ఏదో తెలియని అభద్రత...

10 Jul, 2016 01:13 IST|Sakshi
ఏదో తెలియని అభద్రత...

సందేహం
నేను కాస్త లావుగా ఉండేదాన్ని. బరువు తగ్గాలని ప్రతిరోజూ స్కిప్పింగ్ చేసేదాన్ని. దాని వల్ల నా బ్రెస్ట్ లూజ్ అయింది. దాంతో నాకు ఏదో తెలియని అభద్రతా భావం కలుగుతోంది. మరో ఆరు నెలల్లో నాకు పెళ్లి జరగబోతోంది. దీనివల్ల నా వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు వస్తాయేమోనని భయంగా ఉంది. నా బ్రెస్ట్‌ని మళ్లీ టైట్‌గా చేసుకోవడానికి ఏమైనా సలహా ఇవ్వండి.                                  
- జాహ్నవి

 
స్కిప్పింగ్ చెయ్యడం వల్ల బ్రెస్ట్ లూజ్ అవ్వదు. స్కిప్పింగ్ వల్ల మీరు బరువు తగ్గి, బ్రెస్ట్‌లో ఉండే కొవ్వు, దాని చుట్టూ ఉండే కొవ్వు కరగడం వల్ల లూజయి ఉండొచ్చు. దానివల్ల కంగారు పడాల్సిన అవసరం లేదు. రొమ్ములు బిగుతుగా అవ్వడానికి రెగ్యులర్‌గా వలయాకారంలో బ్రెస్ట్ మసాజ్ చేసుకోవాలి. దాంతో రక్తప్రసరణ పెరిగి, రొమ్ముల పటుత్వం పెరిగి, టైట్‌గా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే కొన్ని ఛాతీ వ్యాయామాలు చెయ్యడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. అలా చేసినా... ఉపయోగం లేకుండా మరీ ఇబ్బందిగా ఉంటే ఓసారి ప్లాస్టిక్ సర్జన్‌ను సంప్రదించి వారి సలహా పాటించవచ్చు.
 
నా వయసు 21. ఎనిమిది నెలల క్రితమే నాకు పెళ్లైంది. నా భర్తతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇద్దరం బాగా సెటిల్ అయ్యాం. కాకపోతే వేరువేరు చోట్ల ఉద్యోగం చేస్తుండటం వల్ల శారీరకంగా నెలకు రెండుమూడుసార్లు మాత్రమే కలుస్తుంటాం, అలా కలిసినప్పుడు ఓసారి గర్భం రాకుండా ఉండేందుకు ఒక పిల్‌ను వేసుకున్నాను. అప్పుడు ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. పీరియడ్ కూడా రెగ్యులర్‌గా వచ్చింది. కానీ అప్పటి నుంచి దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతోంది. అలాగే అది వేసుకున్న తర్వాత  శారీరకంగా కలిసినప్పుడు నొప్పిగా అనిపించింది. ఈ పిల్ వేసుకోవడం వల్ల నాకు భవిష్యత్‌లో ఏమైనా సమస్యలు వస్తాయా? పిల్లలు కలగడానికి ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుందా?
 - స్నేహ

 
మీరు వేసుకున్న పిల్ ఎప్పుడో ఒకసారి జాగ్రత్తలు తీసుకోకుండా కలిసినప్పుడు, అవాంఛిత గర్భం రాకుండా ఉండేందుకు తయారు చేయబడింది. కానీ అది 100 శాతం గర్భం రాకుండా అవుతుందని చెప్పలేం. అది వాడినా 10-15శాతం మందిలో గర్భం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ పిల్ వాడటం వల్ల వైట్ డిశ్చార్జ్, దురద, దుర్వాసన, నొప్పి వంటివి ఏమీ ఉండవు. ఒకసారి వాడటం వల్ల పిల్లలు కలగడానికి ఎటువంటి ఇబ్బందీ లేదు. మీకు ఏదైనా వెజైనల్ ఇన్‌ఫెక్షన్ వల్ల దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్, పొత్తి కడుపులో నొప్పి వచ్చి ఉండవచ్చు.

ఇంకా అలాగే ఉంటే ఓసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది. అశ్రద్ధ చేస్తే ఇన్‌ఫెక్షన్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఈ పిల్ మాటిమాటికీ వేసుకోవడం మంచిది కాదు. దానివల్ల పీరియడ్స్ క్రమం తప్పడం, హార్మోన్లలో మార్పులు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
 
నా వయసు 23. నాకిప్పుడు అయిదు నెలల బాబు ఉన్నాడు. ఆపరేషన్ అయింది. కుట్లన్నీ త్వరగా మానిపోయాయి. డెలివరీ అయిన మూడు నెలలకు నేను, మావారు శారీరకంగా కలిశాం. ఆ మరుసటి నెల పీరియడ్ వచ్చింది. కానీ తర్వాత నెల అంటే.. ఇప్పుడు (అయిదో నెల) పీరియడ్ రాలేదు. ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే నెగెటివ్ అని వచ్చింది. పీరియడ్ ఎందుకు రాలేదో తెలియడం లేదు. మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యానేమోనని భయంగా ఉంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి?              
- పేరు రాయలేదు

 
కొందరిలో కాన్పు తర్వాత బిడ్డకు పాలు పట్టేటప్పుడు, హార్మోన్లలో మార్పు ఉండడం వల్ల కొన్ని నెలలపాటు పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. పీరియడ్ సరైన సమయానికి రాకపోతే తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ ఉండాలని ఏమీ లేదు. కొందరిలో అండాశయాలలో నీటిగడ్డలు (ఒవేరియన్ సిస్ట్) ఏర్పడడం వల్ల కూడా పీరియడ్ ఆలస్యంగా రావచ్చు. కాకపోతే కొందరిలో కాన్పు తర్వాత హార్మోన్ల అసమతుల్యత వల్ల అండం విడుదల ఆలస్యమై కూడా గర్భం లేట్‌గా నిర్ధారణ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మీకు కాన్పు జరిగి అయిదు నెలలే కాబట్టి పీరియడ్స్ కోసం కొన్నిరోజులు ఆగి చూడొచ్చు. అలాగే 15 రోజులకొకసారి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటూ ఉండడం మంచిది. ఒకవేళ మధ్యలో ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్ అయితే... గర్భం వద్దనుకుంటే, మొదట్లోనే మందులతో అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే అబార్షన్ మందులు డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. మళ్లీ ప్రెగ్నెన్సీ రాకుండా... ఇప్పటి నుంచే డాక్టర్ సలహా తీసుకుని లూప్, పిల్స్, హార్మోన్ ఇంజక్షన్స్ వంటి పద్ధతులను పాటించడం మంచిది. అలా కాదనుకుంటే, మీవారు కండోమ్స్ వాడొచ్చు.
- డా॥వేనాటి శోభ
లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్

>
మరిన్ని వార్తలు