నిదురంతటి సుఖమైన పాట

28 Mar, 2015 21:55 IST|Sakshi
నిదురంతటి సుఖమైన పాట

చిత్రం : రాజమకుటం (1960)
 గీతం : సడిసేయకో గాలి
 రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
 సంగీతం : మాస్టర్ వేణు
 గానం : పి.లీల
 
 నా పాట నాతో మాట్లాడుతుంది
 నాతో కృష్ణశాస్త్రి పాట మాటాడింది.
 ‘‘ఇదిగో ఎవరూ మాటాడేది?’’
 ‘‘నేను సుద్దాల అశోక్‌తేజ. హలో’’
 ‘‘నేను కృష్ణశాస్త్రి పాటను.’’
 ‘‘ఓహో, ‘ఇదిగో’ ఏంటి ఫోన్లో?’’
 ‘‘నేను ఆంగ్లంలో హలో అనను. ఇదిగో అనే అంటాను. అవునూ కొసరాజు పిదప కృష్ణశాస్త్రి కదా! మధ్యలో నువు దూరావేంటి గతాదివారం?’’
 ‘‘నా పాటతోనేకదమ్మా ఈ శీర్షిక ఆరంభమైంది’’. కృష్ణశాస్త్రి పాట మాటాడే పద్ధతి చూసి నాకు అచ్చ తెనుగే వస్తుంది...
 ‘‘అశోక్‌తేజా, నా పాటల తండ్రి చలన చిత్రాలకు పాటలు రాయకమునుపే మహాకవి. మహా మహా ప్రస్థాన మహాకవులకే గురుతుల్యులు. ఆయన మనసు ‘‘వెన్న బంగారు లోకం’’. ఆ లోకంలో నింగి సంస్కృతం, నేల తెనుగు తెలుసా?’’
 ‘‘చెప్పు తల్లి’’
 ‘‘మాట మనిషి - పాట పక్షి అన్న మాట విన్నావా?’’
 ‘‘విన్నానమ్మా. కృష్ణశాస్త్రి. పట్నం తెమ్మంటుంది, పల్లె రమ్మంటుంది అన్నది కూడా ఆయనే కదా! బాపు ‘సంపూర్ణ రామాయణం’లో ‘అసలే ఆనదు చూపు - ఆపై ఈ కన్నీరు తీరా దయ చేసిన నీరూపు తోచదయ్యయ్యో’ అని చత్వారంతో నీరునిండిన శబరి కళ్లతో పాట అల్లి శబరి హృదయంలోకి తను వెళ్ల లేదూ!  తన హృదయాన్ని శబరిగా మలచి రాసిన పాట కూడా తెలుసు, ఇంతకీ తమరెవరు?’’
 ‘‘నేనూ... ‘రాజమకుటం’లో ‘సడిసేయకోగాలి’ని...’’ సిగ్గుపడుతూ అంది, ఫోనులో కూడా చెవికి తను సిగ్గరి అని తెలుస్తుంది. కృష్ణశాస్త్రి పాటమ్మాయ్ మరి! నా గుండె గొంతుకలోకి వచ్చి పొలమారినట్టయి ‘‘ఓ వండర్‌ఫుల్’’ అన్నాను. ‘‘మధ్యలో వండర్ ఫులెందుకు? అద్భుతమో, అపురూపమో, అపూర్వమో అనలేవూ’’ అంది లలితరమ్యంగా నా బుగ్గ గిల్లుతూ, బుద్ధి గరపుతున్నట్టూ. మన్నించు పాటా!
 ‘‘అపురూపమైన పాటవి, అపూర్వం కాదు’’
 
 ‘‘ఏం... ఎందుకూ’’?
 ‘‘నీవు పుట్టకన్నా పూర్వం... మల్లీశ్వరిలో మనసున ఊగించిన మల్లెల మాలలు - ఎగిసిన హృదయమును  పగులనీయకు అన్నవి కదా! అందుకే నీవు అపురూపమే కానీ అపూర్వం కాదుగా’’ అన్నాను.
 ‘‘గడుసరివే’’ ‘‘నేనూ కవికోవలోని కోవిలనే కదా’’ అన్నాను పాటల తండ్రి కృష్ణశాస్త్రి సంభాషణా సరళి అనుకరిస్తూ, అనుసరిస్తూ. ‘‘చెప్పు నీ జన్మరహస్యం....
 
 ‘‘ఆరోజేమైందంటే... రాజమకుటం - దర్శకులు బి.ఎన్.రెడ్డి. పాట సన్నివేశం చెప్పారు. అలసిసొలసిన కథానాయకుడు ఎన్టీఆర్‌ను నాయిక తన ఒళ్లో పడుకోబెట్టుకొని సేదదీర్చాలి. ఎలా మొదలెట్టనూ అనుకుంటూ నా కోసం వెదుకుతున్నారు తన గదిలో నా తండ్రి. అంతలో చిన్నగాలి వీచి కిటికీల తలుపులు టపటపా కొట్టుకుంటున్నాయి. లేచి తలుపులు మూసి కూచున్నారు కృష్ణశాస్త్రి. మళ్లీ నాకోసం అన్వేషణ. ఇంతలో మళ్లీ గాలి - తలుపులు టపటపా చప్పుడు... అప్పుడు... ‘సడిసేయకే గాలి - నే పాట రాసుకోవాలి’ అని స్వగతంగా అన్నాడు. అంతే తటాలున తన ముందు నిలిచి... ఇదే పల్లవి తండ్రి అన్నా.
 సడిసేయకోగాలి సడిసేయబోకే... బడలి ఒడిలో రాజు పవళించేనే... పల్లవి పూర్తయింది.
 
 రత్నపీఠికలు, మణికిరీటములు లేకుంటే ఏమీ? చిలిపి పరుగు ఆపి నా రాజును సుకుమారంగా కొలిచి పోరాదే అనిపించాడు. నా రాజు ఎంత సుకుమారుడంటే ఆకు కదలికలకూ, ఏటి గలగలలకూ నిదురలేస్తాడు. నిద్ర అని సంయుక్తాక్షరం రాయటానికి కూడా కృష్ణశాస్త్రి ఇష్టపడడు. నిదుర అనే రాస్తాడు. ఇక్కడ కవి - సినిమా నాయకుడికన్నా సుకుమారుడే. అందుకే ‘నీ వల్ల నిదుర చెదిరిందో నేను ఊరుకోను సుమా!’ అని గాలిని... ఆ రాజసులోచన ద్వారా బెదిరిస్తాడు.

ఈ ఆలోచన - ఈ సుందర ఆలాపన... కృష్ణశాస్త్రికే వస్తుంది.‘పండువెన్నెలను’ పడుకునే పాన్పు చేయరాదా అనటం... పానుపు మెత్తదనం వెన్నెలంత అని... తెనుగు తీపి తెలిసిన తేనెల జాబిల్లి దేవులపల్లి కనుకనే అలా రాయగలిగాడు, సరేనా! మూగగా మారిన నా తండ్రి రాగ గొంతుకే నా పండువెన్నెల పానుపు! వస్తా...’’ అంటు ఫోన్ పెట్టేసింది కృష్ణశాస్త్రి పాటలాధరి- పాట!
 - డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత

మరిన్ని వార్తలు