కాలం కత్తుల వంతెనపై త్యాగాల నడక

8 Nov, 2014 22:45 IST|Sakshi
కాలం కత్తుల వంతెనపై త్యాగాల నడక

పద్యానవనం
 
 త్యాగము నిశ్చయముగ నొక
 యాగంబీ జగతియం దనాదిగ గానన్
 త్యాగము కల్గిన జనులకు
 కాగలవు శుభంబులెల్ల కర్మల నార్యా!

 
‘కుచ్ పానేకే లియె కుచ్ కోనా జరూరీ!’ అనే మాట హిందీలో ఉంది. ఏదైనా పొందాలంటే, ఇంకేదైనా కోల్పోవాల్సిందే అని. వస్తువుకు మరొక వస్తువే అన్నట్టుగా ఇది వస్తుమార్పిడి విధానం కాకపోవచ్చు! ఇంకో రకంగా చెప్పాలంటే, ఒక రూపంలో మనం లబ్ది పొందడానికి మరో రూపంలో ఏదైనా త్యజించడమో, త్యాగం చేయాల్సిన పరిస్థితో అన్న మాట!
 
‘ఎంతో కొంత త్యాగానికి సిద్ధపడకుండా నాయకులు కాలేరు’ అంటారు. కొందరు ఐహిక సుఖాలను త్యజించమంటారు. ఇంకొందరు, కేవలం మిథ్య కనుక ఆముష్మిక సుఖాలపై ఆశను వదిలేయమంటారు. గౌతమ బుద్ధుడు కోర్కెలని త్యజిస్తే జీవితం అనందమయమన్నాడు. నిజమే, ఏదో త్యజించడం త్యాగం. త్యాగం అనేది లోకంలో ఒక యాగమే, అంటే యజ్ఞమే అంటాడు ఈ పద్యం రాసిన డాక్టర్ కపిలవాయి లింగమూర్తి. నూరుకు పైగా పుస్తకాలు రాసిన లింగమూర్తి నిరంతర పరిశోధకుడు. తెలుగువిశ్వవిద్యాలయం డాక్టరేట్‌తో సత్కరించిన ఆయనకు ఇటీవలే వట్టికోట ఆళ్వార్‌స్వామి పురస్కారం లభించింది. తేలికైన మాటలతో జీవన సత్యాల్ని వివరిస్తూ ఆర్యశతకం రాశారు.
 
యజ్ఞంలో త్యాగం అంటే వితరణమే ప్రధానం. ఏదైనా ఇచ్చుకోవడం. వితరణలేని యజ్ఞం ఎంత గొప్పగా చేసినా అది ఫలాన్నివ్వదంటారు. త్యాగం అనే పదం పలికేప్పుడు కాస్త గంభీరంగా కనిపించినా, సౌమ్యంగా ఆలోచించి సరళంగా చూస్తే క్షమాగుణంలో ఉంటుంది. ‘ఇచ్చి పుచ్చుకోవడం’ అన్న సులభ సమీకరణంలోనూ ఉంటుంది అంతర్లీనంగా. ప్రపంచంలో ఎంతటి జఠిలమైన సమస్య అయినా చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవచ్చునంటారు ప్రజాస్వామ్యవాదులు. ఎలా సాధ్యమౌతుంది?

అంటే, ఇచ్చిపుచ్చుకునే ధోరణి వల్లే. పరస్పరం సంప్రదింపులు జరుపుతున్నపుడు ఎక్కడో ఓ చోట, ఎవరో ఒకరు ఒకడుగు వెనక్కి తగ్గి అంగీకారానికి రావడం, అది చూసి అవతలి వాళ్లు కూడా అంతకన్నా ఎక్కువో, అంతేనో, అంతకు తక్కువో... తామూ వెనక్కి తగ్గడం, ఇలా సయోధ్యకు దారి ఏర్పడుతుంది. సమస్యకు పరిష్కారమూ లభిస్తుంది. ఇందులో త్యాగం ఇరువైపుల నుంచీ ఉన్నట్టే! త్యాగాలకు సిద్ధపడ్డవారి కర్మలకు సాఫల్యం ఉంటుంది.

ఒకరి త్యాగాల వల్ల ఎదుటి వారికి తక్షణ ప్రయోజనం కనిపించినా, దీర్ఘకాలంలో అది త్యాగం చేసిన వారికిగానీ, విశాల సమాజ హితంలో గానీ కచ్చితమైన ప్రయోజనం కలిగిస్తుందని చరిత్ర నిరూపించింది. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు... ఇలా మన ప్రాచీన సాహిత్యమంతా త్యాగనిరతి ఔన్నత్యాన్ని కీర్తించడమే కాకుండా సదరు సత్ఫలితాలను సాపేక్షంగా, సోదాహరణంగా వివరించాయి.

శిబి, బలి, దదీచుడు, కర్ణుడు, సోక్రటీస్, జీసస్, గాంధీ వంటి మహనీయుల త్యాగాలు మానవేతిహాస గమనాన్ని ఉద్విగ్నభరితం చేశాయి. మత్స్యగంధితో పెళ్లి జరిపి తండ్రి శంతనుడి ఇచ్ఛ తీర్చడానికి గాంగేయుడు (భీష్ముడు) పలు త్యాగాలకు సిద్ధం కావాల్సి వచ్చింది. ఈ పరిణామమే, అంటే త్యాగాలతో కూడిన భీష్మ ప్రతిజ్ఞ, దరిమిలా ఉత్పన్నమైన పరిస్థితులే మహాభారత కథా గమనాన్ని మలుపులు తిప్పాయి. కైకేయి కోర్కెల ఫలితంగా తలెత్తిన పరిస్థితుల్లో దశరథుడు, కౌసల్య, రామ-సీత-లక్ష్మణుల త్యాగాలు రామాయణాన్నే రసవత్తరంగా నడిపాయి. కడకవి దుష్ట శిక్ష-శిష్ఠ రక్షణకు కారణమయ్యాయి.

సమసమాజం కోసం, అస్తిత్వం కోసం, జాతుల మనుగడ కోసం... విశాల జనహితం కోరి జరిపే సాయుధపోరాటాల్లో ప్రాణాలర్పించే యోధుల త్యాగాలూ చరిత్ర పుటలే! కాలం కత్తుల వంతెనపై త్యాగాల నెత్తుటి నడకలెన్నో! సామ్రాజ్యవాదుల ఉక్కు సంకెలల నుంచి దేశాలకు విముక్తి లభించినా, వర్ణ-జాత్యాహంకారుల నుంచి విభిన్న జాతులకు స్వేచ్ఛావాయువులు దొరికినా... అది, ప్రాణాల్ని పణంగా పెట్టిన ఎందరెందరి త్యాగాల ఫలమో! పోరాటాలే కాదు క్షమలోనూ ఉంది ఔన్నత్యం. మనిషి లక్షణాల్లో అత్యంత ఉత్కృష్ఠమైనది క్షమాగుణం అంటారు. క్షమాగుణానికి త్యాగమే కన్నతల్లి. ప్రతి త్యాగాన్ని మనసారా ప్రశంసిద్దాం. మరిన్ని త్యాగాలకు మనమూ సిద్ధమౌదాం!
 
- దిలీప్‌రెడ్డి
 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు