ఈసారి తెలంగాణ యాసతో...

31 Aug, 2014 01:24 IST|Sakshi
ఈసారి తెలంగాణ యాసతో...

సంభాషణం: బయట ఎవరైనా గుర్తుపట్టి పలకరిస్తే ఏమనిపిస్తుంది?
 ఏ నటుడికైనా తననందరూ గుర్తు పడుతుంటే సంతోషమేస్తుంది. నాకూ అంతే. కానీ ఈ అభిమానానికి ఒక్కోసారి నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ఓసారి భీమవరం వెళ్తుంటే సునీల్‌కి యాక్సిడెంట్ అయ్యింది. విరిగిపోయిన చేతిని మరో చేత్తో పట్టుకుని, రక్తం కారుతూ ఉన్న తన దగ్గరకు ఓ వ్యక్తి వచ్చి ‘ఆటోగ్రాఫ్ ఇస్తారా’ అని అడిగాడట. సునీల్ చెబుతుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు నాకు. ఏదేమైనా ప్రేక్షకుల ఆదరణే మాలాంటి నటులకు బలం ప్రాణం.
 
 నవ్వినంత తేలికగా ఎదుటివాడిని నవ్వించలేం. దానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కావాలి. ఆ లక్షణాలు మెండుగా ఉన్నవాడు ప్రవీణ్. గోదావరి యాసతో డైలాగులు పలుకుతూ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే ఈ యువ హాస్యనటుడి సినీ ప్రయాణం అనుకోకుండా మొదలైంది. ఆనందంగా సాగిపోతోంది. దాని గురించి ప్రవీణ్ చెబుతోన్న కబుర్లు...
 
 అందరూ ఏదో అవ్వబోయి నటుడయ్యానంటారు. మరి మీరు...?
 నేను ఏమవ్వబోయానో తెలియదు కానీ... న టన అంటే మాత్రం పిచ్చి నాకు. కానీ నా మనసులోని మాటను ఎప్పుడూ ఎవ్వరికీ ఎప్పుడూ చెప్పేవాణ్ని కాదు. ఎందుకని? మాది సాధారణ రైతు కుటుంబం. ఇంటికి పెద్ద కొడుకుని. నాన్న లేరు. అమ్మని, తమ్ముడిని చూసుకోవాల్సిన బాధ్యత నాదే. అలాంటప్పుడు సినిమాలు, నటన అంటే కంగారు పడతారు కదా! అందుకని చెప్పలేదు. (నవ్వుతూ) అందరిలాగా మద్రాస్ రెలైక్కేద్దామంటే ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చేసింది. అందుకే డిగ్రీ అయ్యాక బస్సెక్కి హైదరాబాద్ వచ్చేశాను. ఓ చిన్న ఉద్యోగంలో చేరి, ఎం.కాం. కరెస్పాండెన్స్ కోర్సు చేస్తూ ప్రయత్నాలు మొదలెట్టాను. ఒక్కటీ ఫలించలేదు. ఇక వర్కవుటవ్వదని తిరుగు టపా కట్టాను.
 
 
వెళ్లిపోయినవారు మళ్లీ ఎందుకొచ్చారు?
 నేను రాలేదు... దిల్ రాజు తీసుకొచ్చారు. మాది అంతర్వేది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ షూటింగ్ జరిగినా ప్రత్యక్షమైపోయేవాడిని. ‘ఒక ఊరిలో’ షూటింగు చూడ్డానికి వెళ్లినప్పుడు సునీల్ తో పరిచయమయ్యింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ‘కాంచనమాల కేబుల్ టీవీ’ షూటింగు కోసం వచ్చినప్పుడు తనతో స్నేహం ఏర్పడింది. అప్పట్నుంచీ ఎప్పుడు షూటింగుకొచ్చినా నన్ను పిలిచేవాడు. ‘పరుగు’ షూటింగ్ చూడ్డానికి వెళ్లినప్పుడు నన్ను చూసిన దిల్‌రాజు... ‘బంగారులోకం సినిమాలో ఓ క్యారెక్టర్ ఉంది చేస్తావా’ అని అడిగారు. ‘కచ్చితంగా చేస్తాడు, వాడికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం’ అన్నాడు సునీల్. అలా నటుడినైపోయాను.
     
డెబ్భై సినిమాల వరకూ చేశారు కదా... మీకు బాగా నచ్చినదేంటి?
 ‘కొత్త బంగారులోకం’ తర్వాత నాకు అంతగా పేరు తెచ్చింది ‘ప్రేమకథా చిత్రమ్’. ిసినిమాలోని ప్రతి మలుపుకీ కారణమవుతాను. ఓ కమెడియన్‌కి అలాంటి పాత్ర దొరకడం అరుదు, అదృష్టం కూడాను. ‘మిరపకాయ్’లో రోల్ కూడా ఇష్టం నాకు.    
కమెడియన్లంతా హీరోలవుతున్నారు కదా... మీరు కూడా?
 హీరో అవ్వాలని లేదు. ఒకవేళ అవకాశమొస్తే రాజేంద్రప్రసాద్‌గారిలా సినిమా అంతా నవ్వించే పాత్ర అయితే చేస్తాను.
ఎందుకు... మీ ఫ్రెండ్ సునీల్ అయ్యారుగా హీరో?
 అది వేరు. కొందరే అలా అవ్వగలరు. సునీల్ పడిన కష్టమేంటో నాకు తెలుసు. కష్టపడి సిక్స్ ప్యాక్ పెంచాడు. దానికి తోడు అద్భుతం గా డ్యాన్సు, ఫైట్లు చేయగలడు కాబట్టి హీరోగా రాణిస్తున్నాడు.
తను మీకు సలహాలు ఇస్తుంటారా?
 పనిగట్టుకుని ఇవ్వడు. ఏదైనా అడిగితే చెబుతాడు. మొదట్లో మాత్రం ఓ సినిమా చూసి పిలిచాడు. ‘ఓ సీన్లో బాడీని ఫ్రీగా వదిలేశావ్, నిర్లక్ష్యంగా చేస్తున్నట్టు కనిపించావ్, ఇంకెప్పుడూ అలా చేయకు, దృష్టి పని మీదే ఉండాలి’ అంటూ క్లాస్ పీకాడు.    

మీ రోల్ మోడల్ ఎవరు?
 రమణారెడ్డి గారంటే చాలా ఇష్టం. సన్నగా, పీలగా ఉండే ఆయన తన బాడీ లాంగ్వేజీతోనే సూపర్బ్ కామెడీని సృష్టించారు. రేలంగి, నగేశ్, బ్రహ్మానందంగారు... అందరూ నాకు రోల్ మోడళ్లే. అయితే అసలు నటన అంటే పిచ్చి ఏర్పడ్డానికి మాత్రం చిరంజీవిగారే కారణం. ఆయన 150వ సినిమాలో అవకాశం దొరికితే బాగుణ్నని ఆశపడుతున్నాను. ఎన్టీఆర్ (సీనియర్) అంటే కూడా ఎంతో గౌరవం నాకు. ఓ పక్క డెరైక్షన్ చేస్తూనే ‘దానవీరశూరకర్ణ’లో ఆరు పాత్రలను పోషించడం మాటలు కాదు.
డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా?
 ఓ నెగిటివ్ రోల్ చేస్తే బాగుణ్ననిపిస్తూ ఉంటుంది. అలాగే నేను తెలంగాణ యాస బాగా మాట్లాడతానని రవితేజ, హరీశ్ శంకర్ అంటూ ఉంటారు. ఆ యాస మాట్లాడే రోల్ చేయాలి. హరీశ్ ఆ చాన్స్ ఇస్తానన్నారు. వెయిట్ చేస్తున్నాను.
అప్పుడు మీ ఇంట్లో వాళ్లు కంగారు పడతారన్నారు. ఇప్పుడేమంటున్నారు?
 ఆనందపడుతున్నారు. ఇది చేయాలనుకుంటున్నాం అని చెప్పినప్పుడు ఎవ్వరైనా అనుమానపడతారు. అదే నిరూపించుకుని వెళ్లి వాళ్లముందు నిలబడితే సంతోషపడతారు. అందుకే నేనలా చేశాను. ఇప్పుడు వాళ్లూ హ్యాపీ, నేనూ హ్యాపీ!
 - సమీర నేలపూడి

మరిన్ని వార్తలు