పద్యానవనం: సకలజనరంజనం కర్తవ్యం

15 Jun, 2014 01:02 IST|Sakshi
పద్యానవనం: సకలజనరంజనం కర్తవ్యం

 ‘‘నేనురా తెలగాణ నిగళాలు తెగగొట్టి ఆకాశమంత యెత్తార్చినాను
 నేను రాక్షసి గుండె నీరుగా పద్యాలు పాడి మానవుని కాపాడినాను
 నేను వేస్తంభాల నీడలో నొక తెల్గు తోట నాటి సుమాలు దూసినాను
 నేను పోతన కవీశాను గంటములోని ఒడుపుల కొన్నింటి బడసినాను...’’

 
 ఇదిగో జాబిల్లీ నువ్వు సముద్రం మీద సంతకం చేసేటప్పుడు గాలి దాన్ని చెరిపెయ్యకుండా కాలమే కాపలా కాస్తుందిలే... అంటాడు శ్రీశ్రీ. ‘...మురికి గుడిసెల్లో నివసించే పరమ దరిద్రుల నుదుటి మీద ఏ కన్నంలోంచో జాగా చేసుకొని ఎలాగైనా పరామర్శ చేస్తావు కదూ?’ అని శరచ్చంద్రికను ప్రశ్నిస్తూ, పేదల పక్షం వహించమని పరోక్షంగా అభ్యర్థిస్తాడు మహాకవి.  
 
 నిజమే! కాలం అనేకానేక పరిణామాలకు నిరంతర సాక్షి, ద్రష్ట, కొన్నిసార్లు తీర్పరీ! కాలం కళ్లెదుట జరిగిన పలు పరిణామాల క్రమంలో అంతిమంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఎలా తెచ్చారు? ఎవరు తెచ్చారు? ఎవరి కోసం తెచ్చారు? అంటే, సమాధానాలు తేటమయ్యే క్రమంలోనే ఆ ప్రశ్నలు రోజు రోజుకు మరింత మసకబారి పోతాయి.
 
 చరిత్ర పుటల్లో పదాలు, వాక్యాలు, పంక్తులవుతాయి. వ్యక్తులతో నిమిత్తం లేకుండా చరిత్ర గతిలో పర్యవసానాలే మిగులుతాయి. ఉద్యమ గొప్పతనం ఉద్యమకాలంలో తెలియదు. వ్యక్తులు, జనసమూహాల ఇష్టాయిష్టాల్ని బట్టో, కొంతమంది ఇతరేతర ప్రయోజనాల్ని బట్టో కాకుండా, రేపటి ఫలాలను బట్టే నిన్నటి ఉద్యమం వెనుక సహేతుకత నిర్ధారణ అవుతుంది. శీర్షభాగాన ఉండి ఉద్యమం నడిపిన వారికి, విమర్శించే నాటికన్నా ఆచరించే నాడు బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. పేదరికంతో, వేదనతో, ఇబ్బందులతో అలమటించే ప్రతి మనిషి ఆర్తికి స్పందనై పాలన ప్రతిబింబించాలి.
 
 ఒక బాదుషా కాదని మరో బాదుషాకు కిరీటం తొడగడానికి రాలేదు ఈ కొత్తశకం. ఏలికల  కన్నా ముఖ్యంగా పంట ప్రతి కృశీవలునికి దక్కాలి. అందుకే ప్రజాకవి ఇక్బాల్ అంటాడు, (జిస్ ఖేత్ దహఖుకొమయస్సేర్ నహోరోజీ ఉస్ ఖేత్‌కె హర్ ఖూషయె గందంకో జలాదో) ‘‘యే చేను కృషివలునికి తిండి ఈయదో ఆ చేనులో ప్రతి మొక్కను కాల్చేయండి’’ అని. ‘యద్భావం తద్భవతి’. సత్సంకల్పంతో మొదలెడితే సత్ఫలితాలే లభిస్తాయి. అయితే, ఆచరణలో చిత్తశుద్ధి ఉండాలి. ఇల్లలకగానే పండుగ కాదు.
 
 మహాత్మాగాంధీ చెప్పినట్టు గమ్యం మాత్రమే కాదు, మార్గం కూడా ఉదాత్తమైనదే కావాలి. స్వాతంత్రోద్యమ పథాన ఉన్నపుడు పరవాలేదు, అటువంటి మార్గదర్శకత్వం నిరంతరం లభించేది పండిత్ జవహార్లాల్ నెహ్రూకి. స్వాతంత్రానంతరం ప్రభుత్వ బాధ్యతల్లోకి రావడానికి గాంధీజీ ససేమిరా అన్నారు. భారత ప్రథమ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నెహ్రూకు ఒక గగుర్పాటు కలిగింది. బాపూజీ తోడు అడుగడుగున లభించదు. సాంఘిక అసమానతలు, ఆర్థిక అంతరాలు, భిన్న జాతులు, విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా ఉండే ఇంత పెద్ద దేశాన్ని పాలించడం ఎలా? నిర్ణయాలు తీసుకోవడం ఎలా? ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించి ఎందరెందరో బలిదానాల యజ్ఞ ఫలాల్ని అందరికీ అందించడం ఎలా? చేయగలనా? అన్న శంక వెంటాడుతోంది. వెంటనే గాంధీజీ దగ్గరకు వెళ్లిపోయారు. ‘బాపూ, చెప్పండి ఎలా పాలించాలి, నాకేదో కొంచెం భయంగా ఉంది, ఏదైనా మార్గం నిర్దేశించండి’ అని అడిగినపుడు పూజ్య బాపూజీ స్పందన సర్వకాల సర్వావస్థల యందూ గొప్ప మార్గనిర్దేశనమే!
 
 గాంధీజీ వెంటనే తన ముందు దస్త్రాల్లోంచి... దీన వదనంతో, ఎముకల గూడులాగున్న బక్క, నిరుపేద సామాన్యుడి ఫోటో ఒకటి తీసి, ‘‘చాచా! ఆందోళన పడొద్దు. ఇదుగో ఈ ఫొటోను నీ టేబుల్‌పై ఉంచుకో, దేశ పథనిర్దేశకుడిగా నీవు విధానపరమైన ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా ఒకసారి ఈ ఫొటో వంక చూడు తదేకంగా! సదరు నిర్ణయం ఏ కొంచెమైనా ఇతని ఉన్నతికి తోడ్పడుతుందా? అని ఆలోచించు. అవుననిపిస్తే నిస్సందేహంగా నిర్ణయం తీసేసుకో’ అని సలహా ఇచ్చారు. ఆ స్పృహ ఇప్పుడు కావాలి. పాలకులకు ఆ సోయి ఉండాలి. ఈన గాచి నక్కల పాల్జేసిన గతి పట్టించకుండా అప్రమత్తమై మెలగాలి.
 
 బహుముఖీయ భావనై ఈ పద్యంలో మహాకవి దాశరథి పేర్కొన్నట్టు అందరూ కత్తులు దూయరు. ఉద్యమ వాకిట్లో వనాలు నాటి సుమాలు దూసినవారు ఎందరో! పాటై పల్లవించిన వారు, పద్యమై విజృంభించినవారు, పరపాలనా శృంఖలాలు తెగ్గొట్టినవాళ్లు, ఆకాశం ఎత్తైఆర్చినవారు, సకల జనులై సమ్మెకట్టిన వాళ్లు, ఆశతో-నిరాశతో ఆవిరైన వాళ్లు... ఇలా ఎందరెందరో. వారందరి ఆశయాల ఫలాల్ని వారసులకు, వాటాదారులకు, వాస్తవ హక్కుదారులకు దఖలు పరచాలి. సకలజనరంజన తక్షణ కర్తవ్యం.
 - దిలీప్‌రెడ్డి

మరిన్ని వార్తలు