తపాలా: వాన - వర్షం

15 Jun, 2014 01:48 IST|Sakshi

హైదరాబాద్ నుండి సెలవులకు నేనున్న పల్లెటూరికి మనుమలు, మనుమరాళ్లు వచ్చారు. ఓ శనివారం సాయంత్రం మనుమరాళ్లు లాలి, రీమాను తీసుకుని, కృష్ణ మందిరానికి వచ్చాం. అందరం దర్శనం చేసుకొని, తీర్థం తీసుకుని, మెట్లమీద కూర్చున్నాం. అక్కడ చెట్లమీద పక్షుల కిలకిల రావాలు, వాటి చిత్రమైన ఎగరడాలు విచిత్రంగా చూస్తున్నారు లాలి, రీమా. ఉన్నట్లుండి మబ్బులు దట్టంగా వేసి జోరు వాన ఎత్తుకుంది. పిల్లలను గుడి లోపలికి తీసుకొచ్చాం. అందులో ఒక మనుమరాలు, ‘నానమ్మా! చూడు. ఎంత పెద్ద వర్షమో’ అని వేలు పెట్టి చూపించింది. ఇంకొక మనుమరాలు ‘వర్షం కాదు వాన ఎక్కువగా వస్తుంది. ఇంటికెలా వెళ్తాము’ అని ప్రశ్నించింది.
 
నేను కళ్లు మూసుకుని గోవింద నామాలు చెప్పుకుంటూ కృష్ణుణ్ని తలుచుకుంటున్నాను. లాలి, రీమా వర్షం కాదు వాన, వాన కాదు వర్షం అని వాదులాడుకుంటున్నారు. అక్కడ కూర్చున్న భక్తులు నవ్వుకుంటున్నారు. నాకేమీ పాలుపోవటం లేదు. వీళ్లకు ఎలా సమాధానం చెప్పాలి అని కృష్ణుణ్ని తలుచుకున్నాను. లాలి, రీమాలను తీసుకుని, గుడి లోపలికి వెళ్లి కృష్ణుణ్ని చూపించి, ఏ దేవుడు అని అడిగాను.
 
 ఇద్దరూ కృష్ణుడు అని టకీమని జవాబు చెప్పారు. వాళ్లను బయటకు తీసుకొచ్చి, చెట్టుకింద ఉన్న కృష్ణుడి బొమ్మను చూపి ఎవరని అడిగాను. కృష్ణుడే అని అరిచారు. చూశారా అక్కడ ఇక్కడ కృష్ణుడు ఒకటే కదా, అలాగే వర్షం అన్నా వాన అన్నా ఒకటే అని చెప్పాను.
 భలే భలే వర్షం వాన అని ఎగిరారు పిల్లలు. భలే చెప్పారు బామ్మగారు అన్నారు అక్కడ ఉన్న భక్తులు. వర్షం ఆగిపోయింది. చెరొక పక్క ఇద్దర్నీ పట్టుకుని, ఇంటికి బయల్దేరాను నేను.
 - నల్లక పద్మావతి, గూడూరు
 
 ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు,  మీ ఊరు విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి.  మా చిరునామా: తపాలా, ఫన్‌డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1,  రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34.  funday.sakshi@gmail.com

మరిన్ని వార్తలు