శార్వరి నామ సంవత్సర (మకర రాశి) రాశిఫలాలు

22 Mar, 2020 08:25 IST|Sakshi

(ఆదాయం  11, వ్యయం  5,  రాజపూజ్యం 2, అవమానం 6)

ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. విదేశీ సంబంధమైన అవకాశాలు మీకు మీ రక్తసంబంధీకులకు, మీ కుటుంబీకులకు వస్తాయి. ఇది మీ ప్రతిష్ఠను పెంచుతుంది. కృషి వ్యర్థం కాదన్న సంగతి చాలా సందర్భాలలో ఋజువు అవుతుంది. విదేశాలలో మీ వారికి కీలక సమయంలో తగు సహాయం చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి వస్తుంది. కుటుంబ విషయాల తాలూకు ప్రభావం మీ వృత్తి ఉద్యోగ, వ్యాపారాల మీద పడుతుంది, జాగ్రత్త వహించండి. ఎంత జాగ్రత్త వహించినా సహచరవర్గము, అనుచర వర్గము, సోదర వర్గము వల్ల కొన్ని చికాకులు, సమస్యలు తప్పకపోవచ్చు. ఎవరిని నమ్మాలో ఎవరితో కలిసి నూతన కార్యక్రమాలు ప్రారంభించాలో నిర్ణయించుకోవడం కష్టతరం అవుతుంది. ఈ విషయంలో సరి అయిన నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువగా లాభపడగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో, అభిమానంతో మీరు పెంచి పోషించిన మనుషులు మీ పట్ల సగౌరవంగా ప్రవర్తించరు. మీ వ్యతిరేక వర్గానికి సహాయం చేస్తారు. ఒకనాటి శత్రువులు, మిత్రులు కావటం వల్ల కొంత మనశ్శాంతి లభిస్తుంది. నమ్మకద్రోహాన్ని, కృతఘ్నతను భరించలేరు. ఇవి పదేపదే గుర్తుకువచ్చి మనస్సును బాధిస్తాయి.

లౌక్యం లోపించటం వల్ల, స్వతంత్ర భావాల వల్ల కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఏర్పడతాయి. కొన్ని సమస్యలను ఒంటరిగానే ఎదుర్కొంటారు. దైవానుగ్రహం వల్ల ఆపదలను దాటుకుని అనుకూల ఫలితాలు సాధిస్తారు. స్వల్పకాల పరిచితుల వల్ల అపరిమితమైన సహాయసహకారాలు, సేవలు అందుతాయి. ఉద్యోగపరంగా స్థానచలనానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. లీజులు, లైసెన్సులు అనుకూలిస్తాయి. ప్రభుత్వపరంగా రావలసిన రాయితీలు, మినహాయింపులు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దానధర్మాలు సామాజిక సేవ పురోగతిలో ఉంటాయి. అనుకూల ఫలితాలు వస్తాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. మీ సంస్థ గుడ్‌విల్, ప్రతిష్ఠ పెరుగుతుంది. రవాణా సంబంధితమైన ప్రింటింగ్, డాక్యుమెంట్స్, అప్లికేషన్స్, ఇంటర్వ్యూ కార్డులు మొదలైన విషయాలలో జాగ్రత్తగా పరిశీలించి ముందుకు సాగాలి. రొటీన్‌ సంతకాల విషయంలో సాంప్రదాయ వ్యక్తిగత బంధుత్వ అనుబంధాలకు అతీతంగా వ్యవహరించండి. పొరపాటు సంతకాల వల్ల ఇబ్బందులు రావచ్చు. అతికష్టం మీద ముఖ్యమైన తప్పిదాలలో మీ పొరపాటు లేదని మాత్రం ఋజువు అవుతుంది. వ్యవసాయం, వ్యవసాయ సంబంధమైన విషయాలు, వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి.

పిక్‌నిక్‌లు, విందువినోదాలు, విహారయాత్రలు వంటి కార్యక్రమాలలో అపశ్రుతులు సంభవించవచ్చు, జాగ్రత్త వహించండి. వీలైనంత వరకు ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. మీ స్థానాన్ని ఆశించిన వారు భంగపడటం మీకు ఆశ్చర్యం కలిగించదు. ఎందరు ఏమి చేసినా దైవానుగ్రహం ఉంటే చెడు కూడా మంచిగా మారుతుందని ఋజువు అవుతుంది. మీ స్వయంకృతాపరాధాలు, మీ వల్ల జరిగిన తప్పిదాలు పెద్దగా ప్రాధాన్యతను సంతరించుకోవు. సంవత్సర ద్వితీయార్ధంలో స్త్రీలకు సంబంధించి వివాదాలలోకి మీ పేరు లాగబడే అవకాశం ఉంది. మీకు లభించవలసిన ప్రయోజనాలకు ఓ మహిళ వలన ఆటంకాలు ఏర్పడతాయి. పంతాలు, పట్టింపులకు పోకుండా చర్చలతో సమస్యలు పరిష్కరించుకుంటారు. నిందల బరువు దింపుకుంటారు. మీ ప్రత్యర్థుల రాజకీయ పలుకుబడి మీ విషయంలో పనిచేయదు. అయితే కృత్రిమంగా ప్రభుత్వపరంగా ఇబ్బందులు రావచ్చు. వాతావరణంలో వచ్చిన మార్పులు ఆరోగ్యం మీద, వృత్తిఉద్యోగాల మీద ప్రభావం చూపుతుంది.

స్వంత విషయాలకు విచ్చలవిడిగా ఖర్చు పెడతారని మీ మీద వచ్చిన ఆరోపణలకు సంఘటనలే సమాధానం చెబుతాయి. వృత్తిఉద్యోగాల కొరకు శ్రమించి సంపూర్ణ న్యాయం చేశామన్న సంతృప్తి కలుగుతుంది. అందరినీ సమన్యాయంతో చూస్తారన్న ప్రఖ్యాతి కూడా లభిస్తుంది. మీ సహచరవర్గంలో ప్రతిభ కలిగిన వాళ్ళను గుర్తించలేకపోయామన్న బాధ కలుగుతుంది. ఈ విషయంలో అంతర్మ«థనం చెందుతారు. నిబంధనలకు, నైతిక ధర్మానికి తిలోదకాలు ఇచ్చి మీ సాటి వాళ్ళు అధికంగా, మీతో సమానంగా ప్రయోజనాలు పొందుతారు. ఇందువల్ల మానసిక వైరాగ్యం కలుగుతుంది. ఆలోచనలు పరిపరివిధాలా పోతాయి. శత్రువర్గం ఐకమత్యంగా ఉండకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటారు. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. అభివృద్ధికి ప్రముఖ వ్యక్తుల అండదండలు లభిస్తాయి. ఓర్పు వహించి కీలకమైన వ్యూహం అమలు చేస్తారు. చివరివరకు మీ ఆంతర్యం ఇతరులకు తెలియకుండా జాగ్రత్తపడతారు. విద్యా ఆర్థిక సంబంధిత విషయాలలో పురోగతి బాగుంటుంది. మీ జీవితాశయం సాధించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. స్నేహితులు, సన్నిహితులు ప్రతి విషయంలో అండదండగా ఉంటారు. రాజకీయ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మొత్తం మీద సజావుగానే సాగుతుంది. మంచివాళ్ళను ఆదర్శంగా తీసుకుని మీ జీవన గమనంలో కొన్ని మార్పులు చేస్తారు. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. కొన్ని మంచి కార్యాలకు సంబంధించి ఋణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.

వృత్తిఉద్యోగాలపరంగా అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి పై అధికారుల మెప్పు పొందుతారు. ఆర్థికపరిస్థితి అభివృద్ధి చేసుకోవడానికి విశేషంగా కృషిచేస్తారు. సన్నిహితుల పేరుమీద వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపారం సక్రమంగా సాగడానికి అవసరమైన బలం, బలగం, రాజకీయ పలుకుబడి ఉపయోగపడతాయి. విలువైన స్థిరాస్తులలో కొంత భాగాన్ని అమ్ముదామని ప్రయత్నించినా కొన్ని కారణాల వలన కొంతకాలం వాయిదా వేస్తారు. న్యాయస్థానాలలో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. అందువలన ఎంతో ఊరట కలుగుతుంది. కుటుంబంలో మరొకరి సంపాదన పెరుగుతుంది.

మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు, సేవాసంస్థలు, అనాథాశ్రమాలు సానుకూలంగా ఉంటాయి, మంచిపేరు వస్తుంది. అసూయాగ్రస్తులైన కొంతమంది వల్ల కృత్రిమంగా ఇబ్బందులు ఏర్పడతాయి. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తపడతారు. ఐకమత్యంతో సమిష్టిగా కృషి చేస్తే ఏ కార్యాన్నైనా సఫలీకృతం చేయవచ్చునని భావిస్తారు. అందరినీ కలుపుకుని ఒక ముఖ్యమైన కార్యంలో లాభం పొందుతారు. సమిష్టిగా లాభాలు పంచుకుంటారు. ఇతరులు అడిగే ప్రశ్నలకు ఓర్పుగా సమాధానాలు చెబుతారు. మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని అందరూ స్వంత వ్యక్తిగా భావిస్తారు. విదేశాలలోని మీ వారికి గ్రీన్‌కార్డు లభించిందన్న శుభవార్త అందుకుంటారు. క్రయవిక్రయాలలో మెలకువలు పాటించండి. కళ్ళు అలసటకు విద్యాసంస్థల వారికి ఇబ్బంది లేనటువంటి కాలం అయినప్పటికీ సొంత వ్యక్తుల పొరపాట్లు అపఖ్యాతికి దారితీయవచ్చు.

పోటీపరీక్షలో గానీ మామూలు పరీక్షలలో గానీ మీరు వ్రాసింది కాపీ కొట్టిన వారికి ఎక్కువ మార్కులు, మీకు తక్కువ మార్కులు వస్తాయి. కాపీయింగును ప్రోత్సహించడమే తప్పని తెలుసుకుంటారు. రాజకీయ మార్పులు చేర్పులు మీకు లాభిస్తాయి. విదేశాలలో ఉన్న మీ ఆత్మీయవర్గం ప్రశాంతంగా ఉన్నారని తెలుస్తుంది. అక్కడి నుండి వచ్చే ఫోన్‌కాల్స్‌ మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. నిష్కారణ వేధింపులకు గురి అవుతున్న మీ సంతానానికి ఏదో ఒక పరిష్కార మార్గం చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చిల్లరమల్లర తగాదాలు, మధ్యవర్తిత్వాలు, రాజీయత్నాలు విసుగుపుట్టిస్తాయి. ఏ పనిచేయాలనుకున్నా సమాజాన్ని, ఆత్మగౌరవాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సి వస్తుంది. ఇందువలన చేతిలో ఉన్న పనులను కూడా చేయలేకపోతారు. అందరూ అన్ని పనులు చేయలేరని సరిపెట్టుకుంటారు. స్వగృహయోగం ఏర్పడుతుంది. 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా