ప్రత్యేకంగా తయారుచేసే తిప్పుడు పొట్లం...చిన్న రేకు తుపాకి, దానికోసం గుళ్ల ఎర్ర రీళ్ల బుల్లి డబ్బాలు, కంపుకొట్టే పాముబిళ్లలు, వెన్నముద్దల  వెలుగులు ఒక్క క్షణం నన్ను ఆవరించాయి. ఇపుడు నాన్నా లేరు..ఆ మట్టి వాసనల వెలుగులూ లేవు.. అంతా ప్లాస్టిక్‌ మయం. పర్యావరణ హితం అన్నది ఉత్త మాటలకే పరిమితమైపోయింది.  కాంక్రీట్‌ జంగిల్‌ అపార్ట్‌మెంట్లలో పోటా పోటీగా ఎవరు ఎంత ఎక్కువ టపాసులు (డబ్బులు తగలేసారనేదే) కాల్చారనేదే లెక్క. అంతేకాదు అందరూ సద్దుమణిగాక మరీ, మందుగుండు సామగ్రితో సర్జికల్‌ స్ట్రైక్‌ చేసేంత శాడిజం నన్ను మరింత భయపెడుతుంది.. నిజం.. 


 
'దిబ్బు దిబ్బు దీపావళి..' సంబరం గురించి చెప్పు​కోవాలంటే చాలా ఉంది..దీపావళి రోజు సాయంత్రంపూట జరిగే వేడుక ఇది. గోగు మొక్క​లు లేదా గోగుకర్రలు పొడవాటివి తీసుకొని వీటిపై అంతకుముందే తయారు చేసుకుని నువ్వుల నూనెలో తడిపి వుంచుకున్న తెల్లని నూలు గుడ్డల వత్తులు వేలాడదీస్తారు.  ఒక్కొక్కరు రెండు మొక్కల జత పట్టుకుని వరుసగా నించుని ఆ కుటుంబలోని పిల్లలందరి మొహాలు కొత్త బట్టలు, పూల (పిలక) జడలతో నిండు పున్నమి వెలుగుల్లా వెలిగిపోతూ వుంటే.. అమ్మో..అమ్మమ్మో...నాన్నమ్మో..మేనత్తో.. వాటిని వెలిగిస్తారు. అపుడు ఆవిష‍్కృమవుతుందో కమనీయదృశ్యం.  దీపాల కర్రలను పట్టుకొని గుండ్రంగా తిప్పుతూ-  'దిబ్బు దిబ్బు దీపావళి.. మళ్లీ వచ్చే నాగుల చవితి' అని  పాడుతూ  దీపం ఆరిపోతున్న సమయంలో నేలమీద మూడుస్లార్లు కొట్టాలి. అది అయిపోయాక.. పెరట్లోకి వెళ్లి కాళ్లు కడుక్కొని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లి అమ్మ పెట్టే అరిసె తినాలి. ఇక తొందరగా అన్నం తినేసి కాల్చుకోవడానికి వెళ్లాలి.. అయితే ఇక్కడ ఇంకో ట్విస్టు ఏంటంటే.. కొత్త బట్టలుమార్చుకుని... పాత కాటన్‌ బట్టలు వేసుకోవాలి.. ఇహ మారాంలు మొదలు. అయితే ఈ విషయంలో ఇక్కడ మాత్రం అమ్మ, నాన్న ఇద్దరిదీ ఒకటే మాట..టపాసులు కాల్చుకోవాలంటే.. పొట్టి కాటన్‌ బట్టలు వేసుకోవాల్సిందే..!

ఇవేనా..పెరుగుబంతి, కృష‍్ణ బంతిపూలు, కనకాంబరాలు దీపావళి నాటికి పూస్తాయా లేదా అని రోజు వాటి చుట్టూ తిరగడం, పెద్ద పెద్ద దండలు గుచ్చి వాటిని అన్ని గుమ్మాలకు వేలాడ దీయడం, మట్టి ప్రమిదలు, పొటాషియం, సూరేకారం, కొబ్బరిపొట్టు, బొగ్గు సేకరించడం.. చేటల్లో ఆరబెట్టడం...కళ్లల్లో పెట్టుకోవద్దు..చేతులు సరిగ్గా కడుక్కోలేదంటూ తిట్లూ.. ఇలా ఎన్నో.. ఎన్నెన్నో.. తెలిసీ తెలియక విసిరిన తారా జువ్వ తడిచి సరిగ్గా వెళ్లక పక్కనే ఉన్న టైలర్‌ వెంకటరావు మావయ్య ఇంటి చూరులో దూరడం..దీంతో అత్త తిట్ల దండకం.. ఇప్పటికీ గుర్తు.. టైలర్‌ మామ కుట్టిచ్చిన  పూల పూల  పట్టు కుచ్చుల గౌను సాక్షిగా..! తడిచి అంటే..గుర్తొచ్చింది...తయారు చేసుకున్న దీపావళి సామానులు రోజూ ఎండలో ఫెళఫెళమంటూ ఎండటం..దేవుడికి ఎంత వేడుకున్నా..సరిగ్గా దీపావళి రోజే వర్షం రావడం ఎలా మర్చిపోగలం..అయినా.. నాన్న చేతి చిచ్చుబుడ్డి అంతెత్తున ఎగిరి విసిరిన వెలుగు పువ్వులు...మతాబుల వెలుగులు జీవితానికి సరిపడా నాతోనే..

‘‘పర్యావరణహిత దీపావళి సంతోషాల హరివిల్లు..పుడమి తల్లికి ఆనందాల విరిజల్లు’’

మీ నేస్తం..

Read latest Festival News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు