శార్వరి నామ సంవత్సర ( వృషభ రాశి) రాశిఫలాలు

22 Mar, 2020 09:37 IST|Sakshi

(ఆదాయం  14, వ్యయం  11,  రాజపూజ్యం 6, అవమానం  1)

ఈ రాశివారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. గతంలో మీ జీవితభాగస్వామి పేరుమీద కొనుగోలు చేసిన భూమికి మంచి ధర వస్తుంది. మంచి ధరకు అమ్మి కమర్షియల్‌ ఏరియాలో విలువైన షాపుగానీ, స్థలంగానీ కొనుగోలు చేయగలుగుతారు. వేరేచోట వ్యవసాయ భూమి కొనుగోలు చేస్తారు. కొన్ని సందర్భాలలో కీలక స్థానంలో ఉన్న అధికారులు చెప్పుడు మాటలు విని మీ నుండి కనీసం వివరణ కూడా కోరకుండా ఏకపక్ష నిర్ణయాలు చేస్తారు. లౌక్యంగా ప్రతిఘటించి, వాస్తవాలు నిరూపించి మీ ప్రయోజనాలు, మీ స్థానాన్ని కాపాడుకోగలుగుతారు. తోలు ఉత్పత్తుల వ్యాపారాలు, ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు, తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాలు కలిసి వస్తాయి. నౌకా రవాణా, జల రవాణా లాభిస్తుంది. చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ వారికి ఈ సంవత్సరం బాగుంది. కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. అయితే క్లయింట్స్‌ నిబద్ధత గురించి ఒకటి రెండుసార్లు ఆలోచన చేయండి. వివాహాది శుభకార్యాలకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు విసుగు పుట్టిస్తాయి.

దైవానుగ్రహం వల్ల మీ ప్రమేయం లేకుండానే ఆకస్మికంగా పెళ్ళి సంబంధం కుదురుతుంది. పదిరూపాయలు ఖర్చయ్యే చోట ఇరవై రూపాయలు ఖర్చుచేసి శుభకార్యాలు వైభవంగా నిర్వహిస్తారు. మీ పలుకుబడి ఉపయోగించి ప్రభుత్వపరంగా మంచి ఆర్డర్లు తీసుకువస్తారు. మంచి లాభాలు పొందగలుగుతారు. సమాజంలో ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేస్తారు. స్త్రీల వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. స్త్రీల దగ్గర ఒక నమ్మకాన్ని ఏర్పర్చుకోగలుగుతారు. సంవత్సర ద్వితీయార్ధంలో రెండు నెలలు వృత్తి ఉద్యోగాలపరంగా సంతృప్తి ఉండదు. సాంకేతికపరమైన విద్యారంగంలో రాణిస్తారు. సంతానపరమైన విషయాలు సజావుగా ఉన్నప్పటికీ జ్యేష్ఠ కుమార్తె లేక జ్యేష్ఠ కుమారుడి విషయంలో జాగ్రత్తలు తీసుకోవలసిన పరస్థితి ఏర్పడుతుంది.

స్త్రీ సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. నూతన భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగానే ఉంటాయి. భాగస్వాములతో వ్యాపారం చేసే కన్నా నాలుగు గేదెలు పెట్టుకుంటే మంచిదని భావిస్తారు. గతంలో ఎదురైన చేదు అనుభవాలే దీనికి కారణమవుతాయి. లక్ష్మీప్రమిదలతో దీపారాధన చేయండి. రుద్రజడను ఉపయోగించండి. ఉద్యోగంలో స్థానచలనం తప్పకపోవచ్చు. అయినప్పటికీ మీ ఉనికిని కాపాడుకోగలుగుతారు. కుటుంబంలో, బంధువులలో ఏకాభిప్రాయం సాధించి ఎంతోకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించగలుగుతారు. సోదరసోదరీ వర్గానికి అండగా ఉంటారు. మధ్యవర్తిత్వం చేయవద్దు. వివాహాది శుభకార్యాల విషయంలో ఇతరులకు సహాయం చేస్తారు. బాధ్యత అంతా మీపై వేసుకుంటారు.

మీ ఇంట్లో జరిగే శుభకార్యానికి బంధుమిత్రుల నుండి ఇదే రకమైన సహాయసహకారాలు లభిస్తాయి. ప్రేమ వివాహాలు విఫలం అవుతాయి. తాత్కాలిక వ్యామోహంలో జీవితాన్ని కష్టాలపాలు చేసుకోవద్దు. ప్రేమపెళ్ళిళ్ళకు సంబంధించిన వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. ఇటువంటి వాటిని ప్రోత్సహించరు. పునర్వివాహాలు చేసుకోవాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. మధ్యమధ్యలో జీవితభాగస్వామితో విభేదాలు ఏర్పడతాయి. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండండి. కొన్ని అమ్మకాలకు సంబంధించిన విషయాలలో లాభపడతారు. ఋణాలు తీరుస్తారు. తనఖాలు విడిపిస్తారు. విలువైన వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అన్నిరకాల దేవుళ్ల అభిషేకాలకు మహాతీర్థం పొడిని ఉపయోగించండి. అనుకూలమైన ఫలితాలు మొత్తం మీకే దక్కవు.

వ్యవహారాలకు మాత్రం సంబంధించిన వ్యక్తులకు వాటా పంచవలసి వస్తుంది. మీ ఎదుగుదల కొందరికి కంటకంగా మారుతుంది. అసూయగ్రస్తులైన ఇటువంటి వారితో మీ సన్నిహితులు కూడా చేరడం మీకు ఆశ్చర్యం కలిగించే అంశంగా మారుతుంది. కార్యాలయంలో రాజకీయాలు అధికం అవుతాయి. కుల సంబంధమైన రాజకీయాలు చోటుచేసుకుంటాయి. ఇతరుల సలహాలు నచ్చేవి అమలు చేయండి. అంతేగాని ఇతరులు సలహాలు చెప్పడానికి వీలులేని భయానక వాతావరణం మాత్రం కలిగించవద్దు. పట్టుదలతో పాటు పట్టువిడుపులు కూడా మంచికి దారితీస్తాయని గ్రహించండి. వైరివర్గం గుడ్‌విల్‌ను దెబ్బతీయగలుగుతారు. యోగాభ్యాసాల ద్వారా ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. ప్రభుత్వపరంగా, ప్రైవేట్‌పరంగా రావలసిన బిల్లులు ఆలస్యం అవుతాయి.

మీ ప్రాధాన్యత ఎంతమాత్రం తగ్గదు. ప్రత్యామ్నాయం లేని పరిస్థితులలో చాలా మందికి మీరే దిక్కవుతారు. పనిచేసే సామర్థ్యం, నేర్పరితనం మిమ్మల్ని నిలబెడతాయి. అంతేగాని ఎవరో చూపించిన అభిమానం మాత్రం కాదు. అందరినీ కలుపుకుని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇందు వలన కీర్తి, ధనం లభిస్తుంది. అయినవాళ్ళ విషయంలో జోక్యం చేసుకుంటారు. మీ పరపతి వల్ల వాళ్ళకు ప్రభుత్వపరమైన స్కాలర్‌షిప్పులు, ప్రభుత్వపరమైన స్కీముల వల్ల లబ్ధి చేకూరుతుంది. ఆర్ట్‌గ్యాలరీలు, బ్యూటీపార్లర్లు, అలంకార సంబంధిత వ్యాపారాలు లాభిస్తాయి. వస్త్ర వ్యాపారాలు చేసే వ్యాపారులకు ప్రతికూల కాలం.

ప్రింటింగ్, వ్యాపార ప్రకటనలు, మార్కెటింగ్‌ మధ్యస్థంగా ఉన్నాయి. విలాసవంతమైన జీవితానికి దూరంగా ఉండాలని భావిస్తారు. అయితే అది ఆచరణలో సాధ్యంకాదు. ఆర్థికపరమైన మినహాయింపులు, ఇన్‌కమ్‌ట్యాక్స్‌లకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. విలువైన పత్రాలు, డాక్యుమెంట్లు చోరికి గురి అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. లీజులు, డైరీలు, లిఖితపూర్వక వ్యవహారాల యందు జాగ్రత్త వహించండి. కొనుగోలులో లాభపడే అవకాశాలు ఉన్నాయి. నిపుణులను సంప్రదించి కొనుగోలు చేస్తారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలలో ఖర్చు చాలా ఎక్కువగా అవుతుంది. అయినా ఖర్చులకు వెనుకాడరు. దురభ్యాసాలు కలిగి, క్రమశిక్షణ లేని మీ సన్నిహితుల వల్ల ఇబ్బందిపడతారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.

కొంతకాలం రక్తసంబంధీకులతో విభేదాలు చోటుచేసుకుంటాయి. కంటికి సంబంధించిన అనారోగ్యాలు రావచ్చు. మనోనిగ్రహంతో, కఠినమైన క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని గాడిలో పెడతారు. సంవత్సర ద్వితీయార్ధంలో వెన్నునొప్పి బాధిస్తుంది. వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉండాలని మీరు భావించినా కాలం అందుకు సహకరించదు. మీమీద వచ్చిన ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొడతారు. పిల్లల విషయంలో ఒక దిగులు, ఆలోచన  ఉంటుంది. విదేశీయాన విషయాలు, విదేశాలలో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు, విదేశీ వ్యాపారాలు, గ్రీన్‌కార్డు మొదలైనవి సానుకూలపడతాయి. తక్కువస్థాయి వ్యక్తులతో కలిసి పనిచేయడానికి ఇష్టపడరు. ప్రయోజనాలు వదులుకుంటారు కానీ మీరు మీ మనస్సాక్షికి కట్టుబడి ఉంటారు. అంగట్లో అమ్మకానికి అన్నీ ఉన్నాయి. కొనడానికి మన వద్దే డబ్బుల లేవన్న వాస్తవాన్ని గ్రహిస్తారు. ఈ అవినీతి ప్రపంచంలో ధనంతో కాని పని లేదని గ్రహిస్తారు. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా రావలసిన ప్రయోజనాలకు కూడా సమాజంలో ధనం వెచ్చించాల్సిన దుస్థితి దాపురించిందని బాధపడతారు.

ధర్మానికి, న్యాయానికి కాని కాలం సంభవించిందని బాధపడతారు. చదివిన ధర్మశాస్త్రాల సారాంశం తెలిసివస్తుంది. పెద్దలు చెప్పిన నీతిసూత్రాలు, ధర్మసూత్రాలు పాటించినందుకు తగిన శాస్తి జరిగిందని మీకు మీరే సరిపెట్టుకుంటారు. విద్యార్థినీవిద్యార్థులు నిత్యం సరస్వతీ తిలకాన్ని నుదుటన ధరించడం, జ్ఞానచూర్ణాన్ని సేవించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారికి మంచి రోజులు వస్తాయి. మీ వాక్చాతుర్యం, శక్తిసామర్థ్యాలు మంచి ఫలితాలనిస్తాయి. ధనం ఎంత వచ్చినా చేతిలో నిలబడకపోవడం అన్న దిగులు తీరుతుంది. నిలువుధనం ఏర్పడుతుంది.

స్నేహం అనెడి మూడు అక్షరముల తీయని మాట మన సంస్కతి సాంప్రదాయాలలో ప్రముఖమైన స్థానాన్ని పొంది ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలకు, ఆదర్శమైన విషయాలకు సమాజ పరిరక్షణకు ప్రధాన భాగం వహించి వర్ధిల్లుతుంది. స్నేహమే జీవితంగా, ప్రాణంగా భావించి స్నేహానికి నిజమైన అర్థాన్ని తెలియజేసిన మహనీయులు ఎందరో ఉన్నారు. ప్రస్తుత సామాజిక ప్రపంచంలో స్నేహాన్ని కూడా డబ్బులు పెట్టి కొనుక్కోవలసి వస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం ఆవుతాయి. వ్యాపార అభివృద్ధి నిమిత్తం దూరప్రయాణాలు చేస్తారు.

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా