సత్వం: అకిరా కురసోవా.. వెండితెర చక్రవర్తి

23 Mar, 2014 00:27 IST|Sakshi

మార్చ్ 23న విశ్వవిఖ్యాత దర్శకుడు అకిరా కురసోవా జయంతి
 మనిషి బతకడం కోసం చేసే పోరాటాన్నీ, మనిషిగా నిలబడటం కోసం పడే  ఆరాటాన్నీ, సమూహంతో కలిసిసాగే సంతోషపు వెతుకులాటనూ ఆయన చిత్రించాడు.

 
 ఒకసారి దర్శకుడు అకిరా కురసోవాకు ఈ ప్రశ్న ఎదురైంది: ‘‘మీరు ‘రాన్’లోని ఆ ఫ్రేమ్‌లో కెమెరా అలా ఎందుకు పెట్టారు?’’ దానికి కురసోవా ఇచ్చిన జవాబు: ‘‘నేను ఒక్క అంగుళం ఎడమకు ప్యాన్ చేసినా సోనీ ఫ్యాక్టరీ కనబడుతుంది, అదే ఒక్క అంగుళం కుడికి జరిపితే ఎయిర్‌పోర్టు కనబడుతుంది. పీరియడ్ సినిమాకు ఆ రెండూ అనవసరం’’. కురసోవా అంత పర్ఫెక్షనిస్టు!

సినిమా కోసం ప్రాణం పెట్టేవాడు. 1948తో మొదలై నాలుగు దశాబ్దాలపాటు సాగిన ఆయన కెరీర్లో... రషోమన్, ఇకిరు, సెవెన్ సమురాయ్, యొజింబో, థ్రోన్ ఆఫ్ బ్లడ్, దెర్సు ఉజాలా, ద లోయర్ డెప్త్స్, హై అండ్ లో, డ్రీమ్స్, రప్సోడీ ఇన్ ఆగస్ట్... ఒక్కో సినిమా ఒక్కో చరిత్ర!
 
 సినిమా మాస్టర్లు అనిపించుకున్న దర్శకులు ఇన్‌మార్ బెర్గ్‌మన్, ఫ్రెడరికో ఫెల్లిని, సత్యజిత్ రే, రోమన్ పోలన్‌స్కీ, జార్జ్ లుకాస్, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా, మార్టిన్ సోర్సెసె, స్టీవెన్ స్పీల్‌బర్గ్‌లాంటివాళ్లు కూడా కురసోవా వల్ల ప్రభావితమయ్యారు. అందుకే ఆయన్ని విమర్శకులు గౌరవంగా ‘ఎంపరర్ ఆఫ్ ద సెల్యులాయిడ్’ అంటారు.
 
 జపాన్ ‘సమురాయ్’(సైనిక) కుటుంబంలో జన్మించిన అకిరా సినిమాలు మాత్రమే తన ఉనికిగా బతికాడు. యుద్ధ సన్నివేశాలను చిత్రించడంలో, రిస్కు తీసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి! నటీనటులకు అలవాటు కావడానికి, తద్వారా సహజత్వం కోసం సినిమా కాస్ట్యూమ్స్‌తో వాళ్లను కొంతకాలం గడపమనేవాడు. ఏరోజు రషెస్ ఆరోజు స్వయంగా ఎడిట్ చేసుకునేవాడు.
 
 ‘‘ఆలోచనలు సహజంగా వస్తాయి, కథ ఆ క్యారెక్టర్ వెంట సాగిపోతుంది’’ అని తను సినిమా తీసే విధానం గురించి చెప్పేవాడు కురసోవా. స్టోరీబోర్డ్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చేవాడు. సినిమాకు ఫండింగ్ దొరకని విరామ సమయాల్లో తన సీన్లన్నింటినీ బొమ్మలుగా గీసుకునేవాడు. ఆయన స్వయంగా పెయింటర్ కూడా! సినిమాల్లోకి రాకముందు కమర్షియల్ ఆర్టిస్టుగా పనిచేశాడు. ‘‘నిజంగా డెరైక్టర్ కావాలనుకుంటే ముందు స్క్రీన్‌ప్లేలు రాయండి. రాయడం ద్వారానే సినిమా స్ట్రక్చర్ అర్థమవుతుంది, అసలు సినిమా ఏంటో కూడా అర్థమవుతుంది’’ అని ఔత్సాహిక దర్శకులకు సలహా ఇచ్చేవాడు. ‘‘నీలోపల ఎంతో రిజర్వు ఉంటేతప్ప, నువ్వు ఏదీ సృష్టించలేవు. జ్ఞాపకమే సృష్టికి మూలం. శూన్యం నుంచి దేన్నీ సృష్టించలేం’’. అందుకని చదవడం చాలా ముఖ్యమనేవాడు. ‘‘అయితే, చదవడం వల్లగానీ, నీ జీవితానుభవం వల్లగానీ వచ్చినదానికి జోడించగలిగేదేదో నీలోపల లేకపోతే నువ్వు ఏదీ సృజించలేవు’’ అనేవాడు.
 
 ఆయన సినిమాలన్నీ ‘లార్జర్ దన్ లైఫ్’గా కనబడినా, ఆయన మాట్లాడిందంతా జీవితం గురించే! మనిషి ఎప్పుడూ తప్పకూడని నీతినీ, ఎప్పుడూ పాటించవలసిన మానవీయ విలువనీ ఆయన చిత్రాలు  ప్రతిబింబించాయి. మనిషి బతకడం కోసం చేసే పోరాటాన్నీ, మనిషిగా నిలబడటం కోసం పడే ఆరాటాన్నీ, సమూహంతో కలిసిసాగే సంతోషపు వెతుకులాటనూ ఆయన చిత్రించాడు. అయితే, జీవితం ఎంత సంక్లిష్టమైందో ఆయన సినిమాలు కూడా అంతే సంక్లిష్టమైనవి. అందుకే కురసోవా తన సినిమాల్లో ‘ఫలానాది వెల్లడించాడు’ అనడం తప్పుడు విశ్లేషణే అవుతుంది.
 
 ‘‘నా సినిమా ఏం చెబుతుందో నేనేగనక వివరించగలిగితే అందరికీ వెళ్లి అదే చెప్తానుగానీ, అంత కష్టపడి సినిమా ఎందుకు తీస్తాను?’’ అన్నాడాయన. సినిమాను అర్థం చేసుకోవడంలో మెదడుకంటే హృదయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వమనేవాడు. ఆయన చిత్రరాజాలు మాత్రం మెదడునూ, హృదయాన్నీ రెంటినీ సంతృప్తిపరుస్తాయి.

మరిన్ని వార్తలు