నమ్మకం: అద్దం చుట్టూ ఉన్నవి అబద్ధాలా? నిజాలా?

12 Oct, 2013 23:25 IST|Sakshi
నమ్మకం: అద్దం చుట్టూ ఉన్నవి అబద్ధాలా? నిజాలా?

మనం ఎలా ఉంటామో మనకి తెలియాలంటే మనకున్న ఒకే ఒక్క మార్గం... అద్దం. అది మనల్ని మనకు పరిచయం చేస్తుంది. మన అందాన్ని పట్టి చూపిస్తుంది. మన  అవకరాలను మనకు తెలియజేస్తుంది. అందుకే మనకు అద్దం కావాలి.
 కానీ మీకు తెలుసా? మన ఇంటి గోడకు హుందాగా వేళ్లాడే అద్దం వెనుక ఎన్ని కథలున్నాయో...
 ఎన్ని భయాలు ఉన్నాయో... ఎన్ని నమ్మకాలు, మూఢ నమ్మకాలు ఉన్నాయో!
 
 హిందూ మతం ప్రకారం... అద్దం లక్ష్మీస్థానం. అందుకే అద్దం పగిలితే సంపద చెల్లాచెదురైపోతుందని అంటారు. అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా అద్దం ఉంటే, ఇంట్లోకి ప్రవేశించే ఆరోగ్యకరమైన శక్తి పరావర్తనం చెంది తిరిగి వెళ్లిపోతుందని కూడా అంటారు. ఇంతవరకూ సరే. కానీ అద్దం పగిలితే ఎవరో ఒకరి ప్రాణాలకు ముప్పు అని కొందరు ఎందుకంటారు? ముఖ్యంగా రోమన్లు, గ్రీకులు, చైనీయులు, ఆఫ్రిక న్లు, కొన్ని వర్గాల భారతీయులు దీన్ని గట్టిగా నమ్ముతున్నారు. దానికి వారు చెప్పే సమాధానం... అద్దం మనను ప్రతిబింబిస్తుందని, అది పగిలితే మన రూపం ఛిద్రమైనట్టేనని, అంటే మరణం సంప్రాప్తించే సమయం ఆసన్నమైనదని అర్థం చేసుకోవాలని! పగిలిన అద్దంలో ముఖం చూసుకోవద్దనేది కూడా అందుకే. అయితే ఇది ఎంతవరకూ నిజం అంటే... నిరూపించడానికి ఆధారాలు శూన్యం.
 
 అద్దం విషయంలో అమెరికా, ఐర్లాండ్ దేశాల్లోని కొన్ని ప్రాంతాలవారికి  ఓ బలమైన నమ్మకం ఉంది. తెలిసినవాళ్లెవరైనా చనిపోతే, వెంటనే ఇంట్లో ఉన్న అద్దాలన్నిటి మీదా గుడ్డను కప్పేస్తారు వాళ్లు. అలా ఎందుకు అంటే... ఖననం చేసిన వ్యక్తి ఆత్మ వెంటనే ఈ లోకాన్ని విడిచిపెట్టి పోదని, తనవాళ్ల చుట్టూ తిరుగుతుందని, తనకు ఆశ్రయమిచ్చే మరో శరీరం కోసం వెతుకుతుందని, అది దొరికేవరకూ అద్దంలో తలదాచుకుంటుందని అంటారు. అందువల్లే ఎక్కడ ఆ ఆత్మ వచ్చి చేరుతుందో అని భయపడి అద్దాలను కప్పివేస్తారు. సినిమాల్లో సైతం దెయ్యాలు అద్దంలోనే కనిపించినట్టు చూపిస్తుంటారు. అంటే, అద్దం దురాత్మకు ఆశ్రయమిస్తుందన్న నమ్మకం బలంగా ఏర్పడిపోయింది. అయితే ఈ నమ్మకం ఎలా పుట్టింది అంటే మాత్రం వాళ్లెవరూ సమాధానం చెప్పలేరు. అందుకే దీనిని మూఢనమ్మకంగానే పరిగణిస్తున్నారు చాలామంది ఆధునికులు.
 
 
 నమ్మకాలకేం... ఎన్నయినా పెట్టుకోవచ్చు. కానీ అలా నమ్మడం ఎంత వరకూ కరెక్ట్ అనేది కూడా ఆలోచించుకోవాలి. అద్దంలోకి ఆత్మలు ప్రవేశిస్తాయి అనుకుంటే, ఎవరి ఇంట్లోనైనా చనిపోతే వారి ఆత్మ వారి అద్దంలో ఉండిపోవాలి కదా! వారికి కనిపించాలి కదా! అద్దం పగిలితే మనం మరణిస్తాం అనేదే నిజమైతే, ఎక్కడా అద్దమే పగలడం లేదా? అలా పగిలిన ప్రతిసారీ, అందులో ముఖం చూసుకున్న ప్రతిసారీ ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారా? ఇలా ఆలోచిస్తే మన నమ్మకాల వెనుక ఉన్న నిజానిజాల్ని కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు.
 
 అద్దం గురించిన కొన్ని నమ్మకాలు
     ఏడాదిలోపు బిడ్డకు అద్దం చూపిస్తే... బిడ్డ ప్రాణానికి ప్రమాదం!
     కొవ్వొత్తి వెలుగులో అద్దంలో చూసుకుంటే... మనకు బదులు
     మనకిష్టమైన వాళ్ల ఆత్మ కనిపిస్తుంది!
     పెళ్లాడబోయే వ్యక్తి ఎలా ఉంటారో తెలుసుకోవాలంటే... అద్దం ముందు కూర్చుని యాపిల్ తినాలి. ఆపైన జుత్తు దువ్వుకుంటూ అద్దంలోకి చూస్తే మన భుజం వెనుక నిలబడి మనల్ని చేసుకోబోయే వ్యక్తి కనిపిస్తారు!
     వ్యాంపైర్లకు చావు ఉండదు. వాటికి ఆత్మలు ఉండవు. అందుకే అవి అద్దంలో కనిపించవు!

మరిన్ని వార్తలు