చైనా పందిబొమ్మ

20 Dec, 2014 23:48 IST|Sakshi
చైనా పందిబొమ్మ

మూలం: ఎట్ గార్ కెరెట్
తెలుగు: టి. షణ్ముఖ రావు

 
నాన్న నాకోసం ఖరీదైన సింప్సన్ బొమ్మ కొనడు. నిజానికి అమ్మకొందామనే అన్నది. కాని నాన్న ఆ ప్రతిపాదన కొట్టిపారేశాడు. అంత ఖరీదైన బొమ్మలు అలవాటు చేయడం వల్ల నాకు పొదుపు తెలియకుండా పోతుందనీ, పాడైపోతాననీ నాన్న భయం. అమ్మతో నాన్న ఇలా అన్నాడు: ‘‘అంత ఖరీదైన బొమ్మ ఎందుకు కొనాలసలు? సింప్సన్ బొమ్మలో ప్రత్యేకత ఏమున్నది కనక? కీచుమని అరిచి మన దృష్టిని తనవైపు మళ్లించుకొంటుంది. అంతేకదా?’’  అంతేకాదు, నాకు డబ్బు విలువ తెలియదనీ, చిన్నప్పుడే నేర్చుకోకుంటే యింకెప్పుడు నేర్చుకుంటానని కూడా కోప్పడ్డాడు. చిన్న పిల్లలకి అడగ్గానే ఖరీదైన బొమ్మలు కొనిచ్చేస్తే మొద్దులుగా తయారౌతారనీ ఉపన్యసించేడు.
 కాబట్టి నాకోసం సింప్సన్ బొమ్మకి బదులు ఒక చౌకైన అంద వికారమైన చైనా పందిబొమ్మని కొన్నాడు.
 
 బొమ్మ వెనుకభాగంలో నాణేలు నెట్టి దాచుకొనే ఒక బల్లపరుపు రంధ్రం ఉన్నది. యీ విధంగా ఖర్చు నియంత్రించి పొదుపు నేర్పితే నేను మొద్దుబాలుణ్ని కాకుండా మంచి పౌరుడ్ని అవుతానని నాన్న నమ్మకం. ప్రతి ఉదయం నాకు యిష్టం లేకపోయినా ఒక కప్పు కోకో తాగాలి. తొక్కతో ఉన్న కోకో తాగితే ఒక నాణెంయిస్తారు. తొక్క లేనిది తాగితే అర్ధనాణెం ఇస్తారు. కోకో తాగకపోతే అసలేమీ ఇవ్వరు. ఆ నాణేల్ని నేను చైనా పంది బొమ్మ వెనుకభాగంలో జొనుపుతూ పొదుపు నేర్చుకోవాలి.
 
 బొమ్మని కదిలిస్తే అది గలగలా శబ్దం చేస్తుంది. నాణేలు ఎక్కువగా ఉన్నప్పుడు కదిలించినా అంతగా శబ్దం రాదు. అయితే ఎక్కువ డబ్బు పోగైతే మాత్రం దాంతో నేను ఖరీదైన సింప్సన్ బొమ్మ కొనుక్కోవచ్చు. ఈ విధంగా నేను పొదుపు పాఠాలు నేర్చుకొంటున్నాను. నిజానికి అది పంది బొమ్మేగానీ చూడముచ్చటగా ఉన్నది. దాని ముక్కు భాగాన్ని తాకితే చల్లగా ఉంటుంది. దాని వెనుక భాగంలో పూర్తి నాణేన్ని పెట్టినా అర్ధనాణేన్ని పెట్టినా ఒకేలా నవ్వుతుంది. ఇంతకన్నా ముచ్చటైన అంశం యింకొకటి ఉంది. అసలు ఏ నాణేన్నీ దూర్చకుండా వెనుకభాగాన్ని తాకినా సంతోషంగా నవ్వుతుంది.
 
 నేను ఆ పంది బొమ్మకి పెసాచన్ అని పేరు పెట్టుకున్నాను. యీ పెసాచన్ అనే పేరు ఒకప్పుడు మా మైల్‌బాక్స్‌లో ఉండేది. ఎంత ప్రయత్నించినా మా నాన్న దాన్ని తీసిపారెయ్యలేకపోయేడు. పెసాచన్ నా మిగతా బొమ్మల మాదిరిగా ఉండదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాన్లో లైట్లూ స్ప్రింగులూ లీకయ్యే బ్యాటరీలూ ఉండవు. కాని దాని గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. టేబుల్ మీద నుండి కిందకు పడకుండా చూసుకుంటూ ఉండాలి. అది నేలవైపు వంగి కిందకు చూస్తూ నాకు కనపడితే మాత్రం ‘‘జాగ్రత్త సుమా నువ్వు చైనా తయారీవి’’ అంటుంటాను.
 
 అంతే, నా వైపు చూసి నవ్వుతుంది. నేను నా చేతిలోనికి దాన్ని తీసుకుని లాలించే వరకూ ఓపిగ్గా వేచి ఉంటుంది.
 పెసాచన్ నన్ను చూసి నవ్వితే నేను పిచ్చైపోతాను. ఆ నవ్వు కోసమే నేను ప్రతి ఉదయం నాకిష్టం లేకపోయినా తొక్కతో ఉన్న కోకో తాగుతాను. ఒక నాణెం నాన్న వద్ద తీసుకుని దాని వెనుక రంధ్రంలో దూర్చి, దాని నవ్వు చూస్తాను. ప్రతిరోజూ అదే నవ్వు, కొంచమైనా మార్పు ఉండదు. ‘‘పెసాచన్, నువ్వంటే నాకిష్టం. నిజంగా అమ్మా నాన్న కంటే నిన్నెక్కువగా ప్రేమిస్తున్నాను. ఇలాగే నిన్నెల్లప్పుడూ ప్రేమిస్తాను. కాని నువ్వు టేబుల్ మీద నుండి కిందపడితే మాత్రం దేవుడే నిన్ను రక్షించాలి’’ అంటుంటాను.
 నిన్ననే నాన్న పెసాచన్‌ని టేబుల్ మీద నుండి పెకైత్తి గట్టిగా పైకీ కిందకీ కదిలించడం మొదలుపెట్టాడు.
 ‘‘నాన్నా! జాగ్రత్త సుమా! నువ్వు పెసాచన్‌కి కడుపునొప్పి తెప్పిస్తున్నావు’’ అన్నాను.
 కాని నాన్న నా మాట పట్టించుకోలేదు. ఇంకా గట్టిగా కదిలిస్తూనే ‘‘శబ్దం ఏమీ రావడం లేదే! దానర్థం ఏంటో తెలుసా! రేపు నువ్వు ఖరీదైన సింప్సన్ బొమ్మ కొనుక్కోవచ్చు’’ అన్నాడు.
 నేను ఎగిరి గెంతేసేను. ‘‘సింప్సన్ బొమ్మా! నేనా! అద్భుతం నాన్నా! కాని పెసాచన్‌ని కదిలించడం ఆపు. ప్లీజ్. దానికి నొప్పెడుతుంది’’ అన్నాను.
 నాన్న పెసాచన్‌ని తిరిగి టేబుల్ మీద పెట్టాడు. అమ్మని చూడడానికి వెళ్లాడు. ఒక నిమిషం తరువాత అమ్మని చేత్తో తోడుకొని వచ్చేడు. రెండో చేత్తో ఒక సుత్తిని పట్టుకొని వచ్చేడు. ‘‘చూశావా! నేనూహించినట్లుగానే జరిగింది’’ అమ్మతో అంటున్నాడు, ‘‘యీవిధంగా మన యూవీ (నాపేరు) డబ్బు విలువేంటో తెలుసుకున్నాడు. అంతేకదా! యూవీ?’’
 ‘‘బాగా తెలిసింది నాన్నా! అది సరే మరి సుత్తి ఎందుకు తెచ్చావు?’’
 అప్పుడు నాన్న అన్నాడు: ‘‘నీ కోసమే’’ అంటూ సుత్తిని నా చేతిలో పెట్టాడు. పెడుతూ ‘‘జాగ్రత్త సుమా!’’ అన్నాడు.
 ‘‘నేనెప్పుడూ జాగ్రత్తగానే ఉంటాను నాన్నా!’’ అంటూ నిజంగానే సుత్తిని గట్టిగా పట్టుకున్నాను.
 కొద్ది నిమిషాలు వేచి, నాన్న విసిగిపోయేడు.
 ‘‘కానివ్వు మరి. ఆ పంది బొమ్మని పగలగొట్టు’’ అన్నాడు.
 ‘‘ఏమిటీ?’’ నేను అరిచాను, ‘‘పెసాచన్‌ని పగలగొట్టాలా?’’
 ‘‘అవును. పెసాచన్‌నే. కానివ్వు మరి. పగలగొట్టు. నువ్విప్పుడు ఖరీదైన బొమ్మని కొనడానికి అర్హత సంపాదించావు. చాలా కష్టపడ్డావు. పొదుపు నేర్చుకున్నావు’’ అన్నాడు నాన్న.
 తన అంతిమ ఘడియలు తెలిసిపోయిన చైనా పంది బొమ్మ పెసాచన్ నావైపు దీనంగా చూసి విషాదంగా నవ్వింది.
 ‘‘సింప్సన్ బొమ్మ లేకపోతే పోయింది. దానికోసం యీ ఆప్తమిత్రుడి తలని సుత్తితో పగలగొట్టాలా!’’ అని ఆలోచించాను.
 ‘‘నాకు సింప్సన్ బొమ్మ వద్దు నాన్నా! యీ చైనా బొమ్మ పెసాచన్ చాలు’’ అన్నాను. అంటూ సుత్తిని నాన్న చేతికి ఇచ్చేసేను.
 ‘‘నీకర్థం కాలేదన్న మాట’’ నాన్న అన్నాడు. ‘‘సరే నీ ఆలోచన చాలా పరిణతి చెందింది. సుత్తిని యిటివ్వు నేనే నీకోసం దీన్ని పగలగొడతాను’’ అంటూనే సుత్తిని నాచేతిలోంచి తీసుకుని పెసాచన్ పైకి ఎత్తి పట్టుకున్నాడు.
 అమ్మ కళ్లు మూసుకుంది.
 పెసాచన్ అలసిపోయిన చిరునవ్వుని గమనించాను.
 ఇక నిర్ణేతను నేనే అని తేలిపోయింది. నేనే మాత్రం అడ్డుపడకపోయినా పెసాచన్ వినాశనం ఖాయం.
 ‘‘నాన్నా’’ అని అరుస్తూ నాన్న కాళ్లకు చుట్టుకున్నాను.
 ‘‘ఏమైంది యూవీ!’’ నాన్న చేతిలోని సుత్తి ఇంకా గాల్లోనికి లేచే ఉన్నది.
 ‘‘నాన్నా! నాకింకో నాణెం కావాలి. రేపు కోకో తర్వాత దాన్లో దూర్చడానికి మరో నాణెం ఇవ్వు. రేపు నేనే దీన్ని పగలగొడతాను... తప్పకుండా...’’ అన్నాను.
 ‘‘మరో నాణెమా?’’ నాన్న చిరునవ్వుతో సుత్తిని టేబుల్ మీద పెట్టాడు. ‘‘చూశావా? మన వాడిలో ఎంత అవగాహన పెరిగినట్టు చేశానో.... అలావుండాలి....’’ అని అమ్మతో అన్నాడు.
 ‘‘అవును నాన్నా... అవగాహన నిజంగా పెరిగింది. కాని రేపు... రేపు...’’ ఆ సరికే నా గొంతు బొంగురుపోయింది.
 ‘‘అందరూ గదిలోంచి బయటికి వెళ్లిన తరువాత పెసాచన్‌ని గట్టిగా గుండెకు హత్తుకున్నాను. ఒక్కసారిగా బయటికి ఏడ్చేసేను. పెసాచన్ మాట్లాడలేదు. నా చేతుల్లో ప్రశాంతంగా వొణికింది. అంతే. ‘‘బాధ పడొద్దు’’ దాని చెవిలో రహస్యంగా, నెమ్మదిగా చెప్పేను. ‘‘నేన్నిన్ను రక్షిస్తాను. సరేనా?’’
 ఆ రాత్రి మా నాన్న ముందు గదిలో టీవీ చూడ్డం ముగించుకుని నిద్రకుపక్రమించే వరకూ వేచివున్నాను. అప్పుడు నిశ్శబ్దంగా పెసాచన్‌ని పట్టుకొని నెమ్మదిగా యింటి బయటి చీకట్లోనికి జారి వచ్చాను.
 చాలాసేపు మేమిద్దరమూ చీకట్లోనే నడిచాం. చివరకి ముళ్లచెట్లున్న ఒక పంట పొలాన్ని చేరుకున్నాం.
 పెసాచన్‌ని చివరిసారిగా గట్టిగా కౌగిలించుకున్నాను.
 ‘‘పందులకు పొలాలంటే చాలా యిష్టం’’ అని పెసాచన్‌తో చెబుతూ, దాన్ని పొలంలో నేలమీద పెట్టాను. ఇంకా యిలా అన్నాను: ‘‘ముఖ్యంగా ముళ్ల మొక్కలున్న పంట పొలాలంటే పందులకిష్టం. నీకిక్కడ చాలా బావుంటుంది పెసాచన్!’’
 జవాబు కోసం ఎదురుచూశాను.
 కాని పెసాచన్ ఏమీ మాట్లాడలేదు.
 చిరునవ్వు నవ్వనూ లేదు.
 దాని మూతిని తాకి వీడ్కోలు చెప్పినప్పుడు మాత్రం పెసాచన్ విషాదంగా నావైపు చూసింది.
 మళ్లీ నన్ను ఏనాటికీ చూడడం సాధ్యం కాదని దానికీ తెలుసు.

మరిన్ని వార్తలు