నెమ్మదైన వేగం

26 Jan, 2014 00:39 IST|Sakshi
నెమ్మదైన వేగం

 సత్వం

 ‘‘నేను ఇంకా సాధించవలసింది ఏమీలేదు; నేను ఏం సాధించాలనుకున్నానో అది సాధించేశాను.’’
 ఇలాంటి సంతృప్తిని ఒక్క మైకేల్ షుమాకర్ మాత్రమే  ప్రకటించగలడు.
 
 షుమాకర్ అని మనం వ్యవహరిస్తున్న పేరు నిజానికి ‘షూ-మేకర్’కు సమానమే! అయితే, మైకేల్ షుమాకర్ అన్నప్పుడు మాత్రం దీని అర్థం ‘మెరుపువేగం’గా మార్చుకోవాల్సి ఉంటుంది. మామూలు వేగమా అది! ఎత్తులంటే భయపడే ఈ హీరో ఏడుసార్లు ఫార్ములా-1 వరల్డ్ చాంపియన్‌షిప్ గెలుచుకుని ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగాడు. ఇరవై ఏళ్లపాటు ఫాస్ట్‌ట్రాక్‌ను ఏలుకున్నాడు. అలాంటి షుమాకర్‌ను, ఒక కాంతిపుంజాన్ని... ఒక బండరాయి, ఒక జడపదార్థం కోమాలోకి తీసుకెళ్లడం సృష్టి వైచిత్రి!
 పాత సంవత్సరం చాలా దుఃఖంగా ముగిసిపోయింది ఈ జర్మనీయుడి కుటుంబానికి. డిసెంబరు 29న ఆయన ఫ్రాన్సులో స్కీయింగ్ చేస్తూ పడిపోయాడు. బండరాయికి తల బలంగా మోదుకోవడంతో తీవ్రగాయాలపాలై కోమాలోకి వెళ్లిపోయాడు. ఇంకో నాల్రోజుల్లో- జనవరి 3న ఆయన జన్మదినం. మెదడు బాగా దెబ్బతిన్న 45 ఏళ్ల మైకేల్ ఇక/ఇప్పట్లో కోలుకోడేమోనని తాజాగా వైద్యులు చెబుతున్నమాట! ‘నేను దేనినీ ద్వేషించలే’నని చెప్పే షుమాకర్‌ను ప్రేమించని క్రీడాభిమానులు ఎవరుంటారు!
 
 ‘షుమి’ ప్లేబాయ్ తరహా ఫార్ములా వన్ డ్రైవర్ కాదు. పక్కా ఫ్యామిలీ మేన్. నెమ్మదైన జీవితాన్ని ఇష్టపడతాడు. ఆదివారపు ఉదయాల్లో కుటుంబం- భార్య, ఇద్దరు పిల్లలు- పాప, బాబు-తో కలిసి కబుర్లు చెప్పుకుంటూ చాలా సేపు తింటూ మాట్లాడుతూ బ్రేక్‌ఫాస్ట్ చేయడం ఇష్టం. ఎప్పుడైనా సరదాగా వాళ్లకు ఇటాలియన్ పాస్తా చేసిపెట్టడం ఇష్టం. దాదాపుగా ఇరవై ఏళ్ల కాపురంలో భార్యతో చిన్నాచితకా ఎన్ని విభేదాలు వచ్చినా, గట్టిగా నోరు పారేసుకునేంతగా అరిచే సందర్భమే రాలేదట!
 
 అతి మామూలు కుటుంబంలో ఆర్థిక బాధలతో జన్మించి, అత్యంత సంపన్న క్రీడాకారుడిగా ఎదిగినా... ‘‘నేను గొప్పవాడినని ఎవరైనా అన్నా నమ్మను. నా గొప్పదనం ఏదైనా ఉంటే అది ఫార్ములా వన్ రేస్ ట్రాక్ మీదనే కనిపిస్తుంది. పందెం పూర్తయితే... నేనూ మీలో ఒకడినే...’’ అంటాడు. కాబట్టే, ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చూసి ఏడుస్తాడు. బైకు వేసుకుని స్నేహితులతో దేశంలోని మారుమూల ప్రాంతాలు చూడ్డానికి వెళ్తాడు. పర్వతారోహణ చేస్తాడు. (ఎత్తులనుంచి చూసే భయాన్ని అధిగమించాడు). శామ్యూల్ బెకెట్ పుస్తకాలు చదువుతాడు. అయితే, అతడికి పుస్తకాల పేర్లు మాత్రం గుర్తుండవట! ఖాళీ సమయాల్లో, విశ్రాంతిగా రెడ్ వైన్ తాగుతూ సిగార్ కాల్చుకుంటూ కూర్చోవడాన్ని ఇష్టపడతాడు.
 
 ఫార్ములా వన్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించినప్పుడు, ‘టీమ్ మెంబర్స్, మెకానిక్స్, క్రూ... అందరినీ మిస్సవుతాను. రేసుకు ముందు మేము సరదాగా సాకర్ ఆడేవాళ్లం. ఆట అని కాదు, అందులో స్నేహం కలగలిసి ఉండేది. చాలా వ్యక్తిగత సంభాషణలు చోటు చేసుకునేవి. అవన్నీ మిస్సవుతాను,’ అన్నాడు విధిని బలంగా విశ్వసించే షుమాకర్. ఇకపై ఆ ‘విధి లిఖితం’ ఎలావుందో!
 
 ‘షుమి’ ప్లేబాయ్ తరహా ఫార్ములా వన్ డ్రైవర్ కాదు. పక్కా ఫ్యామిలీ మేన్.

మరిన్ని వార్తలు