విశ్లేషణం: పవర్... రెబల్... జీనియస్!

9 Mar, 2014 00:53 IST|Sakshi
విశ్లేషణం: పవర్... రెబల్... జీనియస్!

 జూనియర్ టెన్నిస్‌లో ఆడలేదు, అయినా సీనియర్ టెన్నిస్‌లో సంచలనాలు సృష్టించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 32 మెడల్స్ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్, వింబుల్డన్, ఒలింపిక్స్... మైదానం ఏదైనా తనకు ఎదురేలేదని నిరూపించింది... ఆరుసార్లు వరల్డ్ నంబర్ వన్‌గా నిలిచింది... ఆమే నల్లజాతి వజ్రం సెరెనా విలియమ్స్.
 
 తండ్రి తయారుచేసిన స్టార్
 సెరెనా తండ్రి రిచర్డ్స్ విలియమ్స్ తన బిడ్డల్ని టెన్నిస్ సూపర్‌స్టార్స్‌గా తయారు చేస్తానని ముందే ప్రకటించాడు. దానికి తగ్గట్టుగా నాలుగేళ్లనుంచే వారికి ప్రత్యేక శిక్షణనిచ్చాడు. ఆయనే చీఫ్ కోచ్. జాత్యోహంకార వ్యాఖ్యలు చేస్తున్నారని సెరెనా, వీనస్‌లను జూనియర్ టెన్నిస్‌లో ఆడించలేదు. స్టార్స్ పుట్టరు, తయారవుతారని నిరూపించాడు. అందుకే సెరెనా వ్యక్తిత్వంలోకూడా ఈ తిరుగుబాటు ధోరణి కనిపిస్తుంది. ఆమె సంప్రదాయ మహిళా టెన్నిస్ క్రీడాకారిణుల్లా కనిపించదు. మెలితిరిగిన కండలతో పురుష క్రీడాకారులకు పోటీనిస్తుంది. బంతిని బలంగా బాది ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తుంది.  సంప్రదాయానికి భిన్నంగా ఉండే దుస్తులు ధరించి అందరికీ షాక్ ఇస్తుంది.
 
 మేలు కలయిక
 సెరెనా మనసారా నవ్వుతూ, గలగలా ఎదుటివారివైపు నేరుగా చూస్తూ మాట్లాడేస్తుంది. మాటలకు, చేతుల కదలికలకు మధ్య సమన్వయం ఉంటుంది.  మాట్లాడేటప్పుడు తల పెకైత్తి చూస్తుంది. అప్పుడప్పుడూ తల వంచుకుంటుంది. ముఖ్యంగా ఆట గురించి మాట్లాడేటప్పుడు తల పెకైత్తి చూడటం, వ్యక్తిగత విషయాలు ప్రస్తావించేటప్పుడు కిందకు చూస్తూ మాట్లాడటం గమనించవచ్చు. వీటిని బట్టి సెరెనా విజువల్, ఆడిటరీ, కెనైస్థటిక్ వ్యక్తిత్వాలు మిశ్రీతమైన వ్యక్తిగా చెప్పవచ్చు. ఇలాంటి మిశ్రీత వ్యక్తిత్వం చాలా అరుదుగా కనిపిస్తుంది. రెండు కాళ్లు దగ్గరగా పెట్టి కూర్చోవడం... ఆమె పద్ధతిగా ఉంటుందని చెబు తుంది. అలాగే హస్తాలు తనవైపుకు ఉంచుకుని వాటిని తిప్పేస్తూ మాట్లాడటం తాను చెప్పేది వాస్తవమేనన్న నమ్మకాన్ని కల్పించే ప్రయత్నాన్ని వెల్లడిస్తుంది. ఆమె మాటల్లో ప్రతిబంధకాలకన్నా అవకాశాలకు సంబంధించిన పదాలు ఎక్కువగా వినిపిస్తాయి. చిన్నప్పుడు తాను పొట్టిగా ఉండటంవల్ల పెద్దవాళ్లతో ఆడేటప్పుడు వారిని సమర్థంగా ఎదుర్కోవడం కోసం జంప్ చేస్తూ ఆడేదాన్నని, అదే పెద్దయ్యాక కూడా అలవాటుగా మారిందని చెప్పడంలో... బలహీనతలను బలాలుగా మార్చుకునే సానుకూల దృక్పథం, పరిమితులను అధిగమించాలన్న తపన కనిపిస్తాయి.
 
 పవర్‌స్టార్

 అప్పటివరకు మహిళా టెన్నిస్‌లో టెక్నిక్‌కు ప్రాధాన్యం ఉండగా విలియమ్స్ సిస్టర్స్ పవర్ గేమ్‌తో ఆటతీరే మారిపోయింది. దీనికితోడు సెరెనా పర్‌ఫెక్షనిస్ట్. తను కొట్టే ప్రతి షాటూ పర్ఫెక్టుగా ఉండాలనుకుంటుంది. శరీరసౌష్టవపరంగా సెరెనా పురుషులకు దీటుగా కనిపించినా మానసికంగా ఆమె ఓ అందమైన యువతిగానే ఉంటుంది. అందాన్ని మరింత అందంగా చూపించే దుస్తులు ధరిస్తుంది. ఇందులో కొంత ఎగ్జిబిషనిజం లక్షణాలు కనిపిస్తాయి. తనలో నలుగురు అమ్మాయిలున్నారని చెప్తుంది... అపరిచితుడు సినిమాలోలా. ఆ నలుగురికీ సమ్మర్, మేగన్, సెరెనా, లాక్వడా అని పేర్లు కూడా పెట్టుకుంది. అలాగని ఆమెకు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందని చెప్పలేం. ఎందుకంటే ఆ లక్షణాలేవీ ఆమె ప్రవర్తనలోకానీ, ఆటలో కానీ కనిపించవు. మొత్తంగా చెప్పాలంటే సంప్రదాయాలను ధిక్కరించి కొత్తబాట నిర్మించిన టెన్నిస్ జీనియస్ సెరెనా!
 - విశేష్, సైకాలజిస్ట్
 
 
 

మరిన్ని వార్తలు