శార్వరి నామ సంవత్సర (కన్యా రాశి) రాశిఫలాలు

22 Mar, 2020 08:57 IST|Sakshi

(ఆదాయం  2, వ్యయం  11,  రాజపూజ్యం 4, అవమానం  7)

ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికాభివృద్ధి బాగుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. గతంలో కన్నా ఆస్తుల విలువ పెరుగుతుంది. సంసార పురోగతి మానసిక సంతోషానికి కారణమవుతుంది. వాహనయోగం, గృహయోగం అనుకూలపడతాయి. శుభకార్య సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి. స్నేహితులు, బందువులతో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి. రాజకీయ పదవి లభిస్తుంది. వ్యాపారరంగంలోని వారికి అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం తలపెట్టిన కార్యక్రమాలు మూడువంతులు పూర్తవుతాయి. కొన్ని విషయాలు, వ్యవసాయ సంబంధమైన విషయాలు లాభిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులను అదుపు చేయడంలో విఫలమవుతారు. ఆదాయ మార్గాలను పెంచుకోవడం సర్వదా శ్రేయస్కరం అని భావిస్తారు. అంతర్గత రాజకీయాలు చికాకు కలిగిస్తాయి. మార్పురాని వ్యక్తులలో మార్పు తీసుకురావడానికి ఇక ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదని నిర్ణయించుకుంటారు. అంతర్గత రాజకీయాల కారణంగా ఒకరికి తెలియకుండా మరొకరికి ఆర్థిక సాయం చేయవలసి వస్తుంది.

ముఖ్యమైన ప్రయాణాలు, రహస్య ప్రయాణాలు లాభిస్తాయి. ప్రజా జీవితంలో విశేష ప్రభావం చూపే అంశాలను, చలనచిత్ర అంశాలను, రాజకీయాలను మీకు అనుకూలంగా మార్చుకోగలరు. రాని బాకీలు వివాదస్పదం అవుతాయి. సివిల్, క్రిమినల్‌ కేసులలో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. కులాంతర వివాహాల గురించి, ప్రేమ వివాహాల గురించి మీ వ్యాఖ్యానాలు, అభిప్రాయాలు విమర్శలకు దారితీస్తాయి. ఈ విషయంలో మీరు సమాజాన్ని పట్టించుకోరు. విదేశాల నుండి వచ్చే ఆర్థికసాయంతో మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు, సేవాసంస్థలు, అనాథాశ్రమాలు పురోగమనంలో ఉంటాయి. స్త్రీతో వైరానికి ముందుకు దూకవద్దు. వీలైనంత వరకు వివాదాలకు, వివాదస్పద చర్చలకు దూరంగా ఉండండి. అనువంశిక ఆస్తుల విషయమై డాక్యుమెంట్స్‌లో ఉన్న విషయాలు అస్పష్టంగా ఉండడంతో విభేదాలకు, వివాదాలకు దారితీస్తుంది. డాక్యుమెంట్స్‌లో స్పష్టత ఉండదు, ఇదీ సమస్య. చెవి, ముక్కు, గొంతులకు సంబంధమైన అనారోగ్యాలు బాధిస్తాయి.

మధ్యమధ్యలో వైరల్‌ జ్వరాలు ఇబ్బంది పెడతాయి. వ్యాపార వ్యవహారాలలో అయినవాళ్ళను, బంధువులను దూరంగా ఉంచి లాభపడతారు. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక ప్రయోజనాలను, బంధుత్వాలను వేరువేరుగా చూస్తారు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయము ధనంతో ముడిపడి ఉందని తెలుసుకొని జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అధికారులతో మంతనాలు, రాజకీయ పైరవీలు లాభిస్తాయి. ఐశ్వర్యనాగిని ఉపయోగించడం వలన మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. విద్యా సంబంధమైన విషయాలకు అధికంగా ధనం ఖర్చు చేయవలసి వస్తుంది. మీ పెద్దలపరంగా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. పోటీ పరీక్షలలో మంచి ఫలితాలను సాధిస్తారు. మంచి ఉద్యోగం లభిస్తుంది. సంతానాన్ని చదువులకోసం విదేశాలకు పంపించే ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకు ఋణాలు లభిస్తాయి. ఆకర్షణీయమైన స్కీముల్లో చేరడం వల్ల, చిట్టీలు కట్టడం వల్ల నష్టపోతారు. ప్రైవేటు ఆర్థిక సంస్థలలో పెట్టిన డబ్బు పోతుంది. ధనాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నాలు ఫలించవు. మీ స్నేహితుల రాజకీయ పదవుల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నిస్తారు. మీ వంతు సహాయం మీరు అందిస్తారు.

ప్రతిష్ఠాత్మకమైన సంస్థలో పనిచేయడానికి అవకాశం లభిస్తుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి రంగంలోనూ గట్టి పోటీ ఎదుర్కొనవలసి వస్తుంది. రియల్‌ ఎస్టేట్, ఆహారధాన్యాల వ్యాపారం బాగుంటుంది. కొన్నిచోట్ల భూమి ధర పడిపోతుంది. వ్యవసాయ సంబంధమైన విషయాలు, లాభాలు అయోమయంగా ఉంటాయి. సోదరసోదరీ వర్గంతో సంబంధబాంధవ్యాలు బలపడతాయి. ప్రతినిత్యం హనుమాన్‌ చాలీసా పారాయణం చేయండి. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేస్తారు. సంతానానికి సంబంధించి వివాహ ప్రయత్నాలు ఆకస్మికంగా లాభిస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. బరువుబాధ్యతలు తీర్చుకోగలిగామన్న సంతృప్తి కలుగుతుంది. రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, లైసెన్సులు, లీజులు  పునరుద్ధరణ వంటివి సజావుగా సాగిపోతాయి.

ఉద్యోగంలో ప్రమోషన్‌ లభిస్తుంది. కొన్నాళ్ళు ఉద్యోగంలో అసంతృప్తి వాతావరణం నెలకొంటుంది. కార్యాలయంలో మీ పనితీరు చాలామందికి నచ్చదు. ఉద్యోగం చేయడం కత్తిమీద సాముగా తయారవుతుంది. మీరు చేసే పని ఒకరికి మంచి అనిపిస్తే, పదిమందికి చెడు అనిపిస్తుంది. కష్టపడి సాధించుకున్న పదవి మానసిక అశాంతికి కారణమవుతుంది. సర్వీస్‌లో వివాదస్పద వ్యక్తిగా మిగలకుండా ఉండడానికి ప్రయోజనాలు వదులుకుంటారు. మీడియాపరంగా చికాకులు గోచరిస్తున్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని పూజించండి. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో ఎన్నడూ లేనంత ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రత్యర్థులలో ఐకమత్యం లేకపోవడం మీకు లాభిస్తుంది.

ఇతరులపై మీరు చేసే ఆరోపణలకు సంబంధించిన విషయాల తాలూకు సాక్ష్యాధారాలు లభిస్తాయి. అన్ని విషయాలు మీ అదుపులో ఉన్నట్లుగానే పరిస్థితులు ఉంటాయి. రెండు నెలలు గృహంలో ఐకమత్యం లోపిస్తుంది. రాజకీయ పదవి లభిస్తుంది. జల, వాయు, ఆహార కాలుష్యం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఊహలు, అపోహలు, ప్రక్కనపెట్టి నిజజీవితంలో బ్రతకడం చెప్పదగిన సూచన ఇంటి కొనుగోలు విషయంలో ఆచితూచి అడుగువేయండి. చేతివృత్తి పనివారికి, హోల్‌సేల్‌ వ్యాపారం చేసేవారికి, నిర్మాణరంగ పనులు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. నూతన బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. ఇతరులు మీకు ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ అయ్యే అవకాశం ఉంది. మీ హితవు కోరే పెద్దలను, ఆత్మీయులను దూరం చేసుకోవద్దు. ఆయుర్వేదం, హోమియోపతి వైద్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ప్రయాణాలలో వస్తుభద్రత గురించి గట్టి జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైన వివాదాలతో కాలాయాపన చేసే మీ వాళ్ళను సరైన దారిలో పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. భూమి సంబంధమైన విషయాలు మీకు అనుకూలంగా మారడం వల్ల మీ సాటివారికి, తోటివారికి అసూయ పెరుగుతుంది.

ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. మీరు చేయాలనుకునే కార్యక్రమాలు వెంటనే చేయండి. రహస్య చర్చలు, సంభాషణలు, కాలయాపన చేయటం మంచిది కాదు. ఇందువలన మానసిక ఆందోళన ఎక్కువై మానసిక ప్రశాంతత తగ్గుతుంది. కాంట్రాక్టులు, సబ్‌కాంట్రాక్టులు లాభిస్తాయి. ఉద్యోగంలో బదిలీ కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు అందలం ఎక్కించిన రాజకీయ నాయకులు, మీ ద్వారా ఉద్యోగం పొందిన వాళ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీకు ఉపయోగం లేదు, జాగ్రత్త వహించండి. గతంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు. యోగాసనాలు, మెడిటేషన్‌ వంటి విషయాలలో ఆసక్తి పెరుగుతుంది. మీ ఇంటి ఆడపడుచులకు అన్యాయం జరగకుండా గృహ ఆస్తి విషయాలను సక్రమంగా నిర్వహిస్తారు. ఎంతోకాలం క్రితం సంభవించిన మహాప్రస్థానం మీ మనస్సు మీద చెప్పలేని ప్రభావం చూపిస్తుంది. కుడి మోకాలు ఎక్కువగా ఇబ్బంది పెట్టవచ్చు.

వివాహాది శుభకార్యాల విషయంలో మీ మాటే నెగ్గించుకుంటారు. వ్యాపారంలో నమ్మకంతో మీరు ఇచ్చిన అప్పు సంకటంగా మారుతుంది. మీరు ఇతరులు చెప్పిన విషయాలు వినిపించుకోని వ్యక్తులు, తాము పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు అని వాదించే వ్యక్తులు ఇబ్బందికరంగా మారి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటారు. అయిన   వాళ్ళు, ఆత్మీయులు జీవితాలను పాడు చేసుకుంటుంటే ప్రేక్షకపాత్ర పోషించవలసి వస్తుంది. అవగాహన లోపం వల్ల తక్కువ ఖరీదు చేసే స్థిరాస్తిని ఎక్కువ మొత్తం వెచ్చించి కొనుగోలు చేస్తారు. ఎంతో అనుభవం ఉన్న మీరు ఈ ఒక్క విషయంలో పొరపాటు నిర్ణయం తీసుకుంటారు. ఉపకరించే పరిచయాలను దుర్వినియోగం చేయరు. మీ ఆత్మీయులను, కష్టాలలో ఉన్న స్నేహితులను, బంధువులను కష్ట సమయంలో ఆదుకుంటారు. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించి వారి పట్ల మీ బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తారు. 

కళా, సాహిత్య, సంగీత రంగాలలో సంతానాన్ని ప్రోత్సహిస్తారు. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు రావచ్చు, జాగ్రత్త వహించండి. సోదరసోదరీ వర్గానికి సహాయం చేయవలసిన పరిస్థితి వస్తుంది. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టే వ్యక్తులు ప్రధాన సమస్య అవుతారు. మీకు ఏ మాత్రం సంబంధం లేని విషయాలకు మీరే బాధ్యతవహించాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా పోటీ ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారపరంగా మిమ్మల్ని దెబ్బతీయాలని చూసే శత్రువర్గాల ప్రయత్నాలు విఫలం అవుతాయి. ప్రతి విషయంలోనూ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల అండదండలు మీకు లభిస్తాయి. ఆత్మీయవర్గంతో కొద్దికాలం విభేదాలు కలుగుతాయి.

స్పెక్యులేషన్‌లో నష్టపోయే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించడానికి విధిలేని పరిస్థితులలో మీరు మధ్యవర్తిత్వం వహించాల్సి వస్తుంది. ఓ శుభకార్యానికి కూడా మీరే మధ్యవర్తిత్వం వహించాల్సి వస్తుంది. ఇందువల్ల ప్రయోజనం లేకపోగా మీపై అనవసర నిందలుపడతాయి. రుద్రజడ వాడండి. వివాదస్పదమైన ఆస్తి కలిసివస్తుంది. ఐ.ఎ.ఎస్‌., ఐ.పి.ఎస్‌., ఐ.ఐ.టి వంటి ఉన్నత పరీక్షలకు ఎంపిక అవుతారు. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. ఆరోగ్య వృద్ధికోసం చేసే నూతన విధానాలు మంచి ఫలితాలనిస్తాయి. స్వయంకృతాపరాధాల వలన కొంత నష్టపోతారు. అయితే అది పెద్దగా లెక్కించదగినది కాదు.  

మరిన్ని వార్తలు