ఈ బామ్మ పెళ్లికూతురాయెనే...!

16 Jul, 2017 01:01 IST|Sakshi
ఈ బామ్మ పెళ్లికూతురాయెనే...!

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలనేది మన పాలసీ. కానీ, ఏ వయసులో జరిగినా జబర్దస్త్‌గా జరగాలనేది ఫారినర్స్‌ ఫాంటసీ! అందుకే.. సెంచరీకి దగ్గరలో ఉన్న ఓ బామ్మ.. తన పెళ్లి డ్రెస్‌ సెలెక్షన్‌ కోసం నానా హైరానా పడింది. ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాకు చెందిన సిల్వియా మార్టిన్‌(93) అనే బామ్మ..  ఫ్రాంక్‌ రేమండ్‌(88) అనే తాతతో పెళ్లికి రెడీ అయ్యింది. వెడ్డింగ్‌ డ్రెస్‌ కోసం న్యూ సౌత్‌ వేల్స్‌లోని బర్డ్స్‌నట్స్‌ అనే స్టోర్‌కి వెళ్లి నాలుగు రెడ్‌ కలర్‌ డ్రెస్‌లను ట్రై చేసింది. అయితే, తనకు ఏ డ్రెస్‌ సూట్‌ అయ్యిందో తెలియక కాస్త తికమక పడిందట.

దాంతో బర్డ్స్‌నట్స్‌ ఫేస్‌బుక్‌ ఫేజ్‌లో ఆ నాలుగు స్టిల్స్‌ని పోస్ట్‌ చేసి.. సిల్వియాకి ఏ డ్రెస్‌ బాగుందో చెప్పాలంటూ... నాలుగు పోజులకీ ఏ,బి,సి,డి అంటూ ఆçప్షన్స్‌ ఇచ్చింది. ఆ పోస్ట్‌ని చూసిన నెట్టింట్లోని సిటిజన్లు లైక్‌లు, కామెంట్లు చేస్తూ... చివరాకరికి ఆప్షన్‌ ‘సి’ని సెలెక్ట్‌ చేశారు. ఏకంగా ఐదు వేల లైక్స్‌ ఇచ్చి... శుభాకాంక్షలు తెలిపారు. దాంతో 261 డాలర్లు పెట్టి ఆప్షన్‌ ‘సి’లో ఉన్న డ్రెస్‌నే కొనుక్కుంది సిల్వియా. అయితే... మొత్తానికి ఈ వయసులో పెళ్లేంటా అని ఆరా తీస్తే... సిల్వియా, ఫ్రాంక్‌లు గత 20 ఏళ్లపై నుంచే ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు.

 చాలాసార్లు ఫ్రాంక్‌ పెళ్లి చేసుకుందామని సిల్వియాను బ్రతిమలాడాడట. అయితే.. సిల్వియాకి ఇంటి పేరు మార్చుకోవడం ఇష్టంలేదు. దాంతో పెళ్లి ప్రపోజల్‌ని పక్కన పెడుతూ వచ్చింది. గత ఏడాది సిల్వియా తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో... ఫ్రాంక్‌ని వదిలి తన కుటుంబ సభ్యులతో వెళ్లిపోయింది. దాంతో ఆశలొదులుకున్నాడు ఫ్రాంక్‌. అయితే తిరిగి కోలుకున్న సిల్వియాకు... మరోసారి ఫ్రాంక్‌ పెళ్లి చేసుకుందామంటూ ప్రపోజల్‌ పెట్టాడు. పెళ్లి అయినా ఇంటి పేరు మార్చుకోవల్సిన అవసరం లేదంటూ ఒప్పించాడట. దాంతో సిల్వియాకి పెళ్లికళ వచ్చేసింది.

మరిన్ని వార్తలు