శార్వరి నామ సంవత్సర (మిథున రాశి) రాశిఫలాలు

22 Mar, 2020 09:21 IST|Sakshi

 (ఆదాయం  2, వ్యయం  11,  రాజపూజ్యం 2, అవమానం  4)

ఈ రాశివారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. వివాహాది శుభకార్యాల విషయంలో మీ మాటే నెగ్గించుకుంటారు. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రతి విషయంలోనూ తోడబుట్టినవాళ్ళు, తల్లిదండ్రులు, మీ హితవు కోరే పెద్దలు కొండంత అండగా నిలుస్తారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి సోమరితనాన్ని పక్కనపెట్టి శారీరకంగా, మానసికంగా శ్రమించాలి. ప్రతిష్ఠాత్మకమైన సంస్థలలో పనిచేయడానికి అవకాశాలు లభిస్తాయి. ప్రతిరంగంలోనూ గట్టిపోటీ ఎదుర్కొంటారు. మీ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. విద్యాసంబంధమైన విషయాలలో రాణిస్తారు. ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్‌. వంటి ఉన్నత పరీక్షలకు ఎంపికవుతారు. ఇతరత్రా పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. ఇంట్లో ప్రోత్సాహం బాగానే ఉన్నా చిల్లరమల్లర తగాదాలు చికాకు కలిగిస్తాయి.

కంబైండ్‌ స్టడీస్‌ వల్ల నష్టపోతామని గ్రహించి జాగ్రత్తపడతారు. మీ బంధువుల ఆస్తులకు సంబంధించి, పూర్వీకుల ఆస్తి పంపకాలకు సంబంధించి వ్రాసిన డాక్యుమెంట్లు అస్పష్టంగా ఉంటాయి. అవి విభేదాలకు దారితీస్తాయి. మీరు మధ్యవర్తిత్వం చేసి వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకువస్తారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచిస్తారు. ఇందువల్ల పరోక్షంగా మీరు లాభపడతారు. రాని బాకీలు వివాదస్పదం అవుతాయి. మధ్యవర్తి పరిష్కారం వల్ల లాభం, నష్టం లేకుండా బయటపడతారు. ఒకచోట నష్టపోయినా దైవానుగ్రహం వల్ల మరోచోట లాభపడతారు. సభలు, సమావేశాలు, బహిరంగ సభలు సర్వసాధారణం అవుతాయి. ఆదాయనికి మించిన ఖర్చులను అదుపు చేయడంలో విజయం సాధిస్తారు. సంవత్సర ద్వితీయార్ధంలో విదేశాలలో విద్యను అభ్యసించడానికి, ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

విద్యా ఋణం కూడా మంజూరు అవుతుంది. ప్రభుత్వపరంగా రావలసిన రాయితీలు, సబ్సిడీలు, అధికార ధ్రువీకరణ పత్రాలు, మీకు సానుకూలపడతాయి. నూనె, లోహపు వ్యాపారులకు, వస్త్ర వ్యాపారులకు, రత్న వ్యాపారులకు, రవాణా వ్యాపారులకు కాలం మద్యస్థంగా ఉంది. కార్యాలయంలో మిమ్మల్ని ఏదో ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా ముద్రవేస్తారు. కానీ మీరు అందరి మనిషిగా ఆమోదించబడతారు. కష్ట సమయంలో ఒక స్త్రీ సహకారం లభిస్తుంది. అలంకార సంబంధమైన వ్యాపారాలు లాభిస్తాయి. నిల్వ ఉంచిన అపరాలు, ఆహారధాన్యాల వల్ల లాభపడతారు. సివిల్‌ కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ప్రేమ వివాహం గురించి మీ అభిప్రాయాలు విమర్శలకు దారితీస్తాయి. విదేశాల నుండి వచ్చే ఆర్థిక సహాయం వల్ల మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ రకాల సంస్థలు పురోగమనంలో ఉంటాయి.

సినీరగంలోని వారికి, టీవీ రంగంలోని వారికి అనుకూలమైన కాలం. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేస్తారు. ఎంతోకాలంగా బరువుగా మారిన బాధ్యతలను దించుకోగలుగుతారు. పిల్లల విషయంలో ఒక దిగులు ఆలోచన ఉంటుంది. ఇతరుల మీద మీరు చేసిన ఆరోపణలకు సంబంధించిన విషయం తాలూకు సాక్ష్యాధారాలు మీ చేతికి లభిస్తాయి. రుద్రజడను ఉపయోగించండి. కోర్టుపరంగా వాయిదాపడుతూ వస్తున్న విషయాలు ఒక పరిష్కార దశకు వస్తాయి. చదువు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి దూరప్రయాణాలు ఫలిస్తాయి. పిల్లల ఎదుగుదలకు గట్టి పునాది వేయడానికి, బాగా చదివించడానికి నిర్ణయించుకుంటారు. అందుకు తగిన ధనం కోసం మీ సిద్ధాంతాలను మార్చుకుంటారు. భార్యవైపు బంధువులకు సహాయం చేస్తారు. కొన్ని బాధ్యతల నుండి కొందరికి ఉద్వాసన చెబుతారు.

నిర్మొహమాటంగా ప్రవర్తిస్తారు. మీ పరిశీలనలో కొన్ని ముఖ్యమైన రహస్యాలు తెలుసుకుంటారు. అవి వృత్తి ఉద్యోగాలపరంగా ఎంతగానో ఉపయోగపడతాయి. దైవికం అనే పొడితో ధూపం వేయండి. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టే వ్యక్తులు ప్రధాన సమస్య అవుతారు. సోదరసోదరీ వర్గానికి సహాయం చేస్తారు. వృత్తి,ఉద్యోగ, వ్యాపారాలపరంగా మిమ్మల్ని దెబ్బతీయాలని చూసే శత్రువర్గాల ప్రయత్నాలు విఫలం అవుతాయి. ప్రతి విషయంలో ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల అండదండలు మీకు లభిస్తాయి. ఆత్మీయవర్గంతో కొద్దికాలం విభేదాలు చోటుచేసుకుంటాయి. పెద్దల, వృద్ధుల విషయాలలో మరింత శ్రద్ధ వహించాలని నిర్ణయం తీసుకుంటారు. చెప్పుకోదగిన కారణాలు లేకపోయినా ఒకానొక సందర్భంలో వైరాగ్యం ఆవహిస్తుంది. వైరాగ్యంలో, నైరాశ్యంలో ఒక విధమైన అనుభూతిని పొందుతారు.

మీ మనస్సుకు తగిలిన గాయాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. మీ ఉద్ధేశ్యంలో అవినీతితో సమాజం మైలపడినప్పటికీ నిజాయితీగా ఉన్న మీలాంటి వాళ్ళకు ప్రశంసలు, చికాకులు వస్తాయి. యథార్థమైన ఈ సత్యాన్ని గ్రహించడానికి ఎంతగానో బాధపడతారు. వాస్తవాలు మింగుడుపడవు. ఈ సమస్యను ధర్మదేవతకే వదిలేస్తున్నానని నిర్ణయిస్తారు. వివాదస్పదమైన ఆస్తి కలిసొస్తుంది. వివాహాది, శుభకార్యాల విషయంలో మీకు కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ సర్దుకుపోతారు. మౌనం వహిస్తారు. దైవసంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది అనే వాస్తవాన్ని గ్రహిస్తారు. ఆధ్యాత్మిక రంగంలో తీయని మాటలు చెప్పి మోసం చేసేవారు ఎదురవుతారు, జాగ్రత్త వహించండి. సంతానాన్ని విదేశాలలో చదువు కోసం పంపించే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకర్షణీయమైన స్కీముల వల్ల స్కీముల్లో చేరడం వల్ల, చీటీలు కట్టడం వల్ల నష్టపోతారు. అధికారులతో మంతనాలు, రాజకీయ పైరవీలు లాభిస్తాయి. సంతానానికి సంబంధించి వివాహ ప్రయత్నాలు ఆకస్మికంగా లాభిస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌ లభిస్తుంది. కొన్నాళ్ళు ఉద్యోగంలో అసంతృప్తి వాతావరణం నెలకొంటుంది.

నిర్మొహమాటంగా మాట్లాడే మీ ధోరణి వల్ల ఇబ్బందులు వస్తాయి కొంతమంది దంపతుల దాంపత్య జీవితంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కష్టపడి సాధించుకున్న పదవి మానసిక అశాంతికి కారణమవుతుంది. సర్వీస్‌లో వివాదస్పద వ్యక్తిగా మిగలకుండా ఉండటానికి కొన్ని ప్రయోజనాలు వదులుకుంటారు. రియల్‌ ఎస్టేట్, ఆహారధాన్యాల వ్యాపారం, చేతివృత్తి పనివారికి, హోల్‌సేల్‌ వ్యాపారం చేసేవారికి, నిర్మాణరంగ పనులు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. మీ పేరుమీద కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. అవివాహితులకు వివాహకాలం. సంతాన సాఫల్యకేంద్రాల వల్ల, దొంగస్వామీజీల వల్ల మోసపోతారు. మీరు స్వయంశక్తితో పోటీపరీక్షలలో విజయం సాధించి మంచి ఉద్యోగం పొందుతారు. సంతానలేమితో బాధపడుతున్న వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. మీరు చేయాలనుకునే కార్యక్రమాలు వెంటనే చేయడం మంచిది. రహస్య చర్చలు, సంభాషణలతో కాలయాపన చేయడం మంచిదికాదు. ఇందువలన మానసిక ఆందోళన ఎక్కువై, మానసిక ప్రశాంతత తగ్గుతుంది.

రాజకీయ పలుకుబడి వల్ల మీకు టెండర్లు వస్తాయి. మీరు అందలం ఎక్కించిన రాజకీయ నాయకులు, మీ ద్వారా ఉద్యోగం పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు కలుగుతాయి. జాగ్రత్త వహించండి. ఎన్నో అవకాశాలు మీకు కలిసివస్తాయి. ఏది మంచిదో ఎంచుకుంటే ఎక్కువ లాభపడతారు. జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి. ఓర్పు, నేర్పు సహనంతో అందరితో కలిసి పనిచేసే ధోరణి అవలంబిస్తారు. ప్రజాసంబంధాలు పెంచుకుంటారు. విలువైన పత్రాలు, డాక్యుమెంట్స్‌ మొదలైన వాటి భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. తల్లిదండ్రులను మెప్పించలేక ఇటు ఇంట్లో పోరు, బయటపోరు తట్టుకోలేక ఎవరినీ సంతృప్తిపరచలేరు. తల్లిదండ్రుల ప్రేమ సృష్టిలో ప్రతిజీవి ఆస్వాదిస్తుంది. మనోహరమైన తల్లిదండ్రుల ప్రేమ ముందు ప్రపంచం చాలా చిన్నదిగా అనిపిస్తుంది. అన్ని బంధాలకు అతీతమైనది మాతృప్రేమ. అటువంటి పవిత్రమైన సృష్టి సహజమైన ప్రేమను కొనుక్కోవలసి రావటం దురదృష్టానికి పరాకాష్ట.

తల్లి విషం పెడితే ఆ విషయం నలుగురికీ చెప్పి రచ్చ చేయడం కన్నా ఆ విషం త్రాగటమే మంచిది. బాధాతప్త హదయంతో ఇలాంటివి ఎన్నో భరిస్తారు. అంటే ఇలాంటి స్థాయికి దిగజారిన సంఘటనలు ఎదురవుతాయి. మీ పేరును, మీ సంస్థ పేరును ఉపయోగించుకొని లాభపడే అవకాశవాదుల నిజస్వరూపం తెలుస్తుంది. ముఖ్యమైన విషయాలలో జీవితభాగస్వామితో విభేదాలు రావచ్చు. సంతానాన్ని గారాబం చేయటం వలన ఏర్పడిన పరిస్థితులు మీకు మ్రింగుడుపడవు. పిల్లల విషయంలో ఒక ఆలోచన, దిగులు ఉంటుంది. కుటుంబంలో బంధువులలో అంతర్గత రాజకీయాలు చిరాకు కలిగిస్తాయి.

మార్పురాని వ్యక్తులలో మార్పుతేవడానికి ఇక ప్రయత్నం చేయవద్దు. మీ వృత్తికి సంబంధించిన విషయాలు, ప్రయాణానికి సంబంధించిన వివరాలు, మీ రోజువారి వివరాలు గోప్యంగా ఉంచాలి లేనిపక్షంలో నష్టపోయే ప్రమాదం ఉంది. ఆగిపోయిన నిర్మాణకార్యక్రమాలు, కాంట్రాక్టు వ్యవహారాలు పూర్తిచేస్తారు. మీ పనితీరును మెచ్చుకుంటారు. ముఖ్యమైన పత్రాలు లేక ప్రశంసాపత్రాలు వస్తాయి. ఇతరుల సహాయ సహకారాలతో శుభకార్యాలు పూర్తిచేస్తారు. ప్రతిచోట పోటీ, అనారోగ్యకర వాతావరణం, సహాయ నిరాకరణ మొదలైన ఈతిబాధలు అధిగమించి పనులను విజయవంతంగా చేసుకోగలుగుతారు. యజ్ఞభస్మాన్ని నుదుటన ధరించండి. కళా, సాహిత్య, సంగీతరంగాలలో సంతానాన్ని ప్రోత్సహిస్తారు. మీ ప్రోత్సాహానికి మంచి ఫలితాలు సంతానం సాధిస్తారు.  

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా