శార్వరి నామ సంవత్సర (మేష రాశి) రాశిఫలాలు

22 Mar, 2020 09:42 IST|Sakshi

(ఆదాయం  5, వ్యయం  5, రాజపూజ్యం  3, అవమానం  1)

మేషరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికస్థితి బాగున్నప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి. గృహసంబంధమైన వ్యాపారాలు కొంత నత్తనడకన నడిచినా కొన్ని ప్రాజెక్టులలో లాభాలకు ఇబ్బంది ఉండదు. వెబ్‌సైట్స్‌ వల్ల లాభపడతారు. సంవత్సర ద్వితీయార్ధంలో మీ అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఆర్థిక ప్రయోజనాల కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తారు. ఆఫీస్‌కు సంబంధించి బ్రాంచీలు ఏర్పాట్లు చేస్తారు. పెట్టుబడికి వెనుదిరగరు. కొత్తవారిని నియమిస్తారు. అన్నివిధాలా బాగానే చూసుకున్నా కొంతమంది వ్యక్తులు నిత్యం సణుగుతూనే ఉంటారు.

వారివల్ల ప్రయోజనం ఉండదు. అయినా భరించక తప్పదు. ఏ దేవుడికైనా, దేవతకైనా పూజ చేసేటప్పుడు అభిషేకంలో మహాతీర్థం పొడిని ఉపయోగించండి. మీరు ఎంతో రహస్యంగా ఉంచిన మీ వ్యక్తిగత విషయాలు బయటకు పొక్కుతాయి. ఇది మీకు మనస్తాపం కలిగిస్తుంది. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మీ ఫైళ్ళపై ఉన్నతాధికారులు సంతకాలు చేస్తారు. సంతాన విద్యావిషయాలు, వ్యక్తిగత విషయాలు అన్నీ సాధ్యమైనంతవరకు మీరే దగ్గరుండి చూసుకుంటారు. సంవత్సర ద్వితీయార్ధంలో ఫలితాలు చాలా బాగుంటాయి. కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. భగవంతుని సంకల్పం ప్రకారం నడుస్తుందని నమ్మకం కలిగి ఉంటారు. మానసిక దైవారాధన పెరుగుతుంది. మీ ఆలోచనలకు కార్యరూపం ఇస్తున్న ఒక కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారు.

గాలిలో దీపం పెట్టి దేవునిపై భారం వేయరు. కష్టం, అంకితభావం ఈ రెండూ దైవమని నమ్ముతారు. జీవితాశయాన్ని సాధిస్తారు. అఖండ ఖ్యాతి లభిస్తుంది. ఈ సంతోష సంబరాలను మీరు ఆస్వాదించలేరు. నా ఉన్నతిని చూసి గర్వపడే నా ఆత్మీయుడు, సన్నిహితుడు నాకు శాశ్వతంగా దూరమైనప్పుడు ఈ విజయోత్సవాలు, విందులు, వినోదాలు దేనికి? ఎవరు చూసి సంతోషించడానికి? అనే వేదన మనస్సులో చెలరేగుతుంది. ‘నా స్థితిని చూసి కృత్రిమంగా ఆత్మీయతలు చూపే వారు నా హితులా? కాదు అధికారం చుట్టూ తిరిగే ఈ భజనపరులు వీళ్ళు ఎన్నటికీ నా వారు కాదు. నా వాడు పోయాడు, నాకు శాశ్వత దుఃఖాన్ని మిగిల్చాడు. ఇలాంటి ఆలోచనలు తీవ్రమైన మనోవేదనకు కారణం అవుతాయి కొంతమంది విషయంలో. సాధించిన కీర్తిప్రతిష్ఠలు కాపాడుకోవడానికి మరింత శ్రమించవలసి వస్తుంది. ఎక్కడా విశ్రాంతికి తావులేకుండా శ్రమిస్తారు.

నమ్మకస్తులైన సహచరవర్గం మీ ఆశయాలు సాధించడానికి మీతో సహకరిస్తారు. మీరు సహకరిస్తున్న ఆప్తులు వెళ్ళిపోతారేమోనన్న దిగులు మనసులో ఉంటుంది. మీరిచ్చే ధనానికి, వారు చేసే శ్రమకు చాలా వ్యత్యాసం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. కొన్ని విషయాలపై ఎడతెరపి లేని రాజీలేని చర్యలు చోటు చేసుకుంటాయి. మూర్ఖులను మార్చలేమని గ్రహిస్తారు. కండరాలు, కీళ్ళనొప్పులు బాధిస్తాయి. సందర్భోచిత నిర్ణయాలు తీసుకుని అందరి మెప్పు పొందుతారు. మేధావిగా పేరు వస్తుంది. పైకి శాంతంగా కనిపించినా కటువుగా కనిపించకపోయినా మనస్సులో ఉన్న పగ, ప్రతీకారాన్ని ఎంతో కాలం పోషిస్తారు. అంతర్గతమైన అసహనం, పడినటువంటి పాట్లు జరిగిన అవమానాలు మరిచిపోలేరు. విదేశాల నుండి మీరు కోరుకున్న శుభసమాచారం అందుకుంటారు. కార్యానుకూలతకు కృషితో పాటు లౌక్యం కూడా అవసరమని గ్రహిస్తారు. కనీస లౌక్యం లేకుండా ప్రవర్తించి మీరే విచార పడతారు.

లౌక్యం అనే విద్యను ఏ విధంగానైనా సాధించాలన్న పట్టుదల మీలో కలుగుతుంది. దైనందిన జీవితం రొటీన్‌గా ఉండకూడదని మార్పులు చేయాలని నిర్ణయించుకుంటారు. పిల్లల విషయంలో ఒక దిగులు ఆలోచన ఉంటుంది. ఇంట్లోను, వ్యాపార ప్రదేశాలలోను అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయండి, శుభప్రదం. ఉదర సంబంధ వ్యాధులను నిర్లక్ష్యం చేయవద్దు. గొప్పలు చెప్పుకునే కొందరు స్వార్థపరులు స్థిరాస్తుల విషయంలో మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించి భంగపడతారు. పరోపకారం చేసే వారిని మీరు ప్రోత్సహిస్తారు. ఇందువల్ల అనుకోని కొందరు ముఖ్యమైన వ్యక్తులు దగ్గరవుతారు. అడ్డంకిగా మారినటువంటి కొన్ని ఇబ్బందికరమైన విషయాలు చర్చకు వస్తాయి. స్వయంకృతాపరాధాలు మీ నష్టాన్ని పూరించుకోవడానికి కఠినమైన క్రమశిక్షణతో మిమ్ములను మీరే సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తారు. కొత్త మిత్రులు దూరమవుతారు. పాతమిత్రులు దగ్గరవుతారు. రాజకీయపరమైన విషయాలలో మీ జోక్యం అనివార్యమవుతుంది. ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ మీ రాజకీయ ప్రవేశం ఉంటుంది.

మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తి విలువ పెరుగుతుంది. ఉన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తితో కలిసి పనిచేయాలనుకునే మీ ఆరాటం ఫలిస్తుంది. సమాజంలో ఉన్నతస్థానంలో ఉన్న వారికి మీ సలహాలు, సంప్రదింపులు అవసరం అవుతాయి. మొండితనంతో ఓ అధికారి ఎంతమంది ప్రముఖులు చెప్పినా మీ ప్రయోజనాలకు అడ్డుపడుతున్న ఆ అధికారికి స్థానచలనం సంభవిస్తుంది. దాంతో మీ సమస్య తీరుతుంది. మీరు కోరుకున్న మంచి ఉద్యోగ అవకాశం లభిస్తుంది. సాఫ్ట్‌వేర్‌ రంగంలోని వారికి శక్తిసామర్థ్యాలకు తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది. విదేశాలలో చదువుకోవాలనే మీ కోరిక ఈ సంవత్సరం నెరవేరుతుంది. అంతేగాక విదేశాలలో ఉద్యోగం చేయడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికి అటువంటి అవకాశాలు లభిస్తాయి. మీ కార్యక్రమాలన్నీ క్రమశిక్షణాయుతంగా, రహస్యంగా ముందుకు సాగుతాయి. తోడబుట్టిన వాళ్ళకు మీ కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆర్థిక సహాయం చేస్తారు. విలువైన భూమిని కొనుగోలు చేస్తారు.

కమర్షియల్‌ ఏరియాలో ఒక అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేస్తారు. మీ కొనుగోళ్ళు అన్నీ గోప్యంగా ఉంటాయి. ఉద్యోగంలో బదిలీ వేటు తప్పకపోవచ్చు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల మీ బదిలీ ఆగిపోతుంది. విద్యాపరంగా బాగుంటుంది. పోటీపరీక్షలో విజయం సాధిస్తారు. ఒక ముఖ్యమైన వ్యక్తికి మీరు అంతరంగికులు కావడం వల్ల ఆ వ్యక్తి చేసే తప్పుడు పనులకు మీరే కారణం అని వైరివర్గం భావిస్తారు. అయితే వాస్తవరూపంలో ఇది కొంతవరకు మాత్రమే నిజం. పోలీస్‌ స్టేషన్స్, కోర్టులు, తగాదాలు, వివాదాలు, మధ్యవర్తి పరిష్కారాలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌ లభిస్తుంది. రుద్రజడ ఉపయోగించండి. పునర్వివాహ ప్రయత్నాలు తృటిలో తప్పిపోతాయి. శ్రీ వేంకటేశ్వరస్వామిని పూజించడం చెప్పదగిన సూచన. కుటుంబంలో ఐకమత్యం సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు విఫలం అవుతాయి. కొన్ని అన్యాయాలను మీరు నిరోధించలేకపోతారు. ధనం ఒక్కటే శాశ్వతమని భావించిన వ్యక్తులకు మీ ధర్మసూత్రాలు నచ్చవు. సామాజిక పోకడలు మీపై ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగా కానీ ప్రభావం చూపుతాయి. మీరు తీసుకున్న నిర్ణయాలపైన వాటి ప్రభావం ఉంటుంది.

సమ్మెలు, బంద్‌లు, ఉద్యమాలు వాటి వల్ల కొన్నిసందర్భాలలో లాభపడతారు. కొన్ని సందర్భాలలో నష్టపోతారు. కార్యాలయంలో మీకు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు లభిస్తాయి. ఉన్నతాధికారులు మీకు స్వేచ్ఛను ఇస్తారు. దాని వలన దీర్ఘకాలికంగా అన్యాయానికి గురి అవుతున్న వారికి మీ వల్ల న్యాయం జరుగుతుంది. అదేవిధంగా మీ ఉత్తర్వులు వివాదస్పదమవుతాయి. కొందరు కోర్టుకు ఎక్కుతారు. ఇందులో మీకు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవు గనుక నిశ్చింతగా ఉంటారు. సివిల్‌ సర్వీస్‌లకు ఎంపిక అవుతారు. మీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలు, సేవాసంస్థలు పురోగమనంలో ఉంటాయి. ఆధ్యాత్మిక రంగంలో  ఉన్నవారికి మంచి కీర్తిప్రతిష్ఠలు, ధనం లభిస్తాయి. మీ పాండిత్యానికి, కృషికి అన్నివిధాలుగా తగిన గుర్తింపు లభిస్తుంది. సిద్ధ గంధం ధరించండి. 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా