సార్లొచ్చె... సందడి తెచ్చె!

5 Dec, 2015 23:36 IST|Sakshi
సార్లొచ్చె... సందడి తెచ్చె!

స్పెషల్ స్టోరీ
జిల్లా కేంద్రానికి దూరంగా అక్కడక్కడా విసిరేసినట్టున్న మారుమూల పల్లెలు అవి. పొద్దంతా కాయకష్టం చేసుకొని... పొద్దు గూకిన వేళ గూటికి చేరే పక్షుల్లాంటి పల్లె జనం. అలాంటి పల్లెలకు ఓరోజు అను కోని అతిథులు వచ్చారు. వారం రోజుల పాటు పల్లెల్లో సందడి చేశారు. పల్లె తల్లి ఒడిలో నిద్రపోయారు. ఊరు జనం ప్రేమలో స్వచ్ఛతను చూసి మురిశారు. వాళ్లంతా ఆలిండియా సర్వీసెస్ శిక్షణలో ఉన్నవారు.

పల్లెల పరిస్థితుల్ని, సాధించిన సాధించాల్సిన ప్రగతిని అంచనా వేయడానికి వచ్చారు. పల్లె వాకిట పండుగ వాతావరణాన్ని సృష్టించి వెళ్లారు! ఇటీవల హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రానికి  104 మంది ఆలిండియా సర్వీసెస్ ట్రెయినీలు వచ్చారు. వీరిని తెలంగాణ లోని కొన్ని జిల్లాలకు గ్రామస్థాయి అధ్యయనం కోసం పంపించారు. ఆ సందర్భంగా మెదక్ జిల్లాకు 27 మంది వచ్చారు. గ్రామాల స్వరూపం దగ్గర్నుంచి అన్ని విషయాలనూ అధ్యయనం చేసి వెళ్లారు.
 
నులక మంచంలోనే నిద్ర....
ఐఏఎస్, ఐపీఎస్ అన్న మాటలు వింటేనే... అత్యున్నత స్థాయి అధికారులుగా వారి స్థాయి గుర్తొచ్చి అందరి మనసుల్లో గౌరవం పొంగుకొస్తుంది.  అందుకే కాబోయే ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు తమ ఊరిని వెతుక్కుంటూ వచ్చేసరికి తెలంగాణ జిల్లాల్లోని పలు పల్లెల ప్రజలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఘనంగా స్వాగతాలు పలికారు. ఆప్యాయంగా అతిథి మర్యాదలు చేశారు. ట్రెయినీలు కూడా ఎటువంటి భేషజం లేకుండా అందరితోనూ కలిసిపోయారు.

మీలో మేమూ ఒకళ్లం అన్నట్టుగా కలివిడిగా కలియతిరిగారు. పల్లె జనం ఇచ్చిన నులక మంచం, పాఠశాలల బెంచీల మీదే పడుకున్నారు. రక్తం పీల్చే దోమల దాడికి తట్టుకున్నారు. కలత నిద్రకు అర్థం తెలుసుకున్నారు. అపరిచిత వ్యక్తులు వచ్చారనే హెచ్చరికలు జారీ చేసే కుక్కల అరుపుల్ని కూడా సంగీతంలా ఆస్వాదించారు. పల్లె ప్రజల జీవనం ఎలా ఉంటుందో క్షణక్షణం పరిశీలించి అవగాహన చేసుకున్నారు.
 
ఆశ్చర్యపర్చిన అభివృద్ధి...
పల్లె అనగానే వెలగని దీపాలు, గుంతలు పడ్డ రోడ్లు, నిలిచిపోయిన వాన నీళ్లు, ఎండిన పొలాలు, పూరి గుడిసెలు... ఇలా అన్నీ వెనుకబడిన ఆలోచనలే వస్తుంటాయి. కానీ వాటిలో కూడా అభివృద్ధి పీట వేసుకుని కూర్చుందన్న విషయం స్వయంగా చూసిన సివిల్స్ ట్రెయినీలు ఆశ్చర్యపోయారు. ఇబ్రహీం పూర్ గ్రామంలో ఎక్కడా దోమ అన్నదే లేదు.

దేశంలో దోమలు లేని పల్లె ఇదొక్కటే కావచ్చేమో అన్నారు. అలాగే కొన్ని గ్రామాల్లో ఉన్న పారిశుద్ధ్యం చూసి పరవశించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో కూడా 24 గంటల విద్యుత్తు సరఫరా ఉండటం చూసి వాళ్ల కళ్లల్లో లైట్లు వెలి గాయి. వెనుకబడిన ప్రాంతాలు అనుకున్న చోట్ల కూడా రైతులు సరికొత్త విధానాల్లో వ్యవసాయం చేయడం చూసి ఔరా అనకుండా ఉండలేకపోయారు.   

సిద్దిపేటకు నీరందించే మానేరు నీటి సరఫరా విధానం అడిగి తెలుసుకుంది ఆ యువసేన. సదరు ప్రాజెక్టు వల్ల 122 గ్రామాలకు మంచినీటి సమస్య తీరిందని  గ్రామస్తులు చెబుతుంటే నమ్మలేనట్టుగా చూశారు. నది నుంచి నీటిని తోడి ఎతై్తన ప్రాంతం మీదకు తీసుకుపోయి అక్కడే వాటర్ ట్యాంకర్‌లో నిల్వ చేసి, అక్కడి నుంచి అధిక సామర్థ్యంతో గ్రామాల్లో  ఇంటింటికీ నల్లా ద్వారా నీళ్లు పంపే విధానం వాళ్లను ముగ్ధుల్ని చేసింది.  
 
ఇలా గ్రామాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలు వారికి తెలిసి వచ్చాయి. సరైన ప్రణాళికతో వెళ్తే పల్లెలు సైతం అభివృద్ధి విషయంలో పట్టణాలతో పోటీ పడగలవు అన్న అవగాహన వారిలో కలిగింది. పల్లెల్ని అభివృద్ధి చేయాలంటే ఎలాంటి విధానాలు అవలంబించాలో కూడా అవగతమయ్యింది.
 
రైతన్న జీవితాన్ని చదివారు...
గ్రామాలకు వచ్చిన ట్రెయినీలు మన దేశానికి వెన్నెముక అయిన రైతుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వ్యవసాయ విధానాలపై అధ్యయనం చేశారు. వ్యవసాయ క్షేత్రాన్ని చదును చేయడం, భూసార పరీక్షలు, విత్తనాలు వేయడం, పంట సంరక్షణ, ఎరువులు, పెట్టుబడులు, దిగుబడి, మార్కెటింగ్, గిట్టుబాటు ధర తదితర వివరాలను సేకరించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రుణమాఫీ, అన్నదాతలు అప్పుల పాలు కావడం, ఆత్మహత్యలు  తదితర అంశాలకు కారణాలనూ అన్వేషించారు. సాంప్రదాయ పంటల్ని వదిలేసి పత్తి పంట వైపుకు అడుగులు వేయడానికి దారితీసిన విషయాలను అధ్యయనం చేశారు. హత్నూరా మండలం నవాబుపేట గ్రామ శివారులోని మంజీర పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించేందుకు ట్రాక్టర్‌లో వెళ్లారు. దారికి ఇరు వైపులా ఉన్న రకరకాల పంటలను, డొంకదారిని పరిశీలిస్తూ... రైతుకు అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాలను గమనించారు.  

చెరువుల్లో భూగర్భజలాలు లేకపోవడం, వ్యవసాయ సాగుకు ఇబ్బందికర పరిస్థితు లను అధిగమించేందుకు భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలను గూర్చి రైతులను అడిగి తెలుసుకున్నారు.
 
రాణాపూర్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరిజన తండాకు కాలి నడకన వెళ్లి... అక్కడి సోలార్, బయో గ్యాస్ ప్లాంట్లను పరిశీలించారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. తండాలోని స్వయం సహాయక సంఘాల సభ్యులతో  సమావేశ మయ్యారు. ఆర్థిక వనరులు, ప్రభుత్వ సహకారం, ఇప్పటి వరకు సాధించిన ప్రగతి, కుటుంబ నేపథ్యం, పిల్లల చదువులు వంటి అంశాలన్నీ ఆరా తీశారు.     
 
అనుబంధాలకు కొత్త అర్థం తెలిసింది...
ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎన్నో బంధాలు, అనుబంధాలు ఉంటాయి. అయితే అవి పల్లెల్లో మరింత ధృడంగా ఉంటాయని అర్థమవుతోంది అని ఓ ట్రెయినీ కామెంట్ చేయడం చూస్తే, వాళ్లు ఇక్కడకు వచ్చి అనుబంధాలకు కొత్త అర్థం తెలుసుకున్నారని అనకుండా ఉండలేం. ఈ సందర్భంలో వారికో విచిత్రమైన అనుభవం కూడా ఎదురైంది.
 
రాణాపూర్ దళిత కాలనీలో యువ అధికారులంతా గ్రౌండ్ వర్క్‌లో నిమగ్నమై ఉంటే... ఓ ఇంటిలోంచి కేకలు, అరుపులు వినిపించాయి. ఏమిటా అని ఆరా తీస్తే భార్యాభర్తల గొడవని చెప్పారు అక్కడున్నవాళ్లు. వెంటనే అందరూ ఆ ఇంటికి వెళ్లారు. యాకూబ్ అన్న వ్యక్తి తన భార్య శారద వైపు ఆవేశంగా వెళ్తున్నాడు. ఓ ట్రెయినీ అడ్డం వెళ్లి ఆపారు. భర్త రోజూ తాగి వచ్చి గొడవ పడుతున్నాడని, కొడు తున్నాడని శారద ఫిర్యాదు చేసింది.

దాంతో అందరూ కలిసి భార్యాభర్తల గొడవను సర్ధుబాటు చేశారు, భార్య గొప్ప తనం వివరించారు. బాధ్యతాయుతంగా చూసుకోవాలని భర్తకు నచ్చజెప్పారు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి శిక్షణలో భాగంగా ఇక్కడికొచ్చారు. మన పల్లెల పైరగాలిని పీలుస్తూ, గ్రామస్తుల ప్రేమాభి మానాలకు పరవశిస్తూ ప్రతి క్షణాన్నీ ఆనందంగా గడిపారు. ఉన్నవాటిని చూసి సంతోషించారు. లేనివాటిని సాధించా లంటే ఏం చేయాలో ప్రణాళికలు వేశారు. ఈ అనుభవం వాళ్లను తప్పకుండా గొప్ప అధికారుల్ని చేస్తుంది. పల్లెసీమల్ని పసిడి సీమల్ని చేసేలా వాళ్లను ప్రోత్సహిస్తుంది.
- వర్ధెల్లి వెంకటేశ్వర్లు
సాక్షి ప్రతినిధి, మెదక్

 
స్థానిక వనరులను వినియోగించుకోవాలి!
కొన్ని చోట్ల గ్రామీణ జీవనం కష్టంగా, సంక్లిష్టంగా ఉంది. ప్రజలు కష్టాల్లోనే జీవితాన్ని సాగదీస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్రణాళికల్లో గ్రామాల అభివృద్ధి ఎంతో ముఖ్యమైంది. గ్రామాలపై మరింత దృష్టి పెడితే గ్రామాల రూపురేఖలు మారే అవకాశం ఉంది. అలాగే ప్రజలు కూడా స్థానిక వనరుల్ని విని యోగించుకుని అభివృద్ధి సాధించడం అలవర్చుకోవాలి.
- తనూసింగ్, (ఇండియన్ ట్రేడ్ సర్వీసెస్) న్యూఢిల్లీ
 
పూర్తి అభివృద్ధి అప్పుడే సాధ్యం!

నిజానికి గ్రామాలు కూడా అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయని ఒప్పుకోవాలి. నేను చూసిన ఓ గ్రామంలో శానిటేషన్, మరుగు దొడ్ల నిర్మాణం, సోలార్ లైట్లు, బయోగ్యాస్ ప్లాంట్‌లు వంటి అంశాలు నన్ను ఆకర్షించాయి. అయితే ఎవ్వరూ ఎవరిపైనా ఆధారపడకూడదు. ప్రతి ఒక్కరూ పొదుపు చేసుకుని ఆర్థికంగా మరింత ఎదగాలి. అప్పుడే పూర్తి అభివృద్ధి సాధ్యపడుతుంది
- బి.జీవా (ఐఒఎఫ్‌ఎస్), తమిళనాడు
 
జనంలో అవేర్‌నెస్ బాగుంది!
గ్రామ సమస్యలను నేను దగ్గర నుండి చూడటం, గ్రామస్తులతో  మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడూ పుస్తకాలలో చదివేవాళ్లం కాని పుస్తకాలకు బదులుగా ప్రాక్టిల్ వర్క్ చేయడం బాగా అనిపించింది. శానిటేషన్, పారిశుద్ధ్యం బాగుంది. వాటి గురించి జనంలో మంచి అవేర్‌నెస్ ఉంది. అయితే విద్యార్థులు కూడా అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని అనిపించింది.
- సుకృతీవర్మ (ఇండియన్ ఎకానమీ సోర్స్), లక్నో
 
నేరుగా ప్రజలతో మాట్లాడా!
ప్రజలతో నేరుగా మాట్లాడే అవకాశం వచ్చింది.  ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు, విద్యావకాశాలపై అవగాహన కల్పిస్తే మరింత బాగుంటుంది. మా రాష్ట్రంలో ప్రతి గ్రామానికీ రోడ్డు సౌకర్యం ఉంది. ఇక్కడ కొన్ని గ్రామాల్లో మరింత అభివృద్ధి అవసరం అనిపించింది. అయితే మా గ్రామాల్లో జనం తక్కువ, ఇక్కడ గ్రామాలలో జనం ఎక్కువగా కనిపిస్తున్నారు.
- అశుతోష్ (ఐపీఎస్), ఛత్తీస్‌ఘడ్

మరిన్ని వార్తలు