అరణ్యం: సింహాలు దొంగతనం చేస్తాయా!

13 Oct, 2013 01:02 IST|Sakshi
అరణ్యం: సింహాలు దొంగతనం చేస్తాయా!

    మగ సింహాలు పదడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి. 150 నుండి 250 కిలోల బరువుంటాయి. ఆడ సింహాలు తొమ్మిది అడుగుల వరకూ పెరుగుతాయి. 120 నుండి 200 కిలోల బరువుంటాయి!
     సింహం కూనను వెల్ప్ లేక లయొనెట్ అంటారు!
     సింహం గాండ్రింపు 8 కిలోమీటర్ల వరకూ వినిపిస్తుంది!
     మగ సింహం రోజుకు 7 కిలోల మాంసం తింటే, ఆడ సింహం 5 కిలోలు తింటుంది. అందుకే ఎక్కువగా జీబ్రా, జిరాఫీల్లాంటి పెద్ద జంతువులనే వేటాడతాయివి!
     ఇవి రోజులో పదహారు నుంచి ఇరవై గంటల పాటు విశ్రాంతి తీసుకుంటాయి. అంతేకాదు... మగ సింహాలకు వేటాడటానిక్కూడా బద్దకమే. పైగా వాటి కంటే ఆడ సింహాలే వేటలో చురుగ్గా ఉంటాయి. అందుకే ఆహార సేకరణ బాధ్యత వాటిదే. కానీ వేటాడి తెచ్చినదాన్ని ముందు మగ సింహాలు తిన్నాకే ఆడవి తింటాయి!
     ఆహారం దొరకనప్పుడు ఇవేం చేస్తాయో తెలుసా? చిరుతలు, హైనాలు వేటాడిన జంతువులను దొంగిలిస్తాయి!
     ఆడ సింహాలకు జాలి ఎక్కువ. ఒకవేళ ఏ సింహం కూన అయినా తప్పిపోయి తమ దగ్గరకు వస్తే... వాటికి కూడా తమ పిల్లలతో పాటే పాలిచ్చి పెంచుతాయి!
     సింహాలు నీళ్లు తాగకుండా నాలుగైదు రోజుల పాటు ఉండగలవు!
     సింహాల గుంపును ప్రైడ్ అంటారు. ప్రతి గుంపులో పదిహేను నుంచి నలభై వరకూ ఉంటాయి. ఆడ సింహాలు వేటకెళ్తే, మగవి పిల్లలను చూసుకుంటూ ఉంటాయి. అయితే ప్రతి సింహం రెండేళ్ల పాటు మాత్రమే తన గుంపునకు లీడర్‌గా ఉంటుంది. ఆ తరువాత వేరేది లీడర్ అవుతుంది!  
 
 అందంగా ఉందని దగ్గరకెళ్లారో... అంతే!
 చూడగానే నెమలిలా అనిపిస్తుంది. కాస్త పరిశీలిస్తే కోడిలాగా కనిపిస్తుంది. కానీ ఇది నె మలి కాదు. కోడి అంతకన్నా కాదు. దీని పేరు హాట్జిన్. దక్షిణ అమెరికాలోని ఉష్ణప్రాంతాల్లో కనిపించే ఒక పక్షి!
 
 హాట్జిన్ల దగ్గరకు వెళ్తే అంతే సంగతులు. ఎందుకంటే, వాటి దగ్గర విపరీతమైన బురద వాసనలాంటిది వస్తుంది. ఆ వాసనకు కారణం... జీర్ణక్రియలోని లోపమే. హాట్జిన్లకు జీర్ణశక్తి తక్కువ.  అందుకే గట్టిగా ఉండేవాటిని ముట్టుకోవు. ఆకులు, పూలు తింటాయి. ఆహారం జీర్ణమయ్యే క్రమంలో వాటి శరీరంలో ఒక రసాయనం విడుదలవుతుందట. దాని కారణంగానే ఇలాంటి వాసన వస్తుందని కనిపెట్టారు పరిశోధకులు. హాట్జిన్లు పొడవడం, రక్కడం చేయవు. కారణం వీటికి కొన్ని బలహీనతలుండటమే. ఇవి సరిగ్గా ఎగరలేవు. అన్ని రంగుల్నీ గుర్తించలేవు. నీరసంగా, డల్‌గా ఉంటాయి. అందుకే వీటినెవరూ పెంచుకోవడానికి ఇష్టపడరు. బ్రెజిల్‌లో కొన్ని చోట్ల హాట్జిన్ల గుడ్లను తింటారు. నిజానికి అవి కూడా ఒకలాంటి వాసన వస్తాయట. కానీ రుచి బాగుంటుందట. కానీ వీటి మాంసాన్ని మాత్రం ముట్టరు!

మరిన్ని వార్తలు