శంకర విజయం-4

7 Jul, 2019 10:42 IST|Sakshi
కాలటిలో ఆదిశంకరుల నివాసం

ఆదిశంకరాచార్యుల జీవితచరిత్ర

‘‘వెయ్యేళ్లపాటు ఒంటికాలిమీద నిలిచి తపస్సు చేసి, పరమేశ్వరుణ్ణి సాక్షాత్కరింప చేసుకున్న ఉపమన్యు మహర్షి ఇతడే. శివుడు మాయా వేషం వేసుకుని వచ్చి, భోగభాగ్యాలిస్తానంటే నాకు శివుడే తప్ప మరేమీ అక్కర్లేదన్నాడు. తల్లి రక్షగా ఇచ్చిన భస్మాన్ని అస్త్రంగా మార్చి శివుణ్ణే మసి చేయబోయాడు. ఐహికమైన సుఖాలను త్యజించినందు వల్లనే శివపదాన్ని పొందాడు’’ చెబుతున్న అగస్త్య మహర్షి కొద్దిగా విరామం ఇచ్చాడు.
ఆర్యాంబ శిరసు వంచి ఉపమన్యువుకు నమస్కరించింది.
‘‘నీకు గుర్తున్నదనుకుంటాను. సంతానం కోసం తపస్సుకు పూనుకోబోయే ముందు నీ భర్తకు, ఈ మహర్షి కథనే గుర్తుచేశావు నువ్వు. ఇతడి కోసమే శివుడు క్షీరసముద్రాన్ని సృష్టించాడు. పరమాత్మ శ్రీకృష్ణునిగా అవతరించినప్పుడు సంతానార్థియై ఈ మహర్షినే శరణుజొచ్చాడు. జగద్గురువైన శ్రీకృష్ణునికే గురువు ఈయన’’ అన్నాడు అగస్త్యుడు.
‘‘తెలుసు స్వామీ! అందుకే మేము సంతానం కావాలనుకున్నప్పుడు ఆయన కథ గుర్తు చేసుకున్నాం’’ సంతోషంగా చెప్పింది ఆర్యాంబ.

‘‘ఇక వీరు అత్రి మహర్షి. గురు అవతారమైన దత్తాత్రేయుణ్ణి కన్నతండ్రి. ఈయన ఏమంటాడంటే... వరం ఇవ్వడం ఈశ్వరుడి ధర్మం. ఏది అడిగితే అదే ఇస్తాడు. మనకు విచక్షణను బోధించే బాధ్యత ఈశ్వరుడు తీసుకోడు. ఇట్లాంటి వరం అడగడం తప్పు నాయనా అని ఎప్పుడూ చెప్పడూ అని. శివగురుడు తన తపస్సు పండినవేళ దక్షిణామూర్తి ప్రత్యక్షమైతే నువ్వే నా కొడుకుగా పుట్టు అన్నాడట. నీకు తెలియకపోయి ఉండవచ్చు’’ అన్నాడు అగస్త్యుడు.
‘‘ఆ గొడవలన్నీ నాకేం తెలుస్తాయి స్వామీ!’’ అయోమయంగా అన్నది ఆర్యాంబ.
‘‘నిజమే. ఇదిగో... వీరు దధీచి మహర్షి. ఇంద్రునికి వజ్రాయుధంగా మారడానికి తన వెన్నెముకనే ఇచ్చిన త్యాగశీలి. ఈయనే దక్షయజ్ఞం విధ్వంసమై పోతుందని శాపమిచ్చాడు. ఆ శాపాన్ని నిజం చేయడానికి శివుడు వీరభద్రుణ్ణి పుట్టించాడు. వెనువెంటనే శాంతస్థితిని పొందాడు. భార్యా వియోగాన్ని అప్పటికప్పుడు మర్చిపోయాడు. కింపురుష లోకంలో వటవృక్ష మూలంలో గురు దక్షిణామూర్తిగా తన సనాతన శిష్యులకు మౌనవ్యాఖ్యలతో పరబ్రహ్మ తత్త్వాన్ని బోధించాడు. అపస్మారుణ్ణి తొక్కిపట్టి చిన్ముద్రలో ఎప్పుడూ నిశ్చలంగా ఉండే గురుదేవుడు... భువనాలన్నీ కలియ తిరిగి ప్రాణికోటికి జ్ఞానబోధ చేయాలని నిశ్చయించుకుంటే... లోకానికి అంతకంటే కావలసిందేముంది?’’ అన్నాడు అగస్త్య మహర్షి.

‘‘మీరు చెప్పేదంతా నాకు అయోమయంగా ఉంది స్వామీ! ఇంతకూ మా పిల్లవాడి పెళ్లెప్పుడు అవుతుందని అడిగాను నేను. అసలు ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు. ఏమేమిటో చెబుతున్నారు’’ అంది ఆర్యాంబ.
‘‘గతకాలంలో జరిగిన విశేషాలను కథలుగా గుర్తుంచుకుంటేనే, వర్తమానంలో మనం ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. మనకు తెలియని భవిష్యత్తు పరిణామాలను ఎదుర్కోగలిగిన మానసిక స్థైర్యం వస్తుంది’’ అన్నాడు అగస్త్యుడు.
‘‘సరే స్వామీ! ఉన్న విషయం దాచకుండా చెప్పండి’’ అభ్యర్థనగా అడిగింది ఆర్యాంబ.
‘‘నువ్వింతగా నిర్బంధం చేస్తున్నావు కాబట్టి చెబుతున్నాను. శంకరుడు జన్మించిన ఆర్ద్రా నక్షత్రానికి సాక్షాత్తూ శివుడే అధిదైవం. ఆ తార ప్రథమపాదాన్ని కృపాంశ అంటారు. దేవగురుడైన బృహస్పతి ఆ పాదానికి ఆధిపత్యం వహిస్తున్నాడు. ఆ అంశలో జన్మించిన వాళ్లు గుణవంతులు, నిత్యం ప్రశాంతంగా ఉండే చక్కటి ముఖం కలవాళ్లూ, తామున్న రంగంలో నేర్పురులూ అవుతారు.’’
ఆర్యాంబ తల పంకించింది.

‘‘ఆర్ద్రా నక్షత్ర జాతకులకు అయిదో ఏట తొమ్మిదో నెలలో అపమృత్యు భయం కలుగుతుంది. అందుకే శివగురుడు శంకరునికి మూడో ఏటనే ఉపనయనం చేద్దామనుకున్నాడు. విధివశాత్తూ ఆయన ముందే దాటిపోయాడు. అయిదో ఏడు ప్రవేశిస్తూనే ఉపనయనంతో శంకరుడు ద్విజుడయ్యాడు. రెండో జన్మ పొందినందు వల్ల తొలిగండం దాటాడు.’’
ఆర్యాంబ ఆత్రుతతో వింటోంది.
‘‘ఆయుర్దాయం వేరు; అపమృత్యు భయం వేరు అని గుర్తు పెట్టుకో. ఆర్ద్రా నక్షత్ర జాతకులకు పదహారో ఏడాదిలో వాతరోగం, వాయుపీడ, అగ్నిభయం కలుగుతాయి. దానిని అధిగమిస్తే ఇరవైనాలుగో ఏట సర్పగండం ఉంటుంది. దానిని కూడా అధిగమిస్తే....’’ 
‘‘స్వామీ! మీరు మా వాడి ఆయుర్దాయం గురించి చెప్పదలచుకుంటే, త్వరగా చెప్పండి’’ అన్నది ఆర్యాంబ ఆవేదనతో.
‘‘అమ్మా! కాలకాలుడైన మహాదేవునికి తనకు తానే పరీక్షలు విధించుకోవడం ఒక సరదా. మీ శంకరుడు యదార్థంగా తెచ్చుకున్న ఆయుర్దాయం పదహారేళ్లే. ఆ వయస్సులో అతడికి పరమగురు దర్శనం జరుగుతుంది. ఆయన మరో పదహారేళ్లు ఆయుర్దాయమిస్తాడు. ఆ తరువాత...’’ అగస్త్యుడు ఇంకా ఏదో చెప్పబోయాడు. ‘ఇక చాలు’ అంటూ మహర్షులు ఆయనను ఆపేశారు.

ఆర్యాంబకు డగ్గుత్తిక పడుతుండగా మాట పెగుల్చుకోలేక కళ్లవెంట అశ్రువులు రాల్చుతూ కొద్దిసేపు ఉండిపోయింది. రెండు చేతులా తల్లిని పట్టుకుని శంకరుడు ఆమెను ఓదారుస్తున్నాడు.
‘‘అయితే ఈ ఏడాదే పెళ్లి చేసేయమంటారా?’’ ఆర్యాంబ చివరి ప్రశ్నగా అడిగింది.
‘‘మూడేళ్ల కిందట క్షీరాబ్ధి ద్వాదశినాడు మహాలక్ష్మి ఇతణ్ణి కరుణించింది. మళ్లీ ఈ ఏడాది కూడా అదే తిథి దాకా వేచి చూడు. జరగబోయేది నీకే తెలుస్తుంది’’ చెప్పాడు అగస్త్యుడు.
దుఃఖభారంతో ఆర్యాంబ అక్కడినుంచి కదిలి లోనికి వెళ్లిపోయింది. మహర్షులింకా అక్కడే కూర్చుని ఉన్నారు. తల్లి పూర్తిగా లోపలికి వెళ్లేదాకా శంకరుడు ఓపిక పట్టాడు.
అగస్త్యునికి చేతులు జోడించి, ‘‘మహాత్మా! ఇందాకటి విషయాన్ని కాస్త వివరంగా చెప్పమని కోరుతున్నాను. జైమిని మహర్షి పట్ల వ్యాసుడు ప్రవర్తించినట్లుగానే, గౌతముడు కూడా ప్రవర్తించాడని చెప్పారు. అసలు జరిగిందేమిటి?’’ అని అడిగాడు శంకరుడు.

అగస్త్యుడు చెప్పడం ప్రారంభించాడు. ‘‘శంకరా! నువ్వు దర్శన శాస్త్రవేత్తవు. నీకు ఎక్కువగా చెప్పాల్సిన పని లేదు. జ్ఞానమే గొప్పదంటాడు వ్యాసుడు. అటూ ఇటూ ఊగిసలాడే సంశయం జ్ఞానం కాదంటాడు జైమిని. ప్రమాణ సహితం, శాస్త్రీయం అయిన జ్ఞానం లేకపోతే... కుక్క అనుకుని మేకను వదిలేసి యజ్ఞం చెడగొట్టుకున్న బ్రాహ్మణునిలా మోసపోతావని హెచ్చరిస్తాడు. అజ్ఞానంలో నుంచి పుట్టిన మాయాజాలమే జగత్తు అంటాడు వేదవ్యాసుడు. ‘అధాతో బ్రహ్మజిజ్ఞాసా’ అని వ్యాసుడు బ్రహ్మసూత్రం చెప్పాడు. కర్మలన్నీ యథావిధిగా పూర్తిచేసిన తరువాతే ఆ పనికి పూనుకోమని జైమిని హెచ్చరిస్తాడు. భారతంలో వ్యాసుడు విడిచిపెట్టిన అశ్వమేధాది యాగ రహస్యాలను విడమరుస్తూ తన పేరిట ఓ భారతం రచించాడు జైమిని. దాంతో వ్యాసుడు కోపించి, నీ ముఖం చూడను పొమ్మన్నాడు. గురువు కన్నెర్ర చేస్తే శిష్యుడు అగాథకూపంలో పడిపోతాడు. గురువును దర్శించడానికి వచ్చాడు. శిష్యుడు తనంత తానుగా వచ్చి గురువును చూడబోతే, దర్శనం ఇవ్వనని చెప్పకూడదు. అప్పుడు పాదాల్లో కన్నులు మొలిపించుకుని అక్షపాదుడై వ్యాసుడు, జైమినిని దీవించాడు’’ చెప్పాడు అగస్త్యుడు.

తరువాత తన విషయంలో జరిగిన దానిని గౌతముడే స్వయంగా చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘వారణాసిలో సాక్షాత్తూ విశ్వనాథుని ముందే నిలబడి, శివుడి కంటే విష్ణువే గొప్ప అని చెప్పిన గుండెలు తీసిన బంటు వ్యాసుడు. నా న్యాయదర్శనాన్ని ఆక్షేపించాడంటే పెద్ద విచిత్రం ఏమీ లేదు. ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, శబ్దం అనే ప్రమాణాలతో పాటుగా పదార్థాన్ని పదహారు రకాలుగా విశ్లేషించుకోవడం ద్వారా ఈశ్వరజ్ఞానం పొందవచ్చని చెప్పాను నేను.  శ్రద్ధావంతుడు తనలోకి తాను చూసుకుంటే చాలు... పదార్థ విశ్లేషణకు పూనుకోనక్కరలేదని వ్యాసుని అభిప్రాయం. అతడు నన్ను దర్శించడానికి వచ్చినప్పుడు నేను కూడా పాదాలలో కన్నులు మొలిపించుకుని అక్షపాదుణ్ణయ్యాను’’ ముగించాడు గౌతముడు.
శంకరుడు ఆలోచనలో పడ్డాడు.
అత్రి మహర్షి తాము వచ్చిన పనిని పూర్తి చేస్తూ శంకరునికి ఇలా ఉపదేశించాడు. ‘‘కర్మ, జ్ఞాన మార్గాలకు మధ్య వంతెన వేయాల్సిన సమయం ఆసన్నమైంది. విగ్రహాన్ని మూర్తిమంతం చేయాలి. దానిముందు అగ్నిహోత్రాన్ని వెలార్చాలి ఇది నా అభిమతం. సన్యాసులకు అగ్నిహోత్రంతో పనిలేదు. కానీ భవిష్యత్తులో నీకు అవసరం రావొచ్చని ఇది చెప్పాను. శంకరా! తొందరపడు. సమయం ఎక్కువగా లేదు. మధ్యందిన మార్తాండునిలాంటి నీ తేజస్సును ఈ మానవులు సుదీర్ఘకాలం పాటు భరించలేరు.’’

‘‘పరమాత్మతో ప్రమేయం లేకుండానే ఆత్మ తనంత తానుగా కైవల్యాన్ని సాధించగలదని చెబుతున్న మహావీరుని సిద్ధాంతం ఇప్పుడు రాజ్యమేలుతోంది. మరోపక్క అనాత్మవాదాన్ని వినిపించడానికి త్వరలో తథాగతుడు రాబోతున్నాడనే అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సంధికాలంలో అవైదిక మతాలను ఖండించి, సనాతన ధర్మాన్ని శిఖరస్థాయిలో నిలబెట్టడమే నీ అవతార పరమార్థం. ఈ పనిని వీలైనంత తొందరలో పూర్తి చేయకపోతే జాతి పెనుప్రమాదంలో పడిపోతుంది’’ చెప్పాడు ఉపమన్యు మహర్షి.
‘‘శంకరా! కర్మిష్ఠులను చేరదీయి. జ్ఞానమే సర్వోన్నతమని ఉపనిషత్‌ మతం ఆధారంగా రుజువు చెయ్యి’’ అన్నాడు గౌతముడు.
‘‘శంకరా! యోగాలలో మహోన్నతమైన నాదానుసంధాన యోగం నీకు సంపూర్ణంగా పట్టుబడింది. దానివల్లనే కనకధార కురిపించ గలిగావు. నదీమార్గాన్ని మళ్లించి తల్లికి ఆనందాన్ని కలిగించావు. సాధన విడిచిపెట్టకు. ఆ తల్లిని నొప్పించకుండా వీలైనంత వేగంగా అనుమతి సంపాదించు’’ అని చెప్పాడు దధీచి.

శంకరునికి విజయం కలగాలని అభిలషిస్తూ అగస్త్యుడు వేదస్వస్తి చెప్పాడు. గొంతు కలిపిన మహర్షులు ఆ నాదంలోనే అంతర్హితులయ్యారు.
శంకరునికి కర్తవ్యం స్థిరపడింది. మహర్షుల మాటలు నెమరు వేసుకుంటూ తల్లి వద్దకు వెళ్లాడు. వంటింటి గడపపై తలపెట్టి నిద్రపోతోందామె. ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లి పోయినట్లు ఆమె ముఖమే చెబుతోంది. విసనకర్రతో విసురుతూ ఆమెకు ఉపచారం చేస్తూ కూర్చున్నాడు శంకరుడు. చాలాసేపటి తరువాత కానీ ఆమె తేరుకోలేదు. మెలకువ వచ్చి కళ్లు తెరిచిన వెంటనే కొడుకు ముఖం కనిపించింది. ‘శంకరా!’ అని మాత్రమే అనగలిగింది మళ్లీ విలపిస్తూ.
‘‘అమ్మా! గాలివేగానికి టపటప కొట్టుకునే జండా వంటిదే మానవదేహం. మూఢమతి అయినవాడు కూడా ఈ దేహం స్థిరమని అనుకోడు. చదువుకున్న దానివి. ఎందుకమ్మా దుఃఖం’’ అన్నాడు. 
ఆ మాటతో ఆమె ఏడుపు మరింత పెరిగిందే కానీ, తగ్గలేదు. తల్లిని తొందరపెట్టి బాధించడం ఇష్టం లేక శంకరుడు అప్పటికి ఊరుకున్నాడు. 
భాద్రపదమాసం ముగిసింది.

వంశానుగతంగా వస్తున్న దుర్గాలయ అర్చకుని హోదాలో శంకరుడు శరన్నవరాత్రులను వైభవంగా నిర్వహించాడు. ఆర్యాంబ తన ప్రయత్నాలను విడిచిపెట్టలేదు. కొడుక్కి పెళ్లి సంబంధాలు వెతుకుతూనే ఉంది. ఇక నిలువరించకపోతే ప్రమాదం అనుకున్నాడు శంకరుడు.
‘‘అమ్మా! సంసార బంధాల నుంచి విముక్తుడినై సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకున్నాను’’ అని చెప్పాడు.
తల్లికి ఆ పలుకులు అశనిపాతంలా తగిలాయి. 
‘‘తండ్రీ! ఎవరు చెప్పిన మాటరా  ఇది?  ఎందుకొచ్చింది నీకీ పెడబుద్ధి?! నీకోసం మేమెన్ని పాట్లు పడ్డామో తెలుసా! ఒక్కగొనొక్క కొడుకువి కదా... చక్కగా పెళ్లి చేసుకుని, వంశాన్ని ఉద్ధరించ గలవని ఎంత ఆశ పెట్టుకున్నాను! అసలు నువ్వేమంటున్నావో తెలిసే అంటున్నావా?’’
‘‘అవునమ్మా! స్థిరబుద్ధితోనే చెబుతున్నాను. నేను సన్యసిస్తాను.’’
‘‘వీల్లేదు. నేనొప్పుకోను. నువ్వు పెళ్లి చేసుకోవలసిందే’’ ఖండితంగా చెప్పింది ఆర్యాంబ.
‘‘అమ్మా! నేను అల్పాయువునని తెలిసి కూడా పెళ్లికి సిద్ధపడమంటావా?’’

‘‘ముప్పై రెండేళ్ల ఆయుర్దాయం ఉందని అగస్త్యుల వారు చెప్పనే చెప్పారు. ఆ వయస్సుకి పెళ్లాడి, చక్కగా సంతానాన్ని కన్నవారు ఎందరు లేరు? నువ్వు వంశాన్ని ఉద్ధరించు. నీ చేతిమీదుగా నన్ను దాటించు.’’ 
‘‘అమ్మా! నీకూ నాకూ మధ్య ఎన్ని జన్మలు గడిచాయో నీకేమైనా గుర్తుందా? ఎన్నిసార్లు నువ్వు నన్ను కన్నావో... నాలాంటి వారిని ఎందరు కొడుకులను, కూతుళ్లను ఎన్ని జన్మలలో కన్నావో తెలుసా? గత జన్మలలో పోగొట్టుకున్న సంతానం కోసం ఇప్పుడు బాధపడగలమా? బాటసారులు ఒక సత్రంలో కలుసుకుంటారు. తెల్లవారిన తరువాత ఎవరి దారిన వారు వెళ్లిపోతారు. మనమూ అంతే. ఈ మాత్రం దానికి దుఃఖించడం మంచిదేనంటావా?’’ అడిగాడు శంకరుడు.
‘‘ఈ మెట్టవేదాంతం నాకు చెప్పబోకు. నా కొడుకు గృహస్థు కావాలి. నా గడప పచ్చబడాలి. ఇంట కోడలు దీపం పెట్టాలి. మనుమళ్ల నెత్తుకుని నా తనువు పువ్వులా రాలిపోవాలి. ఇంతే నాకు కావలసింది. నీ పిచ్చి కోరికలు కట్టిపెట్టు’’ కఠినంగా చెప్పి ఆర్యాంబ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది.

శంకరుడు ఆలోచనా పరుడయ్యాడు. దీపావళి అమావాస్య మహోత్సాహంగా ముగిసింది. శివకేశవ ప్రీతికరమైన కార్తికం ప్రవేశించింది. దేహళీదత్త దీపాలతో కాలటిలో ఇళ్లన్నీ ఇరుసంధ్యలలోనూ శోభస్కరంగా వెలుగుతున్నాయి. రోజులు గడుస్తున్నాయి. దుఃఖంలో పాపం ఆర్యాంబకు మరపు వచ్చింది కానీ, ఆనాడు ఆమెతో అగస్త్యుడు చెప్పిన గడువు సమీపించింది. కార్తిక శుద్ధ ఏకాదశి ఉషోదయమైంది.
శంకరుడు పూర్ణా నదిలో సూర్యునికి అర్ఘ్యమిస్తున్నాడు. 
ఆర్యాంబ అప్పటికే స్నానం పూర్తి చేసి, పూజకోసం పెరటి చెట్లనుంచి పూలు కోసుకుంటోంది. కొడుకును ఓ కంట చూసుకుంటూనే ఉంది. శ్రీకృష్ణ స్తోత్రం మననం చేసుకుంటూనే ఉంది.
ఉన్నట్లుండి నదిలో నుంచి ‘‘అమ్మా!’’ అన్న శంకరుని ఆక్రందన ఆమె కర్ణపుటాలను బద్దలు కొట్టింది.
(సశేషం)
- నేతి సూర్యనారాయణ శర్మ

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

పండితుడి గర్వభంగం

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

ఫస్ట్‌ టైమ్‌ రాబరీ..!

నాకు ఆ సమస్య ఉంది

వాసన లేని పువ్వు

ఓహో! అదా విషయం!

సన్యాసికి లోకమంతా ఇల్లే

రావిచెట్టుకు రక్తం కారుతోంది..!

కీచైన్‌ ఉద్యమం

తెల్లదొరలను వణికించిన తెలుగు పాట

కుక్క కాటుకు పప్పు దెబ్బ..!

వచ్చిన వాడు ఫల్గుణుడే...

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

ఇంటింటా చాక్లెట్‌..

సాయంత్రం సరదాగా స్నాక్స్‌తో..

టారో-వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

బంగారు కల

స్థితప్రజ్ఞారాముడు

జనాభాలో మనమే నంబర్‌ వన్‌!

ఆత్మహత్య కానే కాదు...

దాని గురించి నాకు ఏమీ తెలియదు

ద్రౌపది..

ఐదు పైసలు వరదక్షిణ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం