పొంగల్‌ క్రాంతి

13 Jan, 2018 08:10 IST|Sakshi

ఖర్జూరాలు అందుకోండి. పండ్లబుట్ట తీసుకురండి. పచ్చికోవా రెడీ చేసుకోండి. పండగకి ఎప్పుడూ కొత్త బియ్యం పొంగళ్లేనా? వీటిని ట్రై చెయ్యండి. అతిథుల్ని సర్‌ప్రైజ్‌ చెయ్యండి.

స్వీట్‌ పొంగల్‌
కావలసినవి: పాలు – 4 కప్పులు; బియ్యం – కప్పు; బెల్లం పొడి – కప్పు; జీడిపప్పులు – 10; కిస్‌మిస్‌ – 2 టేబుల్‌స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; నెయ్యి – 6 టేబుల్‌ స్పూన్లు; కొబ్బరి ముక్కలు – 2 టేబుల్‌ స్పూన్లు

తయారి:  ముందుగా పాలను మరిగించాలి∙ బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీరు ఒంపేసి, మరుగుతున్న పాలలో వేయాలి∙ బాగా ఉడికిన తరవాత బెల్లం పొడి వేసి కలియబెట్టి, ఉడికించాలి∙ ఐదు టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపాలి∙ బాణలిలో టేబుల్‌ స్పూను నెయ్యి వేసి కరిగాక జీడిపప్పులు, కిస్‌మిస్, కొబ్బరి ముక్కలు విడివిడిగా వేసి వేయించి, ఉడికిన పొంగల్‌లో వేసి బాగా కలపాలి  వేడివేడిగా వడ్డించాలి.

డేట్స్‌ హనీ పొంగల్‌
కావలసినవి: బియ్యం – కప్పు; పెసర పప్పు – అర కప్పు; పాలు – 4 కప్పులు; నీళ్లు – 2 కప్పులు; బెల్లం పొడి – ఒకటిన్నర కప్పులు; ఖర్జూరాలు – 10 (చిన్న చిన్న ముక్కలుగా చేయాలి); తేనె – 3 టేబుల్‌ స్పూన్లు; నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు; ఏలకుల పొడి – టీ స్పూను; శొంఠి పొడి – టీ స్పూను; వేయించిన జీడి పప్పులు – 10

తయారి:  బియ్యం, పెసర పప్పులను బాగా కడిగి అరగంటసేపు నానబెట్టాలి∙ పెద్ద పాత్రలో పాలు పోసి మరిగించాలి∙ నీళ్లు, టేబుల్‌ స్పూను నెయ్యి జత చేసి బాగా కలపాలి∙ నానబెట్టుకున్న బియ్యం + పెసర పప్పు వేసి బాగా కలిపి ఉడికించాలి∙ ఒక పాత్రలో బెల్లం, నీరు పోసి గరిటెతో బెల్లం కరిగేవరకు కలపాలి∙ మిక్సీలో ఖర్జూరాలు, తేనె వేసి మెత్తగా చేసి, ఉడుకుతున్న పొంగల్‌లో వేసి మరోమారు కలిపి ఉడికించాలి∙ ఏలకుల పొడి, శొంఠి పొడి వేసి బాగా కలిపి దింపేయాలి∙ వేయించి ఉంచుకున్న జీడిపప్పులతో అలంకరించి వేడివేడిగా అందించాలి.

ఫ్రూట్‌ పొంగల్‌
కావలసినవి: బియ్యం – కప్పు; పెసర పప్పు – టేబుల్‌ స్పూను; పటిక బెల్లం – కప్పు; ఫ్రూట్‌ పల్ప్‌ – ఒకటిన్నర కప్పులు; ఏలకుల పొడి – టీ స్పూను; కుంకుమ పువ్వు – చిటికెడు; కిస్‌మిస్‌ – కొద్దిగా

తయారి:  బియ్యం, పెసరపప్పులను విడివిడిగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి విడివిడిగా ఉడికించాలి∙ పెసరపప్పు మరీ మెత్తగా కాకుండా, కొద్దిగా పొడిపొడిగా ఉండేలా ఉడికించాలి∙ పటిక బెల్లానికి తగినని నీళ్లు జత చేసి, స్టౌ మీద కరిగించాలి∙ ఒక పాత్రలో అన్నం, ఉడికించిన పెసరపప్పు వేసి బాగా కలపాలి∙ పటికబెల్లం నీళ్లు జత చేసి మారోమారు ఉడికించాలి∙ ఏలకుల పొడి, కుంకుమ పువ్వు జతచేసి మరోమారు కలపాలి ∙ చివరగా ఫ్రూట్‌ పల్ప్‌ జత చేసి బాగా కలియబెట్టి దింపేయాలి ∙ బాణలిలో నెయ్యి వేసి కరిగాక కిస్‌మిస్‌ వేసి వేయించి, ఫ్రూట్‌ పొంగల్‌లో వేసి కలపాలి. ఫ్రూట్‌ పల్ప్‌ కోసం... ఆపిల్, పైనాపిల్, అరటిపండు, సపోటా, స్ట్రాబెర్రీలు... వీటిని తగినన్ని తీసుకుని చిన్నచిన్న ముక్కలుగా చేసి మెత్తగా చేయాలి.

అమృత పొంగల్‌
కావలసినవి: సన్న బియ్యం – కప్పు; పాలు – 2 కప్పులు; నీళ్లు – కప్పు; పంచదార లేని పచ్చి కోవా – కప్పు; పంచదార – కప్పు; కుంకుమ పువ్వు – పావు టీ స్పూను; బాదం పప్పులు – 5; పిస్తా – 5

తయారి:  ముందుగా బియ్యం శుభ్రంగా కడగాలి ∙ పాలు, నీళ్లు కలిపి మరిగాక, కడిగిన బియ్యం వేసి ఉడికించాలి∙ ఉడికిన అన్నాన్ని మెత్తగా మెదిపి, పంచదార జత చేసి, స్టౌ మీద ఉంచి, పంచదార కరిగేవరకు కలపాలి∙ పచ్చి కోవా జత చేసి మరోమారు కలిపి బాగా ఉడికించి దింపేయాలి∙ బాదం పప్పుల తరుగు, పిస్తా పప్పులు వేసి బాగా కలిపి, కుంకుమ పువ్వు పొడి వేసి కలిపి వేడివేడిగా అందించాలి.

మరిన్ని వార్తలు