సుమోలు పేలాయి కాబట్టే బతికి బట్ట కట్టాను!

15 Dec, 2013 02:04 IST|Sakshi
సుమోలు పేలాయి కాబట్టే బతికి బట్ట కట్టాను!

 తొలియత్నం

 ముసిరిన చీకట్ల దగ్గరే ఆగిపోయేది కాలమే కాదు.
 కమ్మిన మబ్బుల్ని చూసి కుంగిపోయేది వెలుగే కాదు.
 పైన కప్పుకున్న నివురును చూసి నీరసపడేది నిప్పే కాదు.
 చిన్న చిన్న దెబ్బలకు చితికిపోయేది అసలు జీవితమే కాదు.


 ఈ ఎరుక ఉంది కాబట్టే జీవితంలోను, దానితో ముడివేసుకున్న సినీ ప్రయాణంలోను ఎదురైన సవాళ్లకు వినాయక్ ఎప్పుడూ లొంగలేదు. అపజయాల్ని విలువైన అనుభవాలుగా మార్చుకుని గాయాల్ని విలువైన పాఠాలుగా మల్చుకుని సినీ ప్రస్థానం సాగిస్తున్న వి.వి.వినాయక్ తన గమనంలో మొదటి అడుగు ‘ఆది’ జ్ఞాపకాల్ని ఒకసారి గుర్తుచేసుకుంటున్నారు.
 
 సినిమాకు ప్రాణం లాంటి సీన్ అది. అంతా సిద్ధం చేసుకున్నాక, పర్మిషన్ లేదంటే ఎలా. నెమ్మదిగా మెదడు మొద్దుబారడం ప్రారంభించింది. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాని స్థితి. ప్రయాణంలో ఒంటరివాడినయ్యానన్న బాధతో ఒక్కసారిగా దుఃఖం కమ్ముకొచ్చేసింది. అప్పుడొచ్చాడు తను. నా భుజం మీద చేయి వేసి ధైర్యం చెప్పాడు. గమ్యం చేరేదాకా ఆ ధైర్యం అలాగే నిలిపాడతను. అతను సినిమానే కాదు, నా నమ్మకాన్నీ నిలబెట్టి హీరో.
 
 అసిస్టెంట్ డెరైక్టర్‌గా ఉన్నప్పుడు ఒక చిన్న ప్రేమకథ నా మనసును తట్టింది. దాన్ని ఎన్టీఆర్‌కు వినిపించాను. తనకు బాగా నచ్చింది. సినిమా చేద్దామనుకున్నాం. ప్రేమ కథ వద్దు, మాస్ కథ అయితే ఎన్టీఆర్‌కి సరిపోతుందన్నాడు నాని. వచ్చిన అవకాశం చేజారిపోతుందేమోనన్న భయం కలిగింది నాకు. మాస్ కథ అంటే ఎలా ఉండాలి, ఎన్టీఆర్‌ను ఎలా చూపించాలి అని ఆలోచించా. మాస్ పాత్రలంటే నందమూరి ఫ్యామిలీకి గాలి పీల్చినంత సులువు. అప్పటికే ఫ్యాక్షన్ సినిమాలు తెలుగు తెరపై కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అలాంటి సినిమా చేయాలనుకున్నా. ఎప్పుడో నా దగ్గర రాసుకున్న రెండు సీన్లు గుర్తుకువచ్చాయి. ఒక పోలీసాఫీసర్ ఇంటిపై శత్రువులు బాంబులు వేసి, కుటుంబాన్ని చంపేస్తారు. బాల హీరో ఒక బాంబ్ విలన్ల మీదకు విసిరి పారిపోతాడు. ఇది మొదటి సీన్. రెండో సీన్ ఏంటంటే, విలన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి పోలీస్ జీప్ పేల్చేస్తాడు. హీరో వెంటనే విలన్ వెహికల్ పేల్చేస్తాడు. రూమ్‌లో కూర్చుని కథ రాయడం మొదలుపెట్టాను. ఒక్కోసారి పొద్దున్నే లేచి మొహం కడగకుండా సీన్స్ రాసేవాణ్ని. పూర్తయ్యాక ఎన్టీఆర్‌కి, బెల్లంకొండ సురేశ్‌కు వినిపిస్తే, వాళ్లకు బాగా నచ్చింది. షూటింగ్ మొదలుపెట్టాం. అంతా బాగానే జరుగుతుందనుకున్నప్పుడు జరిగిన ఒక సంఘటన మరచిపోలేని అనుభవాన్నిచ్చింది.
 
 హీరో విలన్ ఇంటి నుంచి బయటికి వచ్చేటప్పుడు వరుస సుమోలు పేలే దృశ్యాన్ని కోరుకొండ సైనిక్ స్కూల్లో తీయడానికి ప్లాన్ చేసుకున్నాం. సరిగ్గా ఉదయం ఏడు గంటలకు సీన్ మొదలుపెట్టేముందు, స్కూల్ ప్రిన్సిపాల్ వచ్చి ఇక్కడ షూట్ చేయడం కుదరదన్నాడు. ఒక్కసారి షాక్ తిన్నాను. సినిమాకు, నా కెరీర్‌కు ఇది చాలా ముఖ్యమైన సీన్. ముందు నుంచే దీన్ని ఎలా తీయాలనే విషయంపై చాలా వర్క్ చేశాను. దానికోసం బాంబే నుంచి టెక్నీషియన్లను రప్పించాం. ఫైట్‌మాస్టర్ విక్రమ్‌ధర్మాను పిలిపించాం. అయిదు కెమెరాలు సెటప్ చేశాం. ఇప్పుడు సడన్‌గా పర్మిషన్ లేదంటే ఎలా. మెదడు మొద్దుబారిపోతోంది. విక్రమ్ ధర్మా దగ్గరకు వెళ్లి, ప్రిన్సిపాల్‌తో మాట్లాడటానికి రమ్మని అడిగాను.
 
  అది నా పని కాదని మొహం మీద చెప్పేశాడతను. అతని రియాక్షన్‌కు ఒక్కసారిగా షాక్ తిన్నాను. అంతలో ఎన్టీఆర్ వచ్చి నా భుజం మీద చేయి వేసి ధైర్యం చెప్పాడు. నాతో పాటు ప్రిన్సిపాల్ రూమ్‌కి వచ్చాడు. ప్రిన్సిపాల్‌కు తెలుగు రాదు. ఎన్టీఆర్ ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడతాడు. మొదట హీరో కారు పేలుస్తాం. దానివల్ల ఎలాంటి డ్యామేజ్ జరగకుంటే మిగతా వాటికి పర్మిషన్ ఇమ్మని తను ప్రిన్సిపాల్‌ను కన్విన్స్ చేశాడు. అదృష్టం కొద్దీ, ఎలాంటి ప్రమాదం జరగలేదు. దాంతో మిగతా సీన్ షూటింగ్‌కు పర్మిషన్ దొరికింది. ఆ క్షణంలో ఎన్టీఆర్‌ను గట్టిగా పట్టేసుకున్నాను. సినిమా చివరిదాకా ప్రతిక్షణం తను నా వెంట నిలిచాడు.
 
 క్లైమాక్స్‌లో ఎన్టీఆర్ విలన్స్‌తో ఫైట్ చేస్తూ గోడకున్న అద్దాల ఫొటో ఫ్రేముల్ని చేత్తో బద్దలు కొడతాడు. పొరపాటున ఒక గాజు ముక్క ఎన్టీఆర్ కుడి చేతిలోకి చొచ్చుకుని పోయింది. కళ్ల ముందే రక్తం ధారగా ప్రవహించడం మొదలుపెట్టింది. నాకు చెమటలు పట్టసాగాయి. ఎన్టీఆర్ ట్రీట్‌మెంట్ చేయించుకుని, షెడ్యూల్ బ్రేక్ చేయకుండా షూటింగ్‌లో పాల్గొన్నాడు. తరువాత ఎన్టీఆర్ ఒంటి చేత్తోనే ఆ ఫైట్ సీన్ పూర్తి చేశాడు. ఇప్పుడు చూస్తే సినిమాలో ఈ విషయం మీకు అర్థమవుతుంది. గాయం మానకుండానే ‘నీ నవ్వుల చల్లదనాన్ని’ పాట చిత్రీకరణలో పాల్గొన్నాడు.
 
 ఆ పాట ‘ఆది’ సినిమాకు అదనపు అందాన్ని తెచ్చిపెట్టింది. దాని వెనుక ఒక చిన్న కథ ఉంది. అసిస్టెంట్ డెరైక్టర్‌గా ఉన్న రోజుల్లో రోడ్డుమీద అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. మణిశర్మ స్టూడియో ఛాయలకు వెళ్లాక, సడన్‌గా ఒక కారు నా ముందు ఆగింది. అందులోంచి చంద్రబోస్‌గారు దిగి నన్ను పలకరించారు. కానీ ఆయనెందుకో కొంచెం డల్‌గా అనిపించి అడిగాను. నేను వినిపించబోయే పాటపై నీ అభిప్రాయం చెప్పు అని ‘నీ నవ్వుల చల్లదనాన్ని’ పాట పాడారు. నాకు చాలా నచ్చిందని చెప్పాను. కానీ ఈ పాట వేరేవాళ్లకు నచ్చలేదన్నాడు. సార్ ఈ పాట నాకివ్వండి, నేను డెరైక్టర్ అవగానే నా మొదటి సినిమాలో పెట్టుకుంటానని చెప్పాను. సరే, ఈ పాట నీదే అన్నారు చంద్రబోస్. ఇది జరిగిన ఏడాదిన్నరకు బోస్‌గారికి ఫోన్ చేసి పాట అడిగాను. ఆయన చాలా ఆశ్చర్యపోయారు.
 
 ఎన్టీఆర్ మొదటిసారి ఊళ్లోకి వచ్చినప్పుడు బోరింగ్ పంపు దగ్గర నీళ్లు తాగేటప్పుడు సీన్‌కు థియేటర్‌లో విపరీతమైన స్పందన వచ్చింది. దీనికి చిన్నప్పుడెప్పుడో విన్న కథ ఇన్‌స్పిరేషన్. ఒక ఊళ్లో ఒక రైతు పొలంలో పంట పండిన తరువాత అడిగిన వాళ్లందరికీ ధాన్యం పంచాడు. చివరకు చూస్తే తనకు ఒక్క గింజ కూడా మిగలలేదు. అప్పుడా రైతు తన పొలం పక్కన రాయి మీద కూర్చుని బాధపడుతున్నాడు. అప్పుడొకాయన నువ్వు కూర్చున్నరాయి కింద క్రిష్ణదేవరాయల సింహాసనం ఉంది చూడు అన్నారట. ఇది స్థల మహత్యం గురించి చెప్పిన కథ. అలాగే చాలాసార్లు ఆ ఊరి నీళ్లే అలాంటివి అనే మాట వింటుంటాం. దీని ఆధారంగా ఎన్టీఆర్ సీమలోకి అడుగుపెట్టినప్పుడు ఆ ప్రాంత పౌరుషం గురించి చెప్పడానికి ఈ సీన్ రాసుకున్నాను.
 అలాగే సోడా సీసా  ముక్కల్ని బాంబుల్లో చుట్టడం లాంటి చిన్న చిన్న డిటెయిలింగ్ ఎలా చేయగలిగారని చాలామంది ఇప్పటికీ అడుగుతుంటారు. బెల్లంకొండ సురేశ్‌గారి మిత్రుడు సాదిక్‌గారి పక్కన కూర్చుని సీమకు సంబంధించి బోలెడన్ని విషయాలు అడిగేవాణ్ని. ఆయన చెప్పిన వివరాలు, సంఘటనల ఆధారంగా ఇలాంటి  సీన్స్ రాయగలిగాను.
 
 మా సినిమాకు రాంప్రసాద్ కెమెరామెన్. జైల్లో ఎన్టీఆర్ తొడగొట్టే సన్నివేశాలు తీస్తున్నప్పుడు తనకు వేరే సినిమా క్లాష్ వచ్చి సమీర్‌రెడ్డి షూట్‌కు వచ్చాడు. నేను ఆ సీన్‌ను తెరకెక్కించిన విధానం చూసి చాలామందికి నా గురించి గొప్పగా చెప్పాడు. ఈ విషయం గోపాల్‌రెడ్డిగారికి తెలిసి కథ ఉంటే చెప్పు, దుర్గా ఆర్ట్స్‌లో సినిమా చేద్దాం అన్నారు. ఎన్టీఆర్ పక్కన ఉండే ఉదయన్ అయితే, అసలు మనోడికి రజనీకాంత్ అంత బిల్డప్ ఇస్తున్నావ్ అన్నారు. తొడగొట్టే సీన్ షూటింగ్ దశ నుంచే సినిమా మీద ఒక ఎక్స్‌పెక్టేషన్ క్రియేట్ చేసింది.
 నేను రాసుకున్న పాత్రలు, సన్నివేశాలు తెరమీద అంత ఉద్వేగంగా, బలంగా పండటానికి కారణం సినిమాలో ఆర్టిస్టులు. ఎన్టీఆర్ వీర, భయానక, రౌద్ర, కరుణ రసాల్లో బీభత్సంగా నటించడం. అప్పటిదాకా తన కెరీర్‌లో చేయని పాత్రను చలపతిరావు ఈ సినిమాలో చేశాడు. తల్లిదండ్రులు లేని పిల్లవాడిని అనుక్షణం గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాబాయిగా ఆయన నటన అద్భుతం. విలన్ నాగిరెడ్డి పాత్రను మొరటుగా, పశు ప్రవృత్తి కలిగిన మనిషిలా తయారు చేశాను. ఆ పాత్రకు రాజన్ పి.దేవ్ పూర్తి న్యాయం చేశారు.
 ఈ సినిమా చేసినప్పుడు ఉన్నంత కాన్ఫిడెంట్‌గా మరెప్పుడూ ఉండలేకపోయాను. ఏమైనా ‘ఆది’ సినిమా నా కెరీర్‌లో ఓ మ్యాజిక్. అది ఎవరి జీవితంలోనైనా ఒక్కసారే జరుగుతుందనుకుంటా.
 
 ఒక షాట్‌లో కనుబొమ్మలు ఇలా పైకి ముడవాలని రాసుకుంటే తను అలాగే చేసేవాడు. నేను తనను దృష్టిలో పెట్టుకుని రాసుకున్న ప్రతి సీన్‌కు ఎన్టీఆర్ జీవం పోశాడు.
 
 - కె.క్రాంతికుమార్‌రెడ్డి

మరిన్ని వార్తలు