సత్వం: సింపుల్ స్టీవ్

23 Feb, 2014 04:26 IST|Sakshi
సత్వం: సింపుల్ స్టీవ్

ఒక శిల్పాన్ని మైకేలాంజిలో ఒక్కడే అత్యద్భుతంగా చెక్కగలడు; కానీ కంపెనీలను నడపడం ఏ ఒక్కరివల్లో కాదు, వేలాది మంది కావాలి, అందరూ బ్రహ్మాండమైన వాళ్లు కావాలి. క్రీములోంచి క్రీమును తీసుకోవాలి.
 - స్టీవ్ జాబ్స్
 ఫిబ్రవరి 24న స్టీవ్ జాబ్స్ జయంతి
 
 గోడలకు వేసే సున్నం కూడా ‘ప్యూర్’ వైట్‌గా ఉండాలనేవాడట స్టీవ్ జాబ్స్. మామూలు తెలుపు కాదు; స్వచ్ఛమైన తెలుపు! ఒక ఉత్పత్తి ఎలా ఉండాలీ అన్న విషయంలో స్టీవ్‌జాబ్స్‌కు చాలా స్పష్టత ఉంది. సాధారణంగా ఉండాలి. స్వచ్ఛంగా ఉండాలి. ‘సంక్లిష్టంగా కన్నా సింపుల్‌గా ఉండటం కష్టం. సింపుల్‌గా ఉండాలంటే నీ ఆలోచనలన్నింటినీ ఒక కొలిక్కి తెచ్చుకోవాల్సి ఉంటుంది’ అంటాడు జాబ్స్. స్టీవ్ అభిమానించే జర్మన్ ఇండస్ట్రియల్ డిజైనర్ డైటర్ రామ్స్ ఒక మాట చెబుతుంటాడు: ‘ఏ ప్రొడక్టయినా ఇంగ్లీష్ బట్లరులా ఉండాలి. కళ్లముందు కనబడకూడదు; కానీ ఎప్పుడూ అందుబాటులో ఉండాలి’. ఈ విధానాన్నే ‘యాపిల్’ ఉత్పత్తుల డిజైన్లలో జాబ్స్ అనుసరించాడు.
 
 చిత్రంగా, స్టీవ్ జీవితం చాలా సంక్లిష్టంగా సాగింది. సాధారణతనూ, అందునా స్వచ్ఛత కోసం తహతహలాడటం వెనుకా ఈ కారణాలూ ఉండొచ్చు. స్టీవ్‌జాబ్స్ జీవితం సున్నా నుంచి కూడా మొదలుకాలేదు; మైనస్‌తో ప్రారంభమైంది. పెళ్లికాని ప్రేమికుల అవాంఛిత గర్భంగా జన్మించాడు. పెంపుడు తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు. ఐదు సెంట్ల కోసం ఖాళీ కోక్ సీసాలు ఏరాడు. కాలేజ్ డ్రాపౌట్, హిప్పీల ప్రభావం, డ్రగ్స్‌తో స్నేహం, వ్యక్తిగత అశాంతి, ఆధ్యాత్మికతను అన్వేషిస్తూ 1973లో యువకుడిగా భారతదేశం రావడం, నీమ్ కరోలీబాబాను కలిసిన తర్వాత బౌద్ధం వైపు మొగ్గడం, ఆహార్యం మార్చుకోవడం, గుండు కొట్టించుకోవడం, అమెరికాకు తిరిగివెళ్లడం, ‘యాపిల్ కంప్యూటర్’ స్థాపించడం, పర్సనల్ కంప్యూటర్స్, టాబ్లెట్స్, మ్యూజిక్, యానిమేషన్ రంగంలో తనదైన ముద్ర వేసిన ఆలోచనాపరుడిగా పేరుగడించడం... సినిమా కథలా లేదూ!
 
 తర్వాత ఆధ్యాత్మికతను ‘గట్టున’ పెట్టినా ‘మినిమలిస్ట్’గానే బతికాడు స్టీవ్. ఆయన ఇంట్లో పెద్దగా సామాన్లు, ఫర్నిచర్ కూడా ఉండేవికాదట! ఐన్‌స్టీన్ ఫొటో మాత్రం ఉండేది. ‘తనచుట్టూ వస్తువులు ఉండాలని కోరుకోరు. ఉన్నవాటి గురించి మాత్రం పర్టిక్యులర్‌గా ఉంటారు’ అంటారు స్టీవ్‌తో పనిచేసిన జాన్ స్కలీ.
 
 ఈ జాన్ స్కలీ ‘పెప్సీ’ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు, ‘అక్కడే తియ్యటినీళ్లను అమ్ముతూ జీవితాంతం గడుపుతావా? లేదా ప్రపంచాన్ని మార్చడానికి ఒక అవకాశం కోరుకుంటావా?’ అని తన దగ్గరికి పిలుచుకున్నాడు స్టీవ్. తనతో పనిచేసేవాళ్లు ఎక్స్‌ట్రా ఆర్డినరీగా ఉండాలని కోరుకుంటాడు స్టీవ్. ‘ఒక శిల్పాన్ని మైకేలాంజిలో ఒక్కడే అత్యద్భుతంగా చెక్కగలడు; కానీ కంపెనీలను నడపడం ఏ ఒక్కరివల్లో కాదు, వేలాది మంది కావాలి, అందరూ బ్రహ్మాండమైన వాళ్లు కావాలి.
 
 క్రీములోంచి క్రీమును తీసుకోవాలి’ అనేవాడు. ‘ఒక భాగస్వామిని ఎన్నుకునేప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటాం? ఎందుకంటే అతడు నీ సగం కంపెనీ. అలాంటప్పుడు మూడో వ్యక్తిని తీసుకునేప్పుడు? నాలుగు? ఐదు? ఒక కంపెనీని ప్రారంభించినప్పుడు తీసుకున్న మొదటి పదిమంది మీదే కంపెనీ విజయమో, అపజయమో ఆధారపడి ఉంటుంది’ అంటాడు జాబ్స్.
 
 గుప్పెడు పాటలు జేబులో ఉంటే చాలనుకునే వినియోగదారుడికి దోసిళ్లకొద్దీ పాటలు చెవుల్లో పోశాడు జాబ్స్. అయితే, ‘ఒక ఉత్పత్తి బంగారుబాతని తెలిసిపోయాక, ఏ కంపెనీనైనా దాన్నే నమ్ముకుని సుదీర్ఘంగా అక్కడే ఆగిపోతుంది. సృజన మందగిస్తుంది. ఈలోపు జరిగే సాంకేతిక మార్పుల్ని అందుకోలేక ఆ కంపెనీ అక్కడే నిలిచిపోతుంది, దాంతో పోటీదారులు దూసుకెళ్లిపోతారు’ అనేవాడు. అందుకే తమ ‘యాపిల్’ ఉత్పత్తులు ఏ ఒక్కదానికో పరిమితం కాకుండా చూసుకున్నాడు.
 
 ‘నేను ఏదో ఒకరోజు చనిపోతానని గుర్తుంచుకోవడమే నా జీవితంలోని ఎంపికలని ప్రభావితం చేసింది. బయటి అంచనాలు, గర్వం, ఓటమి భయం ఇవేవీ మృత్యువు ముంగిట నిలవ్వు. బయటి రణగొణధ్వనుల్లో నీ అంతర్వాణి వినకుండాపోయే పరిస్థితి తెచ్చుకోవద్దు’ అని చెప్పిన స్టీవ్‌జాబ్స్ 2011లో తన 56వ ఏట క్యాన్సర్‌తో మరణించాడు. మనుషులకన్నా వాళ్లు చేసే పని గొప్పదనేవాడు స్టీవ్. ఆయన గొప్పతనం ‘యాపిల్’ రూపంలో కనబడుతూనే వుంది.

మరిన్ని వార్తలు