శార్వరి నామ సంవత్సర (మీన రాశి ) రాశిఫలాలు

22 Mar, 2020 08:14 IST|Sakshi

(ఆదాయం  8, వ్యయం  11,  రాజపూజ్యం 1, అవమానం 2)

ఈ రాశివారికి ఈ సంవత్సరం భూమి సంబంధమైన వ్యాపారాలలో లాభాలు పొందుతారు. అమ్మకాలు, కొనుగోలు వల్ల లాభపడతారు. విశేషంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో రాణిస్తారు. సంతాన పురోభివృద్ధికి కొంత సమయాన్ని కేటాయిస్తారు. సంతాన పురోగతి మందగించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. సోదరసోదరీ వర్గం ప్రేమ వివాహాలు చికాకు కలిగిస్తాయి. ఇలాంటి వ్యవహారాలకు దూరంగానే ఉండాలని నిర్ణయించుకుంటారు. ఓ విధంగా మీరు బాధ్యతల నుండి తప్పుకుంటారు. స్త్రీల సహాయసహకారాలు లభిస్తాయి. కుటుంబంలో ఐకమత్యం నెలకొంటుంది. ఇందువల్ల మీరు బయట కార్యక్రమాలను సులువుగా, ఉత్సాహంగా చేయగలుగుతారు. స్నేహితులతో కలిసి మీరు పార్ట్‌టైం వ్యాపారం చేస్తారు, అది లాభిస్తుంది. సంపాదించడానికి పడ్డ కష్టం పొదుపు చేయడానికి కూడా పడతారు. నూనె వ్యాపారాలు చేసే వ్యాపారస్తులకు అనుకూల కాలం. భవిష్యత్తు కార్యక్రమం గురించి స్పష్టమైన ప్రణాళిక ఉండదు. ఎప్పటికప్పుడు ఉపాయంతో బయటపడే విషయంపైనా దృష్టి కేంద్రీకరిస్తారు. లీజులు పొడగింపబడతాయి. ఉద్యోగపరంగా ఒక నెలరోజులు ఇబ్బంది పడవలసి వస్తుంది. మీకు సహాయపడే వాళ్ళకు మీ వృత్తి ఉద్యోగాలలో ప్రత్యక్ష సంబంధాలు లేకుండా పోవుట వలన మీకు ఈ ఇబ్బంది కలుగుతుంది. బంధువర్గంలోని వారికి మీరు ఎంతమేలు చేసినా చివరికి విరోధమే మిగులుతుంది. నైతిక ధర్మమే మిమ్మల్ని అడుగడుగునా రక్షిస్తుంది. నిజనిజాలు మీ దృష్టికి రాకుండా మీ సన్నిహితులు, ఆత్మీయులు చేసే ప్రయత్నాలు మీ దృష్టికి వస్తాయి. విందులు, వినోదాలు అందరూ కలిసే పెళ్ళిళ్ళ సంబరాలలో తగిన స్థానం లభించకపోవచ్చు. దీనిని అవమానంగా భావించి, బాధపడి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తుల కొనుగోలు విషయాలలో కొంత జాప్యం జరుగుతుంది. ఇది మీకు లాభించే అంశమే. సంస్థాపరంగా అందరూ కలిసి తీసుకున్న నిర్ణయాలు వివాదస్పదం అవుతాయి.

విమర్శలు ఎదుర్కొనవలసిన బాధ్యత మాత్రం మీ ఒక్కరిపైనే పడుతుంది. మీ ప్రతిపాదనలు విదేశాలలో ఆమోదింపబడతాయి. గతంలో వివాదస్పదమైన డాక్యుమెంట్స్‌ తిరగదోడడం వల్ల మీకు లాభం ఉంటుంది. అగ్రిమెంట్లు, లైసెన్సులు కూడా మీకు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనం చేతికి రావడం వల్ల కొన్ని మొండి బాకీలు తీర్చగలుగుతారు. పొదుపు పథకాలలో ధనాన్ని పెట్టుబడిగా పెట్టి కొంతమేర లాభపడతారు. సరైన సమయంలో మీకు న్యాయం జరగకపోవచ్చు కాస్త ఆలస్యంగా మీకు మరింత మంచి జరుగుతుంది. అధికారులతో, పెద్దలతో ముఖ్యమైన వాళ్ళతో ఆచితూచి మాట్లాడడం, సంబంధబాంధవ్యాలు దెబ్బతినకుండా జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. చలనచిత్ర పరిశ్రమకు చెందిన విషయ వ్యవహారాలు లాభిస్తాయి. మీ అభిప్రాయాలను వాయిదా వేయడానికి వీలులేని పరిస్థితులలో నిర్మొహమాటంగా మీ అభిప్రాయాలు తెలియజేయవలసి వస్తుంది. ప్రత్యర్థులు, పోటీదారుల నుండి ఊహించలేని విధంగా పోటీలు ఎదురవుతాయి. అయితే మీరు తీసుకున్న ముందుజాగ్రత్త చర్యల వల్ల చెప్పుకోదగిన నష్టమేమీ కలుగదు. ఆహార సంబంధమైన నియమాలు పాటిస్తారు. మీరు ఊహించని విధంగా సొంత మనుషులు, ఆత్మీయులు అని భావించిన వారి వల్ల ఇబ్బంది కలుగుతుంది. కొంత నష్టం కూడా కలుగుతుంది. పెద్దగా తెలివితేటలు లేని వారు మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీరు సాధించిన గొప్ప విజయాలు ఇతరులు గుర్తించకపోయినా స్వజనులు గుర్తిస్తారు. వ్యాపార విస్తరణలో అనుచరగణం ప్రముఖ పాత్ర వహిస్తారు. రొటేషన్‌ మనీ కొరకు స్వల్ప ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఋణాలు తీసుకుంటారు. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు, పరపతి, అనుబంధాలు వృద్ధిచెందినా తక్షణ ఆర్థిక సహకారానికి ఆ పరిచయాలు ఉపయోగపడవు.

ప్రకృతి బీభత్సాల వల్ల పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా కానీ నష్టం సంభవించవచ్చు. కాంట్రాక్టుల కన్నా సబ్‌కాంట్రాక్టులు లాభిస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ అమ్మే వ్యాపార వర్గాల వారికి చెప్పుకోదగిన లాభాలు వస్తాయి. ఆత్మీయవర్గం చేసే పొరపాటు వల్ల పోలీస్‌స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగవలసి రావచ్చు. ఒక ఉన్నత పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. రాజకీయ పదవి లభిస్తుంది. ఎంతో ఆత్మీయులనుకోని మీరు భావించిన వారు విదేశాలలో స్థిరపడి మిమ్మల్ని మరిచిపోయినా మిత్రవర్గం అండగా నిలుస్తారు. ముఖ్యమైన వాటిని ఇన్సురెన్స్‌ చేయండి. మేలు జరుగుతుంది. నడమంత్రపు రాజకీయ అధికారంతో మీ మీద జులుం చూపించాలని ప్రయత్నించేవారు ఆపదలో పడతారు. మీ పరిస్థితి సురక్షితంగానే ఉంటుంది. బలవంతులు, మేధావులు మీ సేవలను వినియోగించుకుంటారు. ఇతర భాషలు నేర్చుకోవలన్న ఆసక్తి కలుగుతుంది. ఆచరణలో మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగం లేనివారికి ఉద్యోగప్రాప్తి, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అవివాహితులైన వారికి వివాహప్రాప్తి. కొందరికి పునర్వివాహ ప్రాప్తి కూడా సంభవం. స్త్రీల వల్ల కొన్ని ప్రయోజనాలు పొందుతారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో, మానవీయ కోణంలో సహాయం చేస్తున్న ఓ స్త్రీ విషయంలో అసభ్యకరమైన అసత్య ప్రచారం మీ మీద కొనసాగుతుంది. స్నేహానికి అర్థం తెలుసుకోలేని మూర్ఖులు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని భావిస్తారు. స్త్రీ పురుషుల మధ్య ఉన్న స్నేహాన్ని వక్రీకరించే ఈ సమాజం పట్ల విరక్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక ప్రసంగాలు పెద్దగా ఆకర్షించవు. ఏదో లోపం ఉన్నట్లుగా తోస్తుంది. దీక్షా కార్యక్రమాలు స్వయంగా నియమనిష్ఠలతో నిర్వహిస్తారు.

సామాజిక కార్యక్రమాలలో, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వ్యాపారంలో లాభాలు వచ్చినా మరెందులోనైనా లాభాలు వచ్చినా ధనం ఏదో ఒక రూపేణా జారిపోతుంది. పొదుపు చేయడానికి గట్టి ప్రయత్నం చేస్తారు. అందులో విజయం సాధిస్తారు. ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నుల గురించి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. కోర్టుతీర్పులు అనుకూల ప్రభావం చూపిస్తాయి. కొన్ని దురలవాట్లను వదిలించుకుంటారు. అందువల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. మీకు రావలసిన ధనం మూడు వంతులు మీ చేతికి అందుతుంది. అధిక మొత్తంలో ధనం సంతానం కొరకు వెచ్చించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాకతాళీయంగా మీరు పరిచయం చేసిన వ్యక్తులు మీ పలుకుబడిని, పేరుని అడ్డం పెట్టుకుని అడ్డదారిలో ధనం సంపాదిస్తారు. ఈ విషయం ఆలస్యంగా మీ దృష్టికి వస్తుంది. మీ నిజాయితీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఇది ఇబ్బందికరంగా మారుతుంది. మీ ప్రత్యర్థులు దీనిని అడ్డం పెట్టుకుని లబ్ధి పొందే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. కుటుంబ వ్యవహారాలలో, వ్యాపారంలో మంచి అభివృద్ధి లభిస్తుంది. దీర్ఘకాలపు సమస్యలు పరిష్కారం అవుతాయి. మీకు జరిగిన నమ్మకద్రోహానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటారు. ఉన్నతస్థానాన్ని అధిరోహించడానికిక మీ శత్రువులు చేసే ప్రయత్నాలకు గండికొడతారు. వైరివర్గాన్ని బలహీనపరుస్తారు. ఎదుగుదలకు అవకాశం లేకుండా చేస్తారు.  ఆర్థికసంస్థలలో పనిచేస్తున్న వారు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి.

ఉద్యోగంలో ప్రమోషన్‌ లభిస్తుంది. మీ ప్రాధాన్యత తగ్గించడానికి కొంతమంది ప్రయత్నాలు చేసినా అవి తాత్కాలికమే. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. మళ్ళీ మీరు అనుకున్న స్థానానికి రాగలుగుతారు. వాస్తవాలకు అతీతంగా ఊహాలోకంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు. ఏకపక్ష నిర్ణయాలు కలిసిరావు. నలుగురితో కలిసి చర్చించి నిపుణుల సలహాలు తీసుకుని మీ ఆలోచనలను అమలు చేయండి. ఉద్యోగపరంగా మీరు తీసుకున్న నిర్ణయాలను క్రిందిస్థాయి ఉద్యోగులు వ్యతిరేకిస్తారు. చెప్పుడు మాటలు మోస్తారు.  రాజకీయాలలో రాణిస్తారు. తాత్కాలిక వేతనాల మీద ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగం పర్మినెంట్‌ అవుతుంది. యూనియన్‌లకు, సంఘాలకు సంబంధించిన విషయాలకు మీ నాయకత్వంలో సలహాలు సత్ఫలితాలను సాధిస్తాయి. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది.

బరువుబాధ్యతలను దించుకోగలిగామన్న సంతప్తి కలుగుతుంది. ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ మార్పులు వస్తాయి. క్రీడారంగంలోని వారికి ప్రోత్సహకాలు, అవార్డులు లభిస్తాయి. నూతన ప్రాడక్టులు విజయవంతమవుతాయి. వ్యాపారం బాగుంటుంది. సినీరంగంలోని వారికి మిశ్రమ ఫలితాలు, టీవీ రంగంలోని వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. దేవాలయాలలో అవినీతి మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గుడి, గుడిలో లింగాన్ని మింగే వాళ్ళకు ఎలాంటి శిక్ష పడుతుందోనని రకరకాలుగా ఆలోచిస్తారు. దేవుడి సొమ్ము తినడానికి వాళ్ళకి చేతులు ఎలా వస్తున్నాయో అర్థం కాక అయోమయంలో పడతారు. కార్యాలయంలో గ్రూపు తగాదాలు పరాకాష్టకు చేరుకుంటాయి. జలసంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి. మీరు కొనుగోలు చేసిన ఆస్తుల విలువ పెరుగుతుంది. 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా