పడి లేచారు..!

21 Dec, 2014 00:37 IST|Sakshi
పడి లేచారు..!

పంచామృతం: ఇక అయిపోయిందనుకున్నారంతా. కోలుకోవడం కష్టమే.. అనే అభిప్రాయాలూ వినిపించాయి. గతంలో ఎంతో వైభవాన్ని చూశారు... రకరకాల కారణాలతో విరామం లేదా, వైఫల్యాల వల్ల కొంత ఇబ్బందిని కూడా ఎదుర్కొన్నారు. అయితే తిరిగి బంతిలాగా దూసుకురావడమే వీరి గొప్పదనం. మళ్లీ తమ సత్తా, స్థాయి ఏమిటో చూపిస్తున్నారు. వీరు వ్యక్తిగతంగా వెలుగుతున్నవారే కాదు, వర్తమానంలో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి స్ఫూర్తిప్రదాతలు కూడా!
 
 అమితాబ్ బచ్చన్
 ఈ సూపర్‌స్టార్ కమ్‌బ్యాక్ ఒక వ్యక్తిత్వ వికాస పాఠమే అవుతుంది. సినిమాల ఫెయిల్యూర్‌లు, ఏబీసీఎల్ నష్టాలు అమితాబ్ కథ అయిపోయిందనిపించాయి. ఆ సమయంలో అమితాబ్ అప్పుల పద్దు గురించి మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. అయితే అమితాబ్ అలాంటి దశను అధిగమించాడు. కౌన్‌బనేగా కరోడ్‌పతి ద్వారా, సినిమాల ద్వారా తన స్థాయి ఏమిటో తెలియజెప్పాడు!

నితిన్
 వరస ఫెయిల్యూర్‌లు... కొన్ని సినిమాలు అయితే ఎప్పుడొచ్చి వెళ్లాయో కూడా చాలామందికి తెలియని పరిస్థితి. తొలి సినిమాతోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు సొంతం చేసుకొన్న నితిన్‌ను మధ్యలో కొన్ని రోజులు వరసగా వైఫల్యాలు వెంబడించాయి. అయితేనేం.. ‘ఇష్క్’తో మళ్లీ నితిన్‌టైమ్ స్టార్ట్ అయ్యింది. ఫామ్‌లోకి వచ్చిన బ్యాట్స్‌మన్‌లా ఇప్పుడు చెలరేగుతున్నాడు ఈ హీరో!
 
సల్మాన్ ఖాన్
వరస వివాదాలు.. పోలీస్ కేసులు, చెడ్డపేరు... దాదాపు దశాబ్దం కిందట సల్మాన్ పరిస్థితి ఇది. బాలీవుడ్ బ్యాడ్‌బాయ్ ఇమేజ్‌ను తెచ్చేసుకున్నాడు ఈ హీరో. ఇండస్ట్రీకి హిట్స్‌ను ఇచ్చి ఎంతో అభిమానగణాన్ని సంపాదించుకొన్న సల్మాన్... తాగి కారు నడిపిన కేసులో, కృష్ణజింకలను వేటాడిన కేసులోనూ దోషిగా ఉన్నాడు. ఇలాంటి ఇబ్బందికరమైన దశను తన సినిమాల ద్వారానే సల్లూ అధిగమించాడు. కేసులు కొనసాగుతున్నా... సినిమాల ద్వారా అలరిస్తూ అభిమానుల మనసులను అయితే గెలుచుకున్నాడు.  

 టైగర్ వుడ్స్
దాదాపు ఐదేళ్ల క్రితం అమెరికన్ గోల్ఫ్ ఆటగాడు టైగర్ వుడ్స్ తీవ్ర మైన వివాదాల్లో కూరుకున్నాడు. ఎంతో అభిమానగణాన్ని కలిగిన వుడ్స్‌పై తీవ్రమైన ఆరోపణలు వినిపించాయి. అనేక మంది మహిళలు ‘మాకు వుడ్స్‌తో లైంగిక సంబంధముంది’ అని ప్రకటించుకున్నారు. కొన్ని నెలల పాటు వుడ్స్ శృంగారలీలలు అమెరికన్, ప్రపంచ మీడియాకు మంచి మేత అయ్యాయి. అలాంటి వార్తలు వుడ్స్ వ్యక్తిగత, క్రీడాజీవితాలను దెబ్బతీశాయి. ఎండార్స్‌మెంట్ ఆదాయంపై కూడా దెబ్బకొట్టాయి. అయితే అదంతా గతం. ఇప్పుడు.. వుడ్స్ ఆటలో మళ్లీ చాంపియన్. ఎండార్స్‌మెంట్ విషయంలో కూడా!
 
  ఆండ్రీ అగస్సీ
 1992లో అందుకొన్న తొలి టైటిల్‌తో అగస్సీ ప్రభ మొదలైంది. అయితే కెరీర్ ఆరంభంలో టాప్‌టెన్ స్థాయి ర్యాంకింగ్స్‌లో ఉన్న అగస్సీ ర్యాంక్ ఒకదశలో 141కి పడిపోయిందంటే ఆశ్చర్యం కలగకమానదు. కుటుంబపరమైన సమస్యలు, ఫామ్‌లేమి కలసి 1997ల నాటికి అగస్సీ కథ అయిపోయిందనే అభిప్రాయాన్ని కలిగించాయి. అయితేనేం.. లెజెండరీ ఆటగాడు మళ్లీ పంజా విసిరాడు. 1999 తర్వాత వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచి గ్రాండ్‌గా టెన్నిస్ నుంచి విరామం తీసుకొన్నాడు.

మరిన్ని వార్తలు