ఆ నిజం ఎన్నాళ్లు దాచగలను!

12 Mar, 2016 21:46 IST|Sakshi
ఆ నిజం ఎన్నాళ్లు దాచగలను!

ఇంటర్వ్యూ
అందం, అభినయానికి చిరునామా అంజలి అంటే అతిశయోక్తి కాదు. అంజలి ఎంత బాగా నటించగలదో చెప్పడానికి ఒక్క ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చాలు. ఒకవైపు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో నటించడంతో పాటు ‘గీతాంజలి’ వంటి ఫిమేల్ ఓరియంటెడ్ మూవీలో నటించి, సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోయగలనని నిరూపించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ ‘చిత్రాగంద’తో పాటు తమిళంలో మూడు, నాలుగు చిత్రాలు చేస్తూ, బిజీగా ఉంది. ఇక.. అంజలి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం...
 
నేనిప్పటివరకూ చేసినవన్నీ దాదాపు సాఫ్ట్ క్యారెక్టర్సే. కానీ, రియల్ లైఫ్‌లో నేనలా కాదు. కొంచెం టామ్ బోయ్ టైప్. చిన్నప్పట్నుంచీ అంతే. అమ్మాయిలా కాకుండా అబ్బాయిలానే పెరిగాను. అందుకే నా చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ అంతా నన్ను ‘టామ్ బోయ్’ అనేవాళ్లు.
 
నేను రాజోలులో పుట్టా.  మా అమ్మా, నాన్నలు ఉద్యోగాల నిమిత్తం విదేశాల్లో ఉండటంతో నేను మా నాయనమ్మ దగ్గరే పెరిగాను.  దాదాపు నా స్కూలింగ్ అంతా అక్కడే. చిన్నప్పుడు అబ్బాయిలాగా ప్యాంట్, షర్ట్స్, షార్ట్స్ కూడా వేసుకునేదాన్ని. బాగా హైపర్ యాక్టివ్. చిన్నతనం నుంచి నా లక్ష్యం విషయంలో ఫుల్ క్లారిటీ ఉంది. నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడు మా టీచర్, ‘‘పెద్దయ్యాక ఏమవ్వాలను కుంటున్నారు’’ అని అడిగేవారు. మా క్లాస్‌మేట్స్ అందరూ డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్... ఇలా ఏవేవో చెప్పేవాళ్లు. నా వంతు వచ్చేసరికి ‘‘నేను సినిమా హీరోయిన్ అవుతా’’ అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు.
 
నా వేషభాషలు చూసి చాలా మంది ‘నువ్ హీరోయిన్‌గా ట్రై చేయచ్చు కదా’ అని అడిగేవారు. నేను ఎయిత్త్ క్లాస్ చదువుతున్నప్పుడు అనుకుంటా... ఓ అబ్బాయి వచ్చి నాకు ప్రపోజ్ చేశాడు. చెడమడా తిట్టి, రాఖీ కట్టేశా. ఆ తర్వాత రోజు నా పక్కనున్న అమ్మాయిని చూడటం మొదలుపెట్టాడు. వాళ్లిద్దరి మధ్య ప్రేమలేఖల రాయబారాన్ని నడిపింది కూడా నేనే. ఈ విషయం బయటకు తెలిసి ఊళ్లో నా పేరు మారుమోగిపోయింది.
 
ఇంట్లో తెలియకుండా స్కూల్ ఎగ్గొట్టి  ఒకసారి ‘నువ్వే కావాలి’ సినిమాకు వెళ్లిపోయాను. ఈ విషయం తెలిసి మా ఇంట్లో చితక్కొట్టారు కూడా. ఇంకోసారి ఇంట్లో తెలియకుండా స్కూల్ కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో డాన్స్ చేశాను. ఆ విషయం ఇంట్లో తెలిసిపోయిందని తెలిసి పారిపోయాను. నా గురించి మా వాళ్లు తెగ వెతికే శారు. నేను దొరికాక మాత్రం చాక్లెట్లు ఇచ్చి ఇంకెప్పుడూ అలా చేయొద్దన్నారు.
 
రాజోలు నుంచి చెన్నైలోని మా పిన్ని దగ్గరకు వెళ్లిపోయాను.  అక్కడే నా చదువు కొనసాగించా. ఊరు కాని ఊరు. భాష కాని భాష. దాంతో పాటు ఫ్రెండ్స్ కూడా లేరు. ఆ వెలితి తీర్చుకోవడానికి డ్యాన్స్, యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నా. కానీ హీరోయిన్ అయ్యాక మాత్రం నా జీవితం, నా యాటిట్యూడ్ పూర్తిగా మారిపోయింది. చిన్నప్పుడు ఎంత అల్లరిగా ఉండేదాన్నో, ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా పూర్తిగా సెలైంట్ అయిపోయాను.
 
ఒకసారి మాకు తెలిసిన వాళ్ల పెళ్లి కోసమని రాజోలు వెళ్లాను. అక్కడ అందరూ గుర్తుపట్టి నాతో ఫొటోలు దిగుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. నాకు ఎవరో బోయ్‌ఫ్రెండ్ ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ నాకు బోయ్‌ఫ్రెండ్ ఉన్నా ఎంత కాలమని దాస్తాను. ఇట్టే తెలిసిపోతుంది. ఈ రోజుల్లో ఏ విషయమైనా మీడియాకు తెలియకుండా ఉంటుందా? ఈ రోజు కాకపోతే మరొకరోజైనా తెలిసిపోతుంది.
 
నేను ఒకే రకమైన పాత్రలు చేయాలని ఎప్పుడూ అనుకోను. గ్లామర్, డీ-గ్లామరైజ్డ్.. ఏ కార్యరెక్టర్ అయినా చేయడానికి సిద్ధమే. ఏ పాత్ర చేసినా అందులోకి పరకాయ ప్రవేశం చేయడానికి వంద శాతం కృషి చేస్తాను. పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ‘ఏమీ చేయలేదు’ అని బాధపడకూడదు. అందుకే మంచి పాత్రలు ఎంచుకుంటున్నాను.

మరిన్ని వార్తలు