శార్వరి నామ సంవత్సర (కుంభ రాశి) రాశిఫలాలు

22 Mar, 2020 08:39 IST|Sakshi

(ఆదాయం  11, వ్యయం  5,  రాజపూజ్యం 5,  అవమానం  6)

ఈ రాశివారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. మీ దగ్గర మధ్యవర్తులు ఇతరుల పేర్లు చెప్పి డబ్బు గుంజుతారు. అందులో అబద్ధాలు ఉన్నాయని తెలిసినా డబ్బు సర్దుబాటు చేస్తారు. నమ్ముకున్న వ్యక్తులు, మీవాళ్లు అనుకున్న వ్యక్తులు, రాజకీయ నాయకులు, అధికారులు చెప్పుకోదగిన స్థాయిలో ఉపయోగపడరు. అందరినీ వ్యతిరేకించి మీరు పట్టుబట్టి ఉన్నతస్థానంలో ఉంచిన వ్యక్తులు మీకు మేలు చేస్తారు. ఆత్మీయవర్గం కూడా కొన్ని సందర్భాలలో అపార్థం చేసుకోవడం జరుగుతుంది. అత్యున్నత విజ్ఞానవాదులు, ఎంతో పుణ్యం కలిగినవారు, సమాజంలో ప్రఖ్యాతి కలిగిన వారు వారి వారి భావాలకు విరుద్ధంగా మీతో స్నేహం చేస్తారు, మీ మాటలు, సలహాలు, ప్రవర్తన వారిని విశేషంగా ఆకట్టుకుంటాయి. నిత్యం ఓం నమశివాయ వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ప్రభుత్వ కార్యాలయంలో మీ పరపతి పెరుగుతుంది. అయినా సాధారణ ఫలితాలు మాత్రమే సాధిస్తారు. మొండి బాకీల వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి.

మీ సాటివాళ్ళు మీకన్నా అధికంగా లాభం పొందుతారు. ఈ విషయం మిమ్మల్ని బాధించినా కొంతకాలం తరువాత మీకు కూడా అదే విధమైన ప్రయోజనాలు చేకూరుతాయి. భాగస్వాములుగా చేరమని ఒత్తిడి తెస్తారు. అనుభవం లేని రంగాలలో కొత్తవారిని నమ్మి వ్యాపారంలో దిగుతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్టాక్‌ మార్కెట్ల జోలికిపోవద్దు. మీ మాటలకు వక్రార్థాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీయాన ప్రయత్నాలు ఊహించిన సమయం కంటే ముందే అనుకూలిస్తాయి. విదేశీయాన ప్రయత్నాలలో మీకు సహకరించిన వారి ఋణం తీర్చుకుంటారు. కార్యాలయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకుంటారు. నిజమైన మిత్రులు ఎవరో? కాని వారు ఎవరో? కంటికి స్పష్టంగా తెలుస్తుంది. స్త్రీల వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించుకుంటారు. గణాంకములలో మోసాలు చెల్లించిన ధనాన్ని చెల్లించలేదని, తీసుకోని ధనము తీసుకున్నారని మొదలైన నిందలు అసౌకర్యానికి గురిచేస్తాయి.

నష్టము, బాధలు ఏ స్థాయిలో జరిగినా ఇలాంటివి అల్పమని గ్రహించండి. విలువైన వస్తువులకు ఇన్సూరెన్స్‌ చేయడం మరిచిపోకండి. దొంగతనాలకు అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. అనుమానాస్పద భూములు, ఆర్థికలావాదేవీల జోలికి వెళ్ళవద్దు. గృహ సంబంధిత విషయాలకు అధిక ధనం వెచ్చిస్తారు. ఇరుగు పొరుగు వారితో పరుష సంభాషణలు, బేధాభిప్రాయాలు సంభవిస్తాయి. అనుకున్న కార్యక్రమాలు పూర్తయి, మంచి స్థితి సాధించినా సుఖపడటానికి కొంత సమయం పడుతుందని గ్రహిస్తారు. భాగస్వాముల మధ్య విభేదాలు ఇతరులకు ఉపయోగపడే విధంగా మారడం బాధ కలిగిస్తుంది. నిష్కారణంగా నోరుజారి పరువు తీసుకొని బజారుకు ఎక్కే ఆత్మీయవర్గం మనోవేదనగా మారుతారు. మీ ఓర్పు, సహనం కృత్రిమంగా తెచ్చిపెట్టుకున్నట్లుగానే అందరికీ అర్థం అవుతుంది. సమస్యలు ఎదురైనా అభివృద్ధి సాధించడానికి శారీరకంగా, మానసికంగా అహోరాత్రులు శ్రమిస్తారు. కాంట్రాక్టులు, సబ్‌కాంట్రాక్టులు, లైసెన్సులు లీజులు లాభిస్తాయి. దైవానుగ్రహం వెన్నంటి రక్షిస్తున్నట్లుగా భావిస్తారు. బరువుబాధ్యతలు, శుభకార్యాలు పూర్తి చేయడానికి అధికంగా ధనం వెచ్చిస్తారు. స్థిరాస్తులు అమ్మేటప్పుడు అన్ని విషయాలలో జాగ్రత్త వహించండి, మోసపోయే అవకాశం ఉంది. రాజకీయాలలో రాణిస్తారు. రాజకీయ పలుకుబడి పెరుగుతుంది. విందువినోదాలలో కొత్త విషయాలు తెలుసుకుంటారు. కీలక సమాచారం లభిస్తుంది. అపురూపమైన ప్రదేశాలను కుటుంబసభ్యులతో కలిసి సందర్శిస్తారు.

మానసిక ప్రశాంతత కలుగుతుంధి. నాగబంధాన్ని ఉపయోగించండి. సమాజంలో పెద్దలుగా చలామణీ అవుతున్న వారి అంతరంగిక రహస్యాలు మీకు తెలుస్తాయి. దీక్షలు ఘనంగా పూర్తిచేస్తారు. మహత్తరమైన కార్యక్రమాలను శ్రమించి ఒంటరిగా అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఉన్నతస్థానాలలోని వారి సహకారం లేకుండా మీరు సాధించిన వాటికి మీ శక్తికొలది సహాయపడతారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, వికలాంగులకు సంబంధించిన వాటికి మీ సంపూర్ణ సహకారాలను అందజేస్తారు. విదేశాల నుండి కూడా నిధులు పోగుచేసి వారికి సహాయం చేద్దామనుకున్న మీ ప్రయత్నాలకు ఓ వ్యక్తి సైంధవుడిలా అడ్డుపడతాడు. మాట తప్పే మనుషుల వల్ల నష్టం కలుగుతుంది. కళా, సాంస్కృతిక వ్యవహారాలలో, క్రీడలలో నూతన అవకాశాలు అందివస్తాయి. మీ వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు, వ్యక్తిగత విషయాలు ఇతరులకు తెలియటం వల్ల వివాదాలు, విమర్శలు చోటుచేసుకుంటాయి. కుటుంబ విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు. మీ పర్యవేక్షణ అవసరము. వృత్తిఉద్యోగాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని రహస్యంగా చక్కబెడతారు. మీరు కోరుకున్న కోరికలు తీరుతాయి. విదేశాలలో ఉన్న మీ ఆత్మీయవర్గం ఆకస్మికంగా రావడం జరుగుతుంది. ఇందుకు కారణాలు ఎంత వెతికినా మీకు కనిపించవు. కొన్ని విషయాలు పట్టించుకోకుండా ఉంటేనే మనశ్శాంతి లభిస్తుందన్న నిజాన్ని మీరు గ్రహిస్తారు.

ప్రేమ వివాహాలకు సంబంధించిన వ్యవహారాలు మీ చొరవ వల్ల ఒక కొలిక్కి వస్తాయి. గ్రీన్‌కార్డు కోసం ప్రయత్నించే వారికి ఈ సంవవత్సరం సానుకూలపడుతుంది. వ్యాపార విస్తరణ కోసం బ్యాంకు ఋణాలు తీసుకుంటారు. నూతన భాగస్వాముల చేరిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఎన్నుకున్న ప్రదేశాలను బట్టి లాభనష్టాలు ఉంటాయి. సమున్నతమైన శిఖరాలను అధిరోహించాలని, అందరికీ ఆదర్శంగా ఉండాలని భావిస్తారు. మీరు శ్రమించిన ఒకానొక వ్యవహారం లాభిస్తుంది. ఇక తిరుగులేని అరుదైన విజయాన్ని నమోదు చేసుకుంటారు. కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. శక్తిసామర్థ్యాలకు తగిన గుర్తింపు, చదివిన చదువుకు తగిన  ఉద్యోగం లభిస్తుంది. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలకు కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ సామాజిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల వలన కొంత ఇబ్బంది కలుగుతుంది. లీజులకు సంబంధించిన విషయాలు, ఇసుక వ్యాపారము కొంత వివాదస్పదం అవుతాయి. ప్రతి కీలక సమయంలోనూ దైవానుగ్రహం, రాజకీయ పలుకుబడి మిమ్ములను రక్షిస్తాయి. ప్రైవేటు వ్యక్తుల నుండి లోనులు తీసుకోవలసిన పరిస్థితి బహుశా రావచ్చు. వృత్తిఉద్యోగాలపట్ల అంకితభావంతో దివారాత్రులు శ్రమిస్తారు. అందరి మెప్పులను పొందగలుగుతారు.

ప్రమోషన్‌ లభిస్తుంది. కానీ కొంతమంది కుహానా వ్యక్తులు మీ శ్రమ, అంకితభావం వెనుక స్వార్థప్రయోజనాలు ఉన్నాయని ప్రచారం చేస్తారు. మీ వ్యక్తిత్వంలో, దినచర్యలో ఉన్న లోపాలను తెలుసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తారు. ఆరోగ్య సంబంధమైన సమస్యలు కొంతకాలం బాధపెడతాయి. అరికాలి మంటలు, మోకాళ్ళనొప్పులు, ఇ.ఎన్‌.టి. ప్రాబ్లమ్స్‌ ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది. ప్రధానంగా కీళ్ళు, వెన్నెముక బాధలు ఉండవచ్చు. సోదరసోదరీ వర్గానికి రహస్యంగా ఆర్థికసహాయం అందిస్తారు. వాళ్ళలో ఐకమత్యం లేకపోవడం వల్ల మీరు చేసిన సహాయం బయటపెడతారు. ఎంత కలిసి వచ్చినా డబ్బులు ఉన్నా సంఘంలో మంచి స్థాయి లభించినా దేనికీ లోటు లేని పరిస్థితి ఉన్నా ఏదో ఒక మానసిక అప్రశాంతత బాధిస్తుంది. గతించిపోయిన వ్యక్తి జ్ఞాపకాలు ఎంతగానో బాధిస్తాయి. మరుపు అంత తేలిక కాదని గ్రహిస్తారు. కాలానికి ఎదురీదడం మీ వల్ల కాదని గ్రహిస్తారు. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్‌ బిజినెస్‌లోని వాళ్ళకి బాగుంది. వ్యవసాయరంగంలో ఉన్న వారికి ఫలితాలు బాగున్నాయి. డాక్టర్లు, లాయర్లకు, విద్యాసంస్థల వారికి ఇబ్బంది లేనటువంటి కాలం అయినప్పటికీ సొంత వ్యక్తుల పొరపాట్లు అపఖ్యాతికి దారితీయవచ్చు.

పోటీపరీక్షలో గానీ మామూలు పరీక్షలలో గానీ మీరు వ్రాసింది కాపీ కొట్టిన వారికి ఎక్కువ మార్కులు, మీకు తక్కువ మార్కులు వస్తాయి. కాపీయింగును ప్రోత్సహించడమే తప్పని తెలుసుకుంటారు. రాజకీయ మార్పులు చేర్పులు మీకు లాభిస్తాయి. విదేశాలలో ఉన్న మీ ఆత్మీయవర్గం ప్రశాంతంగా ఉన్నారని తెలుస్తుంది. అక్కడి నుండి వచ్చే ఫోన్‌కాల్స్‌ మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. నిష్కారణ వేధింపులకు గురి అవుతున్న మీ సంతానానికి ఏదో ఒక పరిష్కార మార్గం చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చిల్లరమల్లర తగాదాలు, మధ్యవర్తిత్వాలు, రాజీయత్నాలు విసుగుపుట్టిస్తాయి. ఏ పనిచేయాలనుకున్నా సమాజాన్ని, ఆత్మగౌరవాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సి వస్తుంది. ఇందువలన చేతిలో ఉన్న పనులను కూడా చేయలేకపోతారు. అందరూ అన్ని పనులు చేయలేరని సరిపెట్టుకుంటారు. స్వగృహయోగం ఏర్పడుతుంది. 


 
 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా