సంగ్రామం : యుద్ధభూమిలో ఒలికిన సిరా!

2 Mar, 2014 01:06 IST|Sakshi
సంగ్రామం : యుద్ధభూమిలో ఒలికిన సిరా!

 కలం... మెదడుకి నాలుక వంటిదంటాడో ప్రాచీన రోమన్ కవి. కానీ తన కంటె తుపాకీ గొప్పదని మెదళ్లు భావిస్తే...? కలం ఆ తుపాకీకే నాలుకగా మారిపోగలదు. మొదటి ప్రపంచ యుద్ధం వేళ జరిగింది ఇదే. ఫలితం- కలం సైనిక భాషను నింపుకుంది. యుద్ధ దేవతను ఆవాహన చేసింది.
 

 సామాజిక సంఘర్షణలలో, అంతర్యుద్ధాలలో కవులూ, మేధావులూ బాధితుల వైపు నిలబడడం సహజ పరిణామం. కానీ సామ్రాజ్యాల మధ్య రగడ మీద, పాలక వంశాల నడుమ కక్షల మీద కవులూ రచయితలూ భ్రమలు పెంచుకోవడం ఆ కాలానికి సంక్రమించిన అంధత్వానికి గుర్తు.


 మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ చేసిన తొలి దాడి బెల్జియం(ఆగస్టు 4,1914) మీదే. యుద్ధ క్రీడ మరింత వికృతం కాబోతోందని ఆ దాడి సంకేతించింది. స్త్రీ, బాల, వృద్ధ గణాలను యుద్ధ బాధకు దూరంగా ఉంచాలని పాత నీతి. కానీ వయో భేదం లేకుండా జాతిలో ప్రతి ఒక్కరినీ యుద్ధంతో మమేకం చేయాలన్న దుగ్ధ మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఐరోపా దేశాలలో కనిపిస్తుంది.
 
 యుద్ధం మొదలయ్యే వేళకే జర్మనీలో ఒక యుద్ధ ప్రచార విభాగం చురుకుగా పని చేస్తున్నదన్న సంగతి ఇంగ్లండ్‌కు తెలిసింది. వెంటనే ఆర్థిక కార్యదర్శి డేవిడ్ లాయిడ్ జార్జి... ఇలాంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసే పనిని లిబరల్ పార్టీ పార్లమెంటు సభ్యుడు, పెద్ద పత్రికా రచయిత చార్లెస్ మాస్టర్మన్ (1873-1927)కు అప్పగించాడు. లండన్‌లోని వెల్లింగ్డన్ హౌస్ కేంద్రంగా మాస్టర్మన్ సెప్టెంబర్ 2,1914న తన పని ప్రారంభించాడు. ఇంగ్లండ్‌కు గొప్ప సారస్వత వారసత్వం ఉంది. జర్మనీకి విస్తారమైన జానపద, పురాణ సంపద ఉంది. వాటిని ఆ రెండు దేశాలూ ఉపయోగించుకున్నాయి. నిజానికి జర్మనీకి యుద్ధ ప్రచారం అవసరం లేదు. సైన్యంలో పనిచేయడం అక్కడి పౌరులందరి విధి. యాభయ్ సంవత్సరాలు నిండే లోపున ప్రతి పౌరుడు యుద్ధంలో ఏదో ఒక కాలంలో కనీసం మూడేళ్లు పని చేయాలి.
 
  యుద్ధం ఆ దేశానికి ఒక కుటీర పరిశ్రమ. అయినా డ్రాగన్, రెక్కల గుర్రం వంటి పురాణ ప్రతీకలను ఉపయోగించుకుని జర్మనీ కూడా పెద్ద ఎత్తున యుద్ధ ప్రచారం చేసింది. దీనికి తోడు సంచార సినిమాలతో విస్త్రతంగా ప్రచారం చేసింది. విదేశాలలో, ముఖ్యంగా అమెరికా, కెనడాలలో ఉన్న జర్మన్లు గూఢచర్యం ద్వారా దేశానికి సాయపడాలని భావించారు.
 
 బ్రిటన్‌లో యుద్ధ ప్రచార విభాగం ఏర్పాటు చేశాక మాస్టర్మన్ చేసిన మొదటి పని - ఇరవై అయిదుగురు  ఇంగ్లిష్  రచయితలతో ఒక సమావేశం నిర్వహించడం. నాడూ నేడూ కూడా ప్రపంచ సాహిత్యం మహనీయులుగా పరిగణిస్తున్న ఉద్దండులు- రడ్యార్డ్ కిప్లింగ్ (1865-1936), సోమర్‌సెట్ మామ్ (1874-1965), ఆర్థర్ కానన్ డాయ్ల్ (1859-1930), హెచ్‌జీ వెల్స్ (1866-1946), జీకే చెస్టర్సన్ (1874-1936), జీఎం ట్రెవీలియన్ (1876-1962), విలియం ఆర్చర్ (1856-1924), హెచ్‌జే న్యూబాల్ట్ (1862-1938), జాన్ మేస్‌ఫీల్డ్ (1878-1967), ఫోర్డ్ మ్యాడాక్స్ ఫోర్డ్ (1873-1939), జాన్ గాల్స్‌వర్థీ (1867-1933), ఆర్నాల్డ్ బెనెట్ (1867-1931), గిల్బెర్ట్ పార్కర్ (1862-1932) వంటివారు మాస్టర్మన్ పిలుపును మన్నించినవారే.  
 వీరిలో కిప్లింగ్ ముంబైలోనే పుట్టాడు. ఆయన ‘జంగిల్‌బుక్’ ఇప్పటికీ హాట్‌కేక్. భారతీయ సమాజం నేపథ్యంగా ఎన్నో రచనలు చేశాడు. 1906లో సాహిత్యంలో నోబెల్ బహుమానం స్వీకరించాడు. తరువాత గాల్స్‌వర్థీకి (1932) ఆ పురస్కారం వచ్చింది. విలియం ఆర్చర్ గురించి కూడా చెప్పుకోవాలి. నార్వేజియన్ మహా రచయిత హెన్రిక్ ఇబ్సన్‌ను ఇంగ్లిష్‌వారికి పరిచయం చేసిన ఘనత ఆర్చర్‌దే.
 
  ‘ఎడింబరో ఈవెనింగ్ న్యూస్’ పత్రికకు సంపాదకీయాలు రాసిన ఆర్చర్, ఇబ్సన్ ప్రపంచ ప్రఖ్యాత నాటకం ‘ఎ డాల్స్ హౌస్’ను ఇంగ్లిష్‌లోకి అనువదించాడు. ఇబ్సన్  ఇతర రచనలు ‘ద పిల్లర్స్ ఆఫ్ సొసైటీ’, ‘ద మాస్టర్ బిల్డర్’ వంటి రచనలను కూడా ఆంగ్లంలోకి అనువదించాడు. ట్రెవీలియన్ ప్రధానంగా చరిత్రకారుడు. రచయిత కూడా. యుద్ధాన్నీ, యుద్ధంలో ఇంగ్లండ్ పాత్రనీ సమర్థిస్తూ వీరు చేసిన రచనలను హాడర్ అండ్ స్టౌటన్, మెథూయున్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, జాన్ ముర్రే, మేక్మిలన్, థామస్ నెల్సన్ సంస్థలు అచ్చువేసేవి. అప్పటికే ఐరోపాలో ఎంతో ఖ్యాతి గాంచిన చిత్రకారుడు, డచ్ దేశీయుడు లూయీస్ మేయీకర్ ఈ రచనలకు బొమ్మలు వేసేవాడు. 1918 వరకు వీరు మొత్తం 1160 రచనలు చేశారు.
 
 బ్రిటిష్ వార్ ప్రోపగాండా బ్యూరో తన తొలి పత్రాన్ని 1915 ఆరంభంలో వెలువరించింది. ఇది బెల్జియంలో జర్మనీ చేసినట్టు చెబుతున్న అత్యాచారాల గురించి వివరించింది. ‘ఆయుధం ఎత్తు!’ (ఆర్థర్ కానన్ డాయ్ల్), ‘బెర్లిన్‌లో పైశాచకత్వం’ (చెస్టర్సన్), ‘కొత్త సైన్యం’ (కిప్లింగ్), ‘నెత్తురే వాళ్ల వాదన అయినప్పుడు!’(ఫోర్డ్ మాడాక్స్ ఫోర్డ్) వంటి కరపత్రాలు అప్పుడు వచ్చాయి.
 
 రచయితలతో పాటు బ్రిటిష్ కళాకారులు కూడా మొదటి ప్రపంచ యుద్ధంలో కీలక పాత్ర పోషించారు. వీరి సేవలు యుద్ధంలో ఉపయోగించుకోవడానికి ఏర్పడినదే ఆర్టిస్ట్స్ రైఫిల్.1859లో ఈ దళం ఏర్పాటు యోచనకు బీజం పడింది. మూడో నెపోలియన్ దండెత్తితే జాతికి చెందిన కళాకారులు సయితం ఎదురొడ్డి నిలవాలన్న నినాదంతో ఆవిర్భవించింది.
 
  మొదటి ప్రపంచ యుద్ధకాలానికి బాగా విస్తరించింది. మార్స్ (యుద్ధ దేవత), మినర్వా (జ్ఞానదేవత) తలలతో ఈ దళం ఒక ముద్రికను తయారు చేసుకుంది. 1900 సంవత్సరానికి ఈ దళ ం 12 కంపెనీలుగా విస్తరించింది. తొలి సంవత్సరాలలో ఎక్కువగా చిత్రకారులు, శిల్పులు, ఎన్‌గ్రేవర్స్, వాస్తు శిల్పులు, నటులు, సంగీత విద్వాంసులు ఉండేవారు. విలియం మోరిస్, ల్యూక్ ఫీల్డెస్, చార్లెస్ కీనే, జాన్ లీచ్, అల్ఫ్రెడ్ లీటే (గ్రాఫిక్స్ డిజైనర్) వంటివారు ఈ దళం తరఫున యుద్ధం చేశారు. పాల్ నాష్, జాన్ నాష్, వింథామ్ రాబిన్సన్, యూజిన్ బెనెట్ కూడా ఈ దళంలోనే పని చేశారు. వీళ్లు ఎక్కువగా శిక్షణ కేంద్రాలలో ఉండేవారు. తేలిక పాటి ఆయుధాలను ఉపయోగించడంలో శిక్షణ పొందేవారు. ‘బ్రిటన్ నిన్ను పిలుస్తోంది!’ అంటూ యుద్ధ కార్యదర్శి కిష్నర్ బొమ్మతో రూపొందించిన ప్రఖ్యాత వాల్‌పోస్టర్‌ను రూపొందించిన వాడే అల్ఫ్రెడ్ ఆంబ్రోస్ షూ లీటే (1882-1933). ఆర్టిస్ట్స్ రైఫిల్స్ దళంలో మొదటి ప్రపంచ యుద్ధం సమయానికి 15,022 మంది అధికారుల స్థాయి వారు ఉండేవారు. వీరిలో 2,003 మంది ఆ యుద్ధంలో చనిపోయారు. అంటే అంతమంది కళాకారులు యుద్ధంలో కన్నుమూశారు.
 
 గ్రేట్‌వార్‌లో చెప్పుకోదగిన మరొక విభాగం- సాహిత్యవేత్తలతో ఏర్పడిన అంబులెన్స్ డ్రైవర్ల దళం. అప్పటికీ, అనంతర కాలాలలో ప్రపంచ ప్రఖ్యాతులైన రచయితలంతా పని చేసిన దళమిదే. ఎర్నెస్ట్ హెమింగ్వే, జాన్ దాస్ పాసోస్, ఇఇ కమ్మింగ్స్, వాల్ డిస్నీ వంటివారు ఈ దళంలో చేరారు. వయసు తక్కువ కావడం, లేదా వయసు మీరడం, ఇతర లోపాల వల్ల సైన్యానికి ఎంపిక కాలేకపోయిన వారే ఇందులో ఎక్కువ. ఇలాంటి వారు దాదాపు 23 మంది. జ్టైడ్ స్టీన్, ఈఎం ఫ్రాస్టర్ కూడా ఇందులో ఉన్నారు. విద్యావంతులు, రచయితలు ఇలా డ్రైవర్లుగా పాల్గొనడం రష్యా-జపాన్ యుద్ధం (1905)లో కనిపిస్తుంది.హెమింగ్వే, వాల్ట్ డి స్నీ అమెరికా రెడ్ క్రాస్ తరఫున పాల్గొన్నారు. ప్రచార విభాగంలో ఉన్నప్పటికీ యుద్ధరంగంలో ప్రత్యక్షంగా పాల్గొన దలిచిన వారు కూడా అంబులెన్స్ డ్రైవర్లుగా పని చేశారు. అందుకు ఉదాహరణ- జీఎం ట్రెవీలియన్. ఎన్నో హాస్య రచనలు చేసిన మామ్ సైనికునిగా ఎంపిక కాలేకపోయాడు. కారణం - అప్పటికి ఆయన వయసు నలభయ్ సంవత్సరాలు. దానితో అంబులెన్స్ డ్రైవర్‌గా యుద్ధరంగంలో ప్రత్యక్షమయ్యాడు.
 
 చిత్రంగా యుద్ధ ప్రచార విభాగంలో పని చేసిన మహా రచయితల పేర్లు రహస్యంగా ఉంచారు. 1935 తరువాత గానీ ఈ సంగతి వెలుగు చూడలేదు. యుద్ధం ముగిశాక వాళ్లలో వచ్చిన మార్పు, జీవితాల మీద అది వేసిన ముద్ర, వాళ్ల కుటుంబాలకు పంచిన విషాదం మళ్లీ ఓ పెద్ద గ్రంథం.
 - డా॥నారాయణరావు
 
 
 

మరిన్ని వార్తలు