విడ్డూరం: ఈయన అద్దెకు దొరుకుతాడు!

29 Sep, 2013 04:29 IST|Sakshi

ఇళ్లు అద్దెకిస్తారు, కార్లు అద్దెకిస్తారు, సైకిళ్లు అద్దెకిస్తారు. కానీ టక నోబు నిషిమోటో తనను తానే అద్దెకు ఇచ్చుకుంటున్నాడు. జపాన్‌కు చెందిన ఈ నలభయ్యారేళ్ల పెద్దమనిషి ఓ కాలేజీలో లెక్చెరర్‌గా పని చేస్తున్నాడు. బేస్‌బాల్ చాంపియన్ కూడా. ఈ సారు ఈ మధ్య కొత్తగా ఒసాన్ రెంటల్స్ పేరుతో ఓ ఆఫీసు తెరిచాడు. దీని ఉపయోగం ఏంటయ్యా అంటే... ఏమీ తోచక, టైమ్‌పాస్ అవక  ఇబ్బంది పడుతున్నవాళ్లు ఈయనను అద్దెకు తీసుకోవచ్చు. ఈయన వెళ్లి, వాళ్లకు కబుర్లు చెప్పి, ఆటలాడి, పాటలు పాడి, చక్కగా కంపెనీ ఇచ్చి వస్తాడు. దానికోసం గంటకు వెయ్యి యెన్‌లు చెల్లించాల్సి ఉంటుంది.
 
 నిషిమోటో కొత్త వ్యాపారం గురించి విన్నవాళ్లు ఇదేం వ్యాపారం అంటూ బుగ్గలు నొక్కుకున్నారు. కానీ అతడు మాత్రం తేలిగ్గా తీసుకుంటున్నాడు. ఎందుకంటే, అతడి వ్యాపారం బాగుంది మరి! నలభయ్యేళ్లు దాటినవాడి కంపెనీ ఎవరికి కావాలి అనుకున్నవారందరికీ పెద్ద షాకే ఇచ్చాడు నిషిమోటో. రిటైరైపోయి ఇంట్లో ఉన్నవాళ్లు అతడిని అద్దెకు తీసుకుని టైమ్‌పాస్ చేస్తున్నారు. అర్జెంటు పనిమీద ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే తల్లిదండ్రులు అతణ్ని పిలిచి పిల్లలను ఆడించమని చెప్పి వెళ్తున్నారు. కొందరు యువత (యువతులు కూడా) సైతం అతడి సాన్నిహిత్యాన్ని కోరుతున్నారు. అంటే... నిషిమోటో ప్లాన్ అద్భుతంగా వర్కవుటైనట్టేగా!
 
 భార్యంటే అంత ప్రేమ!
 షాపింగుకెళ్దాం అని భార్య అనగానే జడుసుకునే భర్తలు చాలామంది ఉంటారు. స్త్రీలు ఎక్కువ ఖర్చు చేస్తారని వారి ఉద్దేశం. అయితే కాలిఫోర్నియాలో నివసించే లోమిత మాత్రం అలా అనుకోడు. పైగా తనే  భార్య కోసం షాపింగ్ చేస్తాడు. లోమిత భార్య పేరు మార్గట్. ఇద్దరూ జర్మన్లే అయినా పెళ్లయిన కొంత కాలానికి అమెరికా వచ్చి స్థిరపడ్డారు. మార్గట్‌కు షాపింగ్ అంటే బొత్తిగా ఇష్టం ఉండదు. షాపంగ్ చేయడంలో కంటే ఇంటిని చక్కబెట్టుకోవడంలోనే సంతోషం ఉంటుందంటుందామె.
 
 దాంతో లోమితయే భార్య కోసం షాపింగ్ చేసేవాడు. రకరకాల దుస్తులు కొనుక్కొచ్చేవాడు. క్లియరెన్స్ సేల్ ఎక్కడైనా పెడితే, ఒకేసారి ఇరవై, ముప్ఫై డ్రెస్సులు కొనేసేవాడు. అలా యాభయ్యారేళ్ల కాపురంలో మొత్తం యాభై అయిదు వేల డ్రెస్సులు కొన్నాడు తన భార్యకి. వాటిలో కొన్ని మార్గట్ ఇప్పటికీ వేసుకోనే లేదు. అయినా ఇప్పటికీ కొంటూనే ఉన్నాడు. ఎందుకిన్ని కొంటావ్ అంటే... ‘నా భార్య ఎప్పుడూ స్పెషల్‌గా ఉండాలి, బయటకు వెళ్లిన ప్రతిసారీ కొత్త డ్రెస్సులోనే వెళ్లాలి’ అంటున్నాడు లోమిత. భార్యను ప్రేమించేవాళ్లు చాలామంది ఉంటారు కానీ... లోమితలాంటి భర్తలు మాత్రం ఎవరూ ఉండరేమో!
 
 ట్రీట్‌మెంట్ కలిపిన బంధం!
 అమెరికాలోని బెవెర్లీ హిల్స్‌లో ప్లాస్టిక్ సర్జన్‌గా మంచి పేరుంది డేవిడ్ మెట్‌లాక్‌కి. 2007లో అతడి క్లినిక్‌కి వెరోనికా అనే మహిళ వచ్చింది. బిడియంగా, మొహమాటంగా తన సమస్యను వివరించిందామె. డెలివరీ కారణంగా తన శరీరం షేపు లేకుండా పోయిందని, అది తనను చాలా బాధిస్తోందని చెప్పింది. ఆమె అవస్థను అర్థం చేసుకున్నాడు డేవిడ్.. నిన్ను మళ్లీ మామూలుగా చేస్తాను, అందంగా మారుస్తాను అని ఆమెకు మాటిచ్చాడు. చేసి చూపించాడు కూడా!


 కచ్చితమైన ఆహార నియమాలు, క్రమం తప్పని వ్యాయామం, మానసిక ఆనందం వంటివి మనిషిని ఫిట్‌గా ఉంచుతాయని చెప్పే డేవిడ్, వెరోనికాను ఆ విషయాల్లో గైడ్ చేశాడు.   కొన్ని నెలలు గడిచేసరికి తనలో వచ్చిన మార్పుని చూసుకుని మురిసిపోయింది వెరోనికా. అంతలో తన మనసులోని మాట చెప్పాడు డేవిడ్. నిన్ను తొలి చూపులోనే ప్రేమించాను, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. వికారంగా ఉన్నప్పుడు కూడా తనను ప్రేమించిన అతడి గొప్ప మనసుకు ముగ్ధురాలయ్యింది వెరోనికా. ఎలాగూ తాను సింగిల్ మదరే కాబట్టి, ఆనందంగా అతడిని పెళ్లాడింది. ఇప్పటికీ వెరోనికా ట్రీట్‌మెంట్ కొనసాగుతోంది. అయితే ఇప్పుడు డాక్టర్‌గా కాక, భర్తగా ఆమెను తీర్చిదిద్దుతున్నాడు డేవిడ్. తమది ట్రీట్‌మెంట్ కలిపిన బంధమని అందరికీ ఆనందంగా చెప్తున్నాడు!

మరిన్ని వార్తలు