అజ్ఞాత వీరుడు 

1 Sep, 2019 10:41 IST|Sakshi

కథా ప్రపంచం

ఆషాఢ మాసం. రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయం. కన్ను పొడుచుకున్నా కానరాని కారుచీకటి. వాన హోరుమని కురుస్తోంది. సుబ్బన్నగౌడుగారు అరుగుమీద కూర్చుని లాంతరు వెలుగులో లెక్కలు పత్రాలు చూస్తున్నారు.
లింగడు బయట నుంచి చేతిలో ఒక లాంతరు పట్టుకుని వచ్చి ‘‘అయ్యా! ఏరు పొంగు ఏడవ మెట్టు మీదకు వచ్చింది’’ అన్నాడు.
సుబ్బన్నగౌడుగారు కంగారుగా చప్పున పైకిలేచి ‘‘పద చూద్దాం’’ అంటూ కంబళి భుజాల మీద వేసుకుని బయలుదేరారు. ఇద్దరూ ఏరు ప్రవహిస్తున్న చోటికి వెళ్లి, ఐదారు మెట్లు దిగి నిలుచున్నారు. ఎర్రటి నురుగు తెరలు వాళ్ల కాళ్లకి కొట్టుకుంటున్నాయి. తుంగా నదీ ప్రవాహం ఉరకలు వేస్తోంది. లాంతరు వెలుగులో అలలు తళతళ మెరుస్తున్నాయి. వర్షం భోరున కురుస్తోంది. వాళ్లు అక్కడ నుంచుని చూస్తూ ఉండగానే ఆరో మెట్టు నీళ్లలో మునిగిపోయింది. వాళ్లు ఐదవ మెట్టు మీద నుంచున్నారు. సుబ్బన్నగౌడుగారు లింగడి వైపు తిరిగి ‘‘నిన్న ఎక్కడిదాకా వచ్చాయిరా నీళ్లు?’’ అని అడిగారు.
‘‘నిన్న ఇంతగా లేదు. ఎనిమిదో మెట్టు మీద ఉన్నాయట నీళ్లు. అయినా నిన్నకెరె గ్రామం అంతా కొట్టుకుపోయిందట. కెళమనె రంగప్పగౌడుగారి కొడుకు రాము దొరకనే లేదట. చాలా గోలగోలగా ఉంది.’’

గౌడుగారి మొహంలో భయపు ఛాయ తొంగిచూసింది. ‘‘ఇవాళ పైవైపు వర్షాలెలా ఉన్నాయట, నీకేమైనా తెలుసా?’’’ అంటూ కటిక చీకటి వైపు గుడ్డిగా చూడసాగారు.
‘‘పైన వర్షం జోరుగా ఉందట. శృంగేరి వైపు సరేసరి. ఆగకుండా కురుస్తోందట’’ అంటూ లాంతరు వెలుగులో కిందకు చూసి, ‘‘అయ్యా! ఇటు చూడండి. నీరు ఐదో మెట్టుకి ఎక్కుతోంది’’ అన్నాడు. గౌడుగారు కిందకి చూశారు. ఆయన గుండె జారింది. మొహం నల్లబడింది.
ఇద్దరూ వెనుదిరిగి ఇంటివైపు మళ్లారు. గౌడుగారు కంబళి తీసివేసి వేడినీళ్లతో కాళ్లు కడుక్కుని జంఖానా మీద కూర్చుని, చేతులు వెనక్కి ఆన్చి ఆలోచనలో పడ్డారు. లింగడు లాంతరు తగ్గించి, కంబళి దులిపి దండెం మీద వేసి వంటింట్లోకి వెళ్లాడు.
గౌడుగారి భార్య నాగమ్మ ‘‘ఏమిటి లింగా, లాంతరు తీసుకుని బయటకెళ్లారెందుకు? ఏరు బాగా పొంగిందా ఏం?’’ అన్నారు. గౌడుగారి పన్నెండేళ్ల కొడుకు తిమ్ము, కూతురు సీత భోజనానికి కూర్చున్నారు. ఏరు పొంగే విషయం రాగానే, భోజనం మానేసి తదేకంగా వాళ్ల సంభాషణ వినసాగారు.
‘‘అవునమ్మా ఏరు బాగా పొంగుతోంది. అందులోనూ పైనుంచి వర్షం ఎక్కువగా ఉంది. నిన్నకెరె గ్రామం కొట్టుకుపోయిందట. పాపం ఆ కెళమనె రంగప్పగౌడుగారి రాము ఇంకా దొరకలేదట.’’

నాగమ్మ భోజనానికి కూర్చున్న పిల్లల వైపు చూశారు. ఎందుకు చూశారో ఎవరికి తెలుసు? వాళ్లు అన్నం మానేసి కూర్చోడం చూసి తనే వాళ్ల దగ్గరగా కూర్చుని తినిపించసాగారు.
సీత ముద్ద నోట్లో పెట్టుకోబోతూ, ‘‘అమ్మా రాము ఏమయ్యాడు?’’ అంది.
నాగమ్మ ‘‘ఏంకాలేదు. నువ్వు అన్నం తిను’’ అన్నారు.
తిమ్ము ‘‘ఏమిటమ్మా లింగడు చెప్పేది?’’ అన్నాడు.
‘‘ఏం లేదు బాబూ, ఏరు పొంగుతోందట అంతే. నువ్వు అన్నం తిను’’ అనేసి, ‘‘కదురా లింగా’’ అన్నారు.
సుబ్బన్నగౌడుగారు అరుగు మీద నుంచి ‘‘లింగా’’ అని పిలిచారు. లింగడికి చెవి కొంచెం మందం. వినబళ్లేదు. మళ్లీ పిలిచారు. అప్పుడు నాగమ్మ ‘‘లింగా, పిలుస్తున్నారు. వాళ్లరా’’ అన్నారు. లింగడు తటాలున లేచి తన కుంటికాలితో సొట్టగా అడుగులు వేస్తూ వెళ్లాడు. పాపం! అతని కుడికాలు ఎడంకాలి కంటే కొంచెం పొట్టి, సన్నమూను.
లింగడు అరుగు మీదికెళ్లి ‘‘ఎందుకయ్యా పిలిచారు?’’ అని అడిగాడు.
గౌడుగారు, ‘‘వెళ్లి చూసిరా నీళ్లు ఎంతవరకు వచ్చాయో’’ అన్నారు.

లింగడు లాంతరు వొత్తి పెద్దది చేసి, దీపం పెద్దది చేసి కంబళి కప్పుకుని ఏటి వైపు వెళ్లాడు. వాడు వెళ్లిన కాసేపటికి గౌడుగారు ‘‘నాగా’’ అని పిలిచారు. ఎనిమిదేళ్ల కుర్రవాడు ఒకడు వక్కలు ఉడికించే పొయ్యి వైపు నుంచి పరుగెత్తుకు వచ్చి, స్తంభానికి వెనుక నుంచుని ‘‘ఏంటయ్యగారూ’’ అన్నాడు.
గౌడుగారు, ‘‘పశువుల్ని కట్టేశార్రా?’’ అని అడిగారు.
‘‘కట్టేశామయ్యా. తుంగ ఆవు, బుజ్జి దూడ రెండూ మాత్రం పాకకి తిరిగి రాలేదు.’’
‘‘పోన్లే’’, అంటూ గౌడుగారు దిండునానుకుని కూర్చున్నారు. నాగడు మెల్లిగా చలి కాచుకోవడానికి పొయ్యి దగ్గరకెళ్లిపోయాడు. అప్పటికి ఏటి దగ్గరకెళ్లిన లింగడు తిరిగి వచ్చాడు. గౌడగారు ‘‘నీళ్లింకా పైకి వచ్చాయా?’’ అనడిగారు.
అతడు లాంతరు కింద పెట్టి కంబళి దులుపుకుంటూ ‘‘నాలుగో మెట్టు వరకు వచ్చిందయ్యా’’ అన్నాడు.
‘‘అయితే పశువుల పాకలోకి వెళ్లి అన్ని పశువులను మెడపలుపు వదిలేసి రా’’ అన్నారు. గౌడుగారు మళ్లీ తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చున్నారు. 
లింగడు తన కొడుకు నాగణ్ణి కూడా తీసుకుని పాకలోకి వెళ్లాడు. నాగమ్మ లోపల్నుంచి వచ్చి, ‘‘విస్తరి వేశాను’’ అంటూ చెంబుతో తెచ్చిన నీళ్లు అక్కడ పెట్టారు. సుబ్బన్నగౌడుగారు లేచి చెంబు తీసుకుని నోరు పుక్కిలించి ఉమ్మేసి భోజనానికి వెళ్లారు. తిమ్ము, సీత– ఇద్దరూ అరుగు మీద లాంతరు వెలుగులో కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు. లింగడూ, నాగ వచ్చి అరుగు కొసలో కూర్చున్నారు. వాళ్లిద్దరితో తిమ్ము, సీతలకి బాగా చనువు.

తిమ్ము ‘‘లింగా, ఏరు బాగా పొంగిందా?’’ అని అడిగాడు.
లింగడు ‘‘లేదయ్య ఎప్పుడూ పొంగేలాగానే’’ అన్నాడు.
లింగడి దగ్గర కూర్చున్న సీత సంభాషణ పట్టించుకోలేదు. ఆమె మనసంతా మరెక్కడో ఉంది. ఓసారి లింగడి కాళ్లవైపు, మరోసారి చేతివైపు చూస్తోంది. ఆమెకి చాలా ఆశ్చర్యంగా ఉంది.
ఆఖరికి కుతూహలం ఆపుకోలేక ‘‘లింగా, ఇదేమిటి? నీ కాళ్లకి, చేతులకి అలా మచ్చలు పడి ఉన్నాయెందుకు?’’ అని అడిగింది.
ఆ మాట వినగానే లింగడి మొహం నల్లబడిపోయింది. నోట మాట రాలేదు. కంట నీరు నిండింది. పాత జ్ఞాపకాల వల్ల కలిగిన బాధని దిగమింగుకుంటూ దీనంగా ‘‘అవన్నీ మీకెందుకులే సీతమ్మా’’ అన్నాడు.
తిమ్మూకి లింగడిని ఆ పరిస్థితిలో చూసి జాలితో పాటు ఆశ్చర్యమూ వేసింది. సీతకి మారుగా అతనే ‘‘లింగా, మా ముందు సంకోచమెందుకురా మాతో చెప్పకూడదూ?’’ అన్నాడు.

‘‘మీతో చెప్పడానికేం లెండి. ఇవి జైల్లో సంకెళ్లు వేసిన గుర్తు’’ అన్నాడు.
అమాయకుడైన లింగడు జైల్లో ఉండేవాడని విని తిమ్ము పసి హృదయానికి బలమైన గాయం తగిలినట్లయింది. ‘‘ఏమిటి నీకు జైలా? ఏ పుణ్యాత్ముడయ్యా నిన్ను జైలుకి పంపింది?’’ అన్నాడు.
ఇంతకుముందు నేను మారినహళ్లి రంగనాయకగారి దగ్గర పని చేసేవాడిని. అక్కడ ఐదారేళ్లు జీతానికి ఉన్నానయ్యా. ఏదో ఎవరెవరిదో సావాసం. తాగుడు అలవాటైంది. ఓరోజు సాయంత్రం సారా తాగాను. అందులో ఏటి కలిపారో ఏటో బాగా మత్తెక్కేసింది. తోవలో నడుస్తున్నాను. రంగనాయకగారి కొడుకు శేషనాయక అని ఉన్నాడు. ఆయనకీ బాగా తాగి మత్తెక్కి ఉంది. ఎక్కడి నుంచో వస్తున్నాడు. నాకు దగ్గరగా వచ్చి నోటికొచ్చినట్టు తిట్టసాగాడు. నాకూ తాగిన మత్తులో యజమాని కొడుకని తెలీలేదు. నేనూ తిట్టాను. తర్వాత కొట్టుకున్నాం. ఆయనకు దెబ్బలు బాగా తగిలాయి. నా మీద ఫిర్యాదు చేశారు. నేను పేదవాడిని కనుక నాకు జైలుశిక్ష పడింది.’’

ఆఖరిమాట చెప్పేటప్పుడు అతని కంఠం గద్గదమైంది. కళ్లలో నీళ్లు చిప్పిల్లాయి. పసివాడిలా వెక్కివెక్కి ఏడ్చాడు. అది చూసి అతని కొడుకు నాగడూ ఏడవసాగాడు. సీత కళ్లల్లోనూ నీళ్లు తిరిగాయి. తిమ్ము ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. లింగడు తనను తాను సంభాళించుకున్నాక తిమ్ము పసిపిల్లాడిలాగా ‘‘లింగా నిన్ను జైల్లో చాలా కష్టపెట్టారా?’’ అని అడిగాడు.
‘‘తిమ్మయ్యా, ఇప్పుడవన్నీ తలచుకుని ఏడ్చి మాత్రం ఏం లాభం? నేను జైలు నుంచి వచ్చేసరికి నా పెళ్లాం చచ్చిపోయింది. కొడుకు దిక్కులేని వాడై అడుక్కు తింటున్నాడు.’’
‘‘అయితే ఎన్నేళ్లున్నావు జైల్లో?’’
‘‘రెండేళ్లు తిమ్మయ్యా రెండేళ్లు. తర్వాతైనా సుఖపడ్డాననుకున్నావా? ఉహు.. లేదు. చుట్టాలూ పక్కాలూ జైల్లో ఉండొచ్చానని నన్ను దగ్గరకు చేరనియ్యలేదు. పిల్లాడితో నానా అగచాట్లు పడ్డాను. ఆఖరికి ఎవరో శివనూరు సుబ్బణ్ణగారి దగ్గరకెళ్లు అన్నారు. ఇటొచ్చాను. మారాజు మీ అయ్య. తిండి గుడ్డ ఇచ్చి చచ్చిపోయిన వాడిని బతికించారు’’
లింగడు కథ ముగించగానే తిమ్ము నిట్టూర్చి, ‘‘లింగా, నువ్వు మా ఇల్లు వదిలిపెట్టి వెళ్లకు. నాగడూ అంతే.’’ అన్నాడు.
‘‘అట్టాగేనయ్యా, అట్టాగే..’’

ఉరుములు, మెరుపులు, పిడుగులు, గాలి, వాన పిచ్చెక్కినట్టుగా ఉంది వాతావరణం. ఇంట్లో అందరూ పడుకున్నారు. లింగడు, సుబ్బణ్ణగౌడు ఇద్దరే మెలకువగా అరుగు మీద కూర్చున్నారు. ఇద్దరూ అప్పుడప్పుడు వెళ్లి ఏరు చూసుకుని వస్తున్నారు. అక్కడ నీళ్లు పైపైకి వస్తూనే ఉన్నాయి. 
‘‘లింగా, పడవ ఎక్కడ కట్టావురా? ఇల్లు వదిలి వెళ్లాల్సి రావచ్చు.’’
లింగడు కాస్త కంగారుగా ‘‘ఆ పుల్ల మామిడి చెట్టు వేరుకి కట్టాను. నీరెక్కిందో ఏమో, ఇప్పుడక్కడికి వెళ్లగలనో లేదో’’ అనుకుంటూ లాంతరు పట్టుకుని బయటకు పరుగెత్తాడు. సుబ్బణ్ణగౌడుగారూ అతన్ననుసరించారు. అక్కడికి వెళ్లి చూస్తే అనుమానం నిజమైంది. ప్రవాహం మామిడి చెట్టు మొదల్ని ముంచేసింది. ఇద్దరికీ కాసేపు దిక్కు తోచలేదు. వాగువైపు చూస్తూ నుంచుండిపోయారు. సరిగ్గా అప్పుడే ఇంటి వెనుక ఏదో పడిపోయిన చప్పుడు అయింది. ఇద్దరూ అటు పరుగెత్తారు. పెరటివైపు గోడ పడిపోయి నీళ్లు లోగిట్లోకి చొచ్చుకొస్తున్నాయి. ఇక ఆలస్యం చేస్తే సర్వనాశనం తప్పదనిపించింది గౌడుగారికి.

అన్ని గదుల్లోకి వెళ్లి పడుకున్న వాళ్లందర్నీ లేపేశారు. వాళ్లంతా సగం నిద్రలో కంగారుగా అరుగు వైపు పరుగెత్తారు. గౌడుగారు అందర్నీ స్థిమితంగా ఉండమని చెప్పి, లింగడి కోసం చుట్టూ చూశారు. లింగడెక్కడా కనిపించలేదు. ‘‘లింగా! లింగా!’’ అని కేక పెట్టారు. బదులు రాలేదు. అప్పటికి భయంకరంగా గాలి వీస్తోంది. పిచ్చిగా వర్షం కురుస్తోంది. ముంగిట్లో ఉన్న కొబ్బరిచెట్టు ఇంటికి కప్పిన రేకుల మీద పడి పెద్ద చప్పుడైంది. తిమ్ము, సీత, నాగ భయంతో గట్టిగా అరిచారు. నాగమ్మగారూ ‘‘దేవుడా’’ అంటూ దేవుణ్ణి తల్చుకున్నారు. గౌడుగారు అందరికీ ధైర్యం చెబుతూ, లింగడిని కేకేస్తూ పరుగెత్తారు. వెళ్లి చూసేసరికి లింగడు మామిడి చెట్టు మొదట్లో చేరుకుని పడవ విప్పుతున్నాడు. ఇంటి కిటికీకి ఒక కొబ్బరితాడు కట్టి దాని సాయంతో మామిడి చెట్టు మొదట్లోకి చేరుకున్నాడతను. కాసేపట్లో పడవ విప్పి అందులోకి ఎక్కాడు. కిటికీకి కట్టిన తాడుని మాత్రం చేతిలో పట్టుకున్నాడు.

గాలి హోరులో లింగడు గౌడుగారితో ‘‘అయ్యా తాడు పట్టుకుని లాగండి’’ అన్నాడు. ఆయన అలాగే చేశారు. పడవ ఒడ్డుకు చేరింది. అంతలో లోపల్నుంచి ఏడెనిమిది మంది కెవ్వు కెవ్వుమని అరవడం వినిపించింది.
గౌడుగారు ‘‘లింగా పడవ గుమ్మం దగ్గరగా తీసుకురా’’ అంటూ లోపలికి దూరారు. గుమ్మం దాటే లోపల పనిమనిషి సోమక్క రొప్పుతూ పరుగెత్తుకు వచ్చింది.
గౌడుగారిని చూడగానే సోమక్క అరిచింది. ‘‘మేడ పడిపోయింది. అరుగు మీదకి నీళ్లు వస్తున్నాయి.’’ గౌడుగారు అరుగు మీదకు వచ్చి, ‘‘అందరూ సింహద్వారం వైపు పరుగెత్తండి. లింగడు పడవ తెస్తాడు. ఒరేయ్‌ నాగా ఇటురారా’’ అన్నారు. నాగడు ఆయనతో వెళ్లాడు.
నాగమ్మ, తిమ్ము, సీత, లోకమ్మ, సోమక్క కూతురు దానమ్మ అందరూ సింహద్వారం వైపు పరుగెత్తారు. సోమక్క మాత్రం లోపలి గదిలో తాను దాచుకున్న చిన్న మూట తెచ్చుకోవడానికని వెళ్లి తిరిగి రానే లేదు. గౌడుగారు అరుగు మీదనున్న బీరువా తెరిచి, రెండు పెట్టెలు తీసి, బీరువా తలుపు మూశారు. అక్కడే ఉన్న ఇనుప బీరువా తెరిచి, మళ్లీ ఏమనుకున్నారో ఏమో గాని తలుపు మూసి తాళం వేసేశారు.

‘‘నాగా ఈ పెట్టె తీసుకోరా’’ అన్నారు. ఇద్దరూ చెరో పెట్టె మోసుకుంటూ బయల్దేరారు. లింగడు అందరినీ పడవ ఎక్కించి, కొనని పట్టుకుని నుంచున్నాడు. గౌడుగారు త్వరత్వరగా వచ్చి పెట్టెల్ని పడవలో పెట్టి, నాగడిని ఎత్తి లోపల కూర్చోపెట్టి, తానూ ఎక్కి, లింగడిని పడవ ఎక్కమని చెప్పి, తానొక కొసన కూర్చుని తెడ్డు చేతికి తీసుకున్నారు. సీత, నాగమ్మగారితో ‘‘అమ్మా! సోమక్కేదీ?’’ అని అడిగింది. సరిగ్గా అదే సమయంలో ఇల్లు పడిపోయిన చప్పుడూ ఏదో కేక వినిపించాయి. సోమక్క కూతురు దానమ్మ కూడా తల్లి ఆశ వదులుకుంది.
పడవ చాలా చిన్నది. ఐదారుగురు మాత్రం కూర్చోగలిగినది. నిండు ప్రవాహంలో ఇద్దరైతే సరిపోయేది. ఇప్పుడందులో ఏడుగురు ఉన్నారు. దానితో పాటు రెండు పెట్టెలు కూడా. లింగడికి చోటు లేదనిపించి, ఏం చెయ్యడానికి తోచక నుంచునుండి పడవ సురక్షితంగా ఒడ్డు చేరుతుందా అని ఆలోచిస్తున్నాడు.

అతని ఆలస్యం చూసి గౌడుగారు, ‘‘లింగా ఎందుకురా ఆలస్యం? ఎక్కరా’’ అని కలవరం కూడిన కంఠంతో గద్దించారు.
లింగడు ‘‘అయ్యా చోటు లేదే, ఇప్పటికే పడవకి బరువు ఎక్కువైంది. నేనూ కూర్చుంటే పడవ ఒడ్డు చేరేదెట్టా?’’
‘‘అయితే ఇప్పుడేం చేద్దాంరా? అయ్యేదేదో అవుతుంది ఎక్కు.. దేవుడెలా దయతలిస్తే అలా అవుతుంది’’ అంటూ గౌడుగారు నదివైపు చూశారు. ఆయన ఒళ్లు జలదరించింది.
లింగడు, ‘‘అయితే ఒక పని చేయండయ్యా. మీరంతా ఒడ్డు చేరాక పడవ ఎవరితోనైనా పంపించండి. అంతవరకు నేనిక్కడే ఉంటాను. మీరేం భయపడవద్దు’’ అన్నాడు.
గౌడుగారికి కోపం వచ్చింది. పడవ ఎక్కమని గట్టిగా అరిచి ఆదేశించారు. లింగడు మరి మాట్లాడకుండా పడవ మరో కొసన కూర్చుని తెడ్డు పట్టుకున్నాడు. గౌడుగారు తమ బందూకు నుంచి పది పన్నెండు గుళ్లు పేల్చారు.
పడవ బయలుదేరింది.

ఆ గాలి, వాన, చీకటి– వీటి మధ్యన ‘ఢాం– ఢాం’ అన్న బందూకు చప్పుడు గంభీరంగా మోగి మలెనాడు కొండలు గుట్టల మధ్య నుంచి గంభీరంగా ప్రతిధ్వనించింది. దూరపు పల్లెల్లోని జనం మేల్కొని గుళ్ల చప్పుడు విని ఆశ్చర్యపోయారు.
శివనూరికి రెండు మైళ్ల దూరాన ఉన్న నుగ్గేహళ్లిలో ఇంటి అరుగు మీద పడుకున్న రామే గౌడు, అతని తమ్ముడు సిద్ధే గౌడు కూడా బందూకు పేలిన చప్పుడు విని ఆశ్చర్యంగా లేచి కూర్చున్నారు. 
సిద్ధే గౌడు రామేగౌడుతో ‘‘అన్నయ్యా, అదేమిటి గుండు పేలిన చప్పుడు కదా?’’ అన్నాడు.
రామే గౌడు ‘‘ఎటువైపు నుంచి వినిపించిందిరా?’’ అన్నాడు.
‘‘కెమ్మణ్ణుచ్చి వైపు నుంచి అనిపిస్తోంది మరి’’
‘‘కాదనుకుంటా.. శివనూరి వైపు నుంచి వినిపించినట్టు అనుమానంగా ఉంది’’
‘‘ఎక్కడైనా ఏరూ గీరూ పొంగిందేమో!’’
‘‘ఏదో ఉండే ఉంటుంది. ఏమైనా సరే, నలుగురైదుగురిని తీసుకుని వెళదాం పద’’
సిద్ధేగౌడు హడావుడిగా లాంతరు వెలిగించాడు. రామేగౌడు గురకపెడుతూ నిద్రపోతున్న రంగడిని లేపి నలుగురైదుగురు పనివాళ్లని తీసుకు రమ్మని పురమాయించాడు.

‘‘రామ రామా’’ అంటూ స్త్రీలు పిల్లలూ గోల పెడుతున్నారు. ఆ గోల ప్రవాహపు అలల తీవ్రత మధ్య చిక్కు పడుతూ, లేస్తూ, పడుతూ, తేలుతూ పడవ నుంచి బయటపడి గాలి హోరులో కలిసిపోతోంది. సుబ్బణ్ణగౌడుగారు, లింగడు ఇద్దరూ ధైర్యంగా తెడ్లు వేస్తున్నారు. పడవ మధ్యనున్న లాంతరు చీకటికి భయపడి మూల దాక్కున్నట్టు తన చుట్టూరా ఒక్క అడుగు మేర మాత్రం వెలుగు చూపెడుతోంది. బరువు వల్ల పడవ ఇప్పుడో అప్పుడో మునిగిపోతుందేమో అన్నట్టుంది.
గౌడుగారు పడవలో ఉన్న విలువైన పెట్టెలు రెండింటినీ తీసి నీటిలో పారేశారు. అయినా బరువు తగ్గలేదు. ఎంత చెప్పినా వినకుండా స్త్రీలూ పిల్లలూ ‘రామా రామా’ అని గోలపెట్టడం మానలేదు. దిక్కు తెలియక పిచ్చిగా ఊగుతోంది పడవ. ఓసారి అది మునిగిపోతున్నట్టు వాలి, కొద్దిగా నీళ్లు లోపలికి వచ్చాయి. మళ్లీ అందులోని జనం ‘రామా రామా’ అని అరవసాగారు.
తెడ్డు వేస్తున్న లింగడు స్త్రీలూ పిల్లలూ చేస్తున్న హాహాకారాలను వింటూనే ఉన్నాడు. అతని గుండె కరిగి నీరైంది. పడవ భారంతో మునిగిపోవడం ఖాయమనే అనుకున్నాడు. బరువు తగ్గించడానికి ఏ ఉపాయమూ కనిపించలేదతనికి. ఉన్నట్టుండి అతని మొహం గంభీరమైంది. తెడ్డు వెయ్యడం ఆపి వాన జోరులో చుట్టూ చూశాడు. ఒకరి మొహాలొకరికి కనిపించడం లేదు. కనిపించినా ఎవరూ చూసే స్థితిలో లేరు. తను నీళ్లలోకి దూకేస్తే బరువు తక్కువై పడవ సురక్షితంగా ఒడ్డు చేరవచ్చు. తనని లోకమంతా దొంగ అని ముద్రవేసి దూరం చేసినప్పుడు తిండీ నీళ్లూ ఇచ్చి బతుకుతెరువు చూపించిన వారిని ఎలాగైనా కాపాడాలనిపించింది. తెడ్డు లోపల పెట్టి దూకబోయాడు.

అప్పుడు కొడుకు గుర్తుకొచ్చాడు. కొంచెం తటపటాయించి ఒక క్షణం ఆగాడు. అప్పుడే పడవ మునిగిపోయేలా పక్కకి వాలడంతో అందరూ ‘రామ రామ.. అయ్యో అయ్యో’ అని అరవసాగారు.
లింగడు నిట్టూర్చాడు. అందరూ ఉండగానే పడవ ఒడ్డు చేరకూడదా అనుకున్నాడు. కాని అది ఆత్మవంచన చేసుకునే ఆలోచన అనిపించింది. 
మళ్లీ ‘అయ్యో’ అన్న గోలతో పడవ దద్దరిల్లింది. 
లింగడు వెనుకా ముందూ చూడకుండా ‘రామ రామ’ అంటూ నీళ్లలోకి దూకేశాడు.
అతనలా దూకెయ్యడం ఆ కటిక చీకటిలో ఆ గాలి వానలో ఎవరికీ తెలియలేదు. పడవ బరువు తగ్గి మొదటి కన్నా సులువుగా ప్రయాణించసాగింది.
గౌడుగారు ‘‘లింగా, భగవంతుడి దయవల్ల పడవ కాస్త సులువుగా వెళుతోందిరా’’ అన్నారు. అందులో లింగడి దయ కూడా చేరిందని తెలియదాయనకి.

కాసేపట్లో స్త్రీలు, పిల్లలు ‘దీపం... దీపం’ అని అరిచారు. సుబ్బణ్ణగౌడుగారు తిరిగి చూశారు. ఒడ్డున ఐదారు దీపాలు కనిపించాయి. ఆ వెలుగులో పది పదిహేను మంది మనుషులూ ఉన్నట్టు కనిపించింది. ఒడ్డు నుంచి బందూకు చప్పుళ్లు వినిపించాయి. మెల్లిగా తేలుతూ పడవ ఒడ్డుకు వెళ్లింది.
రామేగౌడు, సిద్ధేగౌడు పరుగున వచ్చి స్త్రీలను, పిల్లలను పడవ నుంచి జాగ్రత్తగా దింపుతున్నారు. సుబ్బణ్ణగౌడుగారు ‘‘ఉన్నప్పా’’ అంటూ దిగారు. అందరం ఒడ్డుకు చేరాం కదా, బతికి బయటపడ్డాం కదా అన్న ఆనందం, ఆ సంబరంలో ఎవరికీ లింగడి గురించిన ఆలోచన రాకపోవడంలో ఆశ్చర్యం లేదు. కాని నాగడు మట్టుకు ఏడుస్తున్నాడు. అదిచూసి సిద్ధేగౌడు ‘‘ఏంటిరా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు?’’ అని అడిగాడు.
వాడు వెక్కి వెక్కి ఏడుస్తూ ‘‘అయ్యా’’ అన్నాడు.
సుబ్బణ్ణగౌడుగారు ‘‘ఏమిటి సిద్ధేగౌడుగారు?’’ అని అడిగారు.
‘‘ఈ కుర్రాడు ‘అయ్యా’ అని ఏడుస్తున్నాడు’’ అన్నాడు. ఆ మాట వినగానే సుబ్బణ్ణగారి మొహం తెల్లగా పాలిపోయింది. చప్పున లేచి నుంచుని ‘‘లింగా, లింగా’’ అని కేకేశారు. అడవిలోంచి ‘‘లింగా, లింగా’’ అని ప్రతిధ్వని వచ్చింది. లింగడెక్కడా కనిపించలేదు. పడవ దగ్గరకు పరుగెత్తారు. అక్కడా లేడు. భీకరమైన చీకటిని కప్పుకుని గంభీరంగా, భయంకరంగా విశాలంగా ప్రవహిస్తున్న నీటిని తదేకంగా చూసి వణికిపోయారు. ఆయనకి దుఃఖం ఆగలేదు. ‘‘లింగా, లింగా’’ అని రోదించారు. నాగడు పడిపడి ఏడుస్తున్నాడు. తిమ్ము, సీత కూడా ఏడవసాగారు.

‘‘మా ఇంట్లో ఓ దీపమే ఆరిపోయింది’’ అని చుట్టూ ఉన్న వాళ్లతో చెప్పుకుని ఏడ్చారు. లింగడి ఆకస్మికమైన చావు కోసం అందరూ శోకించారు. గౌడుగారు నాగడిని ఓదారుస్తూనే ఉన్నారు. అయినా వాడు ఏడవడం మానలేదు. ‘‘అయ్యా.. అయ్యా’’ అని కేకెయ్యడం మానలేదు.
లింగడెలా నది పాలబడ్డాడో ఎవరికీ అర్థం కాలేదు. సుబ్బణ్ణగౌడుగారు లింగడి జాడ ఎక్కడైనా కనిపిస్తుందేమోనన్న ఆశతో కొంతమందిని ఒడ్డు వెంబడే వెతకడానికి పంపించారు.
రామేగౌడుగారు అందరినీ నుగ్గేహళ్లికి రమ్మని ప్రార్థించారు.
తోవ పొడవునా అందరూ లింగడు హఠాత్తుగా కనుమరుగైపోవడం గురించే విస్మయంగా చెప్పుకుంటూ నుగ్గేహళ్లికి చేరుకున్నారు. 
తెల్లవారింది. వర్షం ఇంకా తగ్గలేదు. రాత్రి హడావుడి వల్ల అలసిపోయిన సుబ్బణ్ణగౌడుగారు పక్కమీద పడుకునే రామేగౌడు, సిద్దేగౌడులతో వెనకటి రాత్రి జరిగిన సంగతుల గురించే మాట్లాడుతున్నారు. వాళ్లకి కాస్త దూరంలో ఏడుస్తున్న నాగడిని సీత, తిమ్ము ఓదారుస్తున్నారు.
సీత, ‘‘ఏడవకురా, అయ్య తప్పకుండా వస్తాడు’’ అంటూ వాడి కన్నీరు తుడిచింది.
నాగడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. తిమ్ము ‘‘లింగడు వచ్చేస్తాడురా ఏడవమాకు’’ అని ఓదారుస్తున్నాడు.

అంతలో బయట ఏదో గోల ‘‘లింగడొచ్చాడు, లింగడొచ్చాడు’’ అన్న అరుపూ వినపడ్డాయి.
సుబ్బణ్ణగౌడుగారు లేచి బయటకు పరుగెత్తారు. రామేగౌడు, మిగతావాళ్లూ ఆయన వెంటనే వెళ్లారు. తిమ్ము, సీత, నాగణ్ణి లాక్కుని వెళ్లి అక్కడకు చేరుకున్నారు. నిజంగానే లింగడు వచ్చేశాడు. నాగడు ‘‘అయ్యా’’ అంటూ వెళ్లి అతన్ని వాటేసుకున్నాడు. లింగడి గుడ్డలన్నీ తడిసి సోలిపోతూ, వణికిపోతున్న అతన్ని లోపలికి తీసుకెళ్లి బట్టలు మార్పించి, వేడిగా కాఫీ, ఫలహారం ఇచ్చి, వెచ్చగా పడుకోబెట్టారు.
తర్వాత సుబ్బణ్ణగారు అతని పక్కనే కూర్చుని ‘‘లింగా ఏమైందిరా? అసలు సంగతేంటి?’’ అనడిగారు.
లింగడు క్షీణస్వరంతో ‘‘తెడ్డు వేస్తున్నా కదా! ఓసారి పడవ తలకిందులయినట్లు ఒరిగిందే, అప్పుడు తూలి నదిలో పడ్డాను. పడవని పట్టుకోబోతే ముందుకు పోయింది. కాస్త దూరం ఈదుతూ, తేలుతూ వెళ్లాను. అదృష్టంకొద్దీ కాలికి నేల తగిలింది. గట్టిగా నుంచున్నాను. నడుం వరకు నీళ్లు వచ్చాయి. అలాగే నుంచుండిపోయాను. తెల్లవారాక పొంగు తగ్గింది. మీ ఉప్పు తిన్న రుణముంది కాబట్టి ఇలా రాగలిగాను..’’

గౌడుగారు, ‘‘కాదురా తెడ్డు వేస్తున్న వాడివి తూలిపడితే, తెడ్డు పడవలోకెలా వస్తుంది?’’ అన్నారు.
‘‘ఏమోనయ్యా దేవుడికే తెలియాలి’’
మధ్యాహ్నం భోజనాలయ్యాక తిమ్ము, సీత ‘నేను మొదట చెప్పానంటే, నేను మొదట చెప్పాను’ అంటూ వాదించుకుంటున్నారు.
నాగమ్మ అక్కడికి వచ్చి ‘‘ఏమిట్రా అది?’’ అని అడిగారు.
తిమ్ము ‘‘నేనమ్మా మొదట చెప్పింది లింగడొస్తాడని’’ అన్నాడు.
సీత ‘‘కాదమ్మా తిమ్మన్నయ్య ఉట్టి అబద్ధాలు చెబుతున్నాడు. నేనే ముందు  చెప్పాను. కావాలంటే నాగడిని అడుగు’’ అంది.
‘‘ఎవరైతేనేంరా? మొత్తానికి లింగడు వచ్చేశాడు కదా! అంతే చాలు.’’ అంటూ నాగమ్మ లోపలికి వెళ్లారు.

మరిన్ని వార్తలు