స్ఫూర్తి ప్రదాత అంబేడ్కర్

9 Apr, 2016 22:21 IST|Sakshi
స్ఫూర్తి ప్రదాత అంబేడ్కర్

స్పెషల్ స్టోరీ
ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతి న్యాయాన్ని పొందే హక్కును ఎవరి నుంచీ తీసేయకూడదు అన్నారు. వర్ణధర్మాన్నీ మనుస్మృతినీ బహిరంగంగా వ్యతిరేకించారు. కింది కులాల వారి హక్కుల కోసం గొంతెత్తి అరిచారు. సమ సమాజ స్థాపన అవసరాన్ని ఎలుగెత్తి చాటారు. బాల్యం నుండీ కుల వివక్షకు గురైన ఆయన... ఒకనాడు దేశం యావత్తూ నడవాల్సిన దారిని నిర్దేశించే రాజ్యాంగాన్ని రాస్తారని ఎవరూ ఊహించి ఉండరు. అంతటి ఖ్యాతిని, విజయాన్ని సాధించి వ్యక్తి... బాబా సాహెబ్ అంబేడ్కర్!
 
ఈనాడు భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలూ బాబా సాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతిని ఘనంగా జరపటానికి పోటీపడు తున్నాయి. ఇది నిశ్చయంగా భిన్నత్వంలోని ఏకత్వ నిరూపణే. వర్ణ ధర్మ వ్యవస్థను తమ సంస్కృతిగా చెప్పుకుంటూ గర్వపడే దేశంలో ఒక మహర్ కులానికి చెందిన వ్యక్తి, బాల్యం నుండీ కుల వివక్షకు గురైన వ్యక్తి ఆ దేశపు రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షుడుగా వ్యవహరించి సౌభ్రాతృత్వమూ, సమానత్వమూ, మానవతావాదమూ స్ఫూర్తిగా రాజ్యాంగాన్ని మలచగలిగాడంటే అది అనితర సాధ్యమైన విషయం అని అంగీకరించవలసిందే.

అతిరథ మహారథులుగా పేరుపొందిన రాజకీయ నాయకులు సంప్రదాయవాదులు ఉన్న రాజ్యాంగ పరిషత్తును ఒప్పించి, ‘‘చట్టం ముందు అందరూ సమానులే. న్యాయాన్ని పొందే హక్కు ఏ ఒక్కరి నుంచీ ఏ కారణంగానూ తీసివేయకూడదు. రంగు, కులం, లింగం, ప్రాంతం, పుట్టిన చోటు, జాతి పేరిట వివక్ష చూపకూడదు. అంటరానితనం పాటించడం నేరం!!’’ వంటి అంశాలను రాజ్యాంగంలో పొందుపరచగలిగాడంటే అంబేడ్కర్ శేముషీ వైభవాన్ని క్షమాగుణాన్నీ అర్థం చేసుకోవచ్చు.

వ్యక్తి గౌరవంతో పాటు దేశ ప్రతిష్ఠకు ఐక్యతకు భరోసా ఇచ్చే విధంగా ఆయన రాజ్యాంగాన్ని రూపొందించారు. అంబేడ్కర్ 14-4-1891న మధ్యప్రదేశ్‌లోని మౌ (కంటోన్మెంటు ప్రాంతం)లో రాంజీ, భీమాబాయి దంపతులకు జన్మించాడు. అది మిలిటరీ కేంద్రం. యుద్ధంలో పాల్గొనవలసిన సైనికుల శిక్షణా కేంద్రం. ‘ఆతడనౌకయుద్ధముల  నారియు తేరిన ధీర మూర్తి’గా ఎదగడానికి ఆ నేపథ్యమూ దోహదపడిందేమో. అంబేడ్కర్ జన్మించిన కులం మహర్ కులం.

భారతదేశం సగర్వంగా చెప్పుకునే వర్ణాశ్రమ ధర్మ సంస్కృతిలో మహర్లు అంటరాని, చూడరాని, చెప్పరాని కులాల కోవలోకి వస్తారు. దుర్భరమైన పరిస్థితులలో పెరిగినప్పటికీ సహృదయులైన గురువుల ప్రోత్సాహంతో సంస్కరణాభిలాషులైన బరోడా, కొల్హాపూర్ - సంస్థానాధిపతులు అందించిన ఆర్థిక సహాయంతో ఆయన విదేశాలకు ఉన్నత విద్యలను అభ్యసించగలిగారు.
 
1913-1916ల మధ్య అమెరికాలో కొలంబియా విశ్వవిద్యాలయంలో తత్త్వ శాస్త్రం, అర్ధశాస్త్రం, రాజనీతి శాస్త్రం, సమాజ శాస్త్రం, మానవ శాస్త్రం వంటి ఎన్నెన్నో శాస్త్రాలు చదివారు. 1915లో అర్ధశాస్త్రంలో ఎం.ఎ., డిగ్రీ, డాక్టరేట్ అందుకున్నారు. 1917లో స్వదేశానికి తిరిగివచ్చి బరోడా సంస్థానంలో మిలిటరీ కార్యదర్శిగా చేరారు. కులం కారణంగా అవమానాల పాలై అక్కడి సత్రం యజమాని రోడ్డుమీదకు గెంటివేస్తే రైల్వేస్టేషనులో చెట్టు కింద కూర్చుని నిస్సహాయంగా విలపించిన అనుభవం ఆయనను జీవితాంతం వెన్నాడుతూనే ఉంది. అలాంటి పరిస్థితులను తనవారికి తప్పించటానికే ఆయన కృషి చేశారు. 1920 - 23 సంవత్సరాలలో లండన్‌లో ఎం.ఎస్.సి (1921) డి.ఎస్.సి. (1922) న్యాయశాస్త్రంలో బార్-ఎల్-లా. డిగ్రీలు సాధించి, 1923లో బొంబాయిలో న్యాయవాదిగా జీవితం ప్రారంభించారు.

సమాజంలోని అట్టడుగు వర్గాలను చైతన్యపరచటం కోసం ఆయన అనుక్షణమూ శ్రమించారు. పత్రికలు నడిపారు, పుస్తకాలు రాశారు. మారుమూల పల్లెలకూ వెళ్లి సమావేశాలు ఏర్పాటుచేసి, ప్రజలు తమ జీవనశైలిని ఎలా రూపొందించు కోవాలో చెప్పారు. ప్రతి సమావేశంలోనూ స్త్రీలను ప్రత్యేకంగా సమావేశపరచి వారికి మార్గదర్శనం చేశారు. దుర్మార్గులైన భర్తలను సన్మార్గంలోకి నడిపించాలనీ అది సాధ్యం కాకపోతే వారిని వదిలిపెట్టవచ్చుననీ వారికి ధైర్యం చెప్పారు. మంచి సమాజం ఆవిర్భవించాలంటే అది స్త్రీల వల్లనే సాధ్యం అని చెప్పారు.
 
వర్ణ ధర్మాన్నీ మనుస్మృతినీ విమర్శిస్తూ, వ్యతిరేకిస్తూ సమ సమాజం కోసం ఆలోచనలు రేకెత్తిస్తూ ప్రజలను ఉద్భోదిస్తూ, ఆయన గడపిన జీవితం అసాధారణమైనది. కింది కులాలకు అందరితో పాటు ఊరి చెరువులు వాడుకునే హక్కు, ఆలయాలలోకి వెళ్లే హక్కు ఉన్నాయని చెప్పటానికి ఆయన జరిపిన మహజీ (1927), నాసిక్ (1930) పోరాటాలు దేశం మొత్తాన్ని ప్రభావితం చేశాయి. అలాంటి ఉద్యమాలు చాలా నడిపాక, ‘‘చెరువులు, ఆలయాలు మనకు వద్దు. తిండి, బట్ట, చదువు, ఆత్మగౌరవం మనకు కావాలి’’ అంటూ కింది వర్గాలను జాగృత పరిచారు. భూమినీ భారీ పరిశ్రమలనూ జాతీయం చేయాలన్నారు. దేశంలోని ఆర్థిక రాజకీయ సామాజిక సమస్యలవైపు వారి దృష్టి మళ్లించారు.
 
1927లో అంబేడ్కర్ బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా నామినేట్ అయ్యారు. 1935-38 వరకూ లా కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపించారు. 1937లో బొంబాయి ప్రొవిన్షియల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1942-46లలో వైస్రాయి కౌన్సిలులో లేబర్ మెంబర్‌గా ఉన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం స్వాతంత్య్రోద్యమ దేశ నాయకులతో చర్చలు జరిపిన ప్రతిసారీ అంబేడ్కర్‌ను కూడా ఆహ్వానించి ఆయన వాదన వింటూ ఉండేది. ఆయన జ్ఞాన సంపదను గౌరవించింది. అయినా స్వతంత్ర భారతదేశంలోనే దేశ ప్రగతి సాధ్యమంటూ అంబేడ్కర్ ప్రకటనలు చేస్తుండేవాడు.

స్వరాజ్యం వస్తే కింది వర్గాల/ కులాల సంగతి ఏమిటి? స్వతంత్ర భారతదేశంలో వారి స్థానం ఎక్కడ అంటూ ప్రశ్నించిన ధైర్యశాలి అంబేడ్కర్ ఒక్కడే. ‘‘నేను హిందువుగా పుట్టాను. పుట్టుక నా చేతిలో లేదు. కాని నేను హిందువుగా మాత్రం మరణించను’’ అని 1935లో ప్రకటించాడు అంబేడ్కర్. హిందూ మతం చాలా గొప్పదనీ తన ధోరణి మార్చుకుంటుందనీ అప్పటి నాయకులు అంబేడ్కర్‌కు వాగ్దానాలు చేశారు.

ఆ మార్పు ఎంతకూ రానందున ఆయన విసిగి 1956లో బౌద్ధం స్వీకరించారు. బౌద్ధం ఇండియాకు పురాతన ధర్మమే విదేశీయం కాదు గనక జాతి సమైకత్యతకు, దేశ సమైక్యతకు భంగం కలగదనీ సంతృప్తిపడ్డారు. 1956లో అంబేడ్కర్‌ను నిరాశపరచిన పరిస్థితులు ఈనాడు 2016లో కూడా దేశంలో కనిపిస్తుండటం ఆలోచించదగ్గది. తరచుగా మతపరమైన విమర్శలు చేస్తుండటం వల్ల అప్పటి రాజకీయ నాయకులు అంబేడ్కర్‌ను తమ ప్రత్యర్ధిగా భావించేవారు.

1946లో రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిగినప్పుడు ఆయన బొంబాయి నుండి ఎన్నిక కాకుండా ఉండేందుకు వారు సర్వ ప్రయత్నాలూ చేశారు. ఆయన ఓడిపోయారు. అయితే బెంగాల్‌లోని ముస్లిం లీగు నామ శూద్ర వర్గాల తోడ్పాటుతో జైసూల్ కోల్కాల జిల్లాల నుంచి రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశించాడు. రాజ్యాంగ పరిషత్తులో ఆయన ప్రసంగం విని సభ నివ్వెరపోయింది. బెంగాల్ విభజనలో అంబేడ్కర్ సభ్యత్వం పోయినప్పుడు కాంగ్రెస్ మహారాష్ట్రలోని తన సభ్యులలో ఒకరిచేత రాజీనామా చేయించి ఆ స్థానంలో అంబేడ్కర్‌ను రాజ్యాంగ పరిషత్తుకు తెచ్చుకున్నది (14-7-1947).
 
స్వతంత్ర భారతదేశపు తొలి కేంద్ర మంత్రివర్గంలోకి ఆయనను న్యాయ శాఖామంత్రిగా ఆహ్వానించింది. రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షునిగా చేసి ఆయన ప్రజ్ఞాపాటవాలను వినియోగించుకున్నది. అయితే న్యాయ శాఖామంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్లుకు అడుగడుగునా పరోక్షంగా ప్రతి బంధకాలు ఏర్పరచి ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసేంత వరకూ తెచ్చింది. స్త్రీల ప్రాతినిధ్యానికీ హక్కులకూ సంబంధించి దేశంలో అంబేడ్కర్ ఆశించిన మార్పు ఇంతవరకూ రానేలేదు.
 
వ్యక్తి స్వేచ్ఛ, సమాజ ఆర్థిక నిర్మాణ స్వరూపాల గురించి నాయకులెవరికీ ఏ మాత్రమూ అవగాహన లేని కాలంలోనే అంబేడ్కర్ వాటి సంబంధాన్ని స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పిన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ఇప్పటివరకూ అర్థం చేసుకోలేని ఆచరణలో పెట్టలేని పాలక వర్గాలు ఇంత ఆర్భాటంగా ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న సమయంలో ఆయన ప్రవచనాలను పునశ్చరణ చేసుకోవలసిన అవసరం ఉన్నది.
 
ఈనాడు దేశంలోని విద్య ప్రైవేటీకరణ - విశ్వవిద్యాలయాలలోని కులతత్త్వ ధోరణులు చూస్తే అంబేడ్కర్ స్థాపించిన విద్యాసంస్థలు గుర్తువస్తాయి. పని చేస్తూనే చదువుకునే (షిఫ్టు పద్ధతిలో) విద్యాలయాలు మొదటగా శాస్త్ర విజ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేయాలనుకున్నారు ఆయన. సమానతా ప్రాతిపదికపై యువత పురోగమించాలని ఆశించాడు. ప్రభుత్వాధికారాలు ప్రైవేటు పరం కాకుండా చూడాలన్నారు. రాజకీయ, ఆర్థిక, విద్యా రంగాలను రక్షించుకోవటానికి సన్నద్ధులం కావటానికి 125 ఏళ్ల అంబేడ్కర్ స్ఫూర్తిని అందుకోవలసిందే. మరో 125 ఏళ్లకైనా ఆయన కలలు సాకారమవుతాయా అనేది కాలమే నిర్ణయించటం కాదు, మనమే పూనుకోవాలి.
 
దేశంలో బలపడుతున్న కార్పొరేట్ శక్తులు, ప్రబలుతున్న అనైతికత, అసహనం, కులతత్వం అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగానికి ఎంత అనుగుణంగా ఉన్నాయో ఆలోచించాలి. విద్య ప్రైవేటీకరణ - విశ్వవిద్యాలయాలలోని పక్షపాత ధోరణులు - సమర్ధతకు చోటు లేకపోవటం వంటి సమస్యలపై దృష్టి సారించటమే ఆయనకు ప్రభుత్వమూ ప్రజలూ ఇవ్వగలిగిన గౌరవం.
 - బి.విజయభారతి

జవహర్లాల్ నెహ్రూ, బాబూ రాజేంద్ర ప్రసాద్లతో బాబబా సాహెబ్ అంబేడ్కర్

వ్యక్తి స్వేచ్ఛ, సమాజ ఆర్థిక నిర్మాణ స్వరూపాల గురించి నాయకులెవరికీ ఏ మాత్రమూ అవగాహన లేని కాలంలోనే అంబేడ్కర్ వాటి సంబంధాన్ని స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పిన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ఇప్పటివరకూ అర్థం చేసుకోలేని ఆచరణలో పెట్టలేని పాలక వర్గాలు ఇంత ఆర్భాటంగా ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న సమయంలో ఆయన ప్రవచనాలను పునశ్చరణ చేసుకోవలసిన అవసరం ఉన్నది.

మరిన్ని వార్తలు