అనంతరం: జూనియర్ ఫర్ఫెక్షనిస్ట్

7 Dec, 2013 23:58 IST|Sakshi
అనంతరం: జూనియర్ ఫర్ఫెక్షనిస్ట్

కొడుక్కి తండ్రి పోలికలు రావడంలో పెద్ద విశేషమేమీ లేదు. కానీ అచ్చు గుద్దినట్టుగా అతడి గుణగణాలు రావడం మాత్రం విశేషమే. అందుకే జునైద్‌ని చూస్తే ఆమిర్‌ని చూసినట్టే ఉంటుంది అంటారంతా. ఆ మాట విన్నప్పుడల్లా ఆ కొడుకు చిన్నగా నవ్వుతాడు. అతడి తండ్రి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతాడు.  బంధానికి తండ్రీకొడుకులే అయినా, చూడ్డానికి అన్నదమ్ముల్లా కనిపించే ఆ తండ్రీకొడుకులు... ఆమిర్‌ఖాన్, జునైద్‌ఖాన్!
 
 ‘పీకే’ సినిమా షూటింగ్ జరుగుతోంది. నిండా పాతికేళ్లు కూడా లేని కుర్రాడు స్క్రిప్టు పేపర్లు పట్టుకుని అటూ ఇటూ హడావుడిగా తిరుగుతున్నాడు. మధ్య మధ్యలో కెమెరామేన్ దగ్గరకు వెళ్లి సూచనలు ఇస్తున్నాడు. డెరైక్టర్ దగ్గరకు వెళ్లి డిస్కస్ చేస్తున్నాడు. నటీనటులతో ముచ్చటిస్తున్నాడు. కాస్త దూరంలో కూర్చుని ఉన్న ఓ నలభై ఎనిమిదేళ్ల వ్యక్తి ఆ కుర్రాడినే తదేకంగా చూస్తున్నాడు. కాసేపటి తర్వాత అతడి పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. ఆ నవ్వులో కాసింత గర్వం. అంతా తానై, అన్నింటా తానై మసలుతున్న ఆ కుర్రాడి పేరు జునైద్. అతడిని చూసి మురిసిపోతోంది... ఆమిర్‌ఖాన్, జునైద్ తండ్రి!
 
 బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ గురించి చెప్పమంటే ఎవరైనా మొదట చెప్పే మాట... పర్‌ఫెక్షన్‌కు నిలువెత్తు రూపం, క్రమశిక్షణకు మరో రూపం అని. అవే మాటలు ఇప్పుడు జునైద్‌ని చూసి అంటున్నారంతా. అందుకే కొడుకుని చూసి గర్వంతో పొంగిపోతుంటాడు ఆమిర్. తన మార్గంలో నడిచి హీరో కాకపోయినా, తనకిష్టమైన డెరైక్షన్ రంగంలో ఎదిగేందుకు కొడుకు పడుతోన్న తపనకు తోడుంటాడు. ప్లస్సులను మెచ్చుకుంటూ, మైనస్‌లను అధిగమించడం నేర్పుతూ... కొడుకుని గొప్పవాణ్ని చేసేందుకు ఆరాట పడుతుంటాడు.
 
 ఆ బంధం బలమైనది...
 ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ చిత్రం చేస్తున్నప్పుడు, నటి రీనా దత్తాతో ప్రేమలో పడిన ఆమిర్, తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాడు. వారికి జునైద్, ఇరా పుట్టారు. పిల్లలంటే ప్రాణం ఆమిర్‌కి. కానీ భార్యతో బంధమే... ఎందుకో బలహీన పడింది. పదిహేనేళ్లు గడిచాక పూర్తిగా తెగిపోయింది. పిల్లలు తల్లి చెంత చేరారు. కానీ... తండ్రి గుండెల్లో వారి స్థానం వారిదే.
 
 భార్యతో విడిపోయినా, మరో స్త్రీతో ప్రేమలో పడినా... పిల్లల బాధ్యతను విస్మరించలేదు ఆమిర్. అందుకే జునైద్, ఇరాలకు తండ్రి మీద రెండో అభిప్రాయం లేదు. అమ్మానాన్నలు విడిపోయినా తమకు ఇద్దరూ ఉన్నారన్న భావనలోనే ఉంటారు. అసిస్టెంట్ డెరైక్టర్ అయిన కిరణ్‌రావుని తండ్రి పెళ్లి చేసుకుంటుంటే... వచ్చి విష్ చేయగలిగేంత మెచ్యూరిటీ, వారికి పుట్టిన బిడ్డని తమ్ముడిగా ప్రేమించేంత మంచి మనసుంది వారిలో. అది వారిని తండ్రికి మరింత దగ్గర చేసింది.
 
 తండ్రికి జిరాక్స్ కాపీ...
 జునైద్‌ని చూస్తే ఆమిర్‌ని చూడక్కర్లేదు అంటారు వారి గురించి తెలిసినవారంతా. చేయాలనుకున్నది చేయడం, వెళ్లే దారిలో ముళ్లను ఏరిపారేసి పూలను పరచుకుంటూ పోవడం, వేలెత్తి చూపనివ్వని క్రమశిక్షణ... ఇవన్నీ తండ్రి నుంచే అబ్బాయి జునైద్‌కి. నటుడు కావాలన్న కోరిక అతడికెప్పుడూ లేదు. ఒకరు క్రియేట్ చేసినదాన్ని ఇంప్రవైజ్ చేసే నటుడికన్నా, క్రియేట్ చేసినవాడే గొప్పవాడన్న నమ్మకం అతడిది. అందుకే మెగాఫోన్ పట్టేందుకే మొగ్గు చూపాడు. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ దగ్గర అసిస్టెంట్‌గా చేరాడు.
 
 విలువలకు కట్టుబడి సినిమా తీస్తాడు హిరానీ. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్ చిత్రాలు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఆమిర్ కూడా విలువల గురించి ఆలోచిస్తాడు. అతడికి కొడుకుగా పుట్టిన జునైద్ కూడా వాటి గురించే ఆలోచించాడు. అందుకే తన గురువుగా హిరానీని ఎంచుకున్నాడు. ప్రస్తుతం తన తండ్రి ఆమిర్‌తో హిరానీ తీస్తోన్న ‘పీకే’కి సహాయ దర్శకుడిగా పని చేస్తున్నాడు. నువ్వెప్పుడు దర్శకుడివవుతావు అంటే... ‘ముందు పని పర్‌ఫెక్ట్‌గా నేర్చుకోవాలి’ అంటాడు. ఆమిర్ కొడుకు కదా... పర్‌ఫెక్షన్ గురించి కాకుండా దేని గురించి మాట్లాడతాడు!
 - సమీర నేలపూడి

మరిన్ని వార్తలు