ఆట ముగిసింది

23 Aug, 2015 01:25 IST|Sakshi
ఆట ముగిసింది

నిజాలు దేవుడికెరుక
* ప్రపంచమే మెచ్చిన క్రీడాకారుడు
* యువతకు ఆరాధ్యదైవం అతడు
* మరి నేరస్తుడు ఎలా అయ్యాడు?
ఏప్రిల్ 15, 2015. అమెరికాలోని మసాచుసెట్స్...
 కోర్టు హాలు జనంతో కిక్కిరిసి ఉంది. కోర్టు బయట కూడా అంతా కోలా హలంగా ఉంది. అందరూ ఏదో సీరియస్‌గా చర్చించుకుంటున్నారు.

ఆ రోజు వెలువడబోయే తీర్పు గురించి టెన్షన్ పడు తున్నారు. అంతలో ఒక్కసారిగా అంతా నిశ్శబ్దంగా అయిపోయింది. న్యాయమూర్తి వచ్చారు. తనని చూడగానే లేచి నిలబడిన వాళ్లందరినీ కూర్చోమని సైగ చేస్తూ తన సీట్లో ఆసీనులయ్యారు. వాదోపవాదాలు మొదలుపెట్టమని ఆదేశించారు. న్యాయమూర్తులు లేచారు. ఒకరిని మరొకరు ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నాలు చేశారు. తమను తాము సమర్థించు కున్నారు. చివరి వాదనను యమ జోరుగా వినిపించి కూర్చున్నారు.

న్యాయమూర్తి తీర్పు రాయడం మొదలుపెట్టారు. అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. ఆయన ఏం తీర్పు చెప్పబోతున్నారు?!  వారి ఉత్కంఠకు తెర వేస్తూ న్యాయ మూర్తి పెదవి విప్పారు. ‘‘ఓడిన్ లాయిడ్ అనే వ్యక్తిని హత్య చేసినందుకుగాను ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఆరన్ హెర్నా డెంజ్‌కు యావజ్జీవిత ఖైదును విధించడ మైనది. ఈ శిక్షను ఆరన్ పూర్తిగా అనుభ వించాలి. బెయిల్ అప్లై చేసుకునే అవ కాశాన్ని న్యాయస్థానం ఇవ్వడం లేదు.’’ అందరూ అవాక్కయ్యారు. కొందరి కైతే కళ్లలో నీళ్లు వచ్చేశాయి. ప్రతి ఒక్కరి కళ్లూ ఆరన్ వైపు తిరిగాయి.
 
ఆరన్ తల దించుకున్నాడు. రెండు చేతులతో ముఖాన్ని మూసుకున్నాడు. కొన్ని క్షణాల పాటు అలానే ఉండిపోయాడు. తర్వాత లేచి అందరి వైపూ చూశాడు. ఒక అమ్మాయి మీద అతని దృష్టి ఆగిపోయింది. ఆమె ఏడుస్తోంది. ఏడపును ఆపుకోలేక అవస్థ పడుతోంది. ఆరన్ వైపే దిగులుగా చూస్తోంది. ‘ఈ యెడబాటు నేను తాళలేను’ అన్న భావం ఉంది ఆమె చూపుల్లో.
 
ఆమెనా స్థితిలో చూసి తట్టుకోలేక పోయాడు ఆరన్. చెమ్మగిల్లుతోన్న కళ్లను వేళ్లతో తుడుచుకున్నాడు. మౌనంగా పోలీసుల వెంట నడిచాడు. అంతవరకూ బయట నిలబడి చూస్తోన్న అభిమానులు ఆరన్‌తో కర చాలనం చేయడానికి ఎగబడ్డారు. అతడిని పలుకరించాలని పరితపించారు. వారి కళ్లు తడుస్తున్నాయి. వాళ్ల మనసులు బాధతో మూలుగుతున్నాయి. తమ ఆరాధ్య క్రీడా కారుడు జైలుకు వెళ్లిపోతుంటే వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. అతడు హత్య చేశాడంటే వాళ్లు నమ్మలేకపోతున్నారు. నిజంగానే ఆరన్ ఆ నేరం చే సి ఉంటాడా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ... ఆరన్ నిజంగానే ఆ హత్య చేశాడా? లేక అతడు ఆ నేరంలో ఇరుక్కున్నాడా? అసలు ఏం జరిగింది???
   
జూన్ 18, 2013. ఉత్తర అటెల్‌బరోలోని ఇండస్ట్రియల్ పార్క్... పోలీసు జీపు వేగంగా వచ్చి ఆగింది. నలుగురైదుగురు పోలీసులు బిలబిల మంటూ దిగారు. వారిని చూస్తూనే ఓ వ్యక్తి పరిగెత్తుకు వచ్చాడు. ‘‘నేనే సర్ ఫోన్ చేసింది’’ అన్నాడు రొప్పుతూ. ‘‘ఎక్కడ?’’... అడిగాడు ఇన్‌స్పెక్టర్. ‘‘నాతో రండి’’ అంటూ లోనికి నడిచాడా వ్యక్తి. పోలీసులు అతణ్ని అనుసరించారు.
 పార్క్‌లో... ఓ మూలగా... వెల్లకిల్లా పడి ఉంది ఓ వ్యక్తి మృతదేహం. వయసు ముప్ఫైకి మించదు. శరీరంలో ముందు నుంచీ వెనుక నుంచీ కూడా బుల్లెట్లు దూసుకుపోయాయి. రక్తం ఎగజిమ్మి చుట్టు పక్కలంతా పడింది.
 
‘‘ఇతనెవరో నీకు తెలుసా?’’
 ఇన్‌స్పెక్టర్ అలా అడగ్గానే తల అడ్డంగా ఊపాడా వ్యక్తి. ‘‘ఏదో కాసేపు రిలాక్స్ అవుదామని పార్క్‌కి వచ్చాను. అనుకోకుండా ఈ డెడ్‌బాడీని చూశాను. వెంటనే మీకు ఫోన్ చేశాను’’... చెప్పాడు.
 అప్పటికే జనం గుమిగూడారు. ‘‘మీలో ఎవరికైనా ఇతను తెలుసా?’’... అక్కడున్న వాళ్లందరినీ ఉద్దేశించి అడిగాడు ఇన్‌స్పెక్టర్. ఎవ్వరూ మాట్లాడలేదు. దాంతో ఆధారాల కోసం పరిసరాలన్నీ వెతకడం మొదలుపెట్టారు. అంతలో ఓ అసిస్టెంట్... ‘‘సర్... ఇది చూడండి’’ అంటూ అరిచాడు.

అందరూ అటువైపు వెళ్లారు. అక్కడ ఒక సెల్‌ఫోన్ ముక్కలు ముక్కలుగా పడి ఉంది. సిమ్ ఓ చోట, బ్యాటరీ ఓ చోట, మిగతా భాగాలు వేరేచోట చెల్లాచెదరుగా పడివున్నాయి.
 ‘‘వాటన్నిటినీ కలెక్ట్ చేయండి. ఆ నంబర్ ఎవరిదో కనుక్కోండి. బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపించండి.’’ ఇన్‌స్పెక్టర్ ఆదేశించగానే ఆ పనుల్లో మునిగిపోయారు సబార్డినేట్స్.
   
 కాలింగ్ బెల్ మోగీ మోగగానే తలుపు తెరచుకుంది. ‘‘ఎవరు కావాలి సర్’’ అన్నాడు తలుపు తెరచిన వ్యక్తి.
 ‘‘ఆరన్ హెర్నాండెజ్’’... సింపుల్‌గా చెప్పాడు ఇన్‌స్పెక్టర్.
 అతను లోపలికి వెళ్లాడు. ఐదు నిమి షాల తర్వాత ఆరన్ వచ్చాడు. వస్తూనే ఇన్‌స్పెక్టర్‌కి షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. కూర్చో మంటూ మర్యాదలు చేయబోయాడు. వద్దని వారించాడు ఇన్‌స్పెక్టర్.
 ‘‘సారీ మిస్టర్ ఆరన్. మేమిక్కడికి మీ అభిమానులుగా రాలేదు. ఓడిన్ లాయిడ్‌ని హత్య చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం.’’
 ‘‘వ్వాట్’’... నేను హత్య చేశానా? అది కూడా ఓడిన్‌ని. తనెవరో తెలుసా? నా చెల్లెలు ప్రేమించిన వ్యక్తి. అయితే గియితే అతణ్నిచ్చి మా చెల్లికి పెళ్లి చేస్తాను గానీ హత్య ఎందుకు చేస్తాను సర్?’’
 
నవ్వాడు ఇన్‌స్పెక్టర్. ‘‘ఎవరు ఏది ఎందుకు చేస్తారో నాకు తెలుసు మిస్టర్ ఆరన్. ఎక్కువ తర్కించకుండా కో ఆపరేట్ చేయండి’’ అంటూ సబార్డినేట్ వైపు చూశాడు. అతడు ముందుకు వచ్చి ఆరన్ చేతికి బేడీలు వేశాడు.
 ‘‘సర్ నేను చెప్పేది వినండి... నేనీ హత్య చేయలేదు’’... ఆరన్ అరిచాడు.
 కానీ పోలీసులు వినే స్థితిలో లేరు. వాళ్లు పూర్తి ఆధారాలతో వచ్చారు. పార్కులో దొరికిన సెల్‌ఫోన్ ఆరన్‌దేనని తేలింది.

అయినా వెంటనే అతణ్ని అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఆరన్ పెద్ద సెలె బ్రిటీ. దేశ ఖ్యాతిని పెంచిన ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ప్రపంచం నలు మూలలా అతనికి అభిమానులు ఉన్నారు. అలాంటివాడిని బ్లైండ్‌గా అరెస్ట్ చేస్తే ఏమవుతుందో వారికి తెలుసు. అందుకే ముందు పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేశారు. ఆరన్ ఇంటి మీద, అతనికి సంబంధించిన మనుషుల మీద నిఘా పెట్టారు. ఆరన్ ఇంట్లో పనిచేసే ఓ వ్యక్తి మొదటి ఆధారాన్ని అందించాడు.
 
ఆ రోజు ఆరన్‌కి, ఓడిన్‌కి ఆరన్ ఇంట్లో ఎందుకో వాదన జరిగింది. ఆరన్ రెచ్చిపోయాడు. ఓడిన్ మీద కలబడ్డాడు. అతణ్ని గాయపరిచాడు. తర్వాత నెమ్మదించాడు. ఓడిన్‌కి ఏదో చెప్పి బయటకు తీసుకువెళ్లాడు. కొన్ని గంటల తర్వాత ఇంటికి హడావుడిగా వచ్చాడు. తాను ఓడిన్‌ని గాయపర్చినప్పుడు కారిన రక్తాన్ని పనివాళ్లతో శుభ్రం చేయించాడు.     
 
ఈ సమాచారాన్ని బట్టి, ఓడిన్‌ని పార్క్‌కి తీసుకెళ్లి హత్య చేశాడని అంచనా వేశారు పోలీసులు. ఆ తర్వాత ఆరన్‌తో సహజీవనం చేస్తోన్న షయానా జెంకిన్స్‌ని విచారించారు. ఆమె మొదట ఆరన్ నిర్దోషి అని వాదించింది. కానీ పోలీసుల తెలివి తేటల ముందు ఎక్కువసేపు నటించలేక పోయింది. ఆరన్ తనకి ఓ పెట్టె ఇచ్చాడని, దాన్ని ఎవరికీ తెలియకుండా దాచిపెట్ట మన్నాడని చెప్పింది. అది హత్యకు ఉప యోగించిన ఆయుధమని కనిపెట్టడానికి పోలీసులకు పెద్ద సమయం పట్టలేదు.

ఈ సాక్ష్యాలతో పాటు ఆరన్ ప్రవర్తన కూడా అతని చుట్టూ ఉచ్చు బిగియడానికి కారణమయ్యింది. ఆరన్ ఆవేశపరుడు. 2007లో ఓ బార్‌లో బాగా తాగి బిల్లు కట్ట డానికి నిరాకరించాడు. నిలదీసిన వెయి టర్‌ని గాయపర్చాడు. కొన్ని నెలల తర్వాత ఓ నైట్ క్లబ్బులో ఇద్దరు వ్యక్తులతో వాదనకు దిగి, ఆవేశంలో వాళ్లని షూట్ చేశాడు. 2012లో జరిగిన జంట హత్యల కేసుతో కూడా అతడికి సంబంధం ఉందన్న ఆరోపణలున్నాయి. అవన్నీ విచా రణలో ఉండగానే ఈ హత్య జరిగింది. ఆధారాలన్నీ ఆరన్ వైపే చూపించాయి. దాంతో పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు.
 
రెండేళ్ల విచారణ తర్వాత అన్ని కేసులకూ కలిపి ఒకేసారి తీర్పు వెలువడింది. ఓడిన్‌ని ఆరనే హత్య చేశాడని, మిగతా అన్ని కేసుల్లోని ఆరోపణలు కూడా నిజమేనని తేలింది. ఆరన్‌కు జీవితఖైదు పడింది.
 ఒకనాడు ప్రపంచమంతా అభిమానుల్ని సంపాదించుకున్న ఓ గొప్ప ఆటగాడు, నేడు నేరస్తుడిగా అదే ప్రపంచం ముందు తలదించుకుని నిలబడ్డాడు. అభిమాన సందోహంలో ఉక్కిరి బిక్కిరైన ప్రముఖుడు... ఇప్పుడు ఒంటరిగా జైలు గదిలో ఊచలు లెక్కబెడుతున్నాడు.

అతడేమీ ప్లాన్ చేసి నేరాలు చేయలేదు. కానీ తన బలహీన తను జయించలేకపోయాడు. ఆవేశాన్ని అణచుకోలేక అంత పెద్ద ఘోరానికి పాల్పడ్డాడు. ప్రాణంగా ప్రేమించే ప్రియురాలిని ఒంటరిదాన్ని చేశాడు. ప్రాణమిచ్చే అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. పరువును మంటగలుపుకుని, ప్రతిష్టను దిగజార్చుకుని, హంతకుడన్న ముద్రను వేసుకుని కటకటాల వెనుక కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. కానీ ఆ కన్నీళ్లను ఎవరూ తుడవరు. అతడిని ఎవరూ ఓదార్చరు. ఎందుకంటే... తప్పు చేసింది సామాన్యుడైనా, సెలెబ్రిటీ అయినా... శిక్ష అనుభవించక తప్పదు!
- సమీర నేలపూడి
 
ఆరన్ ప్రేయసి... షయానా జెంకిన్‌‌స
హత్య కేసులో అరెస్టయ్యి, తీర్పు వెలువడే లోపు ఆరన్, షయానాలకి ఓ పాప పుట్టింది. ఆ పాప కోసమైనా అతడు నిర్దోషిగా విడుదల కావాలని తపించింది షయానా. కానీ ఆమె ఆశ ఫలించలేదు. ఆరన్ జైలుకు వెళ్లక తప్ప లేదు. అయితే ఆరన్ హంతకుడు కాదు అని ఇప్పటికీ వాదించేవాళ్లు కొందరు ఉన్నారు. ఎందుకంటే ఓడిన్‌ని ఆరన్ షూట్ చేయడం ఎవరూ ప్రత్యక్షంగా చూడలేదు. అలాంటప్పుడు అతడే చంపాడని ఎలా నిర్ధారిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు వాళ్లు.

కానీ ఆ ప్రశ్నను ఆరన్ మాత్రం సంధించలేకపోయాడు. ప్రతి మాటకీ తడబడ్డాడు. ప్రతి ప్రశ్నకూ పొంతన లేని సమాధానాలే చెప్పాడు. అతడే నేరం చేశాడని న్యాయస్థానం నమ్మడానికి అతడిలోని ఆ తడబాటు కూడా ఒక కారణమయ్యింది.

మరిన్ని వార్తలు