శార్వరి నామ సంవత్సర (సింహ రాశి) రాశిఫలాలు

22 Mar, 2020 09:02 IST|Sakshi

(ఆదాయం  14, వ్యయం  2, రాజపూజ్యం 1, అవమానం  7)

ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. విదేశీయాన ఖర్చులకు ఎక్కువ మొత్తంలో ధనం ఖర్చు చేస్తారు. మీరు చేస్తున్నది మంచికో, చెడుకో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. సంతానం, కుటుంబసభ్యుల కోరిక కాదనలేక ఎప్పటిక్పుడు సర్దుబాటు కావడం విశేషం. సామాజికంగా, రాజకీయంగా వచ్చే మార్పులు మీ మీద ప్రత్యక్షంగా మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. గతంలో తీసుకున్న కఠిన నిర్ణయాలు, పడిన కష్టాలు ఇప్పుడు లాభిస్తాయి. మాటపట్టింపు, మొండి వైఖరి వల్ల కొన్నింటికి దూరంగా ఉంటారు. పరిస్థితుల ప్రభావం వల్ల జీవనమార్గం సక్రమంగానే దొర్లుతుంది. అనువంశికంగా రావలసిన ఆస్తులు ఎట్టకేలకు సానుకూలపడతాయి. రూపాయి ఖర్చు అయ్యేచోట వంద రూపాయలు ఖర్చు అవుతాయి. సంతానం భవిష్యత్తు కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. వాళ్ళ పేరుమీద స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఐశ్వర్యనాగిని ఉపయోగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. క్రీడలు, రాజకీయాలపై మీ అంచనాలు నిజమవుతాయి. అయితే జూదాలకు, పందాలకు దూరంగా ఉండడం మంచిది. సామాజిక పరిస్థితుల మీద విరక్తి పుడుతుంది. ఈ సమాజంలో మనుగడ సాగించగలమా? అన్న మానసిక వేదన కలుగుతుంది. ప్రతినిత్యం నాగసింధూరం నుదుటన ధరించడం వలన నరదృష్టి తొలగిపోయి, జనాకర్షణ ఏర్పడుతుంది.

విద్య వైజ్ఞానికరంగాలలో అనుకున్నది సాధిస్తారు. పి.హెచ్‌.డి. వంటివి పూర్తిచేస్తారు. సివిల్‌ సర్వీస్‌లు, ఇతర పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. టెండర్ల విషయంలో అయోమయం ఏర్పడుతుంది. మీ వ్యక్తిగత, ఆఫీస్‌ రహస్యాలను మీ శత్రువర్గానికి చేరవేస్తున్న నమ్మకద్రోహులను గమనించి తగిన చర్యలు తీసుకుంటారు. వృత్తి రహస్యాలు, వ్యక్తిగత బలహీనతలు ఎక్కడా బయటపెట్టరాదన్న సూత్రాన్ని తెలుసుకుంటారు. టైలర్లకు, కోళ్ళపారాలు నడిపేవారికి బాగాలేదు. అన్నిరకాల వాయిద్యకారులకు మంచి రోజులు. పేరు, ధనం రెండూ సంపాదిస్తారు. కవులకు, రచయితలకు కీర్తిప్రతిష్ఠలు వస్తాయి. సన్మానాలు జరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్‌ లభిస్తుంది. కార్యాలయ సంబంధమైన సమస్యను అధిగమించడానికి ఈ ప్రమోషన్‌ ఉపయోగపడుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. బాధ్యతలు ఎలాగైనా నెరవేర్చాలని నిశ్చయించుకుంటారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో అనుకున్నంత అభివృద్ధి ఉండకపోవచ్చు. కొత్త పరిచయాలు, స్నేహితుల వల్ల ఉపయోగం కలుగుతుంది. కీళ్ళనొప్పులు, కాళ్ళనొప్పులు రావచ్చు. సంవత్సర ద్వితీయార్ధంలో సంతాన విషయమై శ్రద్ధ వహించవలసి వస్తుంది.

అన్నిరకాల దేవుళ్ళ అభిషేకాలకు మహాతీర్థం పొడిని ఉపయోగించండి. యూనియన్స్‌ పోరాటంలో ఉత్సాహంగా పాల్గొంటారు. న్యాయం కోసం చేసే పోరాటంలో ముందుంటారు. న్యాయస్థానాల వరకు పోరాటం పోవచ్చు. రాజకీయ జీవితం బాగుంటుంది. సినిమాలు, డిస్ట్రిబ్యూటర్లకు గత సంవత్సరం కన్నా అనుకూల కాలం. మీరు అనుకున్న పనులు సమయానికి కాస్త అటుఇటుగా పూర్తవుతాయి. భగవంతుడు అన్నీ ఇచ్చినా మిగతావి మనం చేసుకోవలసిన ముఖ్య కార్యాలు ఉన్నాయన్న భావంతో కాంట్రాక్టులు, లీజులు, లైసెన్స్‌లు, రెన్యువల్స్‌ అనుకూలిస్తాయి. ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషిస్తారు. విజయం సాధిస్తారు. సోదరసోదరీ వర్గానికి రహస్యంగా సహాయం చేస్తారు. ఈ విషయమై ఇంట్లో గొడవలు వచ్చి కొంతకాలం మనశ్శాంతి కోల్పోతారు. ఉన్నతవిద్యను అభ్యసించే అవకాశం, ఇతర భాషలను నేర్చుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యాసంస్థలు, సామాజిక సేవాసంస్థలు, లోహపు వ్యాపారాలు చేసేవారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. చేతివృత్తి పనివారికి కూడా మంచి ఫలితాలే సూచిస్తున్నాయి. సంతానం లేని వారికి సంతానప్రాప్తి సంభవం. అవివాహితులైన వారికి వివాహప్రాప్తి.

నిర్మాణాలను దగ్గరుండి పర్యవేక్షించడం చెప్పదగిన సూచన. నాణ్యతలో లోపాలు ఉన్నాయని మీపై ఆరోపణలు రావచ్చు. ప్రభుత్వ నిర్ణయాల వలన కొద్దిమంది రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంలో నష్టపోతారు. పోటీపరీక్షలలో విజయం సాధించి కుటుంబ ప్రతిష్ఠ నిలబెడతారు. మీరు ఎంతో శ్రమించి మంచి ఫలితాలు సాధించినప్పటికీ మీ వైరివర్గం వారు మీ శ్రమను గుర్తించక విమర్శిస్తారు. శత్రువులతో వాదించే కన్నా కాలమే సమస్యలను పరిష్కరిస్తుందని మౌనంగా ఉండిపోతారు. మీరు నిజాయితీగా, స్పష్టంగా మాట్లాడటం వల్ల వైరివర్గం దానిని మీ అహంభావంగా భావించి మీపై అకారణంగా మీ సన్నిహిత సహచరవర్గంలో ఉండే వారి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎవరిపట్ల మీకు ఆసక్తి, అనురాగం ఉన్నాయో వారి వల్లనే మానసిక వేదన కలుగుతుంది. వచ్చిన అవకాశాలు చేజార్చుకోవద్దు, నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం చేయవద్దు. వ్యాపారంలో నూతన ప్రయోగాలు చేసి మంచి ఫలితాలు సాధిస్తారు. రుద్రజడను ఉపయోగించండి. మీ కంపెనీకి ప్రజలలో గుడ్‌విల్, నమ్మకం పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో మీరే కేంద్రబిందువు అవుతారు మిగిలిన భాగస్వాముల పాత్ర నామమాత్రం అవుతుంది.

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఒక ఆశ ఫలించడం మీకు, మీ భాగస్వాముల ఆనందానికి అవధులు ఉండవు. బ్యాంకు రుణాలు, అనుకూలమైన స్థలం, ప్రభుత్వ రాయితీలు మొదలైనవి అనుకూలం. మీరు ఆశించిన విధంగా, ఊహించని విధంగా మీ జ్యేష్ఠ సంతానానికి ఉద్యోగం లభిస్తుంది. ఆడపిల్లల గురించి, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి గట్టిగా ఆలోచన చేస్తారు. వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అవి సఫలం అవుతాయి. మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి కష్టంమీద సంబంధం కుదురుతుంది. ప్రేమవివాహాలు చేసుకున్న వారికి చేదు అనుభవాలు సంభవిస్తాయి. భగవంతుడు నొసట రాసిన రాత శాశ్వతమని నమ్ముతారు. ఈ నమ్మకం చాలా విషయాలలో మీకు మనోధైర్యాన్ని కలిగిస్తుంది. కీలకమైన పోటీపరీక్షలలో నామమాత్రంగా శ్రమించి అనుకూల ఫలితాలు సాధిస్తారు. అనూహ్యంగా ప్రతి విషయంలోనూ అదృష్టం కలిసి వస్తుందని భావించవద్దు. అదృష్టం కోసం ఎదురుచూడడం వలన ఆశ, కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ఈ విషయాన్ని గ్రహించి తగిన విధంగా ప్రవర్తిస్తారు. పాస్‌పోర్ట్, వీసాల కోసం ప్రయత్నించే వారికి అవి లభిస్తాయి.

గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూసే వాళ్ళకి గ్రీన్‌కార్డు లభిస్తుంది. ప్రభుత్వ సంబంధమైన కొన్నిరకాల ఉత్తర్వులు మీకు మేలు చేస్తాయి. మీ పలుకుబడి ఉపయోగించి తక్కువ కొటేషన్‌తో ఎక్కువ లాభాలు ఉన్న కాంట్రాక్టులను మీ స్వంతం చేసుకుంటారు. దూరప్రాంతాలకు మీ పిల్లలను పంపించి చదివిస్తారు. సంసారం గుట్టు రోగం రట్టు అనే సామెత మీ విషయంలో నిజమవుతుంది. మీ సమస్యలను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. మంచి విషయాలు చెబితే జనం ఓర్చుకోలేరు. చెడ్డ విషయాలు సమస్యలు చెబితే లోకువగా చూస్తారని మీ అభిప్రాయం. ఉద్యోగాల విషయంలో మధ్యవర్తుల వల్ల, కమీషన్‌ ఏజెంట్ల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. దొడ్డిదారిలో ఉద్యోగాలు సంపాదించుకునే మార్గాలకు స్వస్తి చెప్పండి. అవి ఎండమావులని గ్రహించండి. సనాతన సంప్రదాయాలు మీద మీకున్న నమ్మకం బలీయమైనది. కోర్టుతీర్పులు మీకు అనుకూంగా ఉంటాయి. కాంట్రాక్ట్‌ పద్ధతిన ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగం పర్మినెంట్‌ అవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. దుష్ప్రచారాలను పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోవడం వల్ల సానుకూల ఫలితాలు సాధిస్తారు. రాజకీయపరమైన నిర్ణయాలు లాభిస్తాయి.

నయవంచకుల సలహాలు ప్రక్కన పెడతారు. ఉన్నతాధికారులు మీ శ్రమను గుర్తిస్తారు. కొంతమందికి వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకోవాలనే ఆలోచనలు వస్తాయి. సహోద్యోగులు మీ మీద చేస్తున్న దుష్ప్రచారం అబద్ధాలని నిరూపిస్తారు. ముఖ్యమైన సభలు, సమావేశాలకు ఆహ్వానాలు అందటం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. బహిరంగ సభల్లో చక్కగా ప్రసంగిస్తారు. కొన్ని అవార్డులు మీకు లభిస్తాయి. కుటుంబ వ్యవహారాలను నిర్లక్ష్యం చేస్తున్నారనే అపవాదు వస్తుంది. ఎటువంటి విమర్శలకు ప్రతిస్పందించకుండా నిండుకుండలా ఉంటారు. విలువలేని వ్యక్తులకు ప్రాధాన్యతనిచ్చి మాట్లాడడానికి ఇష్టపడరు. ఆచరణలో మీ ఈ నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తుంది. సాంకేతిక విద్యలో చక్కగా రాణిస్తారు. వ్యాపార సంబంధమైన విషయాలు కూడా లాభిస్తాయి. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల కొన్ని చికాకులు సంభవిస్తాయి. దైవసంకల్పం ముందు మానవుడు చాలా బలహీనుడని కొన్ని సంఘటనలు నిరూపిస్తాయి.

మార్పులు పరివర్తన కాలానుగుణంగానే నడుస్తాయి. కానీ మన ప్రయత్నాల వల్ల రావని గ్రహిస్తారు. ఇన్సూరెన్స్‌ విషయంలో జాగ్రత్త వహించండి. చోరభయం పొంచి వుంది. పూర్వీకులు రాసిన డాక్యుమెంట్లు, వీలునామాలోని లోపాలు కీలక సమయంలో ఇబ్బంది పెడతాయి. స్పష్టతలేని పెద్దల అభిప్రాయాలు సంకటానికి గురిచేస్తాయి. దురుసుగా మాట్లాడి అయినవాళ్ళని దూరం చేసుకోవడం మంచిలక్షణం కాదు. కోపంగా మీరు మాట్లాడినప్పటికీ విషయాలను కంటితో చూసి నిజానిజాలను బేరీజు వేసుకుంటారు. టీ.వీ, సినీరంగాలలోని వారికి, కళాకారులకు, సాంకేతిక సిబ్బందికి నూతన అవకాశాలు కలిసివస్తాయి. వచ్చిన అవకాశాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటారు. రాజకీయ పదవి లభిస్తుంది. 

మరిన్ని వార్తలు