కొండంత ఆణిముత్యం!

5 Jun, 2016 01:20 IST|Sakshi
కొండంత ఆణిముత్యం!

ఆర్మేనియా
నాగరికత తొలి ఆనవాళ్లను కథలు కథలుగా చెప్పే దేశం. సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన తరువాత సొంత దారి వెదుక్కొని తనదైన ప్రత్యేకతను నిలుపుకుంటున్న దేశం... ఆర్మేనియా అనే పేరుకు  ఏ అర్థం ఉన్నా... ఆర్మేనియా అంటే ఆణిముత్యంలాంటి దేశం!
 
తూర్పు యూరప్, పశ్చిమ ఆసియాల మధ్య ఉన్న దేశం ఆర్మేనియా. ఈ దేశానికి పశ్చిమంలో టర్కీ, ఉత్తరంలో జార్జియా, తూర్పులో అజర్‌బైజాన్, దక్షిణంలో ఇరాన్ దేశాలు ఉన్నాయి. భౌగోళికంగా రెండు ఖండాల మధ్య ఉండడం వల్ల ఎన్నో జాతులు ఆర్మేనియాపై దండెత్తాయి. గ్రీకులు, ఒట్టమన్లు, ఇరానీయులు, రష్యన్లు... ఆర్మేనియా ప్రాంతాలపై దండెత్తారు.
 
ఒకప్పుడు సోవియట్ రిపబ్లిక్‌లో భాగమైన ఆర్మేనియా, సోవియట్ యూనియన్ పతనం తరువాత ‘ఆర్మేనియా రిపబ్లిక్’గా అవతరించింది.
 పది పరిపాలనా విభాగాలుగా ఆర్మేనియా విభజించబడింది.
 
అవి: 1. అగ్రాట్సన్, 2. అరాత్, 3. అర్మవిర్, 4. జెఘర్కునిక్, 5. కోతక్, 6.లొరి, 7.సిరక్, 8. సియునిక్, 9. తవుష్ 10.వయొత్స్‌ద్జర్... ఈ విభాగాల నిర్వహణాధికారిని మర్జ్‌పెట్ అంటారు. వీరిని ప్రభుత్వం నియమిస్తుంది. యెరెవన్ నగరానికి రాజధాని నగరంగా స్వయంప్రతిపత్తి ఉంది.
 ఆర్మేనియా రిపబ్లిక్‌గా అవతరించిన తరువాత వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఉపాధికల్పనలో వ్యవసాయరంగం వాటా పెరిగింది. ఆహారభద్రత పెరిగింది. పర్యాటకరంగంలో ఎన్నో అనుబంధ పరిశ్రమలు వెలిశాయి.
 
పర్యావరణ సంబంధిత అంశాలపై ఆర్మేనియా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంది. గాలి, నీటి కాలుష్యంపై విధించే పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు వినియోగిస్తుంది. ‘నేచర్ ప్రొటెక్షన్’ పేరుతో ఒక మంత్రిత్వశాఖను కూడా ఏర్పాటు చేసింది. టర్కీ, అజర్‌బైజాన్ మినహా ప్రపంచంలోని ప్రతి దేశంతో ఆర్మేనియా సత్సంబంధాలను కొనసాగిస్తుంది. ‘ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్’, ‘కౌన్సిల్ ఆఫ్ యూరప్’తో సహా నలభై అంతర్జాతీయ సంస్థలలో ఆర్మేనియాకు సభ్యత్వం ఉంది. ఆర్థిక సంస్కరణల వల్ల ద్రవ్యోల్బణం తగ్గి స్థిరమైన అభివృద్ధి దిశలో సాగిపోతుంది ఆర్మేనియా.

టాప్ 10
1.    ఆర్మేనియన్ భాషలో దేశం పేరు హయక్. హయక్ అనేది ఆర్మేనియన్ మూల పురుషుడి పేరు.
2.    ఆర్మేనియాలోని ‘అపోస్టోలిక్ చర్చి’ ప్రపంచంలోనే పురాతనమైన చర్చి.
3.    ‘క్రిస్టియన్ కంట్రీ’గా తనను తాను ప్రకటించుకున్న తొలిదేశం ఆర్మేనియా.
4.    రాజధాని యెరెవన్‌లో ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఒపెరా హౌస్ ఉంది.
5.    ‘టూరిస్ట్ ఫ్రెండ్లీ కంట్రీ’గా ఆర్మేనియాకు మంచి  పేరు ఉంది.
6.    ఆర్మేనియా జాతీయ చిహ్నం మౌంట్ ఆరాత్. అయితే భౌగోళికంగా ఇది టర్కీలో ఉంది.
7.    అరస్... ఆర్మేనియాలో పొడవైన నది.
8.    రాజధాని నగరం యెరెవన్‌కి ‘పింక్ సిటీ’ అని పేరు.
9.    మద్యం జన్మస్థలం ఆర్మేనియా అని కొందరు శాస్త్రవేత్తల నమ్మకం.
10.    ఆర్మేనియాలో అత్యధిక ఆదరణ ఉన్న క్రీడ... మల్లయుద్ధం.
 
దేశం     :    రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా
రాజధాని     :    యెరెవన్
అధికార భాష     :    ఆర్మేనియన్
కరెన్సీ    :     డ్రామ్
జనాభా    :    29 లక్షల 99 వేలు (సుమారుగా)
అక్షరాస్యత    :    99 శాతం

మరిన్ని వార్తలు