దర్శకుల హీరో అక్కినేని

2 Feb, 2014 01:03 IST|Sakshi
దర్శకుల హీరో అక్కినేని

 సినీయానం

 ‘అతడనేక యుద్ధములందారితేరిన వృద్ధమూర్తి’ అనే మాటలు అక్కినేనికి సరిగ్గా వర్తిస్తాయి. చిరకాలంగా తెలుగు సినీ అభిమానుల హృదయ పీఠాలనధిష్టించిన నటసమ్రాట్టు - దర్శకుల నటుడు అక్కినేని. దర్శకుల పట్ల ఆయనకు గల గౌరవ భావాన్ని అవలోకిస్తే, అనేక విషయాలు ఈ తరానికి స్ఫూర్తిదాయకంగా కనిపిస్తాయి.
 
 
 కొంతకాలం క్రితం ‘ఫన్‌డే’ రెండవ వార్షికోత్సవం సందర్భంగా-‘తప్పక చూడాల్సిన 100 తెలుగు సినిమాలు’ జాబితా ప్రచురితమైంది. వాటిలో ఇరవైకి పైగా అక్కినేని నటించిన చిత్రాలే ఉన్నాయి. అవి చూడదగ్గవి మాత్రమే కాదు. ప్రజాదరణ పొందినవి ‘కూడా’! ఈ ‘కూడా’ ఎందుకంటే, విమర్శకులు చూడదగినవని చెబితే, అవి సాధారణంగా జనాదరణ పొంద(లే)ని చిత్రాలుగానే ఉంటాయని! కానీ ‘క్వాలిటీ’ని ప్రేక్షకులు విజయవంతం చేస్తారని ఈ ఎంపిక నిరూపించింది.
 
 డెరైక్టర్స్ యాక్టర్
 అక్కినేనిని దర్శకుల నటుడిగా మనం ఎందుకు శ్లాఘించాలి? అక్కినేనికి తనలోని ‘మైనస్ పాయింట్స్’ ఏమిటో తెలుసు. ‘‘నాదేమీ ఆకర్షణీయమైన పెర్సనాలిటీ కాదు. పైగా నావి గుంట కళ్లు’’ అంటూ తనలోని ‘లోపాలను’ చెప్పేవారు. అవి ‘ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్’తో అనే మాటలు కావు.  శిలను అందమైన శిల్పంగా తీర్చిదిద్దుకోగలిగే గొప్పతనం చిత్ర పరిశ్రమకు ఉందని ఆయన దృఢ నమ్మకం.
 ‘శ్రీ సీతారామ జననం’లో కథానాయకుడిగా శ్రీరాముడి పాత్ర ధరించే అవకాశం ఇచ్చి, ఆ తర్వాత ‘బాలరాజు’ వంటి సూపర్ హిట్ చిత్రంతో అక్కినేనికి చిత్ర రంగంలో సుస్థిరమైన పునాదిని ఏర్పరచిన దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య. దగ్గరుండి పెళ్లి కూడా జరిపించి,  ఓ తండ్రిలా భవిష్యత్తుకు రూపురేఖలు దిద్దిన శ్రేయోభిలాషి. ‘‘ఒక నటుడిగా ఎలా ‘మౌల్డ్’ అవ్వాలి? తక్కినవారితో ఎలా మెలగాలి? వంటి పాఠాలన్నీ బలరామయ్యగారి ప్రతిభా సంస్థలో నేర్చుకున్నవే’’ అని స్నేహితులకు చెప్పేవారు అక్కినేని.
 ఆ తర్వాత ఆయనకు గూడవల్లి రామబ్రహ్మం తీసిన ‘మాయాలోకం’లో నటించే అవకాశం లభ్యమైంది. అందులో అక్కినేనిది శరాబందిరాజు పాత్ర. అందులో ఆయన కంటే వయసులో పెద్దవాడైన శాంతకుమారి, ఎం.వి.రాజమ్మ - భార్యలుగా నటించారు. అక్కినేని సంభాషణల్ని లాగినట్లుగా చెబుతూ ఉంటే, ‘‘ఏమిట్రా నాయనా, నాటకం ఫక్కీలో చెబుతున్నావు. మామూలుగా చెప్పు’’ అని రామబ్రహ్మం సరిదిద్దేవారట. ‘‘చిత్ర దర్శకుడికీ నటుడికీ మధ్య కావలసింది ఆత్మీయత. దర్శకుడు, నటుడు నాణానికి ఒకవైపు అయితే, రెండోవైపు ఉండాల్సింది ఆత్మీయత. ఆ రెండూ కలిసినప్పుడే, అది చెల్లుబడి అయ్యే నాణెంలా కనిపిస్తుంది’’ అంటారు అక్కినేని.
 
 ఆయన మొదటిసారి వేషం వేసింది పి.పుల్లయ్య తీసిన ‘ధర్మపత్ని (1943)’లో. పది మంది పిల్లల్లో ఒకడిగా! ఆ తర్వాత పి.పుల్లయ్య దర్శకత్వంలో అర్ధాంగి, జయభేరి, మురళీకృష్ణ, ప్రేమించి చూడు, ప్రాణమిత్రులు వంటి చిత్రాల్లో నటించారు. ఆయన చిత్రాల్లో నటించడమంటే హాయిగా ఉంటుందని, ఆయన చూపే ఆత్మీయతే అందుకు కారణమంటారు ఏయన్నార్.
 
 వరుసగా జానపదాలు, పౌరాణికాలు అన్నీ ఓ పద్నాలుగయ్యాయి. ‘జానపద కథానాయకుడు’ అనే ముద్ర శాశ్వతంగా పడిపోతే ఎలా?’ అనే సంఘర్షణ మొదలైంది. అప్పటికే కొందరు సాంఘికాలకు అక్కినేని పనికిరాడని తేల్చేశారు. సరిగ్గా అప్పుడే ‘సంసారం (1950)’లో నటించే అవకాశం అందిపుచ్చుకున్నారు. అందుకోసం పారితోషికాన్ని తగ్గించుకున్నారు(దర్శకుడు ఎల్.వి.ప్రసాద్). ‘సంసారం’ విజయవంతం కావటంతో - సాంఘికాల్లోనూ అక్కినేని రాణించగలడని రుజువైంది. ‘‘ప్రేక్షకుల నాడి తెలిసిన దర్శకుడు ఎల్.వి.ప్రసాద్’’ అంటారాయన.
 
 వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ‘దేవదాసు’గా అక్కినేని నటిస్తున్నారన్నప్పుడు చాలామంది సందేహాలను వ్యక్తం చేయగా, అదో ‘ఛాలెంజ్’గా తీసుకున్నారు. తనపై ‘ట్రాజెడీ హీరో’ ముద్ర పడకూడదని, విజయా ప్రొడక్షన్స్ ‘మిస్సమ్మ’(దర్శకుడు ఎల్వీ ప్రసాద్) తీస్తున్నప్పుడు, హాస్య ప్రధానమైన పాత్రను తనే పోషించడానికి ముందుకొచ్చారు. ఓ ‘బ్రాండ్’ పడకుండా  నటుడు ఎలా శ్రద్ధ తీసుకోవాలో, ఎలాంటి ‘అహం’ లేకుండా దర్శక నిర్మాతల వద్దకు వెళ్లి సరైన అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలో - ఇటువంటి ఉదాహరణలను బట్టి అర్థం చేసుకోవాలి.
 
 అక్కినేని విశేషంగా గౌరవించే దర్శకుల్లో కె.వి.రెడ్డి ఒకరు. ఆయన ‘క్వాలిటీ’ విషయంలో రాజీపడరని, దేని గురించైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారన్నది తెలిసిన విషయమే. అందుకే ‘దేవదాసు’ విడుదలైన తర్వాత కె.వి.ని కలుసుకున్నారు అక్కినేని. ‘‘నన్ను మీరు యాక్టర్‌గా అంగీకరిస్తారా?’’ అని ఆయనను డెరైక్టుగా అడిగేశారు. అప్పటికే ఆయన పలు విజయాలు సాధించిన హీరో. అయినా కె.వి. దృష్టిలో తన స్థానం ఏమిటో తెలుసుకోవాలన్నది ఆయన తపన. ‘‘యూ ఆర్ ఏ వండర్‌ఫుల్ స్టార్’’ అన్నారు కె.వి. (అప్పుడు కూడా ఆయన ‘స్టార్’ అన్నారే కాని, ‘యాక్టర్’ అనలేదు). అలా అనడమే గొప్ప కాంప్లిమెంట్.  కొన్నాళ్లకు ‘దొంగరాముడు’ ఆ ఇద్దరినీ కలిపింది. మరెన్నో విజయవంతమైన చిత్రాలు వెలువడటానికి నాంది పలికింది.
 
 ‘మల్లీశ్వరి’ వంటి కళాఖండాలంటే, అక్కినేనికి చాలా ఇష్టం. బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో ‘పూజాఫలం’లో నటించారు. ఉత్తమ స్థాయి చిత్రాల కళా విలువల గురించి ఎన్నో విషయాలు ఆయన వద్ద నుంచి తెలుసుకుంటూ ఉండేవారు అక్కినేని - వీలున్నప్పుడల్లా ఆయనను కలుసుకుంటూ.
 
 ‘లైలా మజ్ను’, ‘విప్రనారాయణ’, ‘బాటసారి’ చిత్రాలు ఆణిముత్యాల్లాంటివనీ, వాటికి దర్శకత్వం వహించిన పి.ఎస్.రామకృష్ణ - తనలో మనోధైర్యాన్ని పెంపొందింపజేశారనీ చెప్పేవారు అక్కినేని.
 కమలాకర కామేశ్వరరావు ‘కాళిదాసు’, ‘గుండమ్మ కథ’ - అక్కినేని చలనచిత్ర జీవితంలో ముఖ్యమైన చిత్రాలే. అలాగే కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వంలో వచ్చిన ‘కన్నతల్లి’, ‘ప్రేమనగర్’, ‘సెక్రెటరీ’ చిత్రాలూ!
 ‘టేకింగ్’లో కొత్త పుంతలు తొక్కిన ఆదుర్తి సుబ్బారావు - అక్కినేనిని విశేషంగా ఆకట్టుకున్న దర్శకుల్లో ఒకరు. వినోదమే కాదు... సమాజాన్ని కదిలించే చిత్రాలను విభిన్న ధోరణిలో తీయాలని ఆదుర్తి సంకల్పించినప్పుడు, తనూ భాగస్వామినవుతానని ముందుకొచ్చారు. దాని ఫలితమే - ‘సుడిగుండాలు’, ‘మరో ప్రపంచం’ చిత్రాలు.
 
 అక్కినేనితో అత్యధిక సంఖ్యలో చిత్రాలు రూపొందించిన దర్శకులు వి.మధుసూదనరావు, దాసరి నారాయణరావు. అక్కినేని 200వ చిత్రంగా దాసరి ‘మేఘసందేశం’ రూపొందించి, జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు. వి.బి.రాజేంద్రప్రసాద్ ‘దసరా బుల్లోడు, కె.విశ్వనాథ్ ‘ఆత్మగౌరవం’, బాపు ‘బుద్ధిమంతుడు’-  అక్కినేని తీపి జ్ఞాపకాల్లో కొన్ని. అక్కినేని నుంచి ఓ కొత్త నటుణ్ని ఆవిష్కరించిన ఖ్యాతి ‘సీతారామయ్యగారి మనవరాలు’ చిత్రాన్ని డెరైక్టు చేసిన క్రాంతికుమార్‌కు దక్కుతుంది.
 
 దర్శకులను ఎవరైనా విమర్శిస్తే, ఆయనకు వెంటనే కోపం వస్తుంది. ఒకసారి ఓ గీత రచయిత - ‘తాను ‘డబుల్ మీనింగ్ పాటలు రాయడానికి సదరు దర్శకుడికి ‘టేస్ట్’ లేకపోవడమే కారణ’మని సభాముఖంగా చెబితే, అధ్యక్ష స్థానంలో ఉన్న అక్కినేని - ఆ రచయితను సభా ముఖంగానే చివాట్లు పెట్టారు. ‘అవకాశాలు ఇచ్చి పెంచి పోషిస్తున్న చిత్ర పరిశ్రమను, దర్శకులను ఎద్దేవా చేయడం భావ్యం కాద’న్నారు. దర్శకులంటే ఆయనకు అంత భక్తి!
 - బి.కె.ఈశ్వర్
 
 

మరిన్ని వార్తలు