ఒక అర్ధరాత్రి పిలుపు

18 Jan, 2015 00:23 IST|Sakshi
ఒక అర్ధరాత్రి పిలుపు

సైనికుడికి యుద్ధ సమయం కీలకం. కానీ సైన్యంలోని వైద్యుడికి శాంతిసమయం కూడా కీలకమే. యుద్ధం లేనప్పుడు సైనికులు వార్ ఎక్సర్‌సైజ్ చేస్తారు. అందులో గాయపడిన వారికి వైద్యం చేయాలి, ఎప్పుడు పిలుపు వచ్చినా హాజరు కావడానికి సిద్ధంగా ఉండాలి. అలాంటి పిలుపు ఒక పేదగ్రామీణుడి నుంచి వస్తే! దానికి స్పందించిన లెఫ్ట్‌నెంట్ కల్నల్ డాక్టర్ అశోక్ అనుభవం ఈవారం...
 
మొదట్లో నన్ను విసుక్కున్న సర్జన్ కూడా ‘ఇక నుంచి మీరిచ్చిన ధైర్యంతో సిజేరియన్ ఆపరేషన్లు కూడా చేస్తాను’ అన్నారు.
 
మాది కృష్ణాజిల్లా రేమల్లె. నేను ఆర్మీలో చేరిన నాటికి కశ్మీర్ ప్రశాంతమైన ప్రదేశం. 1990 తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. నేను పూంచ్ సెక్టార్‌లో పని చేసిన రోజుల్లో ప్రతిరోజూ ఒక ఉగ్రదాడి జరిగేది. మేమున్న ప్రదేశం జమ్మూ నగరానికి దాదాపు 250 కిలోమీటర్లుంటుంది. సెలవు రోజుల్లో జమ్మూ నగరానికి వెళ్లాలంటే సరైన రోడ్డు ఉండేది కాదు. ఘాట్‌రోడ్డులో ఏ నిమిషమైనా, ఎక్కడైనా మందుపాతర పేలవచ్చు. వాటికి వెరవకుండా ఉద్యోగం చేయడమే ప్రధానం.
 
సైనికులకు వైద్యం చేయడం నా విధి. స్థానికులకు వైద్యం చేయడం విధి కాదుగానీ ఆసక్తి ఉంటే చేయొచ్చు. నేను వృత్తిరీత్యా ఎనెస్థిటిస్టునే అయినా ఎంతోమంది బిడ్డల్ని డెలివర్ చేశాను, ప్రాణాపాయంలో ఉన్న వారికి అత్యవసర చికిత్స అందించాను.
 
కార్గిల్ సమయంలో...
నా ఆర్మీ జీవితంలో కార్గిల్ వార్ మరిచిపోలేనిది. పాకిస్తాన్ వాళ్లు మనదేశంలో బంకర్లు కట్టేసి దాడులు చేశారు. కాల్పులు బయటి నుంచి కాదు, మన ప్రదేశం నుంచే జరుగుతున్నాయి. బంకర్లలో ఉండే శత్రుసైనికులకు ఆహారం వెళ్లే దారులన్నీ మూసేయడంతో పదిహేడు రోజుల్లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే నాకు సంతోషాన్నిచ్చిన సంఘటన అక్కడి ఓ కుగ్రామంలో జరిగింది.
 
అది 2000 డిసెంబర్. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో స్థానికులు ఒక మహిళను మంచం మీద తెచ్చారు. ఆమె ప్రసవ నొప్పులు పడుతోంది. బిడ్డ అడ్డం తిరిగింది. వెంటనే సిజేరియన్ చేస్తే తప్ప తల్లీబిడ్డా బతకరు. నేను తక్షణమే సర్జన్‌కు ఫోన్ చేశాను. ఆయన కేసు తీసుకోవడానికి సుముఖంగా లేరు. ఆర్మీ డాక్టర్ చేతిలో ప్రాణం పోతే విచారణ  జరుగుతుంది. పైగా ఆమె ముస్లిం మహిళ. ఈ ఆపరేషన్ ఫెయిలయితే తీవ్రవాదులు ఆ డాక్టర్‌ని టార్గెట్ చేయొచ్చు. ఆ భయంతో ‘నేను గైనకాలజిస్టును కాదు’ అని తప్పించుకోజూశారు.
 
కళ్లల్లో కృతజ్ఞతలు
ఏం చేయాలి? నాపై అధికారికి ఫోన్ చేశాను. ‘అధికారిగా ఏమీ చెప్పలేను. మీ రిస్కు మీద చేస్తానంటే నాకే అభ్యంతరం లేదు’ అన్నారు. నేను మళ్లీ సర్జన్‌కు ఫోన్ చేసి ‘మీ పై అధికారిగా ఆదేశిస్తున్నాను, వెంటనే రావాలి’ అన్నాను. ‘నాకు సిజేరియన్ ప్రొసీజర్ తెలియదంటే అర్థం చేసుకోరేం’ అన్నారు. ‘ఎన్నో సిజేరియన్ కేసులు దగ్గరగా చూశాను. ప్రతి స్టెప్ నేను చెప్తాను, మీరు చేయండి’ అన్నాను. అలా ఆపరేషన్ మొదలెట్టి, బిడ్డను క్షేమంగా బయటికి తీశాం. గర్భిణి తల్లితోనే నర్సు పనులు చేయించాం.

బిడ్డకు వేయడానికి వ్యాక్సిన్ కూడా లేదు. అర్ధరాత్రి కదా, ఉదయాన్నే 90 కిలోమీటర్ల దూరంనుంచి టీకా తెప్పించి వేశాం.  ఆ గ్రామస్థుల్లో వ్యక్తమైన కృతజ్ఞత అంతా ఇంతా కాదు. ఆగ్రామ ముఖియా పళ్లెం నిండా ఆక్రోటులు, బాదంకాయలతో వచ్చి ‘మీ సహాయానికి కృతజ్ఞతలు. మీకెంతో ఇవ్వాలని ఉంది. కానీ మా దగ్గరున్నవి ఇవి మాత్రమే’ అన్నారు. అప్పటి నుంచి ఆ గ్రామస్థులు మమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టారు.  వాళ్లెవరూ భారత సైన్యాన్ని సొంతవారిగా భావించేవారు కాదు.  నేను డాక్టర్‌గా చేసింది తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడ్డమే. కానీ ఆర్మీ వ్యక్తిగా అది దేశమాత రక్షణను పటిష్టం చేయడం!    
రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి

మరిన్ని వార్తలు