దిల్‌రుబా... అరుబా!

23 Apr, 2016 22:15 IST|Sakshi
దిల్‌రుబా... అరుబా!

అరుబా
అదిగో అల్లదిగో...

అందమే  ఐశ్వర్యం అయితే... దానికి నిలువెత్తు సాక్ష్యం అరుబా! నిధుల కోసం ఎక్కడెక్కడి నుంచో ఈ ద్వీపానికి వచ్చేవాళ్లు ఒకప్పుడు. నిధుల కోసం ఈ ద్వీపానికి వెళ్లొచ్చిన అమెరికన్ ఒకరు ఉత్త చేతులతో తిరిగొచ్చాడట. ‘ఏమీ దొరకలేదా?’ అని ఆసక్తిగా అడిగితే ‘దొరకకేం బోలెడు నిధులు దొరికాయి’ అన్నాడు ఆ అమెరికన్. ‘ఏవీ... ఎక్కడున్నాయి?’ అని మరింత ఆసక్తితో అడిగితే ‘నా కళ్లలో ఉన్నాయి’ అని చెప్పాడు. ‘నిధులు కళ్లలో ఉండడం ఏమిటి?’ అని ఆశ్చరంగా అడిగితే- ‘అవి బంగారు నిధులు కావు. అరుబా అందాల నిధులు. అరుబా సౌందర్యం ముందు బంగారం విలువెంత?’ అన్నాడట.

అరుబా అందాల్ని గురించి  చెప్పే ఇలాంటి పిట్టకథలు ఎన్నో ఉన్నాయి. తొలి దశలో అరుబా దీవిలో అరవక్ తెగ ప్రజలు నివసించేవారు. ఆనాటి వారి కళల తాలూకు  ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి. గుహచిత్రాలు, రకరకాల మట్టి బొమ్మలు మొదలైనవి ఉన్నాయి.
 
నెదర్లాండ్స్ రాజ్యంలో భాగమయ్యే వరకు అరుబా నిధుల వేటగాళ్లకు ఆకర్షణీయ ప్రదేశంగా  ఉండేది. చమురు శుద్ధి పరిశ్రమల రాకతో అరుబా ఆర్థికవ్యవస్థ బలోపేతం అయింది. అభివృద్ధి వేగం పుంజుకుంది. ప్రశాంతత, ప్రకృతి అందాలు, అత్యున్నత జీవనప్రమాణాల వల్ల  అరుబా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కరీబియన్, అమెరికా, వెనిజులా, యూరప్ దేశాల నుంచి కార్మికులు, వ్యాపారులు, సాధారణ పౌరులు ఇక్కడ నివసించడానికి రావడం మొదలైంది. దీంతో అరుబా జనాభా కూడా పెరిగింది.
 
‘ది ఈగల్ ఆయిల్ రిఫైనింగ్ కంపెనీ’ 1953లో మూతబడడంతో అరుబా ఆర్థికవ్యవస్థ ఒడిదుడుకులకు గురైనప్పటికీ పర్యాటకరంగం  ఆ లోటును పూరించింది.  దేశ ప్రధాన ఆర్థిక వనరుగా మారింది. వివిధ దేశాలకు చెందిన 92 జాతుల ప్రజలు అరుబాలో నివసిస్తున్నారు.  ఆఫ్రికన్, యురోపియన్ మూలాల వల్ల అరుబాలో బహుళ సంస్కృతుల వెలుగు కనిపిస్తుంది. రాజధాని ఆరన్జేస్టేడ్ సంగీత కచేరీలు, ఆర్ట్ ఎగ్జిబిషన్లు, నృత్యరూపకాలతో కళకళలాడుతుంటుంది. ‘కింగ్‌డమ్ ఆఫ్ ద నెదర్లాండ్స్’లోని ఈ స్వయంప్రతిపత్తి గల రాజ్యం... అందం, అభివృద్ధితో ప్రపంచపటంలో తనకంటూ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకుటుంది.
 
టాప్ టెన్

1.    అరుబా సంప్రదాయ భాష పాపియామెంటో. చిత్రం ఏమిటంటే... ఈ భాషను అందరూ ఒకే విధంగా మాట్లాడినా, రాయడం మాత్రం  ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుంది.
2.    బీచ్‌ల దగ్గర త ప్ప ‘బీచ్ వస్త్రధారణ’తో ఇతర ప్రదేశాలలో కనిపించకూడదు.
3.    అనుమతి లేకుండా ఇతరులను  ఫోటో తీయకూడదు.
4.    అరుబాకు రావాలంటే కొన్ని దేశాల వారికి వీసా అక్కర్లేదు. వాళ్లు ఒకటి రెండు నెలలు అరుబాలో ఉండవచ్చు.
5.    ‘బుబలీ పక్షి సంరక్షణా కేంద్రం’లో 80 రకాల వలస జాతి పక్షులు ఉన్నాయి.
6.    ‘గాడిద సంరక్ష ణా కేంద్రం’లోని  గాడిదలకు యాపిల్స్‌తో పాటు, వాటికి ఇష్టమైనవి తినిపిస్తుంటారు పర్యాటకులు.
7.    అరుబాలోని ‘నాణేల మ్యూజియం’లో వివిధ దేశాలకు చెందిన 35,000 నాణేలు ఉన్నాయి.
8.    అరుబాలో ప్రతి యేటా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వారం రోజుల పాటు ఘనంగా జరుగుతుంది.
9.    అరుబాలోని తెల్లటి ఇసుక తీరాలు ‘బేర్‌ఫుట్-ఫ్రెండ్లీ’గా గుర్తింపు తెచ్చుకున్నాయి.  మిట్ట మధ్యాహ్నపు ఎండలో కూడా ఈ ఇసుకలో నడుస్తుంటే కాళ్లకు వేడి తగలదు.
10.    నీటి శుద్ధికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచంలోని ఎన్నో దేశాలకు అరుబా మార్గదర్శిగా ఉంటుంది.

మరిన్ని వార్తలు